సందర్భానుసారంగా స్పందించే హృదయం అలవోకగ అందించే అక్షరాల వరుస ఎందరినో ఆకట్టుకుంటుంది. ”శృంగారీ చేత్‌కవి: కావ్యేజాతం రసమయం జగత్…”అన్నట్లు కవి శృంగారి అయితే శృంగారాన్ని వర్ణించినట్లే, సామాజికుడు, ఆధ్యాత్మికవేత్త, యువకుడు, విద్యార్థి మొదలైనవారు వివిధరకాలుగా వర్ణించుకుంటారు. అని చెప్పడానికి మెరుగు ప్రవీణ్ రాసిన ‘జీవన ప్రయాణం’ పుస్తకంలో గల 50 వచన కవితలన్ని సాక్షాలు. ‘పుట్టిన రోజు’, ‘స్నేహం’, ‘పాఠం’, ‘స్పీడుబ్రేకర్’, ‘ప్రేమ’, ‘పరీక్ష’… మొదలైన శీర్షికలుగల కవితలు ఇప్పటి సమాజ జీవన స్థితిని తెలియజేస్తూ ప్రశ్నిస్తాయి. కొన్ని ప్రేరణాత్మక వాక్యాలుగలవు. మచ్చుకు…
ఎట్లైతె గట్లాయే…/ మన ప్రయత్నం
మనం చేద్దాం ! / మనదేశానికీ
గర్వకారణమౌదాం!! / యువ చైతన్యమే
జనచైతన్యమని చాటి చెప్దాం!!
వృత్తిరీత్య బ్యాంకు ఉద్యోగి అయినప్పటికి సమాజంపట్ల తనకుగల చూపు ఎందరో యువకులకు ఆదర్శం అవుతుంది. ఈ పుస్తకానికి బూర్ల వెంకటేశ్వర్లు రాసిన ముందుమాట ( ‘గీత మార్చేకవి’) చాలా వివరణాత్మకంగా ఉంది. ఈ గ్రంథాన్ని ”ఉత్తమమైన ఆలోచన, ఆచరణకు స్ఫూర్తినిచ్చింది మా అమ్మ…”అంటు తల్లికి అంకితమివ్వడం ఆనందకర విషయం.
పుస్తకం:
జీవన ప్రయాణం (వచన కవిత్వం)
రచయిత: మెరుగు ప్రవీణ్
పేజీలు: 144, ధర: రూ. 100
ప్రతులకు: మెరుగు ప్రవీణ్
తండ్రి: లక్ష్మీనారాయణ
ఇం.నం. 1-92, గోలిరామయ్య పల్లి, రామడుగు, కరీంనగర్, తెలంగాణ-505531
-దత్తయ్య అట్టెం