రాష్ట్ర శాసన సభ ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల శాసన సభా ఎన్నికలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్‌ ఓ.పి. రావత్‌ అక్టోబర్‌ 6న ఢిల్లీలో ఎన్నికల షెడ్యూలు ప్రకటించారు. దీని ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో డిసెంబరు 7న పోలింగ్‌ జరగనుంది. సెప్టెంబర్‌ 6న తొలి శాసన సభ రద్దు కాగా, కచ్చితంగా నెల రోజుల తరువాత ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది.

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నవంబరు 12న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అవుతుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ నవంబరు 19. నామినేషన్ల పరిశీలనకు గడువు నవంబరు 20. నవంబరు 22 తో ఉపసంహరణ గడువు ముగుస్తుంది. డిసెంబరు 7న పోలింగ్‌ జరుగుతుంది. డిసెంబరు 11న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడిస్తారు.

రాష్ట్రంలో సజావుగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి చేస్తోంది. భారత ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్‌తోసహా ఎన్నికల కమీషన్‌ బందం రాష్ట్రాన్ని సందర్శించి ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించి, సంతప్తిని వ్యక్తంచేసింది.

రాష్ట్ర ఎన్నికల సంఘం సవరణల అనంతరం విడుదలచేసిన తుది ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 2,73,18,603గా ఉంది. వీరిలో పురష ఓటర్లు 1,37,87,920, మహిళా ఓటర్లు 1,35,28,020, థర్డ్‌ జెండర్‌ 2,663 మంది

ఉన్నారు. వీరుగాక అదనంగా త్రివిధ దళాలు, విదేశీ వ్యవహారాలలో పనిచేసే సర్వీసు ఓటర్లు 9,451 ఉన్నారు.

తెలంగాణతోపాటు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మిజోరం, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికల షెడ్యూలును కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వామపక్ష తీవ్రవాద ప్రభావంగల ఛత్తీస్‌ గఢ్‌ రాష్ట్రంలో రెండు దశలలోనూ, మిగిలిన రాష్ట్రాలలో ఒక రోజు చొప్పున ఎన్నికలు జరుగనున్నాయి.

ఛత్తీస్‌గడ్‌ ఎన్నికలు తొలి రెండు దశల్లోనూ, మధ్యప్రదేశ్‌, మిజోరం రాష్ట్రాల ఎన్నికలు మూడో దశలోనూ, తెలంగాణ, రాజస్థాన్‌ ఎన్నికలు నాలుగో దశలోనూ నిర్వహించనున్నారు. అయితే, అన్ని రాష్ట్రాలకూ కలిపి ఒకేసారి డిసెంబరు 11న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఈ ఎన్నికలలో అన్నిచోట్లా ఓటు రసీదు యంత్రాలు (వీవీప్యాట్‌) వినియోగించనున్నట్టు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏదో ఒకచోట ఓటు రసీదులను లెక్కించనున్నట్టు రావత్‌ తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 119 శాసన సభా స్థానాలకు ఒకే సారి డిసెంబరు 7న పోలింగ్‌ జరుగనుంది. ఈ ఎన్నికలలో అక్రమాలు నిరోధించేందుకు, శాంతి యుత వాతావరణంలో స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడానికి, అందరికీ అందుబాటులో ఎన్నికలు అనే లక్ష్యంతో ఎన్నికల కమిషన్‌ చర్యలు చేపడుతోంది.

Other Updates