రాష్ట్ర సిద్ధి జరిగిన అనంతరం ఉద్యమసారథే రాష్ట్ర నాయకుడై ”బంగారు తెలంగాణ” దిశగా నూతన రాష్ట్రాన్ని వడివడిగా నడిపించుకుపోవడం మన దేశంలోనేగాక, విదేశాల్లోనూ ఒక అద్భుతమని భావించడం నాయకత్వ విజయానికి గొప్ప నిదర్శనం. ఒక్కసారి మన తెలంగాణ ఈ మూడేళ్లలో సాధించుకున్న విజయాల్ని పరిశీలిస్తే సమర్థ నాయకత్వం సమాజానికి లభించినప్పుడు సక్రమమైన అభివృద్ధి సాధ్యమేనన్న సత్యం బోధపడుతుంది. దానికి నిదర్శనం మన తెలంగాణా రాష్ట్రమే.
అభివృద్ధికి ఏది మార్గం?
అనే ప్రశ్న వేసుకుంటే తప్ప అభివృద్ధిలో ముందంజ సాధ్యంకాదు.
మాన్యులైన మన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చెయ్యగానే యీ ప్రశ్నకు సమాధానాన్ని అన్వేషించే క్రమంలో వారికి కనిపించిన మొదటి సమాధానం
”నీళ్ళు”-నీళ్ళ లభ్యత సంపూర్ణమైనప్పుడు ఏ సమాజానికైనా పురోగతి సాధ్యమన్న దృఢవిశ్వాసమే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలకు శ్రీకారం చుట్టడానికి కారణమైంది.
వచ్చిన ఆర్నెల్లలోనే కరెంటు సమస్యకు మంగళంపాడిన సమర్థుడైన నాయకునికి ‘నీళ్ళ’ విషయంలో ఉన్న నిబద్ధతలో ఎటువంటిలోపం ఉండదు. తెలంగాణ గత 60యేళ్ళ వలస పాలనలో తాగునీటికి, సాగునీటికి దూరమై ఎన్నెన్ని కష్టాలను అనుభవించిందో స్పష్టంగా తెలిసినవాడు కనుక తమ ప్రభుత్వం మొట్టమొదట నీటి లభ్యతపైనే దృష్టి పెట్టాలనీ, తమ అయిదేళ్ళ పాలనలో ఇంటింటికీ స్వచ్ఛమైన నీటిని అందించాలన్న పట్టుదలతో ‘మిషన్ భగీరథ’కు పూనుకోవడం వెనుక నాయకుని దృఢవిశ్వాసం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. మరొక వీరోచిత విషయమేమంటే ఈ అయిదేళ్ళ కాలంలో ఇంటింటికి నీళ్ళు ఇవ్వని పక్షంలో వచ్చే ఎన్నికల్లో ఓట్లే అడగమన్నమాట యావద్విశ్వాన్ని ఆశ్చర్యంలో ముంచింది. ప్రపంచంలో ఏ నాయకుడు ఎప్పుడూ చేయని, చేయలేని ప్రతిజ్ఞ చేసి కార్యోన్ముఖుడై విజయపథంలో సాగుతున్న సమర్థుడైన ముఖ్యమంత్రి నాయకులందరికీ ఆదర్శనీయుడు. రూ. 43,400 కోట్లు సురక్షితమైన నీటి కొరకు కేటాయించిన విషయం తెలిసినప్పుడే వారికి ఈ విషయంలో ఎంతటి పట్టుదల ఉందో అర్థమౌతుంది. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల్లో సుమారు 10 శాతం తాగునీటికే కేటాయించిన ఈ పథకంలో ఇప్పటికే సుమారు 1.50 లక్షల కి.మీ.ల వరకు పైప్‌లైన్లు పూర్తయి శరవేగంతో ముందుకు సాగడం
శుభ పరిణామం.
ఇది ప్రతిష్ఠాత్మక పథకంగా తీసుకున్న తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మొదట గజ్వేల్‌లో విజయవంతంగా పూర్తి చేసి భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ప్రారంభింపజేయడం విశేషం. మోదీ తన ‘మన్‌కీబాత్’ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని గురించి ప్రశంసించడం సంతోషకరమైన విషయం. కేవలం ప్రధానమంత్రేకాదు, కేంద్ర ప్రభుత్వమూ, నీతి ఆయోగ్‌లుకూడా ప్రశంసించడం మన ప్రభుత్వానికే గర్వకారణం. అందుకే అప్పటి యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మన రాష్ట్రమంత్రివర్యులైన తారక రామారావుతో భేటి అయి ఈ పథకం గురించి పూర్తిగా తెలుసుకుని తమ రాష్ట్రంలోనూ ప్రారంభించాలన్న స్ఫూర్తిని చూపించారు. బీహార్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రవంటి కొన్ని రాష్ట్రాలు కేవలం ప్రశంసించడమేగాక తమ రాష్ట్రాలపక్షాన ప్రతినిధులను కూడా పంపి ఈ పథకాన్ని అమలు చేస్తున్న విధానాలపై అవగాహన పొంది రమ్మని పంపడమే దీని గొప్పదనాన్ని తెలుపుతున్నది. రాష్ట్ర ప్రజల దాహార్తి తీర్చడమే ప్రథమ కర్తవ్యంగా భావించిన మన ముఖ్యమంత్రి పూనిక ఎంతటి ప్రశస్తమైనదో మనం గుర్తించి సహకరించాలి.
నీటికి సంబంధించిన రెండు మహత్తర పథకాలు దశాబ్దాల కాలంగా కరవు రక్కసి కోరల్లో చిక్కుకున్న తెలంగాణ ప్రజల పాలిటి కల్పవృక్షాలు కావాలన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు సత్సంకల్పం త్వరలో సాకారమౌతున్న శుభ సందర్భంలో వారికి మన ప్రజలు సర్వదా కృతజ్ఞులై ఉంటారు. నీటి లభ్యత గురించి, వాటి వినియోగం గురించి సంపూర్ణమైన అవగాహన కలిగిన ముఖ్యమంత్రివర్యుల కార్యాచరణ గురించి, కట్టే ప్రాజెక్టుల రూపురేఖల్ని గురించి ప్రత్యేకంగా శాసనసభను సమావేశపరచి సభ్యులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో సమగ్ర దృశ్యాన్ని చూపించి, తమ పథకం ఎట్లా సాగుతున్నదో, ఎట్లా సాగాలో వివరంగా చెప్పడం వారి విజ్ఞతకు ఉదాహరణం.
ప్రజా సంక్షేమం గురించి నిర్వహించే పనుల్లో ఎన్ని అవరోధాలెదురైనా ఎదుర్కొనే దమ్మున్న ముఖ్యమంత్రి గనుక తలపెట్టిన ప్రతి పథకం ప్రగతి దిశగా దూసుకుపోతున్నది. నీటి అవసరం వలెనే ప్రకృతి పరిరక్షణ కూడా మన కర్తవ్యమేనన్న సదవగాహనతో ‘హరితహారం’ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. పచ్చని చెట్టే ప్రగతికి మెట్టు అన్న ధ్యేయంతో ప్రస్తుతం దాదాపు 23 శాతం ఉన్న పచ్చదనాన్ని కనీసం ఈ అయిదేళ్ళలో 33 శాతానికి పెంచాలన్న దృఢ నిశ్చయంతో ప్రారంభమైన ఈ మహత్తర పథకం ఏడాదికి కనీసం 40 కోట్ల మొక్కలు నాటి వాటిని రక్షించి తమ పాలనలోని ఈ అయిదేళ్ళలో దాన్ని 230 కోట్ల మొక్కల వరకూ చేర్చాలన్న దృఢ సంకల్పంతో పనిచేస్తూ ఉంది మన ప్రభుత్వం. ఈ పథకం నిర్వహణలో ప్రభుత్వంతోబాటు ప్రజలు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల వంటి వాటిని భాగస్వాములుగా చేసి కొనసాగించడం బాధ్యతను గుర్తు చేయడమేనన్న భావన కలుగుతున్నది. రోడ్లకిరువైపులా, ఖాళీ స్థలాల్లో, అటవీ ప్రాంతాల్లో, బంజరు భూముల్లో చెట్ల పెంపకం చేసి మనందరం పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములమై ”వాన తిరిగి రావాలి, కోతులు అడవి దారి పట్టాలి” అన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వజ్ర సంకల్పానికి చేయూతనిచ్చి సహకరించాలి. తెలంగాణాను సస్యశ్యామలంగా, ఆకుపచ్చ తెలంగాణాగా రూపొందించుకోవాలి.
ప్రతీ వ్యక్తికీ సొంతిల్లు ఒక కల. ఆ యిల్లు కూడా మరీ పిట్టగూడు వలె కాకుండా నివాసయోగ్యంగా ఉండాలన్న నిర్ణయంతో మన రాష్ట్ర సాకారం కాగానే ‘డబుల్ బెడ్రూం’ పథకాన్ని ప్రవేశపెట్టడమేగాక కట్టి చూపించిన ఘనులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. వచ్చే రెండేళ్ళలో కట్టాల్సిన ఇళ్ళన్నీ పూర్తి కావాలన్న లక్ష్యంతో ఈ పథకం అన్ని జిల్లాల్లోనూ శరవేగంగా కొనసాగుతూ ఉంది.
ఐటీ రంగం చూసుకుంటే ఆ రంగంలో నిత్య కృషీవలునిగా కొనసాగుతున్న మన రాష్ట్ర ఐటీ శాఖామాత్యులు కేటీఆర్ తమ నిరంతర కృషివల్ల మన రాష్ట్రాన్ని జాతీయస్థాయిలోనేగాక, అంతర్జాతీయ స్థాయివరకు ఎదిగించి ఈ మూడేళ్ళ పాలనాకాలంలోనే మహత్తర విజయాల్ని అందించిన ఘనులు. కళ్ళముందే కనిపిస్తున్న విజయాలు ఆయన కృషికి నిదర్శనాలై ప్రపంచదృష్టిని ఆకర్షిస్తున్నాయి. తన చొరవతో రాష్ట్రంలోకి ఐటీ కంపెనీలు వరదలా ప్రవహించి వస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 1300 కంపెనీలు చోటు చేసుకున్నాయి. 2015-16 సంవత్సరంలో ఎగుమతులు రూ. 75,000 కోట్లకు చేరుకోవడమంటే దాని వెనుక ఎంతటి పట్టుదల, కృషి ఉందో అర్థం చేసుకోవచ్చు. జాతీయ ఎగుమతులు ఐటీ రంగంలో 12.3 శాతం అయితే రాష్ట్రం ఎగుమతులు 13.26 శాతం ఉండడం మన ముందంజను తెలుపుతూ ఉంది. నాలుగు లక్షలకుపైగా ప్రత్యక్ష ఉద్యోగాలకు, మరెన్నో పరోక్ష
ఉద్యోగాలకు అవకాశాన్ని కలిగించిన ఐటీరంగం మన రాష్ట్ర రూపురేఖల్నే మార్చి గొప్ప ఖ్యాతిని అందించింది. ఇది ప్రపంచంలోని అత్యున్నతస్థాయి ఐటీ కంపెనీలకు హైదరాబాదును కేంద్రం చేసింది. కేటీఆర్ చొరవవల్ల ఏర్పడ్డ ఐటీ హబ్ ప్రోత్సాహం కారణంగా ఈ హైదరాబాద్‌లోనే స్పేస్ ఇంజినీరింగ్ టెక్నాలజీ రంగాలు, వాహన రంగంలో టెక్నాలజీ రంగాలవంటి విభిన్న భాగాల కార్యాలయాల ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. ఇక్కడి ఈ అభివృద్ధి చూసే ప్రపంచ దిగ్గజ సంస్థల అధిపతులైన సత్య నాదెళ్ళ, రతన్‌టాటా వంటి ప్రముఖులు సందర్శించి ప్రభుత్వాన్ని అభినందించారు. కేంద్ర రక్షణశాఖతో టీహబ్ ఒప్పందం, గోవా రాష్ట్రం ఈ మార్గంలోనే పయనించి టీ-హబ్ ఏర్పాటు చేసుకోవడంవంటి సత్ఫలితాలకు ఇది నిదర్శనం. అందువల్లే దాదాపు 2.5 లక్షల చ.అడుగుల టి-హబ్-2ను ఏర్పాటు చేసి ఈ రంగంలో మరింత ముందుకు పోవాలని మన ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. హార్డ్‌వేర్ రంగంలో మరిన్ని నూతనావిష్కరణలకై ప్రోత్సాహాన్ని అందించడం కొరకు టీ వర్క్స్‌ను త్వరలో ప్రారంభించాలని యోచిస్తూ ఉంది. మూడేళ్ళలోనే యావద్విశ్వం దృష్టిని ఆకర్షించి ఐటీ రంగంలో మేటి రాష్ట్రంగా నిలిచిన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఐటీశాఖమంత్రి చూపించిన చొరవ, చేసిన, చేస్తున్న కృషి అభినందనీయం.
ఏ రాష్ట్రమెనా, ఏ దేశమైనా అభివృద్ధి పథంలో వడివడిగా సాగాలనుకున్నప్పుడు పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వెయ్యాలి. ఏర్పడ్డ మూడేళ్ళలోనే తెలంగాణా రాష్ట్ర సారథి మన రాష్ట్రాన్ని తన ముందు చూపుతో పరిశ్రమలకు స్వర్గధామం చేశారు. టీఎస్ ఐపాస్ విధానాన్ని తన ఆలోచనలతో ప్రవేశపెట్టి ప్రపంచ పారిశ్రామికవేత్తలను అబ్బురపరిచారు. ఈ విషయంలోనూ కేసీఆర్‌తోబాటు, కేటీఆర్ కూడా పరిశ్రమించారు. వారి ఆలోచనల్లోంచి పుట్టిన వినూత్న విప్లవాత్మక పారిశ్రామిక విధానానికి తొలిమెట్టే టీఎస్ ఐపాస్ విధానం. కొత్తగా పరిశ్రమలు స్థాపించేవారి శ్రమ తగ్గించి కేవలం 15 రోజుల్లోనే అన్ని రకాల అనుమతులు పొందేవిధంగా రూపొందించిన ఈ విధానం ఒక విప్లవం. ఆ కారణంగానే కర్ణాటక రాష్ట్ర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అధికారులు టీఎస్ ఐ పాస్ విధానాన్ని ప్రత్యక్షంగా తెలుసుకొని ఈ పారిశ్రామిక విధానంపై ఆశ్చర్యాన్ని ప్రకటించారు. పంజాబ్ రాష్ట్ర స్మాల్ ఇండస్ట్రీస్ ఎక్స్‌పోర్ట్స్ కార్పొరేషన్‌వారు ఈ మోడల్స్ పరిశీలన చేసినా, శక్తిమాన్ గ్రూపువారు నగరానికి సమీపంలో 200 ఎకరాల్లో తమ పరిశ్రమను స్థాపించాలనుకుని ఎంవోయూ కదుర్చుకున్నా, టెలిఫోన్ పరిశ్రమ నాయకులు, ప్రభుత్వాల ప్రతినిధులు, మలేషియా ప్రతినిధుల బృందం మన ఐటీశాఖమంత్రితో భేటీ అయినా, ప్రతీదానికి ఈ టీఎస్ ఐపాస్ విధానమే ప్రధాన కారణం.
ఎయిర్‌బస్, దస్సాల్ గ్రూప్‌వంటి వారి ప్రతినిధులు ఆదిభట్ల, ఇబ్రహీంపట్నం ఏరోస్పేస్‌లను సందర్శించి ఆ ప్రాంతాల్లో తమ పరిశ్రమల సాధనకు సంసిద్ధతలను వ్యక్తం చేయడానికి కారణం కూడా టీఎస్ ఐపాస్ విధానమేనన్నది నిర్వివాదం. ఇంతటి దూరదృష్టితో మూడేళ్ళలోనే యావత్ప్రపంచం విస్తుపోయే రీతిలో ప్రగతి సాధిస్తూ టీఎస్ ఐపాస్ విధానాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించడం ఆదర్శవంతమైన విధానం. అందుకే వ్యాపార దిగ్గజాలతో, మంత్రులతో కూడిన చైనా ప్రతినిధి బృందం నగరాన్ని సందర్శించి డ్రైపోర్ట్, హౌసింగ్ అభివృద్ధి వంటి వాటి కొరకు మన ప్రభుత్వంతో ఒప్పందాలను చేసుకుంది. ఈ మార్గంలోనే యూఏఈ ప్రతినిధి బృందం కూడా మన రాజధానికి వచ్చి ఒప్పందాల దిశగా ప్రయత్నం కొనసాగిస్తున్నది.
రాష్ట్ర అభివృద్ధికి మార్గం సామాన్యుని జీవితంలో వెలుగులు రావడమన్న నిశ్చయంతో మన నాయకుడు కొత్తకొత్త పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు జరిగేటట్లు చూస్తున్నారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, దళితులకు మూడెకరాల భూమి, గొల్ల, కురుమ, యాదవ మొదలైనవారికి వివిధ రూపాల్లో సహకారం అందించి అభివృద్దే ధ్యేయంగా సాగిపోతున్న తీరు ఇతర రాష్ట్రాలకు ఆదర్శమై నిలుస్తుంది. ఇటీవల రైతు సంక్షేమం దృష్ట్యా ప్రకటించిన ఎకరాకు 4000 రూపాయల ఆర్థిక సాయం కూడా రాష్ట్రాభివృద్ధిని సూచిస్తున్న పథకమే.
ఏ ప్రాంత పురోగతైనా ఆ రాష్ట్రపు జాతీయ రహదారుల అభివృద్ధితో ముడివడి ఉండటం సహజం. ఇది గమనించిన రాష్ట్ర నాయకత్వం దీనిపైగూడా దృష్టిపెట్టి 60 ఏళ్ళ ఉమ్మడి రాష్ట్ర పాలకుల కాలంలో అభివృద్ధి సగటులో 2.2గా ఉన్న దాన్ని ఈ మూడేళ్ళలో సగటు అభివృద్ధిని 4.7గా పెంచడం ఒక రికార్డు. ఇది దేశంలోనే జాతీయ అభివృద్ధిలో ప్రథమ స్థానాన్ని కట్టబెట్టింది. ఈ దిశలోనే మన రవాణాశాఖ ఎం వాలెట్ అనే ఒక కొత్త యాప్‌కు రూకల్పన చేయడం కారణంగా దీన్ని ఒక సంవత్సరంలోనే 23,40,000మంది డౌన్‌లోడ్
శ్రీ గన్నమరాజు గిరిజా మనోహరబాబు