హరితహారం ప్రారంభంలో ”వానలు వాపస్ రావాలె, కోతులు వాపస్ పోవాలే ” అనే నినాదం ఇచ్చి నేడు రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజానీకాన్ని హరితహారం వైపు కదిలించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇప్పుడు మూడవ విడత హరితహారాన్ని ప్రారంభిస్తూ, మొక్కలను పసిపిల్లల్ని పెంచినట్టు పెంచాలని రాష్ట్ర ప్రజానీకానికి, ముఖ్యంగా మహిళలకు పిలుపునిచ్చారు. పచ్చని తెలంగాణను తీర్చిదిద్దవలసిన అవసరాన్ని, ప్రాధాన్యతను ముఖ్యమంత్రి పదేపదే నొక్కిచెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన ఓ సర్వే ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా కెనడాలో సగటున ఒక మనిషికి 8,953 చెట్లు ఉన్నాయి. రష్యాలో 4,461, అమెరికాలో 716, మన పొరుగునే గల చైనాలో మనిషికి సగటున 102 చెట్లు ఉండగా, అత్యల్పంగా మన భారత దేశంలో మనిషికి సగటున కేవలం 28 చెట్లున్నాయి. భూమిమీద 33 శాతం పచ్చదనం వుంటేనే ప్రకృతి సమతుల్యత సాధించినట్టు. మన తెలంగాణ విషయానికి వస్తే, గత పాలకుల నిర్లక్ష్యం, విచక్షణా రహితంగా అడవులను నరికివేసిన ఫలితంగా పచ్చదనం 24 శాతానికి దిగజారి, ప్రకృతి సమతుల్యత దెబ్బతింది. ఫలితంగా వర్షాలు దూరమయ్యాయి. ఇప్పుడు 33 శాతానికి చేరుకోవాలంటే మొత్తం 230 కోట్ల మొక్కలు నాటాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో అటవీ ప్రాంతంలో 100 కోట్లు, ఇతర ప్రాంతాల్లో 120 కోట్లు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 10 కోట్ల మొక్కలు నాటాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
గత రెండేళ్ళలో నిర్వహించిన హరితహారం రెండు దశలలో 47.53 కోట్ల మొక్కలను నాటడం జరిగింది. మూడవ దశలో 40 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం అమలుచేస్తున్న హరిత హారం మూడవ దశ కార్యక్రమం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, విజయపథంలో కొనసాగుతోంది. ఇందుకు ప్రకృతి కూడా కరుణించి వర్షాలు కురవడంతో అత్యధికంగా మొక్కలు నాటే అవకాశం, నాటిన ప్రతి మొక్కను బతికించుకొనేందుకు చక్కటి సదవకాశం ఏర్పడింది. మొక్కలు నాటడానికి వీలుకాని ప్రదేశాలలో సీడ్ బాల్స్ (విత్తన బంతులు) చల్లడం ద్వారా పచ్చదనాన్ని పెంచే ప్రక్రియను ఈ ఏడాది ప్రవేశపెట్టాం.
మూడవ విడత హరిత హారం కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కరీంనగర్ శివారులోని మానేరు డ్యాం తీరాన మహాగని మొక్కను నాటి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ” మనిషి జీవితంలో అడుగడుగునా మొక్క పెనవేసుకొని వుంది. పిల్లల్ని పెంచినట్లే మొక్కల్ని పెంచాలి , ప్రతి వ్యక్తీ కనీసం రెండు మొక్కలు నాటాలి ” అని పిలుపు నిచ్చారు.
మొక్కలు నాటడమే కాదు. నాటిన ప్రతి మొక్కా బతకటం ముఖ్యం. అందుకు తగిన రక్షణ, నీటివసతి కల్పించడం అవసరం. అందుకు ఎక్కడికక్కడ హరిత సైన్యాలను (గ్రీన్ బ్రిగేడ్స్) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో బ్రిగేడ్ లో 51 మంది సభ్యులుగా వుంటారు. దీనితోపాటుగా, మొక్కల సక్సెస్ రేటు పెంచేందుకు పనితీరు ప్రాతిపదికగా పలు అవార్డులను కూడా ప్రభుత్వం ప్రకటించి ప్రోత్సహిస్తోంది.
రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ‘హరిత పాఠశాల-హరిత తెలంగాణ’ నినాదంతో ‘గ్రీన్ డే’ నిర్వహించి మొక్కలు నాటారు. లక్షలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొక్కలు పెంపకం, వాటి ఆవశ్యకతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు, క్విజ్ పోటీలు నిర్వహించారు.
పచ్చని తెలంగాణ ఉండాలంటే హరితవనాల్ని బాగా పెంచాలి. అప్పుడే కరవును శాశ్వతంగా నివారించగలం. హరితహారం ప్రధాన లక్ష్యం అదే. ఆ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరం భాగస్వాములమవుదాం. నాటిన ప్రతి మొక్కనూ రక్షించుకునేందుకు ప్రతిన బూనుదాం.