enneelaఅన్నవరం దేవేందర్‌

ఈయేడు వానలు ఇరగ దంచుతున్నాయి. రెండు మూడేండ్ల కింద ఎండిపోయిన చెర్లు కుంటలల్ల నీళ్ళు నిండినయి. కప్పల బెకబెకలు ఇనొస్తున్నయి. కట్టలపొంటి నడుస్తుంటే నీళ్ళ బందుకు నీరు కట్టెలు కన్పిస్తున్నయి. ఊరినిండ వానల సంబురమే కనిపిస్తున్నది. నీళ్ళ కళనే వేరు. వానలు పడకుంటే ఎవరి మొఖం చూసిన దీనత్వం కన్పిస్తది. చెర్లు, కుంటలు, బాయిలు బందాలే కాదు. ప్రాజెక్టులు సుత నిండ నీళ్ల గోలెం లెక్క అయినయి. బస్సుల్ల పల్లెటూల్లకు పోతాంటే పచ్చగ పొలాలు కన్పిస్తున్నయి. అక్కడక్కడ మడికట్లు దుబ్బ చెల్కలు తప్ప కడమదంత పచ్చని చేండ్లు కండ్ల సంబురం అయితంది.

ఇటు ముసురు అటు కొంచెం ఎండల మధ్య సింగిడి పొడుస్తే ఎంత సంబురం అయితదో ఇప్పుడు ఊర్లల్ల అంత సంబురం అయితది. ఊరు మొగులుమీద సంగిడి అంటే సీతమ్మవారు చీర అరేసుకున్నది అనుకునేది. దీన్నే ఇంద్రధనుస్సు అంటరు. ఈ కాలంలనే కన్పించే సింగిడి సూస్తే చిన్న పోరగాండ్ల నుంచి పెద్ద మనుసులదాకా ఏదో సంతోషం కల్గి మొఖం ఎలిగిపోతది. ఓ పక్క వాగులు నిండుగ పొంగుతున్నయి. చెర్లు మత్తల్లు దుంకుతున్నయి.ఎవుసం బాయిలు కొప్పురంగ నిండినయి. ఎండి ఎరగప్ప అయిన బోర్లల్ల నీళ్ళు మీదికి వచ్చినయి. చెరువు కట్టమీద యాట పిల్లలు తెెగుతన్నయి పోగులు పోగులుగ కూర పంచుకుంటాండ్రు. కట్టమీద ఒక్క యాటపిల్ల ఎందుకైతది! కులానికొకటి తలాని కొకటి కోస్క తింటరు. మైసమ్మ చెట్టు కాడ నెత్తురు మరకలు అయితయి. యాటకు కోసిన మాంసం ఇంటింటికి మోత్కాకులల్ల తెచ్చుకుంటరు. ఆ ఆకుల్ల తెచ్చిన కూర వండుక తింటే అదొక్క నాలిక సంబురం. కట్ట పొంటి కల్లు సుత మస్తు పారుతంది.ఈదుల్లకు సుత మస్తు కల్లు వస్తది. ఈతకల్లు, తాటి కల్లు పచ్చని పొలాలు, నిండిన చెర్లు. పారుతున్న కాలువలు. చెరువు కింద మడిట్ల్లు నాట్లు ఏస్తున్న ఆడోల్లు, నారు పంచుతున్న మొగోల్లు నడుమ నడుమ అప్పుడే కైకట్టి పాడుతున్న పాటలు. ఇదొక లోకం పచ్చని లోకం పైరు పచ్చని లోకం ఎవుసం ఇప్పుడు నవ్వుతున్న ప్రపంచం. మీ మడిగట్ల ఒడ్ల నుంచి నడుసుకుంట పొతాంటే ఇనచ్చే పాటకు ఎవలైనా పరవశించిపోవాల్సిందే. ఎన్నో పాటలు అక్కన్నే పురుడు పోసకుంటయి, తరతరాలు వారసత్వంగా వస్తున్న పాటలు, బతుకమ్మ సరాలు సత మస్తు పాడుతరు. ఒక్క పాటకు నాట్లు నాట్లేసేటోళ్ళ కోరన్‌ ఇస్తరు. ఇటు నాట్లు ఏసుకుంట అటు పాట పాడుతాంటే పని చేసినట్టే అనిపియ్యదు. పొద్దు పోయినట్టే అన్పియ్యదు. మనసంతా పాటలమీదకి పోతది. అయితే పాటలు అందరికీ రావు. కవులు గాయకులు కొందరే ఉన్నట్టు కొందరే పాడుతరు వాళ్లంటే అందరికీ గౌరవం. ఆ పాడేటామె ఏ పొలం పనికి వస్తదో ఆ పొలమంతా కళావేదిక అయితది. ఇటు పాటలు అటు ఆకాశంల కొంగలు, ఇటు పక్క ఊరవిష్కల గుంపు, చెట్టు మీద రామచిల్కలు, దూరంగ కాకులు, బుర్క పిట్టలు, కర్రె పిట్టలు ఆ సంబుర వాతావరణమే వేరు వేరుగ ఉంటది అయితే ఈ పాటల పటాటోపం అంతా నీళ్లు ఉనప్పుడే ఉంటది. చెర్లల్ల నీళ్ళు లేేనప్పుడు ఊరంత దోడ్‌.. దోడ్‌..

బాయిల కాడ ఎవుసం దగ్గర పనిచేసినంక గడ్డమీద సద్ది తినుడు ఒక సుందరదృశ్యం. నాట్లు వేయ వచ్చియనోల్లు కలువ వచ్చినోల్లు డబ్బ గిన్నెలల్ల కట్టు సద్దిని చెట్టు కొమ్మకు కట్టుతరు. పాలియాల్లకు కాల్రెక్కలు కడుక్కొచ్చుకొని సద్దులు తినేటప్పుడు సూస్తె అందరి దగ్గర కూరలతోపాటు తొక్కులు ఉంటయి. మామిడి కాయ పిక్కతొక్కు ఆఖరుకు కలుపుకొని పెరుగుల తింటాంటే మస్తు రుచిగుంటది. నాగలి దున్నినంక నారు పంచి ఏశినంక చెట్లకింద కూకోని తింటాంటే బువ్వ సరిపోనట్టే అన్పిస్తది. తిని జరసేపు సుట్ట బీడి తాగేటోల్లు తాగుతరు. సాటుకు జర్ద పొగాకు ఏసుకునే ఆడోల్లు సుత ఉంటరు. వాల్లకు అదొక సంబురం. ఎవల సంబురమైనా వద్దంటే ఆగది. రమ్మంటే రాదు. వానకాలం నాట్లు ఎయ్య వచ్చేటోళ్లు పాలకాయిదం కొప్పెర పెట్టుకుంటరు. ఇటు చిన్న చిన్న వాన పడుతుంటే ముసురు పెడుతుంటే సుత కొప్పెర పెట్టుకొని పని చేస్తనే ఉంటరు. చినుకులు జర బగ్గ దంచుతుంటే చెట్ల కిందికో ఎడ్ల కొట్టంలకో పోయి కొచెంసేపు కూకుంటరు. అప్పటికే ఆ కొట్టంల ఎడ్లు నాగలి దున్ని మెత్త గాళ్ళు పడి దీనంగా చూస్తూ ఉంటయి. బాగా అలసిన మొఖాలతో ఇదివరకు తిన్న గడ్డిని నెమరు వేస్తుంటాయి.

ఎడ్లతోని బురద నాగలి దున్ని వాటి పెయ్యి కడుగుడు ఎవసాయదారునికి ప్రేమ సంటి బిడ్డలకు తానం పోపిచ్చినట్టే చేస్తడు. ఎద్దుకు అంటిన బురదను దగ్గర చెర్ల లేకపోతే బాజట్ల కడుగుతాడు. కాళ్లకు తోకకు మెడ కింద కడుపు కింద కడుగుతాంటే, ఎద్దు నీళ్లకింద మంచిగ నిలబడ్తది. అటు ఇటు కదలకుండ ఒక్క తాన్నే నిలబడ్తది. ఎడ్ల పెయ్యి తన పెయ్యి కడుక్కున్నట్టే కడిగి గుంజకు కట్టేస్తడు. పచ్చగడ్డి వానకాలంల కంచెలల్ల కావల్సినంత దొరుకుతది. కంచె లేకపోతె ఒడ్లపొంటి ఆడ ఈడ గడ్డిని ఎడ్లు నాగలి దున్నీ దున్నీ అలిసి తిని పంటయి. ఎడ్లకు పనికి పాటకు, నాటకు, వానకు. మనిషికి ప్రాకృతిక సంబంధం ఉంటది. ఆ సంబంధమే వ్యవసాయం ఆదే వర్ష రుతువు నీళ్లు వాగులు, చెర్లు, కుంటలు, బోర్లు చెట్లు పక్షులు కొంగలు గొర్రెంకలతో రైతు కల్సి బతుకుతడు. ఇదంతా ప్రకృతి పులకరిస్తే వానలు కురిస్తేనే పచ్చని చెట్లు పెరిగితేనే సాధ్యం. ఇప్పుడు మొగులు మీద పొడిసిన సింగిడి సూసి రైతు నవ్వుతండు.

Other Updates