రాష్ట్రంలో మైనారిటీలు 11 శాతం మంది వున్నారు. వీరిలో అత్యధికులు సామాజిక, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు.ఈ బడ్జెట్‌లో మైనారిటీల సంక్షేమానికి రూ. 1030 కోట్లు కేటాయించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో తెలంగాణలోని మొత్తం 10 జిల్లాలలోగల మైనారిటీల కోసం కేటాయించింది కేవలం రూ. 501.98 కోట్లు మాత్రమే. ఇప్పుడు కేవలం 10 నెలల కాలానికే అందుకు రెట్టింపు నిధులను ప్రతిపాదించడం గమనార్హం.
విద్యకు రూ. 10,956 కోట్లు
విద్యపై చేసే వ్యయాన్ని ఖర్చుగా చూడకుండా, మానవ వనరుల అభివృద్ధికోసం భవిష్యత్తుకోసం పెట్టే పెట్టుబడిగా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే తొలి బడ్జెట్‌లో విద్యారంగానికి రూ. 10,956 కోట్లు కేటాయించింది. కేజీనుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించేందుకు కట్టుబడి ఉన్నామని చేతల్లో నిరూపించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ సాయంగా రూ. 3,418 కోట్లు వస్తాయని అంచనా వేసింది. దీంతో విద్యారంగానికి బడ్జెట్‌లో 10.88 శాతం నిధులు దక్కాయి.
- కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యా పథకానికి ముందస్తు ఏర్పాట్లకోసం రూ. 25 కోట్లు కేటాయించింది. శ్రీ పాఠశాల విద్యకు అత్యధికంగా 9335.13 కోట్ల రూపాయలు కేటాయించారు. భవన నిర్మాణాలు, మధ్యాహ్న భోజన పథకం, కంప్యూటర్ విద్య, వయోజనవిద్య, ఉపాధ్యాయుల వేతనాలు, బాలికలకోసం మరుగుదొడ్ల నిర్మాణం, అదనపు తరగతి గదుల నిర్మాణం, స్కూల్ గ్రాంట్, టీచర్లకు శిక్షణా తరగతులు, సైన్స్ ఫేర్ తదితర కార్యక్రమాలకు ఈ నిధులు వ్యయపరుస్తారు. ఇందులో పాఠశాల విద్యాశాఖ పరిధిలో నిర్వహించే మోడల్ స్కూళ్ళ నిర్మాణానికి రూ. 940.73 కోట్లు, రాష్ట్రీయ మాథ్యమిక శిక్షా అభియాన్‌కు రూ. 906.40 కోట్లు ప్రతిపాదించారు.
- ఉన్నత విద్యకోసం రూ. 1227.26 కోట్లు కేటాయించారు.
- ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పీజీ కాలేజీలతోపాటు యూనివర్సిటీల అభివృద్ధికోసం ఈ నిధులు వినియోగిస్తారు. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన విశ్వవిద్యాలయాలలో భవనాల నిర్మాణంకోసం రూ. 16.76 కోట్లు కేటాయించారు.
- సాంకేతిక విద్యకు ప్రణాళికా వ్యయం రూ. 212 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ. 181 కోట్లు ప్రతిపాదించారు. బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ కోసం రూ. 119.63 కోట్లు, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల నిర్వహణ కోసం రూ. 100 కోట్లు ప్రతిపాదించారు. యూనివర్సిటీలకు రూ. 292.02 కోట్లు కేటాయించారు.