తెలంగాణ రాష్ట్ర తృతీయ అవతరణోత్సవాలు పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాం. గత మూడేళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు ప్రజల ముంగిటకు వచ్చి చేరుతుండంతో ఎల్లెడలా ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ఏ ప్రభుత్వానికైనా ప్రజల ఆనందానికి మించి కావల్సింది ఏముంటుంది. జనరంజక పాలనకు వేరే నిదర్శనం ఏముంటుంది.
మూడేళ్ళ క్రితం దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రం ఎన్నో బాలారిష్టాలను అధిగమించి, ఎదురవుతున్న సమస్యల చిక్కుముడులను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందడుగు వేస్తోంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజావసరాలకు తగినట్టుగా సరికొత్త పథకాలకు రూపకల్పన చేయడంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని మన రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలచింది. ముఖ్యంగా మన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను స్వయంగా సందర్శించేందుకు దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల , సంస్థల ప్రతినిధులు మన రాష్ట్రానికి తరలిరావడం, ఇలాంటి పథకాలను తమతమ రాష్ట్రాలలో ప్రారంభించాలని సంకల్పించడం నిజంగా గర్వకారణం.
విభజనకు ముందు తెలంగాణ వ్యతిరేకులు, ఉమ్మడిపాలకులు కొందరు ఊహించినట్టుగా, పగటి కలలు కన్నట్టుగా, తెలంగాణ ప్రజానీకాన్ని భయపెట్టాలని చేసిన ప్రయత్నాలన్నీ ప్రత్యేక రాష్ట్రంలో బెడిసికొట్టాయి. ఆనాటి వారి శాపనార్థాలే, నేడు మన రాష్ట్రం పాలిట వరాలుగా పరిణమించాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో రాష్ట్రం అంధకారమయం కాకపోగా, వెలుగు జిలుగులతో విరాజిల్లుతోంది. ఆర్థిక సంక్షోభం ఏదీ రాకపోగా, ఆదినుంచీ తెలంగాణ ప్రాంతం సుసంపన్నమైనదే అన్న విషయం మరోసారి నిరూపితమైంది. ఆర్థికాభివృద్ధిలో నేడు దేశంలోనే అగ్రస్థానంలో నిలచింది. పరిశ్రమలు తరలిపోవడం కాదుగదా, పోటీపడి మరీ తరలివస్తున్నాయి. నాటి ఉమ్మడిపాలనలో సాగునీరులేక నెర్రెలువెట్టి, వెలవెలబోయిన పంటపొలాలు నేడు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. లక్ష్యాలను అధిగమించి, కేవలం కొన్ని నెలల కాలంలోనే పంటపొలాలకు నీరందించిన భక్తరామదాసు ప్రాజెక్టు సాక్షిగా, సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగం అందుకున్నాయి. పాలన చేతకాదని నోరుపారేసుకున్న వారే నేటి మన సుపరిపాలనను చూసి నోళ్ళు వెళ్ళబెట్టవలసి వస్తోంది.
ఒకటా, రెండా ఎన్ని సంక్షేమ పథకాలు…. ఎన్ని అభివృద్ధి ప్రణాళికలు. ఒక్కమాటలో చెప్పాలంటే మనిషి పుట్టింది మొదలు గిట్టేవరకూ, అన్నిదశలలోనూ ప్రభుత్వ సాయం పొందని కుటుంబం ఏదీ ఉండబోదంటే అతిశయోక్తి కాదు. ఈ రాష్ట్ర అవతరణోత్సవాల సందర్భంగా గర్భిణులకు 12,000 రూపాయల ఆర్థిక సహాయం, నవజాత శిశువులకు కె.సి.ఆర్ కిట్, ఒంటరి మహిళలకు భతి వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రారంభించుకుంటున్నాం. రాష్ట్రంలో వ్యవసాయం దండగకాదని, పండగ అని నిరూపించే లక్ష్యంతో, అన్నదాతకు భరోసానిచ్చి, అన్నివిధాలా ఆదుకొని, వారిని సంఘటితపరచే విధానాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే వచ్చే ఏడాది నుంచి వ్యవసాయ పెట్టుబడుల నిమిత్తం ఎకరానికి 4, 000 రూపాయల వంతున రెండు పంటలకు 8, 000 రూపాయల చొప్పున నేరుగా రైతు ఖాతాలోనే జమచేసేందుకు ప్రభుత్వం పథకరచన చేసింది.
మూడేళ్ల ప్రాయంలో, బుడిబుడి అడుగులు వేసే తరుణంలోనే అనేక విషయాలలో దేశంలోనే నెంబర్ వన్‌గా ఇంటా, బయటా ప్రశంసలు అందుకుంటున్న తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో మరెంతో ప్రగతి సాధించగలదనడంలో సందేహం ఏముంటుంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఏ ఒక్క రాష్ట్రంతోగాక, ప్రపంచ దేశాలతోనే అభివద్ధిలో పోటీ పడుతోంది. అందుకే, రాష్ట్ర అవతరణోత్సవాల శుభవేళ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ శుభ తరుణంలో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకూ అభినందనలు.. శుభాభినందనలు.