లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో భారత కోకిల సరోజినీ నాయుడు ముందు మైక్ పెట్టారు. అప్పుడే కొత్తగా సభల్లో మైకులు ప్రవేశ పెట్టే రోజులు కనుక అంతా మైకుతో మాట్లాడటానికి ఉత్సాహపడేవారు. కానీ, సరోజినీ నాయుడుకు దాన్ని చూస్తూనే కోపం వచ్చింది. రాజసం ఉట్టిపడేలా చేత్తో మైక్‌ని టేబుల్‌పై కొట్టి తిప్పి ఒక్కసారిగా, ఉరుములా ఆంగ్లంలో ‘నా కంఠస్వరం భారత దేశంలోని లక్షలాది ప్రజలకి ఏలాంటి యంత్ర సహాయం లేకుండానే వినపడుతుంది. ఇక్కడున్న మీ లక్షమంది సునాయాసంగా వినగలరు’. అని వెంటనే, హిందుస్తానీలో మాట్లాడింది. అమె మొదటి పలుకుతోనే జనం నిశ్శబ్దంగా కూర్చోవటమే గాక, అంత భారీ సభలో మైక్‌ని ‘త్రోసి రాజన్న’ ఆమె ధైర్యానికి అంతా ముక్కున వేలేసుకున్నారు.
మద్రాసు నగరంలోని రసికరంజనీ హాల్‌లో ఆంధ్ర మహిళా జాతీయ విద్యా సమావేశాలు 1945 జనవరి 18న జరిగాయి. ఐణక నరసమ్మ అధ్యక్షత వహించారు. ఉన్నవ లక్ష్మీబాయమ్మ స్వాగతవచనాలు పలికారు. సాంబమూర్తి, రాజాజీ, రైట్ హానరబుల్ శ్రీనివాస శాస్త్రి లాంటి ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సరోజినీ నాయుడు ఆనాడు చిరస్మరణీయమైన ప్రారంభోపన్యాసం చేశారు. ఆమె ఏమన్నారంటే… ”నేను వంగదేశానికి పోతే తమ యింటి ఆడపడుచునని, ఆంధ్ర దేశానికి వస్తే తమ ఇంటి కోడలినని అంటారు. కాని, ఈ రెండు భాషలలోను విడమరచి మాట్లాడలేని నా శోచనీయ స్థితికి విచారిస్తున్నాను. ఇంగ్లీషులో మాట్లాడే దౌర్భాగ్యం నాకు ఏర్పడింది. నేను తెలంగాణావాసిని. నిజమైన తెలుగు ప్రాంతం మాదే. మీదికూడా తెలుగు భాషే. తెలంగాణ ప్రతిష్ఠ అపూర్వమైంది. అక్కడి శిల్పాలు, శాసనాలు అపూర్వమైన వి. వరంగల్ శిథిలాలు, శిల్పాలు, సంప్రదాయాలు భావి ఉత్త మ గతికి ఉత్తేజ కరణాలు. మా ప్రాంతంలో (తెలంగాణలో) చాలా మంది తెలుగు వారు నివసిస్తున్నారు” అని అన్నారు..
సరోజినీ నాయుడు 1879 ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాదులో జన్మించారు. ఆమె తండ్రి ఆఘోరనాథ చటోపాధ్యాయ. స్వగ్రామం తూర్పుబెంగాల్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లోని బ్రహ్మనగర్. హైదరాబాద్‌లో స్థిరపడక ముందు అఘోరనాథుడు బ్రిటీష్ ప్రభుత్వ స్కాలర్‌షిప్ పై లండన్‌లో రసాయన శాస్త్రంలో బి.ఎస్సీ. చేస్తున్నాడు. ఆయన ప్రతిభను వినియోగించుకోవాలని ఆనాటి ఆరవ నిజాం ఆయనను హైదరాబాద్‌కు ఆహ్వానించారు. హైదరాబాద్ రాష్ట్రంలో ఇంగ్లీషు విద్యా బోధనకు శ్రీకారం చుట్టింది అఘోరనాథుడే. ఈనాటి నిజాం కళాశాల ఆయన పెట్టిన పంట. అనంతరం తన భార్యతో కలిసి ఉస్మానియా మహిళా కళాశాల స్థాపనకు పాటుపడ్డాడు.
ఆనాడు అఘోరనాథుని ఇల్లు హైదరాబాద్‌లో బహుభాషల సంగమం. భార్య, భర్తలు బెంగాలీలో మాట్లాడితే, పిల్లలు ఇంగ్లీషులో మాట్లాడేవారు. నౌఖర్లు తెలుగు భాషలో మాట్లాడితే, వచ్చీ పోయే వారు ఉర్దూలో మాట్లాడేవారు. ఆ విధంగా భారత మిశ్రమ సంస్కృతికి సరోజినీ నాయుడు ఇల్లు ఒక ఆదర్శంగా నిలిచింది. హైదరాబాద్‌లో ఆనాడు ఇంగ్లీషు చదువుకు సౌకర్యాలు లేనందున ఆమెని మద్రాసు నగరానికి పంపించారు. అక్కడ ఆమె తన పన్నెండవ ఏట మద్రాసు రాష్ట్రంలోనే మెట్రిక్యులేషన్ పరీక్షలో ప్రథమ తరగతిలో మొదటి ర్యాంకు సాధించింది. ఆమె తెలివితేటలకు ఆశ్చర్యం పొందిన నిజాం నవాబు ఆమెకు లండన్‌లో చదువుకునే ఆర్ధిక సౌకర్యాలు కలిగించారు. ఆమె రెండు సంవత్సరాలు ఇంగ్లాండ్‌లో ఉండి లండన్‌లోని కింగ్స్ కళాశాలలోను, కేంబ్రిడ్జిలోని గర్టన్‌లోను చదివి 18 సంవత్సరాల వయస్సులో డిగ్రీ పొందకుండనే హైదరాబాద్‌కు తిరిగి వచ్చింది. లండన్‌లో ఉన్న రోజుల్లో ఆమె నేర్చిందంతా ఇంగ్లీషు సాహిత్యమే. అప్పుడే ఆమె ప్రతిభ గొప్పగా రాణించింది. రాయల్ సొసైటీలో ఆమెకు సభ్యత్వం లభించింది. హైదరాబాద్‌కు రాగానే ఆమె వివాహం అంతకు ముందే ప్రేమించుకున్న డాక్టరు గోవింద రాజుల నాయుడుతో జరిగింది. ఆ వివాహం మద్రాసులో జరిగింది. ఈ వివాహానికి కందుకూరి వీరేశలింగం పంతులు పౌరోహిత్యం వహించారు. ఆ విధంగా సరోజినీ దేవి, సరోజినీ నాయుడుగా మారి ఆంధ్రుల కోడలైంది. ఆమె మొదటి కావ్యం ‘స్వర్ణ ప్రాంగణం’ 1905లో ప్రచురితమైంది. హైదరాబాద్ గురించిన వర్ణనలతో, హిందూ ముస్లిం భాగస్వామ్యంగల ఆ నగర జీవిత వైవిధ్య చిత్రణతోనూ సరోజినీ దేవి కవితా వ్యాసాంగం ప్రారంభమైంది.
సరోజినీ నాయుడుకు మహాత్మా గాంధీతో మొదటి పరిచయం లండన్‌లో 1914లో జరిగింది. మహాత్మా గాంధీ భారత రాజకీ యాలలో ప్రవేశించకముందే ఆమె కాంగ్రెస్ పార్టీలో ప్రధాన భూమిక వహించింది. బాంబే కాంగ్రెస్ సమావేశంలో, మేలుకో, మేలుకో అనే గేయం చదివి సరోజినీ నాయుడు సభికులను ఉర్రూతలూగించింది. 1922లో మహాత్మాగాంధీ కేసు విచారణ సందర్భంలో ఆమె అక్కడే వుండి ప్రజల క్రోధాగ్నిని చల్లార్చే ప్రయత్నం చేసింది. 1925లో కాన్పూర్‌లో జరిగిన కాంగ్రెస్ సభకు ఆమె అధ్యక్షురాలుగా ఎన్నికైంది. అప్పుడు అధ్యక్ష స్థానంలో ఉన్న మహాత్మాగాంధీ ‘నా స్థానంలో ఉండదగిన వ్యక్తి సరోజినీయే’ అని అన్నారు.
1929లో ఆమె భారత దేశపు అనధికార రాయబారిగా అమెరికా సందర్శించింది. ఆమె అమెరికా నుండి తిరిగి రాగానే దేశ రాజకీయ పరిస్థితులలో వచ్చిన మార్పుని గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. మహాత్ముడు ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించాడు. గాంధీజీని అరెస్టు చేయగానే ఆ స్థానంలో ఉద్యమానికి సారథ్యం వహించడానికి అబ్బాస్ త్యాబ్జీని నియమించారు. ఆ తరువాత స్థానం సరోజినీ నాయుడుది. ఆమెను ఆరెస్టు చేసి జైల్లో ఉంచారు. గాంధీ – ఇర్విన్ ఒడంబడికతో విడుదలైన నాయకులలో ఆమె ఒకరు. మహాత్మా గాంధీ వెంట రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి ఆమె లండన్ వెళ్లింది. అక్కడ ఆమె గాంధీజీకి కుడి భుజంగా ఉంటూ మరొకవైపు స్త్రీల హక్కుల కోసం కృషి చేసింది. రౌండ్ టేబుల్ సమావేశం విఫలం కావడంతో దేశమంతటా అరెస్టులు తిరిగి మొదలయ్యాయి.
1942 క్విట్ ఇండియా ఉద్యమంలో సరోజినీ నాయుడును అరెస్టు చేసి ఆగాఖాన్ ప్యాలెస్ జైల్లో ఉంచారు. స్వాతంత్య్రం రావడానికి ఆరు నెలల ముందుగా ఆసియా దేశాల సంబంధాల మహాసభ (ఏషియన్ రిలేషన్స్ కాన్ఫరెన్స్) ఢిల్లీలో జరిగింది. సరోజినీ నాయుడు అధ్యక్షత వహించారు. అధ్యక్ష హోదాలో ఉంటూనే ఆమె భారత ప్రతినిధి వర్గానికి నాయకత్వం వహించారు. పదవీ ప్రమాణ స్వీకారం చేస్తూ ఆమె చేసిన ప్రసంగం వచనంలోనే ఉంది. కానీ, అది నిజానికి వచనం కాదు. స్వేచ్ఛా స్వాతంత్య్రాల సంగీత రూపకం. స్వాతంత్య్రా నంతరం ఆమెను ఉత్తరప్రదేశ్ గవర్నరుగా నియమించారు. గవర్నరుగా ఉన్న ఆ స్వల్పకాలంలో లక్నో రాజ్‌భవన్‌ను ఒక సాంస్కృతిక కేంద్రంగా మలిచింది.
సరోజినీ నాయుడు ఎన్నడూ హైదరాబాద్ రాష్ట్ర రాజకీయాలలో పాల్గొనలేదు.
ఇక్కడ ఆమె కవయిత్రి మాత్రమే. ఒక రోజు నిజాం నవాబు అమెను ‘సరోజినీ! నీవు నన్ను, నీ తండ్రిగారిని చూశావు కదా! మాలో నీకు ఏమి బేధం కనిపించింద’ని అడిగాడు. అమె వెంటనే భగవంతుడు నీకు ‘దిమాక్’ (తెలివి) ఇచ్చాడు. కీర్తి శేషునికి ‘దిల్’ (ఔదార్యం) ఇచ్చాడు అని నిస్సంకోచంగా అనేసింది. నిజాం సంతృప్తి పడ్డాడు. స్వల్ప అనారోగ్యంతో బాధపడుతూ 1948 ఫిబ్రవరి 18వ తేదీన అమె లక్నోలో మరణించారు.