తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మూడు చైనా కంపెనీలు రాష్ట్ర సర్కార్‌తో ఎంఓయులు కుదుర్చుకున్నాయి. ఐటీ, వైద్య రంగాలలో ఈ ఎంవోయులు కుదిరాయి. జూన్ 20న రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ మేరకు ఒప్పందాలు జరిగాయి. చైనాలోని హైనాన్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ లూయూ జీయూన్, రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్‌లు సంతకాలు చేశారు. అలాగే హైనాన్ రాష్ట్ర గవర్నర్ లీయూ సిగయ్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయులు కుదుర్చుకుంది. టీహబ్-హైనాన్ మధ్య ఒప్పందంపై టీ-హబ్ సీవోవో శ్రీనివాస్, హైనాన్‌లో అపోలో ఆసుపత్రి ఏర్పాటుపై అపోలో వైపున సంగీతారెడ్డి సంతకాలు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారీ పరిశ్రమలు, ఐటిశాఖా మంత్రి కె.తారకరామారావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చైనాలో జరిపిన పర్యటన ఫలాలు ఇప్పుడిప్పుడే కార్యరూపంలోకి వస్తున్నాయని అన్నారు. ఇందులో భాగంగానే హైనాన్ రాష్ట్ర గవర్నర్ లీయూ సిగయ్, ఆ రాష్ట్ర మంత్రులు, మేయర్ బృందం మన రాష్ట్రంలో పెట్టుబడుల పరిశీలనకు వచ్చారని తెలిపారు. ఇక్కడ పెట్టుబడుల అవకాశాలను వారికి వివరించినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య, అంగీకారం కుదుర్చుకోవడానికి కేసీఆర్ చైనా పర్యటన దోహదపడిందన్నారు. మన దేశంలో అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్ అయిన టీ-హబ్‌తో హైనాన్ ఒప్పందం కుదుర్చుకోవడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు.
దీనివల్ల చైనా స్టార్టప్ కంపెనీలు భారత్‌లోకి అడుగుపెట్టడానికి టీ-హబ్ ద్వారా అవకాశం ఏర్పడుతుందన్నారు. ఇరు రాష్ట్రాలు కలిసి పనిచేసేదిశగా ఈ ఒప్పందాలు సత్పలితాలు ఇస్తాయన్నారు. హైనాన్ రాష్ట్రంలో ఈ సంవత్సరం నవంబర్, వచ్చే సంవత్సరం ఏప్రిల్‌లో పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్నారన్నారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వారు ఆహ్వానించారని తెలిపారు. హైనాన్ రాష్ట్ర గవర్నర్ లీయూ సిగయ్ మాట్లాడుతూ, తెలంగాణ, హైనాన్ రాష్ట్రాలకు మధ్య సంబంధాల బీజం పడిందని, హైనాన్‌లో పర్యటనకు మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించామని తెలిపారు. మొత్తంగా తెలంగాణ, హైనాన్ రాష్ట్రాల మధ్య ఒప్పందం రాష్ట్రంలో పెట్టుబడులకు దోహదం కల్పిస్తుందని ఇరు రాష్ట్రాల వారు హర్షం వ్యక్తం చేశారు.