sసినిమా అంటే భారీ సెట్టింగులు, పంచ్‌ డైలాగులు, ఫైట్లు, పాటలుగా మారిపోయాయి. మానవ సంబంధాలు, కుటుంబ సమేతంగా చూసే సినిమాలు ఈ రోజుల్లో చాలా తక్కువ. సామాజికాంశాలు, మానవీయ కోణంలో సినిమా చూడాలంటే కష్టమే. ఇలాంటి సినీ ప్రపంచంలో అనుబంధాలు, ఆప్యా యతలు, భావోద్వేగాన్ని ఆవిష్కరించి మనుషుల మనస్సుల్లో పెరుగుతున్న దూరాన్ని కళ్ళ ముందు ప్రత్యక్షం గావించారు మెదక్‌ జిల్లాకు చెందిన వేణు నక్షత్రం. స్వీయ దర్శక, నిర్మాణంలో తెరకెక్కిన ‘‘నక్షత్రం – మూడు హృదయాల చప్పుడు’’. మూడు విభిన్న కథలను, వారి హృదయ స్పందనలను దృశ్య రూపంలో చూపించి ప్రేక్షకులను ఉద్వేగానికి, ఆలోచనలోను చేశారు…

మూడు హృదయాల చప్పుడు వినిపించే ‘నక్షత్రం’ సినిమాలోని కథలన్నీ రోజు రోజుకు క్షీణిస్తున్న మానవీయ విలువలు, తల్లి దండ్రుల ఉద్వేగాలను, డాలర్ల మోజులో కనుమరుగై పోతున్న ప్రేమ, ఆప్యాయత, అనురాగాలే ప్రధానంశంగా నిర్మించబడ్డాయి. ఈ సినిమాలు అమెరికాలోని నార్త్‌ కరోలినా ఏవియేషన్‌ ఫిలిం ఫెస్టివల్‌లో, డ్యూక్‌ యూనివర్సిటీలోనూ దేశ విదేశీయుల ప్రశంసలు పొందాయి.

‘అవతలి వైపు’:

సున్నితమైన మానవ సంబంధాలను తెరపై ఆవిష్కరిస్తున్న ‘నక్షత్రం’ సినిమాలో మూడు కథలు ఉన్నాయి. ఇందులో మొదటిది ‘అవతలి వైపు’. విదేశాల్లో ఉంటున్న తమ పిల్లల ఆదరణకు నోచుకోక స్వదేశంలో ఒంటరి జీవితాన్ని గడుపుతూ తపించిపోతున్న తల్లిదండ్రుల సంఘర్షణ ప్రధానాంశంగా ‘అవతలి వైపు’ చిత్రం రూపొందించబడిరది. విదేశాల్లో డాలర్ల మోజులో పడి కన్న తల్లిదండ్రుల ప్రేమను మరిచిపోయిన పిల్లల గురించి తపించిపోయే తల్లి దండ్రుల ఆవేదన ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమ పిల్లలపై అపార ప్రేమను పెంచుకున్న తల్లిదండ్రులు భవిష్యత్తులో తమను ఆదుకుంటారని పిల్లలను ఉన్నత చదువులు చదివించి పెద్దవారిని చేస్తే…. ఒంటరి వారిని చేసి విదేశాలకు వెళ్లిన పిల్లలపై పెంచుకున్న ప్రేమతో పిచ్చి వారైన తల్లిదండ్రుల గురించి ‘అవతలి వైపు’ చిత్రంలో చూపించారు. విదేశాల్లో ఉన్న తన కుమారుడు ఎప్పుడొస్తాడోనని ఎదురు చూసి చూసి పిచ్చిదైన తల్లి, తమ ఇంట్లో ఫోన్‌ మోగినప్పుడల్లా తన కొడుకే ఫోన్‌ చేశాడని తపించి పోయే తల్లిదండ్రుల భావోద్వేగాలను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించారు.

‘పిలుపు’ – ఇది యాంత్రిక జీవన మలుపు 

సినిమాలో రెండో కథ ‘పిలుపు’. డాలర్లు, విదేశీ వ్యామోహంలో మన యువత కోల్పోతున్నదేమిటి? దాని పర్యవసనాలేమిటి? డబ్బు మోజులో మరిచి పోతున్న మానవీయ కోణాన్ని స్పృశించే ప్రయత్నమే ఈ పిలుపు. డబ్బు మోజులో పడి మాతృత్వాన్ని సైతం దూరం చేసుకుంటున్న యువతగురించి ఆవిష్కరించారు ఇందులో..

‘ఎంతెంత దూరం’

మూడవ కథ చదువు కోసం ఓ కొడుకు తన తండ్రితో పడే ఘర్షణ, అతని హృదయ స్పందన ఈ చిత్రం వివరిస్తుంది. చదువు కొందరికి మాత్రమే సొంతం కాదు, అందరిది అనేదే ఈ కథ.

చదువు విలువ తెలియని తండ్రి తన కొడుకు సాధించిన విజయాన్ని తెలుసుకోలేక, ఉన్నత చదువులు చదివించేది లేదు కూలీకి వెళ్ళమంటాడు. ఆ తర్వాత గ్రామంలోని దొర తన కూతురు కంటే నీ కొడుకు ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడని అభినందించడంతో, తన కొడుకు సాధించిన విజయాన్ని తెలుసుకుని తన కొడుకు వల్లే తనకు గౌరవం దక్కిందని సంతోషిస్తాడు. తన కొడుకు కోరుకున్నట్లే ఉన్నత చదువుకు పట్నం పంపిస్తానని హామీ ఇస్తాడు. చదువు వల్ల ఎంత గౌరవం దక్కుతుందో ‘ఎంతెంత దూరం’ చిత్రంలో తెరకెక్కించాడు నక్షత్రం వేణు. గత సంవత్సరం హైదరాబాద్‌ లో జరిగిన తెలంగాణా ఫిలిం ఫెస్టివల్‌లో ‘ఎంతెంత దూరం’ ఉత్తమ చిత్రం అవార్డుని సొంతం చేసుకుంది.

Other Updates