రాజకీయమంటే ఎత్తులు.. పై ఎత్తులు అని చాలామంది భావిస్తారు. నిజానికి రాజకీయమంటే ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం. ఈ మౌలిక సత్యాన్ని చాలామంది విస్మరించి మేలి ముసుగేస్తారు. కొత్తతరం రాజకీయ నాయకులు మాత్రం నిజమైన రాజకీయ స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు. వారిలో కల్వకుంట్ల తారక రామారావు ముఖ్యులు.
తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖమంత్రిగా సమాజం మొత్తాన్ని ప్రభావితం చేసే విధంగా ఆయన కార్యక్రమాల్ని చేపడుతున్నారు. ఈ కీలకాంశాన్ని గుర్తించి ”స్కోచ్’ సంస్థ సెప్టెంబర్ 9న ప్రభావశీల మంత్రిగా ఆయనను గౌరవించి కొత్త ఢిల్లీలో సత్కరించింది. ప్రజల అవసరాలకనుగుణంగా ఐటీరంగాన్ని తీర్చిదిద్దినందుకుగాను ఈ సత్కారమని నిర్వాహకులు పేర్కొన్నారు.
ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే ప్రభుత్వాల లక్ష్యమన్న ప్రాథమిక అవగాహనకు దూరంగా రాజకీయాలు జరుగుతున్న సమయంలో ఒక కొత్త తరంగంలా, తాజా గుబాళింపు తారక రామారావు రూపంలో తెలంగాణను తాకింది. మాటలో మృదుత్వం, ఆలోచనల్లో ఆధునికత-స్పష్టత, పరిపక్వత ఆయన సొంతం. రెండు మూడు భాషల్లో అనర్గళంగా, అద్భుతంగా ప్రసంగించే నైపుణ్యం ఆయనకో వరం. విషయాన్ని విశ్లేషించి సూటిగా చెప్పగల ప్రతిభ ఆయన సొంతం.
ఈ అపురూప లక్షణాలన్నింటిని ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు, నిర్దేశించుకున్న లక్ష్యసాధనకు ఖర్చు చేస్తున్నారు. అందుకే ఆయన నేటి మేటి ఐటి మంత్రిగా మన్ననలు అందుకుంటున్నారు. అవార్డులు సొంతం చేసుకుంటున్నారు.
ఇంటింటికి ఇంటర్నెట్
మంత్రి మదిలో ఎన్నో అద్బుత ప్రణాళికలున్నా ‘ఇంటింటికి ఇంటర్నెట్’ ప్రణాళిక మాత్రం 21వ శతాబ్దంవైపు తెలంగాణ ప్రజల్ని తన చిటికెన వేలు అందించి నడిపించడమే! ఇది కేవలం నినాద ప్రాయంకాదు. సంపూర్ణ వాస్తవమని జరుగుతున్న పనులు చెబుతున్నాయి.
ఇంటింటికి ఇంటర్నెట్ ఒక గొప్ప విప్లవం. పల్లెలు, పట్టణాలు, నగరాల్లోని ప్రజలందరికి సమానస్థాయిలో ఇంటర్నెట్ సేవలు అందడం అద్భుతమైన సోషలిస్టు భావన. ధ్వంసరచన చేసి రక్తం కళ్ళ చూస్తేనే విప్లవమన్న ముతకభావనకు ఎప్పుడో కాలం చెల్లింది. సమూలమైన మార్పునే విప్లవంగా పరిగణిస్తున్న సందర్భంలో ఇంటింటికి ఇంటర్నెట్ ద్వారా కనెక్టివిటి కల్పించి పౌరుల జ్ఞాన శక్తి మేరకు ఎదిగేందుకు రెక్కలు తొడగడం ఆషామాషీ వ్యవహారమేమికాదు. ఆన్‌లైన్ అన్నింటికీ అవసరమవుతున్న సమయంలో బ్రాడ్ బ్యాండ్ అందించడం అపురూపం.
నాల్గవ పారిశ్రామిక విప్లవం పరిఢవిల్లుతున్న సమయంలో ప్రాథమికమైన వనరు ఇంటర్నెట్. దీన్ని అందించడం ప్రభుత్వ ప్రాథమిక ధర్మం. ఈ విషయాన్ని ఎంతోముందు చూపుతో గ్రహించి ఆచరణలో పెట్టిన మంత్రి కేటీఆర్ అభినందనీయులు. ఈ విషయాన్ని ప్రపంచం గుర్తించింది. అందుకే అంతర్జాతీయస్థాయి ఐటీ కంపెనీల సీఈవోలందరూ కేటీఆర్ ఆలోచనలకు, జ్ఞాన తృష్ణకు, దాన్ని ప్రజలపరం చేయాలన్న తపనకు ముగ్ధులవుతున్నారు.
ఈ విషయాన్ని దాచుకోకుండా వివిధ సందర్భాల్లో వారు బహిరంగంగా ప్రకటించారు. ముఖ్యంగా టి-హబ్ కల నెరవేరిన తర్వాత తెలంగా ప్రతిష్ఠ ప్రపంచంలో నలుదిశలకు పాకింది. దేశంలో ఇతర దేశాల్లో ఎన్నో ఇంక్యుబేటర్లున్నా టి-హబ్ ఇంక్యుబేటర్‌కు ప్రపంచ పారిశ్రామికవేత్తల, ఐటీ నిపుణుల, దిగ్గజాల మన్ననలు అందుకుంది. గవర్నర్ నరసింహన్ దగ్గరనుంచి రతన్‌టాటా, సత్య నాదెళ్ళ వరకు ఎందరో ప్రముఖులు టి-హబ్ ఆలోచనను, ఆచరణను అభినందించారు.
ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను ఒడిసిపట్టి వాటికనుగుణంగా కొత్త టెక్నాలజీతో యువతను ఉత్సాహపరచడం నేటి అవసరం. అందుకు పెద్ద వేదికను టి-హబ్ ద్వారా కల్పిస్తున్నారు. ఇదొక ఇంక్యుబేషన్ కేంద్రం. గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లాంటివి మన యువతకు ముందుగా తట్టినా వాటికి ప్రాణంపోసి ముందుకు తీసుకెళ్ళే సదుపాయం గతంలో లేనందువల్ల ఆ ఆలోచనలు ప్రారంభదశలోనే సమాధి అయ్యేవని వర్తమానంలో అలా జరగడానికి వీల్లేదని కొత్త ఆలోచనతో రండి.. ఆవిష్కరణతో వెళ్ళండి అన్న నినాదంతో టి-హబ్‌ను తీర్చిదిద్దడం, దానికి రతన్‌టాటా, సత్య నాదెళ్ళ లాంటి ప్రముఖులు కితాబు నివ్వడం చిన్న విషయమేమికాదు.
నూతన భారత ముఖచిత్రం టి-హబ్‌లో కనిపిస్తోందని రతన్‌టాటా టి-హబ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రశంసించారు. ఈ ఒక్క మాటచాలు! సరైన దిశలో కేటీఆర్ ఆలోచనలు కొనసాగుతున్నాయని చెప్పడానికి.
70వేల చదరపు అడుగుల ప్రస్తుత టి-హబ్‌లో వందలాది స్టార్టప్ సంస్థలు పనిచేస్తున్నాయి. త్వరలో విశాలమైన చోట మరిన్ని ఎక్కువ సంస్థలు పనిచేసుకునేందుకు అనువుగా టి-హబ్ రెండవ దశను రాయదుర్గంలో ప్రారంభించనున్నారు. భారతదేశానికి స్టార్టప్‌ల కేంద్రంగా హైదరాబాద్ నిలవాలనే పట్టుదలతో ఆయన పనిచేస్తున్నారు. ఆ తపన స్పష్టంగా కనిపిస్తోంది.
ఇప్పుడు మార్పు (విప్లవం)కు టెక్నాలజీ కీలకమన్న ప్రాథమిక అవగాహన కొరవడితే ప్రజలను ముందుకు తీసుకెళ్ళలేరు. ప్రజలకు సాధికారత సాంకేతిక పరిజ్ఞానం అందించినప్పుడే సాధ్యమని ఎందరో ప్రొఫెసర్లు చెబుతున్నారు. అందుకే భారత ప్రధాని స్టార్టప్ ఇండియా.. స్టాండప్ ఇండియా అన్న నినాదం ఇచ్చారు. దాన్ని ఎంతో వేగంగా అందిపుచ్చుకుని కేటీఆర్ మరింత సృజనాత్మకతను జోడించి అమలు చేస్తున్నారు. టి-హబ్ కేవలం తెలంగాణ స్టార్టప్‌లకేగాక భారతదేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఇందులో చేరవచ్చని స్పష్టతనిచ్చి దాని విశాలత్వాన్ని విడమరిచి చెప్పారు. మొత్తం మానవాళికి ఉపయుక్తం అయ్యే పరిశోధనలు, ఆవిష్కరనలు జరగాలన్నదే ఆయన అభిమతం. ఈ స్టార్టప్‌లకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ట్రిపుల్ ఐటి, నల్సర్ విశ్వవిద్యాలయం అన్నివిధాలా సహాయ సహకారాలను అందిస్తున్నాయి, వెన్నుదన్నుగా నిలిచాయి. ప్రతి అడుగులో అవసరమైన తోడ్పాటు సంస్థలు అందిస్తున్నాయి. వెంచర్ క్యాప్టలిస్టులతో పరిచయాలు టి-హబ్ పెంచుతోంది. వ్యాపారరంగంలో అవసరమైన అన్ని హంగులు ఇక్కడ కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నారు. దీని వెనకాల ఐటిశాఖ, తెలంగాణ ప్రభుత్వం బలంగా నిల్చున్నది. ఈ స్వప్నం కేటీఆర్‌ది. అది అతి స్వల్పకాలంలో సాకారం కావడం వెనుక ఎంతో శ్రమ, పట్టుదల దాగివుంది. ఇలాంటి కీలకమైన, క్లిష్టమైన పనులను అలవోకగాచేసే సత్తా తనకుందని మంత్రి కేటీఆర్ రుజువు చేసుకున్నారు. సిలికాన్ వ్యాలీలో టి-హబ్ బ్రిడ్జిని నెలకొల్పడం వీటన్నింటికి కొసమెరుపు.
ఒక కొత్త ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. అని అందరూ అనుకుంటున్న విషయం తెలిసిందే. ఒక కొత్త ఆలోచన ఒక మంత్రికి.. ప్రభుత్వానికొస్తే ప్రజల జీవితాలు మారుతాయనడానికి టి-హబ్, ఇంటింటికి ఇంటర్నెట్ పథకం ఉదాహరణగా నిలుస్తున్నాయి.
కేంద్ర ఐటిశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో తెలంగాణకు రావలసిన ఐటిఐఆర్ పథకం గూర్చి పట్టు విడువకుండా మంత్రి కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. అది కార్యరూపం దాల్చితే తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ నగరం ఎన్నో రెట్ల అభివృద్ధిని సాధిస్తుంది. మరిన్ని లక్షలమందికి ఉపాధి లభిస్తుంది.
ఆ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు వస్తే కేటీఆర్‌కు ఏ అవార్డు ప్రకటించినా అది చిన్నదే అవుతుంది.
వుప్పల నరసింహం