అంగడి కిష్టాపూర్ పాఠశాల
సిద్ధిపేట జిల్లా మర్కూక్ మండలంలోని అంగడి కిష్టాపూర్ ప్రాథమిక పాఠశాల జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి హృదయాన్ని కదిలించింది. పాఠశాల విజయపరంపరను తెలుసుకున్న కలెక్టర్ ఏకంగా 10 లక్షల రూపాయల చెక్‌ను పాఠశాల అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించిన ప్రధానోపాధ్యాయులు ఓంకార్‌కు అందించారు.
అంగడి కిష్టాపూర్ పాఠశాల సాధించిన ఘనత ఏమిటి?
గతంలోకి తొంగి చూస్తే.. మూడు సంవత్సరాల క్రితం కేవలం 12 మంది విద్యార్థులతో మూతబడే స్థాయిలో వెంటిలేటర్ సహాయంతో బతుకుతున్న పేషంట్ పరిస్థితి ఆ పాఠశాలది. అపుడు ఆ పాఠశాలను ఎలాగైనా బతికించుకోవాలనే తపనతో పనిచేసిన అక్కడ ఉన్న నుస్రత్ మేడమ్ సంకల్పానికి జేజేలు. ఆ సందర్భంలో ఓంకార్ అనే ఉపాధ్యాయుడు ఆ పాఠశాలకు బదిలీపై వచ్చి, ఆ పాఠశాలకు ఎందుకు వచ్చాను అనుకున్న సందర్భం. కేవలం 12మంది విద్యార్థులు. వారు కూడా ఎప్పుడు వెళతారో తెలియదు. ఆగస్టు 15 ర్యాలీలో 10మందితో.. గ్రామంలో తిరిగిన సందర్భం ఓంకార్ మనసును కలచివేసింది. గ్రామస్థుల సహకారంతో ఈ బడిని ఏం చేయలేమా అనే ఆలోచనతో మధనపడుతూ తన స్నేహితుడు గ్రామ యువకుడు ప్రక్క గ్రామం చేబర్తిలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రామకృష్ణారెడ్డితో తన ఆలోచనలను పంచుకున్నాడు. అప్పుడే ఒక అడుగు ముందుకు వేసి ఎలాగైనా ఈ బడిని బతికించుకోవాలనే సంకల్పం ఓంకార్‌కు కలిగింది. ఆయన సంకల్పానికి రాముడిలా తోడయ్యాడు, ఆ గ్రామ సర్పంచ్ రాములుగౌడ్.
రాములుగౌడ్ నాయకత్వంలో అప్పటి మండల విద్యాధికారి సుగుణాకర్, యువకులు, గ్రామస్తులు వెంకట్‌రెడ్డి, బాల్‌రెడ్డి, శ్యాంసుందర్, శ్రీనివాస్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, కమ్మరిచారి, యాదగిరి, ఆంజనేయులు, కరుణాకర్‌రెడ్డి అందరూ సమావేశమై గడప, గడపకు తిరిగారు. దృఢసంకల్పంతో ముందుకు సాగారు. అసలు పిల్లలు రాకపోవడానికిగల కారణాలు అన్వేషిం చారు. అందులో ముఖ్యమైనది ఆంగ్ల మాధ్యమమని గ్రహించారు. తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుని ఏ ఆంగ్ల మాధ్యమం కొరకై ప్రైవేట్ పాఠశాలలకు వెళుతున్నారో ఆ ఇంగ్లిష్ మీడియాలో విద్యాబోధనను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలోనే వెంకట్‌రెడ్డి, కాసుల శ్రీనివాస్‌రెడ్డి ముందుకువచ్చి పాఠశాలకు సాంకేతిక విద్య కొరకు ల్యాప్‌ట్యాప్‌ను అందజేశారు. సాంబశివరావులు రూ. 70,000 విలువచేసే ఫర్నీచర్ అందించడం మంచి సంకల్పం మహారూపం దాల్చింది.
సర్పంచ్, ఎస్.ఎం.సీ. ఛైర్మన్ బాల్‌రెడ్డి, హెచ్.ఎం. ఓంకార్, యువకులందరూ పిడికిలి బిగించి ఉద్యమరూపాల్లో పాఠశాలను బతికించుకునే ప్రయత్నం ప్రారంభించి కృతకృత్యులయ్యారు. తల్లిదండ్రులు వారి పిల్లలను క్రమంగా అందరూ ఈ పాఠశాలలోనే చేర్పించారు. ఈ సమయంలోనే ప్రక్క గ్రామం చేబర్తిలో పనిచేస్తున్న రామకృష్ణారెడ్డి స్వగ్రామం అంగడికిష్టాపూర్ కావడం, పాఠశాల అభివృద్ధిలో మరో కీలక పరిణామం. గ్రామంలో గ్రామస్తులతో కలిసి అంతకుముందే ఆ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న రామకృష్ణారెడ్డి పట్టణ ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉన్నా కేవలం కిలోమీటర్ దూరం గల అంగడి కిష్టాపూర్ తన స్వంత గ్రామం పాఠశాలను తీర్చిదిద్దాలని బదిలీపై ఈ పాఠశాలను ఎంచుకున్నారు.
పాఠశాలలో అనుభవం కలిగిన, నిష్ణాతులైన ఉపాధ్యాయులచే విద్యా బోధన చేయాలనే తరుణంలో గ్రామంలోని పాఠశాల పూర్వ విద్యార్థులు, ఉన్నత విద్యార్హత కలిగిన యువతులు మౌనిక, రాణి, నవీన, సంధ్య విద్యా వాలంటీర్లుగా ముందుకు వచ్చి పిల్లలను అద్భుతంగా తీర్చిదిద్దడంలో క్రియాశీల పాత్ర పోషించారు. అప్పటికే కళాకారుడిగా ఉన్న చిన్ని కృష్ణ, సామాజిక బాధ్యతగా విద్యా వాలంటీర్‌గా ప్రవేశించాడు. ఇంకేం రాములుగౌడ్ నాయకత్వంలో ఓంకార్, రామకృష్ణారెడ్డి, నుస్రత్ మేడమ్, చిన్ని కృష్ణ… ఇలా అంకితభావంగల అంగడి కిష్టాపూర్ గ్రామస్తుల చైతన్యం పాఠశాల ఆస్తిగా మారినది.
దాతలు, యువజన సంఘాలు ముందుకు వచ్చి పాఠశాలకు ల్యాప్‌టాప్, ప్రొజెక్టర్, ఆట వస్తువులు ఒక్కటేమిటి ఒకకార్పొరేట్ పాఠశాలకు ఉండవలసిన అన్ని హంగులను సమకూర్చారు. ఎస్‌ఎంసీ ఛైర్మన్ బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సభ్యులందరూ కలిసి రేకులతో తాత్కాలిక తరగతి గదులు ఏర్పాటు చేశారు. ఇంతలో ప్రజలతో మమేకమయ్యే అధికారిగా పేరున్న ‘గడ’ హనుమంతరావు దృష్టి ఆ పాఠశాలను ఆకర్షించింది. ప్రభుత్వపరంగా అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడ నిర్మాణం, అన్ని వసతులను సమకూర్చారు. పాఠశాల అభివృద్ధికి పాటుపడుతున్న ప్రతి ఒక్కరిని తనదైన శైలిలో ప్రోత్సహించి ముందుకు నడిపించారు.
పాఠశాల 3వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వచ్చారు. వారు కేవలం మాట్లాడి అత్యవసర పనిపై వెళతానని వార్షికోత్సవానికి హాజరయ్యారు. కానీ పాఠశాల వాతావరణం, గ్రామస్తుల చైతన్యం, సర్పంచ్ రాములుగౌడ్ అంకితభావం, ఎంఎంసీ ఛైర్మన్ బాల్‌రెడ్డి దక్షత, స్టార్ యూత్ ప్రోత్సాహం వీటిన్నింటికి మించి అంగడి కిష్టాపూర్ పాఠశాల పిల్లల ప్రతిభా పాటవాలు ప్రత్యక్షంగా చూశాక ‘ఈరోజు నా కార్యక్రమాలు అన్ని రద్దుచేసుకుంటున్నాను. మీరు ఎంతసేపైనా వార్షికోత్సవం నిర్వహించండి. నేను ఇక్కడే ఉంటాను’ అని తెలిపి వారి కుటుంబ సభ్యులను కూడా పాఠశాలకు ఆహ్వానించి వార్షికోత్సవం తిలకించడం నిజంగా అద్భుతం.
ఆ వార్షికోత్సవాన్ని గ్రామస్తులంతా కలిసి ఊరి జాతరగా నిర్వహించారు. 1వ, 2వ తరగతి చిన్నారులు ప్రపంచంలోని దేశాల పేర్లు, రాజధానులు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల పేర్లు చెబుతున్న సమయంలో అతిథులందరూ మంత్రముగ్ధులయ్యారు. చివరగా కలెక్టర్ మాట్లాడుతూ, అంగడి కిష్టాపూర్ పాఠశాల మూతపడే స్థాయినుంచి ఒక్కపిల్లాడు ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళకుండా, ఈ రోజు 86మందితో కళకళలాడుతోందని, దీనికి కృషి చేసిన సర్పంచ్, గ్రామ పెద్దలకు, యువకులను, మాజీ ప్రజా ప్రతినిధులను అభినందించారు. అదేవిధంగా పట్టుదలతో త్రికరణశుద్ధిగా అంకితభావంతో పనిచేస్తూ పడిపోయే బడిని నిలబెట్టిన ప్రధానోపాధ్యాయుడి కృషిని కొనియాడారు. ప్రాథమిక పాఠశాలకు అవసరాల నిమిత్తం పది లక్షల రూపాయల చెక్కును ప్రధానోపాధ్యాయునికి అందించారు. గ్రామాభివృద్ధికొరకు సర్పంచ్‌కు ప్రత్యేకంగా పది లక్షల రూపాయల చెక్కును అందించారు. అంగడి కిష్టాపూర్ గ్రామస్తుల చైతన్యం చూస్తుంటే గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం, ముఖ్యమంత్రి కేసీఆర్ ‘బంగారు తెలంగాణ’ స్వప్నం సాకారమయ్యే సమయం ఆసన్నమైనదని నిస్సందేహంగా చెప్పవచ్చు.
అదరాసుపల్లి శశిధర్‌శర్మ