పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆనందంగా అభివృద్ధి చేసుకుందామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఉద్భోదించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కలిసి సంతోషంగా బాధ్యతలు పంచుకుంటే బంగారు తెలంగాణ సుసాధ్యమన్నారు. ఏప్రిల్ 1న నిజామాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో అమలవుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల పురోగతి గురించి అధికారులు, ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో ప్రాధాన్యతలను స్థానిక అవసరాల రిత్యా గుర్తించాలని, వినూత్న కార్యాచరణ ద్వారా మాత్రమే నవ తెలంగాణ నిర్మాణం సాధ్యమని ముఖ్యమంత్రి చెప్పారు.
పాత రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్న మూస విధానాలు మనకక్కరలేదు. మొన్నటి దాకా బడ్జెట్ గురించి మనకు సరైన అంచనా లేకుండే, ఈ సారి బడ్జెట్‌ను సంపూర్ణ అవగాహనతో రూపొందించుకున్నాం. అక్కరకు రాని స్కీంలను తొలగించాలన్నారు. ఇక మిగిలింది మీరు సమన్వయంతో కలిసి సంతోషంగా పనిచేసుకుంటూ పోవటమే అని అన్నారు. తెలంగాణ గడపగడపకూ తాగునీరు అందించే బృహత్తర కార్యక్రమం మిషన్ భగీరథ పనుల పురోగతిపై సిఎం సమీక్షించారు.
పైపులైన్ల కోసం తవ్వకాల కార్యక్రమం గురించి ఆరా తీసిన సిఎం, రైతు పొలాల గుండా వెళ్లే పనులను జూన్ నెల ప్రారంభానికి ముందే పూర్తి కావాలన్నారు. వానలు ఈసారి బాగా కురుస్తాయని సమాచారం వుంది. రైతులు పొలం పనులు చేసుకుంటుంటే మనం పైపులేస్తం అంటే కుదరదు. వాళ్ళ పనులు ప్రారంభం కాకముందే అందుకు సంబంధించిన పనులు పూర్తి చేయండి అని ఆదేశించారు. ఈ విషయంలో సంబంధిత ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలకు రైతుల భూముల వివరాలు అందించాలని, దాన్ని బట్టి స్థానిక రైతులకు నచ్చజెప్పి పనులు వీలయినంత త్వరగా పూర్తి చేయాలన్నారు.
ఇన్‌టేక్ వెల్స్ నిర్మాణం, ప్రధాన పైపులతో సహా గ్రామాల్లో అంతర్గత పైపుల నిర్మాణం ఎప్పటికల్లా ముగుస్తాయో స్పష్టంగా చెప్పాలని నీటిపారుదల ఇంజనీర్లను ప్రశ్నించగా, వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. ”మేము నీళ్ళియ్యకపోతే ఓట్లు అడుగం అని ప్రజలకు చెప్పినం. మమ్ముల ఓడగొడుతారా ఏంది మీరు పనులు స్పీడ్‌గా పూర్తి చేయాలే” అని సిఎం చమత్కరించారు.
9 గంటల నిరంతర విద్యుత్ అమలును ఏప్రిల్ 1న నుంచి నిజామాబాద్ జిల్లాలో ప్రారంభం చేసిన నేపథ్యంలో సరఫరా గురించి సిఎం ఆరా తీసారు. ఎటువంటి ఆటంకం లేకుండా సరఫరా చేస్తున్నామని అధికారులు వివరించడంతో సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్ పంపిణీకి సంబంధించిన కార్యక్రమాలను సమన్వయంతో కలిసి పూర్తి చేసుకోవాలని ఎమ్మెల్యేలకు, విద్యుత్ అధికారులకు సిఎం సూచించారు.
వ్యవసాయానికి సంబంధించిన విద్యుత్ కనెక్షన్లు పెండింగ్‌లో లేకుండా చూడాలని పదిహేను, ఇరవై రోజుల్లో మొత్తం మంజూరు చేయాలన్నారు. అందుకోసం అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయిస్తుందని తెలిపారు.
మిషన్ కాకతీయ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువుల పూడికతీత పనుల్లో ఎటువంటి అలసత్వం సహించనని అన్నారు. సరిపోను నిధులున్నా పనులు చేపట్టడంలో జాప్యం ఎందుకు జరుగుతుందని అధికారులను సిఎం ప్రశ్నించారు. కామారెడ్డి ప్రాంతంలో ఉత్పత్తి అవుతున్న నల్లబెల్లాన్ని మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పారు.
దవాఖానాల్లో పరిస్థితుల గురించి వైద్యాధికారులతో సిఎం ఆరా తీశారు. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి ప్రాధాన్యత కలిగిన అంశమని సిఎం అన్నారు. సీజనల్‌గా వచ్చే వ్యాధులపై ముందే ప్రజలకు అవగాహన కల్పించాలని, ఆసుపత్రులను ఆధునీకరించాలని స్పష్టం చేసిన సిఎం అందుకు తగిన నిధులను కేటాయించామన్నారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు డి.శ్రీనివాస్, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత, తదితరులు పాల్గొన్నారు.
సమీక్షా సమావేశం అనంతరం నిజామాబాద్ జిల్లా జర్నలిస్టులు ముఖ్యమంత్రిని కలిసి తమకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. కలెక్టర్‌తో చర్చించి జాగా ఎంపిక చేసుకోవాలని సిఎం వారికి సూచించారు. జాగాలు ఎంపిక కాగానే ఇండ్ల నిర్మాణం చేపడతమన్నారు.
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి ఉదయం 11 గంటలకు బయల్దేరి నిజామాబాద్ జిల్లా నర్సింగాయపల్లి గ్రామంలో ఇందూరు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులతో కాసేపు మాట్లాడారు. అనంతరం అక్కడే మధ్యాహ్న భోజన కార్యక్రమం ముగించుకుని నిజామాబాద్ జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. సమీక్షా సమావేశానంతరం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడి నుండి బాన్సువాడలోని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో ముఖ్యమంత్రి రాత్రి బసచేశారు.