‘యజ్ఞోవై శ్రేష్టతమం కర్మ’ అన్న వేదవాజ్ఞయ ప్రకారం ప్రాచీన సంప్రదాయాల్లో యజ్ఞంవల్ల కలిగే లాభాలేమిటో ఈ ‘యజ్ఞ చికిత్స’ తెలియజేస్తోంది. ఇంట్లో యజ్ఞం-ఒంట్లో ఆరోగ్యం అన్న శీర్షిక సూక్తులతో, వెలువడ్డ మంచి గ్రంథం ఇది. ఆంగ్లమూలం డా|| దుంపల గోపాలకృష్ణ ఆర్య రచించగా తెలుగు స్వేచ్ఛానువాదం డా|| గౌడ జనార్ధన్ (నేత్ర వైద్య నిపుణులు) చక్కగా విశదీకరించి మనకందించారు. సంపాదకత్వాన్ని డా|| మఱ్ఱి కృష్ణారెడ్డి చేసినారు. ఇందులో మానవుల ఆరోగ్యం కొరకు యజ్ఞ సూక్తాలను అందించారు. ఓమ్ అగ్నిమీళే పురోహితమ్, యజ్ఞస్యదేవ మృత్విజమ్ హోతారం తర్న ధాతమమ్||
భూమిపై సూర్యచంద్రులు ప్రకాశము మొదలుపెట్టినప్పుడే భగవానుడు నాలుగు వేదములను ప్రకటించాడు. వీటిలో యజ్ఞమునకు అత్యున్నత స్థానం ఇవ్వబడింది. అగ్నిహోత్రము, పూర్ణిమ, అమావాస్య మరియు ఇతర పర్వముల యజ్ఞాల ద్వారా మానవుడు సంపూర్ణ ఆనందమును పొందును అని బోధించెను. ఇందులో యజ్ఞ సంబంధ పదములు-ఆజ్యం (నెయ్యి ఘృతము) పరిచయాలు యజ్ఞయాగాధుల సంపూర్ణ వివరణలు ఉన్నాయి. శ్రౌత యజ్ఞములు-స్మార్త యజ్ఞములు (1) ద్రవ్యయజ్ఞం (2) తపోయజ్ఞం (3) కర్మయజ్ఞం (4) స్వాధ్యాయ యజ్ఞము (5) జ్ఞాన యజ్ఞము ఉన్నాయి. అంతేకాకుండా నిత్య యజ్ఞాలు కామ్య యజ్ఞాలు. నైమిత్తికాలు ఉన్నాయి. అలాగే 24 యాజ్ఞిక యజ్ఞాల నామములు కూడా ఇందులో ఉదహరింపబడినది. యజ్ఞవల్ల జీవనశక్తిలో వృద్ధి-యజ్ఞంవల్ల సంపూర్ణ తృప్తి యజ్ఞాయుర్వేద ప్రక్రియ విధానాలు కూడా ఇందులో ఉన్నాయి. ప్రతివారు చదువవలసిన మంచి మహాగ్రంథం ఇది.
– కె. స్వరూపరాణి