ఆదిలాబాద్‌ జిల్లా జైపూర్‌ మండలం పెగడపల్లి వద్ద సింగరేణి పవర్‌ప్లాంట్‌
రెండో దశకు చెందిన 600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంగల మూడో ప్లాంటు పనులకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మార్చి 3వ తేదీన శంకుస్థాపన చేశారు.

సింగరేణి అతిథి గృహంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించి, విద్యుత్‌ ఉత్పత్తి సాధనకు సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

మూడేళ్లలో-విద్యుత్‌-మిగులు-అధికారులకు-సి.ఎం.-ఆదేశంభవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ‘విద్యుత్‌కోత’ అనే మాట కూడా వినపడకూడదని, వచ్చే మూడేళ్ళలో రాష్ట్రంలో మిగులు విద్యుత్‌ సాధించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఇందుకోసం అధికారులు సమన్వయంతో, కలసికట్టుగా పని చేయాలన్నారు. ఈ ఏడాది నవంబర్‌ నాటికి 1200 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వచ్చేలా పనులు పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు.

పెగడపల్లివద్ద సింగరేణి సంస్థ 3570 కోట్ల రూపాయల వ్యయంతో 600 మెగావాట్ల మూడో యూనిట్‌ను చేపట్టింది. ఆదిలాబాద్‌ జిల్లా జైపూర్‌వద్ద ఇప్పటికే నిర్మాణంలో ఉన్న 1200 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంగల రెండో యూనిట్‌ పనులను సత్వరం పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశించారు.

కొత్తగా నిర్మిస్తున్న మూడో ప్లాంటుకు అవసరమైన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా సింగరేణి సంస్థ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆ సంస్థ సి.ఎం.డి. ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. సంస్థలో బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి తీసుకుంటున్న పలు అంశాలను కూడా ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం ఉన్న 52 మిలియన్‌ టన్నుల ఉత్పత్తిని 2019-20 నాటికి 75.6 మిలియన్‌ టన్నులకు పెంచేందుకు చర్యలు తీసుకొంటున్నట్టు తెలిపారు. కొత్త గనులను ప్రారంభిస్తున్నామన్నారు.

దీనిపై ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌. సంతృప్తిని వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం, నాయకత్వంపై పూర్తి నమ్మకం
ఉన్నదని, కేవలం ఇక్కడికే పరిమితం కాకుండా ఇండోనేషియా, మొజాంబిక్‌, దక్షిణాఫ్రికావంటి దేశాలలోని బొగ్గు బ్లాకులను కూడా తీసుకోవాలని సూచించారు.

ఈ పర్యటన సందర్భంగా స్థానికులు అందించిన ఆర్జీలను సి.ఎం. స్వీకరించారు. ప్లాంట్‌కు సంబంధించి పెగడపల్లి వైపు గేటు ఏర్పాటు చేయాలని కొందరు, భూములు కోల్పోయిన వారికి వీలైతే శాశ్వత ప్రాతిపదికన, లేదా కాంట్రాక్టు పద్ధతిలోనైనా ఉద్యోగాలు ఇవ్వాలని మరికొందరు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Other Updates