వి.ప్రకాశ్‌

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ‘ముల్కీ నిబంధనలు సక్రమమే’నని డిసెంబర్‌ 9, 1970న తీర్పునిచ్చింది. ప్రధాన న్యాయమూర్తి ఎన్‌. కుమరయ్య, న్యాయమూర్తులు గోపాల్‌ రావు ఎక్బోటే, ఆవుల సాంబశివరావుతో కూడిన ఫుల్‌ బెంచ్‌ పి.డబ్ల్యూ.డి, విద్యుచ్ఛక్తి శాఖ ఉద్యోగులు దాఖలు చేసిన ‘రిట్‌’లో ఈ తీర్పునిచ్చింది.

1968లో బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనందున తాత్కాలిక ఉద్యోగులను తొలగించాలని ‘రిట్రెంచ్‌మెంట్‌’ జీ.ఓ. జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ పబ్లిక్‌ వర్క్స్‌, విద్యుత్‌ శాఖల ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. పూర్వ హైదరాబాద్‌ సంస్థానంలో నిజాం నవాబులు ముల్కీ నిబంధనలను ఒక ఫర్మానా ద్వారా 1919లో జారీ చేశారు. ”ఈ నిబంధనలు ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో అమల్లో వున్నట్లు పరిగణించాల”ని హైకోర్టు తీర్పులో పేర్కొన్నారు.

రాజ్యాంగంలోని 35(బి) అధికరణం ప్రకారం తెలంగాణ ప్రాంతంలో ముల్కీ నిబంధనలు ”అమల్లో ఉన్న శాసనం”గా పరిగణించాలని న్యాయమూర్తులు తమ తీర్పులో స్పష్టం చేశారు.

రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అంతకు ముందుగల ముల్కీ నిబంధనలన్నీ రద్దు చేస్తూ వాటి స్థానంలో నూతన నిబంధనలు అప్పటి రాజ్‌ ప్రముఖ్‌ నిజాం రాజ్యాంగంలోని 309 అధికరణం ద్వారా 1955లో జారీ చేశారనీ, ఈ నిబంధనల ప్రకారం సంస్థానంలో ఉద్యోగం కొరకు ఒక వ్యక్తి సంస్థానంలో నివసిస్తున్నట్లు సర్టిఫికేట్‌ సమర్పించాలనీ, ఈ నిబంధనలకు అప్పుడు శాసన ప్రతిపత్తి వున్నదనీ న్యాయమూర్తులు పేర్కొన్నారు.

రాష్ట్రాల పునర్విభజన జరిగే సమయానికి ఆయా ప్రాంతాల్లో అమల్లో ఉన్న చట్టాలు పునర్విభజన జరిగిన తర్వాత కూడా ఆ ప్రాంతాల్లో అమలులో ఉండడం కొనసాగాలని రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 119 నిర్దేశిస్తున్నదని న్యాయమూర్తులు వివరించారు.

1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చిన సమయానికి 1949లో నిజాం నవాబు ఫర్మానా ద్వారా జారీ చేసిన ముల్కీ నిబంధనలు అమల్లో వున్నాయని, ఈ నిబంధనలకు రాజ్యాంగంలోని 35(బి) అధికరణం రక్షణ కల్పిస్తున్నదనీ న్యాయమూర్తులు వివరించారు. ఈ నిబంధనలను సవరించటానికి గానీ, రద్దు చేయటానికి గానీ ఒక్క పార్లమెంటుకు మాత్రమే అధికారం వున్నదనీ, రాష్ట్ర శాసన సభలకు అధికారం లేదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. అందువలన ఈ నిబంధనలను రద్దు చేస్తూ 1955లో రాజ్‌ ప్రముఖ్‌ జారీ చేసిన కొత్త నిబంధనలు చెల్లనేరవని, 1949 నాటి నిబంధనలే అమలులో కొనసాగుతున్నట్లు భావించాలనీ న్యాయమూర్తులు స్పష్టం చేశారు.

ముల్కీ నిబంధలు వివాదాలు – గత తీర్పులు

1919 నుండి అమల్లో వున్న ముల్కీ నిబంధనల ప్రకారం 15 సంవత్సరాలు (వరుసగా) తెలంగాణ లేదా అప్పటి హైదరాబాద్‌ రాష్ట్రంలో నివసిస్తే ఆ వ్యక్తి ముల్కీ (స్థానికత)గా పరిగణించబడతాడు.

భారత రాజ్యాంగం 35 (బి) అధికరణ ద్వారా ఈ ముల్కీ నిబంధనలకు రక్షణ కల్పించింది.18-9-1951న అప్పటి ముఖ్యమంత్రి వెల్లోడీ ప్రభుత్వం మరో సర్క్యులర్‌ను జారీ చేస్తూ ”15 ఏళ్ళ నివాసార్హతకు సంబంధించిన నిబంధన ఇక ముందు కూడా అమల్లో వుంటుంద”ని పేర్కొన్నది.

1955 నవంబర్‌ 9న బూర్గుల రామక్రిష్ణారావు ప్రభుత్వం భారత రాజ్యాంగంలోని 309వ అధికరణం క్రింద” హైదరా బాద్‌ రిక్రూట్‌మెంట్‌ రూల్స్‌”ను రూపొందించి రాజ్‌ ప్రముఖ్‌ నిజాం సంతకంతో ఒక ఫర్మానా (నోటిఫికేషన్‌)ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం స్థానికతకు 15 ఏళ్ళు ఉండాలని పేర్కొన్నారు. కానీ, ముల్కీయేతరున్ని కూడా కొన్ని షరతులతో ఉద్యోగాలలో నియమించవచ్చునని మినహా యింపు ఇచ్చారు.రాష్ట్రాల పునర్విభజన చట్టం ప్రకారం 1955 నోటిఫికేషన్‌ యధాతథంగా 1-11-1956న ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో కూడా తెలంగాణా ప్రాంతానికి వర్తిస్తుంది.

నిజానికి రాజ్యాంగంలోని 35(బి) అధికరణం క్రింద 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చిన ముల్కీ నిబంధనలను సవరించే అధికారం కేవలం భారత పార్లమెంట్‌కే వున్నది. వెల్లోడి, బూర్గుల ప్రభుత్వాలకు గానీ, రాజ్‌ ప్రముఖ్‌ నిజాంకు గానీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలకు గానీ లేనే లేదు. ఎవరికి తోచినట్లు వారు ముల్కీ నిబంధనలను సవరిస్తూ వచ్చారు. ఈ చర్యలన్నీ రాజ్యాంగ వ్యతిరేకమైనవేనని ఉన్నత న్యాయస్థానాలు తప్పు పట్టినవి.

ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుకు ప్రాతిపదికగా నిలిచిన పెద్ద మనుషుల ఒప్పందంలో 7వ అంశం ముల్కీ నిబంధన గురించి రాసుకున్నారు.

ముల్కీ నిబంధనల కొనసాగింపుకై 1957 డిసెంబర్‌ 7న ఎపి పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ (రిక్రూట్‌మెంట్‌ యాజ్‌ టు రెసిడెన్స్‌) యాక్ట్‌ – 1957ను తీసుకు వచ్చింది కేంద్ర ప్రభుత్వం.రాజ్యాంగంలోని 16వ అధికరణ (క్లాజ్‌ 3) ప్రకారం తెలంగాణలోని స్థానికులకు ముల్కీ వర్తింపచేయడానికి ఈ చట్టం, నియమావళిని పార్లమెంట్‌ రూపొందించింది. తొలుత ఐదేళ్ళు అమలయ్యేలా ఈ చట్టాన్ని తెచ్చారు. 1968-69 నాటికి ఈ చట్టాన్ని అమలు చేయడంలో పాలకులు ఘోరంగా విఫలమైనారని తెలంగాణలోని రీజనల్‌ కమిటీ, పలు ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు ఆందోళన చేయడం, న్యాయస్థానాలు, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం కారణంగా ఈ చట్టాన్ని 1964 నుండి 1969 వరకు మరో ఐదేళ్ళు పొడిగించారు. అయినా ఫలితం లేక పోవడంతో టిఎన్‌జీవోలు ఆ సంస్థ అధ్యక్షులు కె.ఆర్‌. ఆమోస్‌ నాయకత్వంలో తెలంగాణ రక్షణల (సేఫ్‌గార్డ్స్‌) ఉద్యమాన్ని 1968లో ప్రారంభించారు. 1968 జూలై 10న ‘తెలంగాణ హామీల దినం’ పేరుతో సభలు నిర్వహించారు.

తెలంగాణ రక్షణల అమలుకై ఖమ్మంలో రవీంద్రనాథ్‌ 1969 జనవరి 8న, పాల్వంచలో పోటు కృష్ణమూర్తి జనవరి 10న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినారు. జనవరి 15న ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారు. అంతకు ముందే జనవరి 7న వరంగల్‌లో ఎం.ఎల్‌.ఏ. టి. పురుషోత్తమ రావు ఆధ్వర్యంలో ‘తెలంగాణ రక్షణల ఉద్యమ సమితి’ ప్రారంభమై వరంగల్‌ హర్తాళ్‌, జనవరి 9న బహిరంగ సభ నిర్వహించారు. ఉద్యమం తెలంగాణ అంతటా వ్యాపించడంతో జనవరి 18,19 తేదీల్లో ముఖ్యమంత్రి అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించి ‘నాన్‌-ముల్కీలను తమ స్వంత ప్రాంతాలకు బదిలీ చేయడానికి జీ.ఓ నెం. 36 జారీ చేశారు. ఫిబ్రవరి 28 లోపు ఈ జీ.ఓ అమలు చేస్తామన్నారు. కొందరు తెలంగాణేతర ఉద్యోగులు ఈ జీ.ఓ అమలు నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించారు.

ముల్కీ నిబంధనలు చెల్లవు – హై కోర్టు తీర్పు

1969 ఫిబ్రవరి 3న ‘ముల్కీ నిబంధనలు చెల్లవు” అని జస్టిస్‌ చిన్నపరెడ్డి తీర్పు నిచ్చారు. 1968 ఏప్రిల్‌ 30న నాన్‌ – ముల్కీలను తొలగిస్తూ వెలువడిన జీ.ఓపై పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయులు కొందరు హైకోర్డులో వేసిన రిట్‌లో ఆంధ్రప్రదేశ్‌ న్యాయమూర్తి ”తెలంగాణ ప్రాంతంలోని కొన్ని రకాల ఉద్యోగాలలో స్థానికులను మాత్రమే చేర్చుకోవాలన్న ‘ముల్కీ నిబంధనల’కు అవకాశం ఇచ్చిన ”పబ్లిక్‌ ఎంప్లాయ్‌ మెంట్‌ చట్టం – 1957లోని మూడవ సెక్షన్‌, దీనికి అనుబంధ రూల్స్‌ చెల్లవని, వీటిని అమలు జరపరాదని” తీర్పునిచ్చారు. ఈ తీర్పు పై ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌కు అప్పీలు చేసింది. జీ.ఓ 36పై దాఖలైన రిట్‌ పిటీషన్లపై అప్పీలును కూడా కలిపి హైకోర్టు బెంచ్‌ ఫిబ్రవరి 20న తీర్పు వెలువరించింది.

ముల్కీ సక్రమమే – హైకోర్టు బెంచ్‌

జస్టిస్‌ పింగళి జగన్మోహన్‌ రెడ్డి, జస్టిస్‌ ఆవుల సాంబశివరావులతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఫిబ్రవరి 3న జస్టిస్‌ చిన్నపరెడ్డి ఇచ్చిన తీర్పును త్రోసిపుచ్చింది. జీ.ఓ 36 గురించి అడ్వొకేట్‌ జనరల్‌ ”స్వస్థలాలకు నాన్‌-ముల్కీలను బదిలీ చేయనవసరం లేకుండా ఎక్కడివారక్కడే పని చేసేలా అదనపు ఉద్యోగాలు ప్రభుత్వం సృష్టించగలద”ని హామీ ఇచ్చారు. దీనికి కోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. కానీ అప్పటికే జీ.ఓ 36 అమలు నిలిపివేస్తూ సూప్రీం కోర్టు ఫిబ్రవరి 17న ఒక రిట్‌ పిటీషన్‌లో ‘స్టే’ ఇచ్చింది. ఈ కారణంతో జీ.ఓ 36 అమలు కాలేదు. ఇక రక్షణల అమలు అసాధ్యమేనని భావించిన తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులు ప్రత్యేక రాష్ట్ర సాధనోధ్యమాన్ని ప్రారంభించి ఉధృతం చేశారు.

ముల్కీ రూల్స్‌ చెల్లవు – సుప్రీం కోర్టు

ఉద్యమం ఉధృతమవుతున్న సమయంలోనే 1969 మార్చి 28న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

యం. హిదయతుల్లాతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ఫుల్‌ బెంచ్‌ జీ.ఓ 36ను రద్దు చేస్తూ ”ముల్కీ నిబంధనలు చెల్లవు” అని స్పష్టమైన తీర్పునిచ్చింది. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఫిబ్రవరి 20న ఇచ్చిన తీర్పును త్రోసిపుచ్చింది. ఉద్యమం ఈ తీర్పుతో మరింత తీవ్రమైంది.

రాజ్యాంగాన్ని సవరించాలన్న రాష్ట్ర కేబినెట్‌

సుప్రీం తీర్పు ఎలా ఉన్నా ‘రక్షణలు అమలు చేస్తాం’ అని సిఎం బ్రహ్మానంద రెడ్డి మార్చి 28తీర్పు తర్వాత ప్రకటించారు. 30వ తేదీన మంత్రివర్గం సమావేశమై ”సుప్రీం కోర్టు తీర్పు ద్వారా తలెత్తిన పరిస్థితిని చక్కదిద్ది తెలంగాణ రక్షణలు, ముల్కీ రూల్స్‌ అమలు చేయడానికి రాజ్యాంగాన్ని సవరించాల”ని కేంద్ర ప్రభుత్వానికి ”కేబినేట్‌ విజ్ఞప్తి”ని పంపించారు.

ఉత్పన్నమైన సంకట స్థితి

1969 మార్చి 28న సుప్రీం కోర్టు ఫుల్‌ బెంచ్‌ తీర్పు స్ఫూర్తికి విరుద్ధమైన తీర్పును 1970 డిసెంబర్‌ 9న హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం వెలువరించింది.

సుప్రీం కోర్టు పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ చట్టం – 1957లోని 3వ నిబంధన రాజ్యాంగంలోని 16(3) అధికరణానికి భిన్నంగా వుందని ఆ నిబంధనని కొట్టివేసింది. అయితే అంతవరకూ అమల్లో వున్న ముల్కీ నిబంధనలు తిరిగి కొనసాగించవచ్చునా, లేదా అన్న విషయంపై సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయమూ చేయలేదని హై కోర్టు త్రిసభ్య ధర్మాసనం ప్రస్తావించింది. ”రాజ్యాంగంలోని 35(బి) అధికరణం ప్రకారం ముల్కీ నిబంధనల అమలు కొనసాగుతూనే ఉండగలద”ని హైకోర్టు ఫుల్‌ బెంచ్‌ స్పష్టం చేసింది.

అయితే రాజ్యాంగంలోని 372వ అధికరణం ప్రకారం రాష్ట్రపతికి ఈ నిబంధనలను సవరించే అధికారం, చివరికి రద్దు చేసే అధికారం కూడా

ఉన్నట్లు” హైకోర్టు త్రి సభ్య ధర్మాసనం తీర్పులో పేర్కొన్నది.

నిజానికి సుప్రీం కోర్టు ఫుల్‌ బెంచ్‌ తీర్పును ఏ హైకోర్టు ‘ఓవర్‌ రూల్‌’ చేయజాలదు. కానీ ఈ కేసులో ఒక ప్రత్యేక పరిస్థితి ఎదురైంది.

(ఈ సంకటస్థితిని తదనంతరం వెలువడిన సుప్రీం కోర్టు తీర్పు పరిష్కరించింది)

హై కోర్టు తీర్పును అమలు చేయాలి – టిఎన్‌జీఓ

ముల్కీ నిబంధనలు సక్రమమేనని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని టిఎన్‌జీఓ అధ్యక్షులు కె. రామకృష్ణా రెడ్డి, హైదరాబాద్‌ ఇంజనీర్ల అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కె. అనంతరెడ్డి ప్రభుత్వాన్ని కోరినారు.

ఆంధ్ర ఉద్యోగులందరినీ గెజిటెడ్‌ పదవులలో, నాన్‌ గెజిటెడ్‌ పదవులలో వున్న వారిని బదిలీ చేయాలని ఆ ఖాళీలను తెలంగాణ వారితో భర్తీ చేయాలని కోరినారు.

హై కోర్టు తీర్పు దృష్ట్యా అర్హులు కాని పదవుల్లో కొనసాగుతూ తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న ఆంధ్ర సోదరులు ఆంధ్ర ప్రాంతానికి సాధ్యమైనంత త్వరలో బదిలీ కోరాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు. తీర్పు అమలుకు ఆయా జిల్లాల అధికారులను చర్యలు తీసుకోవలసిందిగా అభ్యర్థించవలసిందని తమ యూనియన్ల శాఖలకు సూచించారు.

వచ్చే సంచికలో…

అష్టసూత్ర పథకంపై అసెంబ్లీలో చర్చ

Other Updates