కవిత్వం రాయాలనే ఆరాటం వున్నప్పుడు సామాజిక స్పృహమీద అవగాహనతోపాటు భాషమీద జరంత పట్టుంటేనే ‘మంచి’ కవిత్వం వస్తుందనే సంగతి పాఠకులందరికీ తెలుసు. పదిహేడేండ్లకు పూర్వమే రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టినా, పదేండ్ల క్రితమొచ్చిన ‘మేలుకొలుపు’తో కవిగా పరిచయమైన కూకట్ల తిరుపతి రాసిన ఐదు పుస్తకాలలో యీ ‘ఎర్రగాలు’ కవిత్వం యెంతో మందిని మెప్పించింది. ఉత్తినే కవిత్వం రాయకుండా వున్న విషయాన్నే దృశ్యమానంగా చెప్పడంలో తిరుపతి గట్టి కృషినే చేస్తుంటాడ నిపిస్తుంది. ఉద్య మానికి ముందు ఉప్పొంగిన కవి త్వాన్నే యీ మధ్య ‘ఎర్ర గాలు’గా మనకందించినా కొన్ని కవితలు మాత్రం మళ్లీ మళ్లీ చదువుకునేలా వున్నాయి. ‘వలసబోయిన పల్లె’లో చెప్పాల్సిన విషయం చాలా వున్నా కొంచెమే చెప్పినప్పటికీ ‘ఊర చెరువు’లో కవిత్వపు ‘ఊట’ వేరేగా అనిపించింది. పాతబస్తీ పేదరికం గురించి ‘అమీనా’లో వేదన కనిపిస్తే పచ్చని సోపానాల గురించి ‘పచ్చదనాల బాట’లో హరితహారం కొరకు ఆశపడిన యీ కవి ‘ఆదివాసీ ఆణిముత్యం’లో ఆకట్టుకునే కవిత్వం రాశాడు. ‘ఎర్రగాలు’ల్లాంటి ముర్రి (రి) పాలనందించే కవితలు మరెన్నో రాసిన యీ కవి’తల’లో కవిత్వం నిండుగానే వున్నప్పటికీ కవిత్వీకరించడంలో కొంత అసం పూర్తి కనిపించింది. ‘అతారెలు పతారెలు’, ‘ఎర్రగాలు’, ‘ఆదివాసీ ఆణిముత్యం’, ‘అకాలం’, ‘మసి గాయాలు’, ‘చెమట చుక్కలు’, ‘బాల కార్మికులం’లాంటి అసలైన కొన్ని కవితల్లో సాంద్రతగల కవిత్వం మనల్ని ఆనందింపజేస్తుంది. ఆలోచించి రాసే కవిత్వంకన్నా అనుభవాన్ని ఆసరా చేసుకుని రాసే కవిత్వంలో పటుత్వం వుంటుంది కాబట్టే తిరుపతి కలంలో మెరుపు కనిపిస్తుంది. ‘ఎర్రగాలు’లోని 37 కవితలలో కొన్ని కవితలు మాత్రమే అచ్ఛమైన తెలంగాణ నుడికారంతో వడి దిరిగి కనిపించినప్పుడు మిగతా కవితలు కూడా అదే మాదిరిగుంటే బావుండునన్పించింది.
-కన్నోజు లక్ష్మీకాంతం