తెలంగాణ రాష్ట్రానికి మరోసారి జాతీయస్థాయి గుర్తింపు దక్కింది. ఇప్పటికే పలు అవార్డులు, ప్రశంసలు అందుకున్న తెలంగాణ రాష్ట్రం ఈ సంవత్సరానికి గాను ”మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్” అవార్డు దక్కించుకున్నది. ప్రతి ఏడాది CNBC TV18 నిర్వహించే India Business Leader Awardsలో భాగంగా రాష్ట్రానికి ఇచ్చిన అవార్డును ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా ఆగస్టు 30న రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్ అందుకున్నారు.
దేశంలోనే చిన్న వయస్సున్న తెలంగాణ రాష్ట్ర పురోగమనం, అభివృద్ధికి ఈ అవార్డు నిదర్శనమని మంత్రి కేటీఆర్ అన్నారు. పోటీ ప్రపంచంలో ప్రజలకు సేవలందించేందుకు సీఎం కేసీఆర్ ఎప్పటిక ప్పుడు మంత్రి వర్గానికి మార్గదర్శకాలు చేస్తున్నారని మంత్రి అన్నారు. అన్ని రంగాల్లో అనుభవం ఉన్నవారిని, నిష్ణాతుల సలహాలు తీసుకొని ప్రజారంజక పాలన అందించాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని మంత్రి తెలియజేశారు.
భారత దేశంలో అత్యంత ప్రగతిశీల, పురోగమనశీల రాష్ట్రంగా ఉండాలన్నది ముఖ్యమంత్రి అలోచన అని మంత్రి కేటీఆర్ తెలిపారు. పాలన పురోగతి, సమర్థవంతమైన పాలనకు రాష్ట్రం నిదర్శనమని, మోస్ట్ ప్రామిసింగ్ అవార్డు, ప్రజలకు మంచి పాలసీలతో ప్రభుత్వాన్ని నడిపిస్తుందనడానికి నిదర్శనమన్నారు. అన్ని రంగాల్లో పురోగమనంలో రాష్ట్రం ఉందన్నారు. ఆగస్టు 30న శాసన సభ జీఎస్టీ బిల్లును అమోదించిందని తెలిపారు. జీఎస్టీతో రాష్ట్రం వేగంగా పారిశ్రామిక రంగంలో ఎదుగుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రాబోయే సంవత్సరాల్లో తెలంగాణ భారతదేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఎదుగుతుందని తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేస్తున్నారనడానికి ఈ అవార్డు నిదర్శనమని, తెలంగాణ అభివృద్ధికి పాటు పడుతున్న నాయకత్వానికి, తెలంగాణ ప్రజలకు అంకితమని మంత్రి తెలిపారు.