శాసనసభలో జనవరి 18న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటన

సామరస్యానికి, సహజీవనానికి పట్టుగొమ్మగా నిలిచే రాష్ట్రం తెలంగాణ. ఇక్కడ ప్రజా జీవనంలో లౌకిక విలువల స్ఫూర్తి అడుగడుగునా వెల్లివిరుస్తుంది. అందుకే జాతిపిత మహాత్మాగాంధీ తెలంగాణ జీవన మర్యాదను గంగా, జమునా తెహజీబ్‌గా అభివర్ణించారు. ఈ స్ఫూర్తికి సమైక్య పాలనలో విఘాతం కలిగింది. ప్రజల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు అనేకం జరిగాయి. అల్పసంఖ్యాక వర్గాలు తీవ్ర నిర్లక్ష్యానికి, వివక్షకు గురయ్యాయి. సమైక్య పాలనలో మైనారిటీలకు ఎంత అన్యాయం జరిగిందో గత 20 ఏండ్లుగా చేసిన బడ్జెట్‌ కేటాయింపులు చూస్తే అర్థమవుతుంది. 1995-96లో మైనారిటీల కోసం కేటాయించిన బడ్జెట్‌ కేవలం ఒక కోటి ఇరవై లక్షలు. ప్రభుత్వాలు చూపిన ఈ నిర్లక్ష్య వైఖరివల్లనే మైనారిటీలు సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటు తనానికి, అణచివేతకు గురయ్యారు. దీంతో ఆ వర్గాలలో ఆందోళన, అభద్రత, అవిశ్వాసం ఏర్పడ్డాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత మైనారిటీల అస్తిత్వం నిలబెట్టేందుకు, వారిలో ఆత్మ గౌరవం, ఆత్మ విశ్వాసం పాదుకొల్పేందుకు ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు చేపట్టింది. తెలంగాణలో 14.24 శాతంగా ఉన్న మైనారిటీల అభివృద్ధి, సంక్షేమంకోసం సమగ్ర కార్యాచరణను రూపొందించింది. మైనారిటీల అభివృద్ధికోసం తెలంగాణ మొదటి బడ్జెట్లోనే 1030 కోట్లు కేటాయించాం. ఈ ఏడాది ఆ కేటాయింపులను 1204 కోట్లకు పెంచాం.

విదేశాలకు వెళ్లి విద్యనభ్యసించాలనుకునే మైనారిటీ విద్యార్థులకోసం చరిత్రలో మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకం తెచ్చింది. ఈ పథకం ద్వారా గతేడాది 463మంది విద్యార్థులు లబ్దిపొందారు. వారికి ఒక్కొక్కరికి పది లక్షల స్కాలర్‌షిప్‌తోపాటు విమానయాన ఖర్చులు కూడా అందించాం. ఈ ఏడాది ఈ స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని పది లక్షలనుంచి 20 లక్షలకు పెంచాం. 89వేల మంది మైనారిటీ విద్యార్థులకు ప్రీమెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ కింద 35 కోట్ల రూపాయలు అందించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులతో ఇంటర్మీడియట్‌నుంచి పీజీ వరకు దరఖాస్తు చేసిన ప్రతీ ఒక్కరికీ పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ అందించాం. ర్యాంకులతో సంబంధంలేకుండా ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల మాదిరిగానే మైనారిటీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని వర్తింపజేస్తున్నాం. లక్షా 18వేలమంది మైనారిటీ విద్యార్థులకు 2015-16 వరకు చెల్లించాల్సిన 219.43 కోట్ల రూపాయలు చెల్లించాం.

పేరు పొందిన ఐఏఎస్‌ కోచింగ్‌ సెంటర్లలో వందమంది మైనారిటీ విద్యార్థులకు ప్రభుత్వం శిక్షణ ఇప్పిస్తున్నది. కోచింగ్‌ సెంటర్లకు ఫీజు చెల్లించడంతోపాటు విద్యార్థులకు స్టయిఫండ్‌ కూడా అందిస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకున్నట్లే మైనారిటీ విద్యార్థులకు కూడా ప్రభుత్వం స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేసింది. సివిల్‌ సర్వీసెస్‌, గ్రూప్స్‌, బ్యాంకింగ్‌ తదితర పోటీ పరీక్షలకు హాజరయ్యే మైనారిటీ విద్యార్థులకు ఈ స్టడీ సర్కిల్‌ ద్వారా శిక్షణ అందిస్తున్నాం. ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు వెలువడిన సందర్భంలో అవసరమైన శిక్షణ కార్యక్రమాలను పాత పది జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్నాం.

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తను ప్రోత్సహించడానికి టీఎస్‌ప్రైడ్‌ అనే పథకం ప్రవేశపెట్టినట్లే, మైనారిటీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి టీఎస్‌ప్రైమ్‌ అనే పథకం ప్రవేశపెడుతున్నాం. హైదరాబాద్‌లో మైనారిటీ ఐటీ పారిశ్రామికవేత్తలకోసం త్వరలోనే ప్రభుత్వం ప్రత్యేక ఐటీ పార్కును ఏర్పాటు చేయబోతున్నాం.

అనీస్‌-ఉల్‌-గుర్బా ముస్లిం అనాథ శరణాలయానికి స్థలం కేటాయించమని దశాబ్దాలుగా ప్రజలు కోరుతున్నారు. కానీ వారి విజ్ఞప్తి గత ప్రభుత్వాల కాలంలో దారుణమైన నిరాదరణకు గురైంది. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అనీస్‌ ఉల్‌ గుర్బాకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించాం. ముస్లిం అనాథలకు ఆశ్రయమిస్తున్న ఏకైక సంస్థ అనీస్‌ ఉల్‌ గుర్బాకు నాంపల్లిలో నాలుగువేల చదరపు గజాల అత్యంత విలువైన స్థలాన్ని కేటాయించాం. దీనిని ఒక ఆదర్శవంతమైన అనాథ శరణాలయంగా తీర్చిదిద్దబోతున్నాం. పేద అనాథ పిల్లలకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. త్వరలోనే ఈ స్థలంలో బహుళ అంతస్తులతో భవనం నిర్మించబోతున్నాం.

హైదరాబాద్‌ నగరంలో ఓన్‌ యువర్‌ ఆటో అనే వినూత్న పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్‌ ద్వారా 1783మంది మైనారిటీ యువకులకు 50శాతం సబ్సిడీపై ఆటోలు అందించాం. మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కోసం అందించే రుణాల సబ్సిడీని 50శాతంనుంచి 80 శాతానికి ప్రభుత్వం పెంచింది. నాక్‌, ఇసిఐఎల్‌, సిఐపిఇటి, సెట్విన్‌లాంటి సంస్థలద్వారా మైనారిటీ యువత నైపుణ్యాల అభివృద్ధికి శిక్షణ ఇస్తున్నాం.

పేదరికం అనుభవిస్తున్న మైనారిటీ కుటుంబాలు ఆడపిల్లల పెండ్లిల్లు చేయలేక అవస్థలు పడుతున్నాయి. దీనివల్ల అనేక సామాజిక దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం పేద మైనారిటీ ఆడపిల్లల పెండ్లికోసం 51వేల రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు ‘షాదీ ముబారక్‌’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 51,452 మంది మైనారిటీ బాలికలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం మంజూరు చేసింది.

సర్వమత సమభావానికి ప్రతీకగా ప్రభుత్వం బతుకమ్మ, బోనాలతోపాటు రంజాన్‌, క్రిస్ట్‌మస్‌ పండుగలను స్టేట్‌ ఫెస్టివల్స్‌గా నిర్వహిస్తున్నది. రంజాన్‌ పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరుపేద ముస్లింలకు పెద్దఎత్తున ఇఫ్తార్‌ విందులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల పదివేల పేద ముస్లిం కుటుంబాలకు నూతన వస్త్రాలను బహూకరించింది. అదేవిధంగా క్రిస్ట్‌మస్‌ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చర్చిలలో ప్రత్యేక విందు ఏర్పాటు చేయడంతోపాటు రెండు లక్షల పేద క్రిస్టియన్‌ కుటుంబాలకు కొత్త బట్టలు కానుకగా ఇచ్చింది.

ముస్లిం ప్రార్థనా స్థలాల్లో ఆధ్యాత్మిక సేవలందించే ఇమామ్‌లకు, మౌజమ్‌లకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున ప్రభుత్వం గౌరవభృతి అందిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 8934మంది ఇమామ్‌లకు, మౌజమ్‌లకు దీనివల్ల ప్రయోజనం చేకూరింది.

మక్కా, మదీనా సందర్శించే హజ్‌ యాత్రికులకోసం తెలంగాణ స్టేట్‌ హజ్‌ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్ల రూపాయల ప్రత్యేక గ్రాంటు అందించింది.

ఉర్దూ భాష పరిరక్షణ, అభివృద్ధికోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఉర్దూ మీడియం పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉర్దూ ఘర్‌తోకూడిన షాదీఖానాలను మంజూరు చేసింది.

వక్ఫ్‌బోర్డు, వక్ఫ్‌ సంస్థలు ముస్లిం సమాజానికున్న విలువైన సంపద. సుదీర్ఘకాలంగా ఇవి నిర్లక్ష్యానికి గురయ్యాయి. వక్ఫ్‌ సంస్థల్లో నిర్మాణాలు, మరమ్మతులకోసం ప్రభుత్వం 53 కోట్ల రూపాయల గ్రాంటు అందించింది. గతంలో కేవలం నాలుగైదు కోట్ల గ్రాంటు మాత్రమే ఇచ్చేవారు. 11 చోట్ల ఉన్న వక్ఫ్‌ భూముల్లో నిర్మాణాలు చేపట్టడానికి ఆ స్థలాలను లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. దీనిద్వారా వక్ఫ్‌బోర్డుకు 60 నుంచి 70 కోట్ల ఆదాయం సమకూరుతుంది. వక్ఫ్‌ ఆస్తులను కాపాడడంకోసం ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటున్నది. కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లాస్థాయిలో వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణ సమన్వయ కమిటీలను నియమించింది. జామే నిజామియాలో ఆడిటోరియం నిర్మాణంకోసం ప్రభుత్వం 14.65 కోట్లు కేటాయించింది.

రాజస్థాన్‌లోని అజ్మీరా దర్గా ముస్లింల పవిత్ర ప్రార్థనా స్థలం. తెలంగాణనుంచి మతాలకతీతంగా పెద్ద సంఖ్యలో యాత్రికులు అక్కడికి వెళతారు. వారి సౌకర్యంకోసం అజ్మీర్‌లో ప్రత్యేక వసతి గృహం ‘రుబాత్‌’ను నిర్మించడానికి ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసింది. స్థలం కేటాయించాలని రాజస్థాన్‌ ప్రభుత్వానికి లేఖ రాసింది. స్థలం కేటాయించగానే నిర్మాణ పనులు ప్రారంభిస్తాం.

ముస్లింల సామాజిక, ఆర్థిక స్థితిగతులు అధ్యయనం చేయడంకోసం ఏర్పాటు చేసిన సుధీర్‌ కమిషన్‌ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. జనాభా ప్రాతిపదికన, వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో అభిప్రాయం తెలిపేందుకు ఈ నివేదికను బీసీ కమిషన్‌కు అందజేశాం. బీసీ కమిషన్‌ ఈ విషయంలో వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరిస్తున్నది. ఆ వివరాల ఆధారంగా తన అభిప్రాయం తెలియజేస్తుంది.

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పించాలంటే మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించరాదనే ఆంక్షను సడలించుకోవాల్సి ఉంది. తమిళనాడు ప్రభుత్వం 45/94 చట్టం తెచ్చి, భారత పార్లమెంటు ఆమోదం ద్వారా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో రిజర్వేషన్ల పెంపు అంశాన్ని చేర్పించింది. మన రాష్ట్రంలోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తాం. వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లోనే ముస్లిం రిజర్వేషన్‌ బిల్లును సభలో ప్రవేశపెడతాం. తమిళనాడుకు కల్పించిన తరహాలోనే మన రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మనం కోరిన రిజర్వేషన్‌ అమలుచేసుకునే సౌలభ్యాన్ని పొందేందుకు వీలుగా బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపుతాం.

దళిత క్రిస్టియన్లు తమ ఎస్సీ హోదాకోసం ఎంతో కాలంగా ఆందోళన చేస్తున్నారు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సమస్యను పరిష్కరించాం. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కొనసాగించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం.

క్రైస్తవులు చర్చిలు నిర్మించుకోవాలంటే గతంలో అనేక కఠిన నిబంధనలుండేవి. ఇప్పుడు మిగతా ప్రార్థనా స్థలాల నిర్మాణానికి ఇచ్చినట్టే, స్థానిక సంస్థల అనుమతితోనే చర్చిలను నిర్మించుకునే వీలు కల్పిస్తూ జీవో జారీ చేశాం. హైదరాబాద్‌లో క్రిిస్టియన్‌ భవన్‌ నిర్మించడానికి పదికోట్ల రూపాయలు మంజూరు చేశాం.

మైనారిటీలకోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుండడంవల్ల మైనారిటీ సంక్షేమశాఖ ప్రాధాన్యం సంతరించుకున్నది. కేవలం 35మంది ఉద్యోగులతో నామమాత్రంగా సాగుతున్న ఈ శాఖను బలోపేతం చేసే దిశగా 80 పోస్టులను ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసింది.

మైనారిటీల స్థితిగతులు మారాలంటే, వారి పిల్లలకు మంచి విద్యనందించాలి. ఆ విద్య ఇంగ్లిష్‌ మీడియంలో గ్లోబల్‌ ప్రమాణాలకు ధీటుగా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఉండే అవకాశాలను అందిపుచ్చుకునే స్థాయికి మన మైనారిటీ పిల్లలు ఎదగాలి. అదే సమయంలో పిల్లలకు విద్య చెప్పిండానికి అయ్యే ఖర్చు భారం కుటుంబాలపై పడకూడదు. మైనారిటీల్లో ఎక్కువ శాతం నిరుపేదలు, చిన్నా చితకాపనులు చేసుకుని పొట్ట పోసుకుంటున్నారు. వీరి పిల్లల పోషణ, శిక్షణ బాధ్యతను పూర్తిగా ప్రభుత్వమే తీసుకోవాలని నిర్ణయించాం. దేశంలో ఎక్కడాలేనివిధంగా, రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూలేని విధంగా మైనారిటీ పిల్లలకోసం పెద్ద ఎత్తున ఆవాస విద్యాలయాలను నెలకొల్పుతున్నాం. ఈ రెసిడెన్షియల్స్‌ ఏర్పాటు కావడంతో మైనారిటీ వర్గాల్లో పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం అవుతున్నది.

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కేజీ టూ పీజీ విద్యావిధానంలో భాగంగా ఈ రెసిడెన్షియల్‌ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నాం. 2016-17 విద్యా సంవత్సరంలో 71 మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూళ్లను కొత్తగా ఏర్పాటు చేశాం. ఈ స్కూళ్లలో ప్రవేశాలకోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది 13వేల సీట్లుంటే… 35వేల దరఖాస్తులు వచ్చాయి. ఈ స్పందనను దృష్టిలో ఉంచుకుని వచ్చే విద్యా సంవత్సరం మరో 129 మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూళ్లను ప్రారంభిస్తున్నాం. దీంతో తెలంగాణలో 200 మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూళ్లు కొలువుదీరుతాయి.

మైనారిటీ బాలికలు ఎక్కువగా డ్రాపవుట్స్‌గా మారు తున్నారు. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం.. 200 స్కూళ్లలో 100 స్కూళ్లను మైనారిటీ బాలికలకోసం కేటాయిం చింది. ఆడపిల్లలకు భద్రత, మంచి చదువు అందించే పాఠశా లలు ఏర్పడినందుకు తల్లిదండ్రులు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాఠశాలల్లో దాదాపు లక్షా 28వేల మంది విద్యార్థినీ విద్యార్థులు ఇంగ్లిష్‌ మీడియంలో గ్లోబల్‌ ప్రమాణాలకు ధీటైన విద్యను పొందుతారు. ఈ విప్లవాత్మక పరిణామంతో రాష్ట్రంలోని భావితరం మైనారిటీల జీవితాల్లో గొప్ప పరివర్తన సాధించేందుకు ఈ స్కూళ్ళు శాశ్వత ప్రాతిపదికలను నిర్మిస్తాయి.

కుల, మత బేధాలకు అతీతంగా, అన్నివర్గాల ప్రజలు ఒక తల్లి బిడ్డలవలె కలిసిమెలసి జీవించే తెలంగాణ సంస్కృతికి మనమందరం వారసులం. అభివృద్ధి ఫలాలు అన్నివర్గాల ప్రజలకూ సమానంగా లభించినప్పుడే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. సకల జనులూ సామరస్యంగా, సంతోషంగా జీవించే ‘బంగారు తెలంగాణ’ నిర్మాణానికి ప్రభుత్వం పునరంకితమవుతున్నది.

సజావుగా శాసన మండలి సమావేశాలు

18రోజుల పాటు జరిగిన శాసనమండలి సమావేశాలు సజావుగా ముగిశాయి. ప్రతిపక్షాల వాదనలు…అధికార పక్షాల ప్రతివాదనలతో పెద్దల సభ హుందాగా సంపూర్ణంగా జరిగింది.

ప్రశ్నోత్తరాల సమయంలో దేవాలయాలు, నీటి ప్రాజెక్టులు, మార్కెట్‌ యార్డులు, తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులు, అతి వృష్టి అనావృష్టి, దేవాలయాలు, ప్రార్థనా మందిరాల అభివద్ది, ఆరోగ్య, పోలీస్‌, ఎక్సైజ్‌, ఆర్థిక, అటవి శాఖ తదితర శాఖలపై చర్చలు జరిగాయి. ఈ సమావేశాల్లో ఆరోగ్య శాఖపై సభ్యులు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో పది ప్రశ్నలు ఉంటే దాదాపు అందులో రోజుకు కనీసం మూడు ప్రశ్నలు ఆరోగ్య శాఖ పై ఉండడం గమనార్హం.

దాదాపు 14అంశాల పై లఘ చర్చలు జరిగాయి. ముఖ్యంగా విద్యుత్‌, నీటి ప్రాజెక్టులు, ఐటీ, ఆర్థీక, రుణాలు, అటవీ, ఆరోగ్య, గ్రేటర్‌ మున్సిపాలిటీతో పాటు దాదాపు 14అంశాలు సంపూర్ణంగా చర్చించారు. ఇక చివరి రోజు మైనారీటి సంక్షేమం పై దాదాపు రెండు గంటలకు పైగా చర్చ జరిగింది. సభలో ప్రతి సభ్యుడు మైనారిటీ రిజర్వేషన్‌ పై మాట్లాడారు.

18 రోజుల శీతాకాల మండలి సమావేశాలు 66గంటల 25నిమిషాలు నిర్వహించినట్టు మండలి ఛైర్మెన్‌ స్వామి గౌడ్‌ ప్రకటించారు. అదే విధంగా సమావేశాల్లో మొత్తంగా 139 ప్రశ్నలకు సమాధానాల పై 108మంది సభ్యులు ప్రసంగించారు. మంత్రులు మూడు స్టేట్‌ మెట్స్‌ ఇవ్వగా…16బిల్లులు పాస్‌ అయ్యాయి.

Other Updates