మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకులంతా ఓడిపోయారు. పార్లమెంటులో పండిట్‌జీ ధాటికి ఎదురే లేకపోయింది. ఆ సమయంలో నెహ్రూని ఎదుర్కోగల సమర్థుడు శ్యాంప్రసాద్ ముఖర్జీయే. 1952లో పార్లమెంటుకు ఎన్నికైన ముగ్గురు జనసంఘ్ సభ్యులలో ఆయన ఒకరు. ఖండిత భారతపు అఖండత్వంకోసం బలిదానం చేసిన మొదటి దేశభక్తుడు.
డా|| శ్యాంప్రసాద్ ముఖర్జీ (1901-1953) ప్రముఖ విద్యావేత్త. కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా, కలకత్తా హైకోర్టు జడ్జిగా విశిష్ట సేవలందించి ప్రజల మన్ననలందుకున్న ఆశితోష్ ముఖర్జీ కుమారుడు. ఆయన కేవలం 33 ఏళ్ళ వయస్సులో కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1939 అంటే తన 38 ఏళ్ళ వయస్సులో ఆయన హిందూ మహాసభ తాత్కాలిక అధ్యక్షుడుగా వ్యవహరించారు. మహాత్మాగాంధీకి ఆయనపట్ల విశ్వాసం ఉండేది. పటేల్ హిందూ మనస్తత్వంగల కాంగ్రెస్ వాది. మీరు కాంగ్రెస్ మనస్తత్వం గల హిందూ మహాసభ సభ్యులు’ అని గాంధీజీ శుభాకాంక్షలు పొందిన వ్యక్తి.
తొలి స్వతంత్ర భారత ప్రభుత్వంలో గాంధీజీ సూచనపై ముఖర్జీని మంత్రివర్గంలో తీసుకొని ఆయనను పరిశ్రమల మంత్రిగా నియమించారు. పరిశ్రమల మంత్రిగా ఆయన కలకత్తాలో హిందూస్తాన్ ఏరోనాటిక్‌తోపాటు, చిత్తరంజన్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ, సింధ్రీ ఎరువుల కర్మాగారంవంటి అతిపెద్ద ప్రభుత్వ సంస్థలెన్నింటికో శంకుస్థాపన చేశారు. అతి తక్కువ కాలంలో ఆయన చెప్పుకోతగ్గ విజయాలను సాధించడం ఆయన దూరదృష్టికి, పరిపాలనా సామర్థ్యానికి నిదర్శనం.
నెహ్రూ మంత్రివర్గంలో ఉన్నప్పుడే ప్రధానితో తనకున్న విభేదాలను దాచుకోలేదు. 1950లో పాకిస్థాన్ ప్రధాని లియాకత్ అలీఖాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. పార్లమెంటులో డా. ముఖర్జీ నెహ్రూకంటే ఎంతో మెరుగైన వక్త. ఒకరోజు నెహ్రూ పార్లమెంటులో మాట్లాడుతూ ‘నేను జనసంఘ్‌ను నలిపివేస్తాను’ అని ఆవేశంతో హెచ్చరించారు. డా|| ముఖర్జీ వెంటనే జవాబిస్తూ ‘ప్రతిదాన్ని నలిపివేయాలన్న ప్రధానమంత్రి మనస్తత్వాన్నే మేము నిలిపివేస్తా’మన్నారు.
డా. శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రసంగం వినడానికి లోక్‌సభ గ్యాలరీలో చోటు దొరికేదికాదు. ఆయన ప్రసంగం వినాలని కోరుకునేవారు మూడు రోజుల ముందే పాసులు తీసుకుని సీట్లు రిజర్వు చేసుకునేవారు. ముఖర్జీ ప్రసంగం అత్యంత ఆకర్షణీయంగా, పాలక పక్షానికి అంకుశంగా ఉండేది. గంగానది ప్రవాహతుల్యమైన ఆయన ప్రసంగం ఒక్కోసారి ప్రధాని నెహ్రూకే నివ్వెరపాటు కలిగించేది. జాతీయ పార్టీలను కాంగ్రెస్ పార్టీ ఏనాడూ సహించలేదు. కాంగ్రెస్ ఈ ధోరణివలన వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి. ఇప్పుడున్న రెండు జాతీయపార్టీలు. ఒకటి కాంగ్రెస్. రెండోది బీజేపీ. కశ్మీర్ పర్యటనలో ఉండగా ముఖర్జీని కశ్మీర్ సరిహద్దుల్లో అరెస్టు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 1953 మే 23న మరణించారు.
అజాత శత్రువు
ఇ.ఎమ్.ఎస్. నంబూద్రిపాద్‌ను ప్రేమించని మళయాళీ అంటూ ఎవరు కనిపించరు. వ్యక్తిగతంగా ఆయన ఆదర్శ జీవితం గడపడం ద్వారా కమ్యూనిజమ్ అంటే గిట్టనివారినుండి కూడా ఆయన అభిమానాన్ని సంపాదించుకున్నారు. సాధారణంగా నేటి రాజకీయాల్లో లోపించే సుగుణాలన్నీ… నిజాయితీ, ధైర్య సాహసాలు, సునిశితమైన మేధస్సు, నిస్వార్థత అన్నీ ఆయనలో ఉండేవి. సహాయనిరాకరణోద్యమం, ఖిలాఫత్ ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు.
తన జీవితంలో ఏది చూడకూడదనుకున్నాడో అదే చూడవలసి వచ్చింది. చివరకు తన ప్రధాన శత్రువు గద్దెనెక్కడం భరించవలసివచ్చింది. తన అవిశ్రాంత రాజకీయ, సాహితీ ప్రసంగాలలో ఆయన బీజేపీని ఎన్నిసార్లు, ఎన్నివిధాలా దుయ్యబట్టి ఉంటారో చెప్పటం కష్టం. ఆ పార్టీ 1998లో లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని చేపట్టడం ఆయనను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. కానీ నంబూద్రి 89 ఏళ్ల రాజకీయ జీవితంలో వైఫల్యాలు, సాఫల్యాలు కొత్తేమీకావు. నంబూద్రిపాద్ చూస్తుండగానే కమ్యూనిస్టు ప్రపంచంలో దిమ్మెరపోయే విధమైన మార్పులు జరిగాయి. సోవియట్ యూనియన్ బలం క్షీణించిపోయింది. స్వదేశంలో పార్టీ చాలా వరకు బలహీనపడింది. ఆరు దశాబ్దాలు గడిచినతర్వాత కూడా భారతదేశంలో రెండున్నర రాష్ట్రాల సరిహద్దులు దాటనేలేదు.
అధికారంలో ఉన్నా లేకపోయినా దాదాపు ఆరున్నర దశాబ్దాలపాటు ఆయన చెప్పిందే పార్టీకి వేదమవుతూ వచ్చింది. కమ్యూనిస్టు ఉద్యమంలో రాజకీయ జీవితంలోనూ ఆయన ఆలోచనలు, అభిప్రాయాలు విలక్షణంగా ఉండేవి.
1957లో ఆయన కేరళ ముఖ్యమంత్రి అయ్యారు. తిరుగుబాటుద్వారా అధికారాన్ని చేజిక్కించుకోకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారాన్ని చేజిక్కించుకోవడం కమ్యూనిస్టుపార్టీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం. పాలకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌ను ఎదుర్కోవడానికి అవసరమైతే తను దయ్యాలతోనైనా చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన ఒక దశలో ప్రకటించారు. ఆ ధ్యేయంతోనే ఆయన 1960లో కేరళలో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు ఒరవడి చుట్టారు. అయితే చివరకు ఆయన ప్రారంభించిన సంకీర్ణాలు విచ్ఛిన్నమైపోతున్నా ఏమీ చేయలేకపోయారు. ఆయన మార్గనిర్దేశకుడే కానీ, సంరక్షకుడుకాదు. 1909లో జన్మించిన ఇ.ఎం.ఎస్.1998లో మరణించారు.
గెలుపు, ఓటములని అనుకోలేదు
1945లో రూజ్‌వెల్ట్ మరణించగానే ఉపాధ్యక్షుడు ట్రామన్ అమెరికా అధ్యక్షుడైనాడు. 1948 ఎన్నికల్లో ఆయనకు అనుకోని రీతిలో విజయం లభించింది. అమెరికా చరిత్రలో కనీవినీ ఎరుగని సమస్యలు ట్రూమన్ పరిపాలనాకాలంలో ఉత్పన్నమైనాయి. అగ్రరాజ్యాధిపతుల సమావేశం యాల్టాలో జరిగినప్పుడు రూజ్‌వెల్ట్, స్టాలిన్‌ల మధ్య కానవచ్చిన సహకారం పాట్స్‌డామ్‌లో జరిగినప్పుడు ట్రూమన్, స్టాలిన్‌లమధ్య కానరాలేదు. రూజ్‌వెల్ట్ మృతితోనే రష్యా, అమెరికాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం ప్రారంభమైందని చాలామంది అభిప్రాయం.
కొరియా యుద్ధం ట్రూమన్ ప్రభుత్వానికి, డెమోక్రటిక్ పార్టీ ఇరవై ఏళ్ళ అధికారానికి ముప్పు తెచ్చి పెట్టింది. అమెరికా సైనిక నష్టాలు రెండవ ప్రపంచ యుద్ధంలోకంటే కొరియా యుద్ధంలోనే అధికం కావడం ఆయన ప్రభుత్వ పతనానికి కారణం. కొరియా యుద్ధం అంతమొందాలంటే బలవంతుడైన నాయకుడు, సమర్థవంతమైన ప్రభుత్వం ఉండాలని ప్రజలు కోరారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఐసెన్ హోవర్‌ని ఎన్నుకున్నారు.
జి.వెంకటరామారావు