రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాల్లో మైనారిటీల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం కూడా ఒకటని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే అత్యంత పేదరికం అనుభవిస్తున్న మైనారిటీల సంక్షేమానికి అధికారులు మరింత శ్రద్ధతో పనిచేయాలని కోరారు. అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో మైనారిటీలు తప్పక లబ్ధి పొందేలా కార్యాచరణ ఉండాలని సూచించారు. మైనారిటీ యువకుల స్వయం ఉపాధి కోసం బ్యాంకులతో సంబంధం లేకుండా వంద శాతం సబ్సిడీపై లక్ష నుంచి రెండున్నర లక్షల రూపాయల విలువైన యూనిట్ల కోసం ఆర్థిక సహాయం అందించాలని చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇండ్లలో మైనారిటీలకు తప్పకుండా కనీసం పది శాతం కోటా ఉండాలని ఆదేశించారు. మైనారిటీ డెవలప్‌మెంట్ కార్పోరేషన్, ఉర్దూ అకాడమీ, వక్ఫ్ బోర్డులు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
మైనారిటీల సంక్షేమంపై ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కేటి రామారావు, ఈటల రాజేందర్, ఎంపి అసదుద్దిన్ ఓవైసీ, ఎంఐఎం శాసన సభా పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, ప్రభుత్వ సలహాదారు ఎకె ఖాన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, మైనారిటీ శాఖ కార్యదర్శి
ఉమర్ జలీల్ జీహెచ్‌ఎంసి కమీషనర్ జనార్థన్ రెడ్డి, హెచ్‌ఎండిఏ కమీషనర్ దానకిషోర్, హైదరాబాద్ కలెక్టర్ యోగిత, సిఎంఓ ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మైనారిటీల కోసం ప్రస్తుతం అమలవుతున్న కార్యక్రమా ల అమలు తీరును సమీక్షించారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ… ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మైనారిటీల్లో ముస్లింలే ఎక్కువ. వీరిలోనే అత్యంత పేదరికం ఉంది. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే మైనారిటీల జీవితంలో వెలుగు వస్తుందని నేను ఉద్యమ సమయంలోనే అనేక మార్లు చెప్పాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కూడా మైనారిటీల అభివృద్ధి, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో కేటాయింపులు పెంచాం. చాలా కొత్త కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీల నిధులు ఎలా ఖర్చు చేస్తున్నామో మైనారిటీల కోసం పెట్టే ఖర్చును కూడా అలాగే ఖర్చు చేయాలి. తెలంగాణలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందితేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. ఏ ఒక్క వర్గం వెనుకబడిపోయినా అది సంపూర్ణ ప్రగతి కాదు అని సీఎం అన్నారు. మైనార్టీ సంక్షేమంకోసం అన్ని రకాల వ్యయాల కన్నా రెసిడెన్షియల్ స్కూళ్ల కోసం పెట్టే ఖర్చు తనకు ఎంతో తృప్తినిస్తున్నదని, రేపటి తరానికి మంచి విద్యను అందించడం కన్నా మించిన ఆస్తి ఏదీ లేదని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చెప్పారు. తమకు సెక్షన్లు పెంచాలని, అదనపు స్కూళ్లు కావాలని ఎమ్మెల్యేల నుంచి డిమాండ్ వస్తున్నదని సీఎం తెలిపారు.
సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు:
ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ కార్యక్రమంలో ఖచ్చితంగా మైనారిటీలు లబ్ధిపొందే విధంగా కార్యాచరణ ఉండాలి.
పేద మైనారిటీ యువకుల స్వయం ఉపాధి కోసం బ్యాంకులతో సంబంధంలేకుండా వందశాతం సబ్సిడీపై ఆర్థిక సహాయం అందించాలి. లక్ష, రెండు లక్షలు, రెండున్నర లక్షల రూపాయల విలువైన యూనిట్ల కోసం ఆర్థిక సహాయం అందించాలి. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్లు పర్యవేక్షించాలి.
డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో పదిశాతం మైనారిటీలకు దక్కేలా చర్యలు తీసుకోవాలి.
అర్బన్, సెమీ అర్బన్, కార్పోరేషన్లు, గ్రామీణ ప్రాంతాల్లో మైనారిటీల అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. దానికి అనుగుణంగానే కార్యక్రమాలను రూపొందించి అమలు చేయాలి.
పాఠశాలలు, కళాశాలల్లో ఉర్దూ టీచర్ల పోస్టులు ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఖాళీలున్నాయి? ఇంకా ఎన్ని కావాలి? తదితర వివరాలు సేకరించి భర్తీ చేయాలి.
మైనారిటీ డెవలప్‌మెంట్ కార్పోరేషన్, ఉర్దూ అకాడమీ, వక్ఫ్ బోర్డు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి.
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉద్యోగాల ఖాళీల భర్తీకోసం నిర్వహించే పోటీ పర్షీలు, వివిధ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రన్స్‌లు ఇంగ్లీషు, తెలుగుతో పాటు ఉర్దూ భాషలో కూడా నిర్వహించాలి.
హైదరాబాద్ నగర పరిధిలో ముస్లింల కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక వాడను, ప్రత్యేక ఐటి కారిడార్‌ను అభివృద్ధి చేయాలి.
కోకాపేటలో పది ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఇస్లామిక్ కల్చరల్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించాలి. మూడు వారాల్లోగా నిర్మాణ పనులు మొదలు కావాలి.
దేశంలోనే చార్మినార్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. హైదరా బాద్‌కు వచ్చే ప్రతీ పర్యాటకుడు చార్మినార్ చూడాలను కుంటారు. దీనికి తగినట్లుగా చార్మినార్ వద్ద ఏర్పా ట్లుండాలి. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పా ట్లు చేయాలి. పర్యాటకులు చార్మినార్ వద్ద సులభంగా గడపడం కోసం ఏర్పాట్లు చేయాలి. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ తరహాలో చార్మినార్‌ను అభివృద్ధి చేయాలి.
42 కిలోమీటర్ల మూసీ పరివాహక ప్రాంతాన్ని సబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో అభివృద్ధి చేయాలి. పార్కులు, షాపింగ్ కాంప్లెక్స్‌లతో పాటు పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కూడా నిర్మించాలి. మూసీ నది వెంట మెట్రోరైలు/నానో రైలు నడపడానికి ఏర్పాట్లు చేయాలి. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ పనులను పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారిని నియమించాలి.
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వివిధ అత్యవసర పనులు చేయడం కోసం ఎస్‌డిఎఫ్ నుంచి రూ. 40 కోట్లు వెంటనే విడుదల చేయాలి.
రెసిడెన్షియల్ స్కూళ్లు ఓ విప్లవం: అసదుద్దీన్
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో ఏర్పాటుచేసిన మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు సామాజిక మార్పునకు ఎంతో దోహదపడుతున్నాయని, పదేండ్లలో ఓ విప్లవం చూస్తామని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసించారు. మైనార్టీ సంక్షేమంపై జరిగిన సమీక్షలో రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్వహణపై అసదుద్దీన్ ప్రత్యేకంగా మాట్లాడారు. చాలామంది ముస్లింలు తమ పిల్లలను రెసిడెన్షియల్ స్కూళ్లలో చేర్పించడానికి ఆసక్తి చూపుతు న్నారన్నారు. బోధన, వసతి, ఆహారం బాగున్నాయని ఆయన ప్రశంసించారు.
సీఎంకు జామియా నిజామియా కృతజ్ఞతలు
హైదరాబాద్ పాతనగరంలోని సుప్రసిద్ధ, పురాతన జామేనిజామియా ఇస్లామిక్ విశ్వవిద్యాలయం ఇచ్చే డిగ్రీ సర్టిఫికెట్లకు ప్రభుత్వ గుర్తింపు ఇవ్వడానికి అంగీకరించి నందుకు ఆ విశ్వవిద్యాలయం యాజమాన్యం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేసింది. స్థానిక ఎమ్మెల్యే, ఒలేమా కమిటీ ఛైర్మన్ సయ్యద్ అహ్మద్‌పాషాఖాద్రీ, జామియా నిజామియా ఛాన్స్‌లర్ అక్బర్ నిజాముద్దీన్, వైస్ ఛాన్స్‌లర్ ముఫ్తీ ఖలీల్ అహ్మద్ తదితరులు సీఎంను కలిసి ఈ మేరకు కతజ్ఞతలు తెలిపారు.