యాదాద్రి క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నారసింహుడి కల్యాణోత్సవం ఘనంగా ముగిసింది. తిరుకల్యాణ వేడుకలను భక్తులు పెద్ద ఎత్తున తిలకించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి మార్చి 10న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలలో భాగంగా మార్చి 17న జరిగిన కల్యాణ మహోత్సవ సందర్భంగా యాదగిరి గుట్టకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సతీసమేతంగా విచ్చేసి, స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు.
ముఖ్యమంత్రి దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీ పంచలక్ష్మీ నరసింహస్వామికి గుర్భగుడిలో ముఖ్యమంత్రి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అదేరోజు సాయంత్రం గవర్నర్ నరసింహన్ దంపతులు యాదాద్రికి చేరుకొని స్వామివారి కల్యాణానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. వేడుకలను తిలకించారు.
ఉదయం పూజా కార్యక్రమాల అనంతరం దేవాలయ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధికారులతో సమీక్ష జరిపారు.
నేనున్నంక మీందుకు భయం
రోడ్డు విస్తరణలో భాగంగా గుట్ట మీద అడ్డుగా వున్న వ్యాపార సముదాయాలు, దుకాణాలను తొలగించారు. ఈ సందర్భంగా దుకాణదారులతో, యజమానులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఆలయాన్ని విస్తృ త స్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి సహకరించాలని వారికి సూచించారు. విస్తరణ కార్యక్రమంలో వారు కోల్పోయిన దుకాణాలకు బదులుగా స్థలం కేటాయించడంతో పాటు దుకాణాలను నిర్మించి ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. వాటిని రిజిస్ట్రేషన్ కూడా చేయించి ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. మీకు నమ్మకం అయినంకనే గుడి పనులు పూర్తి చేస్తామని సీఎం చెప్పడంతో దుకాణాల యజమానులు సంతోషించారు. ఎవరికీ నష్టం వాటిల్లకుండా పూర్తి స్థాయిలో నష్టపరిహారాలు చెల్లిస్తామని, యాదాద్రి గుట్ట రోడ్డు, విస్తరణ బాధితుల సంఘం నేతలకువివరించడంతో వారు సీఎంకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని స్పష్టం చేశారు. తమకు ముఖ్యమంత్రిపై పూర్తి భరోసా వున్నదన్న ధీమా వ్యక్తం చేశారు.
యాదాద్రిని అద్భుత పవిత్ర స్థలంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. గుడిమీదికి వెళ్లే రోడ్డు విశాలంగా వుండాలన్నారు. ఈ సందర్భంగా గుడి నిర్మాణ నమూనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. వాస్తు, ఆగమ శాస్త్ర సూత్రాల ప్రకారం యాదాద్రి నిర్మాణాలు వుండాలన్నారు. యాదాద్రిలో నిర్మించ తలపెట్టిన టెంపుల్ సిటీని అత్యంత అద్భుతంగా విశాలమైన ల్యాండ్ స్కేప్‌లో నిర్మించాలన్నారు. వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యే విధంగా కళ్యాణ మండపాన్ని నిర్మించ తలపెట్టినామని, హైదరాబాద్‌లో వున్న పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్‌లను మైమరపించేదిగా వుండాలని అన్నారు. యాదాద్రి పట్టణాన్ని పరిసర ప్రాంతాల ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కన్వెన్షన్ సెంటర్‌ను కూడా నిర్మించనున్నట్టు సిఎం తెలిపారు. యాదాద్రి ఔటర్‌రింగ్ రోడ్డుకు దగ్గరగా వున్నందున నగర వాసుల రాకపోకలకు మార్గం సుళువవుతుందన్నారు.
గుట్టమీద పార్కింగ్ స్థలం లేనందున దాదాపు 5 వేల నుండి 6 వలే వాహనాలు నిలిపే సామర్థ్యం కలిగిన విశాలమైన పార్కింగ్ స్థలాన్ని నిర్మించనున్నట్లు సీఎం తెలిపారు. స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు నిత్యాన్నదాన సత్రాన్ని నిర్మించాలని అన్నారు. యాదాద్రి చుట్టు పక్కల ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని, తద్వారా స్థానికులకు, వ్యాపారులకు ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయని సిఎం చెప్పారు.ముఖ్యమంత్రి తిరిగి హైదరాబాద్ బయలుదేరుతున్న సందర్భంలో రాచెర్ల రమేష్ అనే చేనేత కళాకారుడు తాను స్వయంగా నెయిల్ అండ్ త్రెడ్ ఆర్ట్ ద్వారా తయారుచేసిన కెసిఆర్ చిత్రపటాన్ని ముఖ్యమంత్రికి బహూకరించారు. రంగు రంగుల దారాలతో సహజత్వం ఉట్టిపడేలా మేకులకు దారాలు చుట్టి తయారు చేసిన కళారూపం అందరినీ ఆకట్టుకుంది. ఇటువంటిది ప్రపంచంలోనే అరుదైన కళారూపమని చెప్పడంతో సంతోషించిన ముఖ్యమంత్రి కళాకారుడు రాచర్ల రమేష్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
యాదాద్రి దేవాలయ ఉద్యోగులు ఒక రోజు వేతనం రూ.3,40,400లను చెక్కు రూపంలో మిషన్ కాకతీయకు విరాళంగా ముఖ్యమంత్రికి అందజేశారు.
యాదాద్రిపై ఆహ్లాద వాతావరణం
యాదగిరిగుట్టను పూర్తిస్ధాయిలో అభివృద్ధిగావించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పునరుద్ఘాటించారు. మార్చి 11న అధికారిక నివాసంలో యాదాద్రి పునర్నిర్మాణం మీద సిఎం విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా యాదాద్రిలో నడుస్తున్న అభివృద్ది పనుల గురించి అధికారులు సిఎంకు నివేదించారు. యాదాద్రి అభివృద్ధిలో రవాణా వ్యవస్థను పటిష్టపరచడం, అనువయిన నివాస సముదాయాలను, వ్యాపార కేంద్రాలను నిర్మించడం, యాదాద్రి పరిసర ప్రాంతాలను సుందరీకరించి ఆహ్లాదకర వాతావరణాన్ని నెలకొల్పడం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.
వీటితో పాటు దేశ విదేశాల ప్రముఖులు పాల్గొనే విధంగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణను భారీ ఎత్తున నిర్వహించే సామర్థ్యం గల క్షేత్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాహిత్య, వ్యాపార కేంద్రంగా యాదాద్రిని చూడాలన్నదే తమ ధ్యేయం అన్నారు.
తెలంగాణ పది జిల్లాల నుంచి నేరుగా యాదాద్రికి చేరుకునేందుకు విశాలమైన రహదారుల నిర్మాణం ఉండాలన్నారు . ప్రధాన ఆలయ ప్రంట్ ఎలివేషన్, వీధిపోటు తదితర వాస్తు సూత్రాలను సమీక్షిచారు. గిరి ప్రదర్శన కోసం గుట్ట చుట్టూ వున్న రోడ్లను వెడల్పు చేయాలన్నారు. రోడ్డు వెడల్పులో ఇండ్లు కోల్పోనున్న వారికి ప్రత్యామ్నాయం చూపడమే కాకుండా వారికి నిర్మాణ ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. గుట్ట మీదికి వెళ్ళే దారి వన్ వేనే వుండాలన్నారు. టూవే ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు పెరుగుతాయన్నారు. రహదారుల వెంట పాదచారులకు వీలుగా ఫుట్ పాత్ లను నిర్మించాలన్నారు.
దేవాలయ భూములు అన్యాక్రాంతమైన విషయాన్ని ఈ సందర్బంగా అధికారులు సిఎం దృష్టికి తెచ్చారు. అన్యాక్రాంతమైన భూములను గుర్తించి స్వాధీనం చేసుకోవాలని అందులో నివాసాలేర్పాటు చేసుకున్న వారికి మానవతా దృక్పథంతో ప్రత్యామ్నాయం చూపించాలని అధికారులను ఆదేశించారు. గుట్ట మీద దుకాణాలను ఇతరులకు కేటాయించే సమస్యే లేదు. వాటికి టెండర్లు కూడా పిలవం. భారీ ఎత్తున చేపట్టే వ్యాపార నిర్వహణ మినహాయించి వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో తలపెట్టిన టెంపుల్ సిటీలో కూడా స్థానికులకే అవకాశాలిస్తామన్నారు. టెంపుల్ నిర్మాణాలు, పరిసర ప్రాంత అభివృద్ది కార్యక్రమాలు సమాంతరంగా సాగాలన్నారు. ఇతరాత్ర సమస్యలను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి వాటి పరిష్కారానికి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా యాదాద్రి నిర్మాణానంతర గుడి గోపురాల నమూనాలను వీడియో ప్రదర్శన ద్వారాతిలకించారు..
ఊహకు అందని అభివృద్ధి
సమావేశంలో పాల్గొన్న ఇండ్లు, దుకాణాలు కోల్పోతున్న బాధితులు యాదాద్రి అభివృద్ధిపై రూపొందించిన వీడియోను చూసి సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. ఊహలకు అందనంత గొప్పగా యాదాద్రి పునర్మిర్మాణం జరుగుతుండడం తమ పూర్వజన్మ సుకృతం అని వీడియోను చూసి పరవశించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తలపెట్టిన యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ నూతన ఆవిష్కరణ మహాకార్యానికి తమ మద్దతు పూర్తిస్తాయిలో వుంటుందని దుకాణ దారులు స్పష్టం చేశారు. తమకు కెసిఆర్ మీద పూర్తి భరోసా వున్నదని తమ వంతుగా గుట్ట అభివృద్ధిలో భాగస్వాములవుతామని అన్నారు.
ఈ సమీక్షలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, నల్లగొండ జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, ఆలయ ఈవో గీత, యాదగిరిగుట్ట అభివృద్ది మండలి ప్రత్యేకాధికారి కిషన్ రావు, రహదారులు భవనాలు శాఖ చీఫ్ ఇంజనీర్ రవీందర్ రావు, లాండ్ స్కేప్ ఆర్కిటెక్ట్ జగన్ మోహన్, టెంపుల్ ఆర్కిటెక్ట్, డిజైనర్ ఆనంద్ సాయిలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో గుట్టమీద ఉపాధి కోల్పోయిన దుకాణాదారులు, స్థలాల యజమానులు దాదాపు 60 మంది దాకా ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. కాగా వారికి భోజనాలు ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి ఆతిథ్యమిచ్చారు.