tsmagazineతెలంగాణలోని యాదవులు దేశంలోనే అత్యంత ధనవంతులు కావాలన్న లక్ష్యంతోనే గొర్రెల పంపిణీ కార్యక్రమం అమలుచేస్తున్నామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పారు. యాదవ, కురుమ సంక్షేమభవన్‌ నిర్మాణం కోసం ప్రభుత్వం కోకాపేటలో కేటాయించిన భూమిలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం సి.బి.ఐ.టి మైదానంలో నిర్వహించిన బహిరంగసభలో కె.సి.ఆర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఖర్చుకు వెనుకాడకుండా అర్హులైన గొల్ల, కురుమలందరికీ సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. గొల్లకురుమల సంక్షేమ నిధి కోసం మూలధనంగా కోటి రూపాయలు మంజూరుచేస్తున్నట్టు సి.ఎం ప్రకటించారు.యాదవ యువతకు సబ్సిడీపై మీట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు.

తెలంగాణలోని అన్ని జాతులు, కులాలు, వర్గాల ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణ కల నెరవేరుతుందని, రాష్ట్ర జనాభాలో అత్యధికంగా వున్న బి.సిలు ఆర్థికంగా బలపడాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతోపాటు, ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ పరిపాలనాతీరు ఆదర్శప్రాయమని ఈ సభలో ప్రత్యేక ఆహ్వానితునిగా పాల్గొన్న కర్ణాటక రవాణా శాఖామంత్రి రేవణ్ణ ప్రశంసించారు. రాష్ట్ర మంత్రులు శ్రీనివాస యాదవ్‌, జోగురామన్న, పి.మహేందర్‌ రెడ్డి, ఈటల రాజేందర్‌, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బి.సి.లకు మరిన్ని అవకాశాలు
గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టిన ముఖ్యమంత్రిని అభినందించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి యాదవ, కురమ సంఘాల ప్రతినిధులు ప్రగతి భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారినుద్దేశించి మాట్లాడారు.

”గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపడదాం అనుకున్నప్పుడు చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. కొంతమంది అవమానాలు కూడా చేశారు. కానీ ఇప్పుడు ఈ కార్యక్రమం ఎంతో విజయవంతమైంది. ఇప్పటికి లక్షన్నర కుటుంబాలకు 30 లక్షల గొర్రెల పంపిణీ జరిగింది. పంపిణీ చేసిన గొర్రెలకు 12 లక్షల పిల్లలు పుట్టాయి. తెలంగాణలో ఇప్పుడు 42 లక్షల అదనపు గొర్రెలున్నాయి. దీనివల్ల యాదవ సోదరులు పెద్ద ఎత్తున బాగుపడడం నాకు ఎంతో సంతోషం కలిగించింది. మొదట రాష్ట్ర వ్యాప్తంగా 84 లక్షల గొర్రెల పంపిణీ చేస్తే సరిపోతుందని అనుకున్నాం. కానీ ఇప్పుడు 7.60 లక్షల కుటుంబాలకు కోటిన్నరకు పైగా గొర్రెల పంపిణీ చేయాల్సి వస్తుంది. అందరికీ గొర్రెలు పంచుతాం. భారతదేశంలో ధనవంతులైన యాదవులు ఎక్కుడున్నారంటే, తెలంగాణలోనే అనే సమాధానం రావాలి. భారతదేశంలో ఎక్కువ మాంసం ఎగుమతి చేసే రాష్ట్రం ఏదంటే, తెలంగాణ అని సమాధానం రావాలి. ఇదే నా లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లోని యాదవులు గొర్రెలు పెంచితే, పట్టణ ప్రాంతాల్లోని యాదవుల కోసం మీట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు పెట్టాలి. ఇందుకోసం ప్రభుత్వం సహాయం చేస్తుంది. వచ్చే ఏడాది నుంచే పట్టణ ప్రాంతాల్లో మీట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటాం” అని ముఖ్యమంత్రి ప్రకటించారు.

”యాదవులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అవసరమైన ప్రేరణ ఇవ్వడానికి, వేదిక ఉండడానికి గొల్ల, కుర్మల కోసం హైదరాబాద్‌లో యాదవ్‌ భవన్‌ నిర్మిస్తాం. ఏడాదిలోగానే నిర్మాణం పూర్తి చేస్తాం. అందులో పేద యాదవుల పెండ్లిళ్లు జరగాలి. ఏ అండ లేని వారికి అండగా నిలవాలి. కొంత నిధి కూడా సమకూర్చుకుందాం. వాటి ద్వారా యాదవ కుటుంబాల్లో చదువుకునే వారికి, వైద్యం అవసరం ఉన్న వారికి అండగా ఉందాం” అని సీఎం పిలుపునిచ్చారు.

”తెలంగాణ రాష్ట్రంలో బిసిల రాజకీయ ప్రాతినిధ్యం పెరగాల్సి ఉంది. దీనికోసం చర్యలు తీసుకుంటున్నాం. బిసిల రాజకీయ ప్రాతినిధ్యం పెంచే క్రమంలో యాదవులకు సముచిత స్థానం దక్కితీరుతుంది. వచ్చే ఏడాది రానున్న రాజ్యసభ ఎన్నికల్లో ఒక స్థానాన్ని యాదవులకే కేటాయిస్తాం. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కురమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గ మల్లేశానికి అవకాశం కల్పిస్తాం. డీ లిమి టేషన్‌ వల్ల పెరిగే అసెంబ్లీ స్థానాల్లో కూడా యాదవులకు టిక్కెట్లు ఇస్తాం” అని సీఎం ప్రకటించారు.

Other Updates