– కన్నెకంటి వెంకటరమణ
ప్రపంచంలో జరిగే జాతరలలో అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర 2020 ఫిబ్రవరి 5వ తేదీ నుండి 8వతేదీ వరకు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరుగనుంది. దట్టమైన అడవుల్లో, కొండా కోనల మధ్య గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలతో జరిగే ఈ మేడారం జాతరకు దాదాపు 900 ఏళ్ళ చరిత్ర ఉంది. గిరిజన కుంభమేళా, తెలంగాణా కుంభమేళాగా పిలువబడే ఈ జాతరకు దాదాపు కోటి మందికి పైగా గిరిజనులు, గిరిజనేతరులు హాజరవుతారు. మేడారం జాతర నిర్వహణ ఏర్పాట్లకు, భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున రూ. 75 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, స్నానఘట్టాల నిర్మాణం, అంతర్గత రహదారుల నిర్మాణం, పారిశుధ్య కార్యక్రమాలు, విద్యుత్, తాగునీటి సౌకర్యం తదితర పనులను ముమ్మరంగా చేపడుతున్నారు.
మేడారం జాతర చరిత్ర
సుమారు 900 సంవత్సరాల క్రితం తమని నమ్మిన జనం కోసం, నమ్ముకున్న విలువల కోసం, ఆత్మాభిమానం, స్వేచ్ఛాయుత జీవనానికి కాకతీయ రాజులతో యుద్ధం చేసి ప్రాణాలను వదలి వీరమరణం పొందడం ద్వారా ప్రజల హదయాల్లో సమ్మక్క, సారలమ్మలు వనదేవతలుగా సుస్థిర స్థానాన్ని పొందారు. వీరి వీర మరణానికి గుర్తుగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజుల్లో మేడారం కుగ్రామంలో ఈ మహా జాతరను నిర్వహిస్తున్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు తెలంగాణాతో పాటు ఆంధ్రా, ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలనుండి లక్షల సంఖ్యలో గిరిజనులు, గిరిజనేతరులు హాజరవుతారు. ఏ విధమైన విగ్రహం కానీ, ఆకారం కానీ లేకుండా కేవలం గద్దెలను మాత్రమే దేవతలుగా పూజించే సమ్మక్క, సారలమ్మల జీవిత చరిత్ర లిఖితంగా అందుబాటులో లేనప్పటికీ, సమ్మక్క కథ తరతరాలుగా మౌఖికంగా జానపదుల్లో నిక్షిప్తమవుతూ వస్తున్నది.
13 వ శతాబ్దంలో మేడరాజుకు జన్మించిన సమ్మక్క బాల్యం నుండే విలువిద్యలు, యుద్ధ విద్యలను నేర్చుకుంది. వీటితో పాటు సమ్మక్కలో ఉన్న మహిమలతో పాముకాటు ద్వారా మరణించిన వారిని, దీర్ఘకాల రోగాలతో బాధ పడుతున్న వారిని వన ఔషధాలతో నయం చేసేది. సమ్మక్కను తన వరుసకు మేనల్లుడైన పడిగిద్ద రాజుతో వివాహం చేశారు. వివాహానంతరం మేడారానికి పడిగిద్ద రాజు రాజవుతాడు. వీరికి సారలమ్మ, జంపన్నలు జన్మిస్తారు. సమ్మక్క మాదిరిగానే ధైర్య సాహసాలు కలిగిన సారలమ్మను కొండాయి గ్రామానికి చెందిన గోవింద రాజులు వివాహం చేయిస్తారు.
ఈ క్రమంలో కొన్నాళ్ళకు మేడరాజ్యంలో తీవ్ర కరువు ఏర్పడుతుంది. కరువు ఉన్నప్పటికీ కప్పం కట్టాల్సిందేనని అప్పటి కాకతీయ రాజు ఒత్తిడి చేశాడు. కరువు ఉన్నప్పటికీ తనకు సంబంధం లేదని పన్ను కట్టాల్సిందేనని స్పష్టం చేయడంతో పడిగిద్దరాజు మేడారాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాడు. దీనితో ఆగ్రహం చెందిన కాకతీయ రాజు రుద్రదేవుడు తన మంత్రి యుగంధరుడి నేతృత్వంలో యుద్ధానికి పంపాడు. ఈ కాకతీయ సైన్యాన్ని సంపెంగ వాగు వద్దనే నిలపాలని పడిగిద్ద రాజు, గోవింద రాజులు కాకతీయ సైన్యంతో యుద్ధానికి దిగారు. ఈ యుద్ధంలో పడిగిద్ద రాజు, గోవిందా రాజులు మరణించారు. రోజంతా జరిగిన ఈ యుద్ధంలో ప్రాణాలకు తెగించి పోరాడిన జంపన్న శత్రు రాజులకు దొరకకుండా సంపెంగ వాగులో దూకి ఆత్మార్పణం చేసుకున్నాడు.
ఈ విషాద వార్త తెలుసుకున్న సమ్మక్క అపర కాళీలా యుద్ధ రంగంలో దూకి అపర కాళిలా విజృంభించింది. యుద్ధరంగంలో సమ్మక్కను నేరుగా ఎదుర్కోలేమని భావించిన కాకతీయ సైనికులు చాటుగా వచ్చి వీపులో బల్లెంతో పొడుస్తారు. దీనితో సమ్మక్క తీవ్ర గాయాలతో చిలకల గట్టు పైకి దట్టమైన అడవుల్లోకి వెళ్లి పెద్ద కాంతితో మాయమైంది. కోయలంతా ఆ వెలుగు వెంట పరుగెత్తగా చిలకల గట్టు పై ఉన్న నెమలినార చెట్టు వద్ద కుంకుమ భరిణ కనిపించింది. ఈ భరిణినే సమ్మక్కగా కోయ గిరిజనులు పూజిస్తూ వస్తున్నారు. సంపెంగ వాగును జంపన్న వాగుగా వ్యవహరిస్తున్నారు.
ధీరత్వాన్ని, దైవత్వానికి ప్రతిరూపంగా ఎప్పటికీ ప్రతి రెండేడ్లకు ఒకసారి మేడారంలో సమ్మక్క, సారలమ్మ, జంపన్న, పడిగిద్ద రాజు, గోవిందరాజులను తలుస్తూ గిరిజనులు జాతర నిర్వహిస్తున్నారు. విలక్షణమైన ఆచార వ్యవహారాలు కలిగివుండి. ప్రకృతి సంబంధ భావనలతోనే నిర్వహిస్తున్న ఈ మేడారం జాతరలో విగ్రహారాధన ఎక్కడా కనిపించదు. జాతర జరిగే 4 రోజుల్లో అమ్మవార్లు కొలువుదీరిన రోజునుండి కోట్లాదిమంది గిరిజనులు, గిరిజనేతరులు తమ మొక్కులను చెల్లించుకోవడానికి పసుపు కుంకుమలను, ఒడిబియ్యాలను, బంగారాన్ని (బెల్లం) సమర్పిస్తారు. కోడిపుంజులు, మేకపోతులను బలిస్తారు. సమ్మక్క గద్దె చేరే సమయంలో కోడిపుంజులు గాలిలో ఎగురవేసి ఆరగింపును చేస్తారు. తలనీలాలు సమర్పించి జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేసి అమ్మవార్లను దర్శించుకొంటారు. పురుషులు స్త్రీ వేషం ధరించి సమ్మక్క, సారలమ్మలను ఆవాహన చేసుకున్నట్టుగా భావిస్తారు. గుర్రం తల ఆకారంలో ఉండే లక్ష్మిదేవరలు ఈ జాతరలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.
జాతర తేదీలు…
2020 ఫిబ్రవరి 5 వ తేదీ: కన్నెపల్లి నుండి సారలమ్మ గద్దెకు చేరుకుంటారు.
2020 ఫిబ్రవరి 6 వ తేదీ: చిలకల గట్టు పై నుండి సమ్మక్క గద్దెకు చేరుకుంటారు.
2020 ఫిబ్రవరి 7 వతేదీ:మొక్కు బడులు సమర్పణ.
2020 ఫిబ్రవరి 8వ తేదీ: అమ్మవార్ల వన ప్రవేశం.
రూ. 75 కోట్లను కేటాయించిన ప్రభుత్వం సాంప్రదాయ బద్దమైన, యజ్ఞ యాగాది క్రతువుకు భిన్నంగా తమకంటూ ప్రత్యేక జీవన విధానం, ఆచారాలు, సంప్రదాయాలు, ఆరాధన పద్ధతులతో జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర నిర్వహణ ఏర్పాట్లకుగాను రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రూ. 75 కోట్ల భారీ నిధులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులను ఈ క్రింది ఏర్పాట్లకు వ్యయం చేస్తారు.
- రోడ్లు భవనాల శాఖకు: రూ.8.05 కోట్లు.
- పంచాయితీ రాజ్ శాఖకు: రూ. 3.50కోట్లు
- ఇరిగేషన్ శాఖ: రూ. 4 కోట్లు.
- గిరిజన సంక్షేమం: రూ. 4 కోట్లు.
- గ్రామీణ నీటి సరఫరా, శానిటేషన్‌కు: రూ.19 కోట్లు.
- జిల్లా పంచాయితీ అధికారి: రూ. 3.65 కోట్లు.
- ఎండోమెంట్స్‌కు: రూ.3 కోట్లు.
- ఎం.పీ.డీ.సి.ఎల్‌కి : రూ.4 కోట్లు.
- టీ.ఎస్‌ఆర్టీ.సికి: రూ. 2.48 కోట్లు.
- ఫైర్ సర్వీసులుకు: రూ. 21 లక్షలు.
- వైద్య, ఆరోగ్య శాఖకు: రూ. 1.46 కోట్లు.
- పోలీసు శాఖకు: రూ. 11 కోట్లు.
- రెవిన్యూ శాఖకు: రూ. 7 .50కోట్లు.
- అటవీ శాఖకు: రూ.10 లక్షలు.