రిజర్వేషన్లు ఖరారు చేసిన ప్రభుత్వం
పంచాయతీ ఎన్నికలను మూడు నెలలలోపు పూర్తిచేయాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు నగారా మోగించింది. ఇందులో కీలకమైన రిజర్వేషన్ల ఖరారు పూర్తి చేసింది. రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. రిజర్వేషన్లు 50శాతం మించకుండా చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఎస్టీలకు 6.7 శాతం, ఎస్సీలకు 20.5 శాతం, బీసీలకు 22.8 శాతం స్థానాలను రిజర్వు చేసింది. జనరల్ కేటగిరీలో 50శాతం చేర్చింది. ఈ ప్రకారం మొత్తం 12,751 గ్రామ పంచాయతీలలో 3,146 పంచాయతీలు ఎస్టీలకు, 2,113 పంచాయతీలు ఎస్సీలకు, 2,345 పంచాయతీలు బీసీలకు కేటాయించబడ్డాయి. ఇక జనరల్ కేటగిరిలో 5,147 గ్రామపంచాయతీలు కేటాయించబడ్డాయి. ఇక అన్ని కేటగిరీలలో కలిపి మహిళలకు 6,378 గ్రామ పంచాయతీలు కేటాయించబడ్డాయి.
ఏజెన్సీ, వందశాతం ఎస్టీ జనాభా ఉన్న పంచాయతీలు, సాధారణ రిజర్వేషన్లతో కలిపి ఎస్టీలకు ఎక్కువ సంఖ్యలో సర్పంచ్ స్థానాలు రిజర్వు అయ్యాయి. రాష్ట్రం మొత్తంలో 12,751 గ్రామ పంచాయతీలు ఉండగా, వీటిలో గిరిజన ప్రాంతాలకు సంబంధించి (షెడ్యూల్) 1,281 పంచాయతీలను ఎస్టీలకు కేటాయించారు. అలాగే వందశాతం జనాభా ఉన్న 1,177 సర్పంచ్ స్థానాలను ఎస్టీలకే రిజర్వు చేశారు. ఇవి పోను మిగిలిన 10,293 పంచాయతీలను ఎస్సీ, ఎస్టీ, బీసీ కోటా ప్రకారం రిజర్వేషన్లు నిర్దారించారు. ఈ కేటాయింపుల ప్రకారం ఎస్టీలకు 688, ఎస్సీలకు 2,113, బీసీలకు 2,345 పంచాయతీలు రిజర్వు అయ్యాయి. అన్ని కేటగిరీల్లోను 50శాతం స్థానాలు మహిళలకు కేటాయించారు. మొత్తంగా రాష్ట్రంలో ఎక్కువ సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. ఇక 5,147 జనరల్ సర్పంచ్ స్థానాల్లో అన్ని వర్గాల వారు, మహిళలు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.