యాదాద్రి దేవస్థానానికి ఇంటర్‌నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఐఎస్వో) సర్టిఫికెట్ లభించింది. సాధారణంగా వ్యాపారాంశాలకు,ఇతర విషయాలకు ఐఎస్వో సర్టిఫికెట్ ఇచ్చే ఈ సంస్థ ఒక దేవస్థానానికి ఇలాంటి సర్టిఫికెట్ ఇవ్వడం మొదటిసారి. దేశవ్యాప్తంగా అనేక దేవాలయాలను అభివృద్ధి చేస్తున్న సంస్థలను అధ్యయనం చేసిన ఈ సంస్థ యాదాద్రి ఆలయ అభివృద్ధి అథారిటీ (వైటీడీఏ) చేపట్టిన పనులను పరిశీలించింది. దేవాలయం నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్న తీరు, రేయింబవళ్ళు పనిచేస్తున్న కూలీల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను గమనించారు. శిల్పులు రాళ్ళను ఆళ్వార్లుగా, 32 నరసింహావతార మూర్తులుగా చెక్కుతున్న తీరును నిశితంగా పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణ కోసం చేపడుతున్న జాగ్రత్తలను కూడా ఐఎస్వో అధికారులు సమీక్షించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పునరుద్ధరణకు పూజలు నిర్వహించి పనులు ప్రారంభింప చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న పనులను డిజిటలైజేషన్ చేసిన విధానాన్ని చూసి ఐఎస్వో ప్రతినిధులు అబ్బురపడ్డారు. దేశం మొత్తంలో యాదాద్రి పనులు వారికి మెరుగ్గా అగుపించడంతో యాదాద్రి దేవస్థానానికి, వైటీడీఏకు ఈ సర్టిఫికెట్‌ను అందచేశారు. వైటీడీఏ వైస్ చైర్మన్ జి.కిషన్‌రావు, ఈవో గీతలు ఈ సర్టిఫికెట్‌ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతులమీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా యాదాద్రి అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌వైఎం ఇంటర్‌నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి ఆలపాటి శివయ్య పాల్గొన్నారు. దేవాలయం డిజిటలైజేషన్, ఐఎస్వో గుర్తింపు గురించి సీఎంకు వివరించారు.
దసరానాటికి మూలవిరాట్ దర్శనం
దసరానాటికి భక్తులకు యాదగిరి లక్ష్మినర్సింహ్మాస్వామి మూలవిరాట్ దర్శనం కలిగేలా పనులు వేగవంతం చేస్తున్నామని వైటీడీఏ వైస్ చైర్మన్ జి.కిషన్‌రావు వెల్లడించారు. ఐఎస్వో సర్టిఫికెట్ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా అందుకోవడం ఒక అద్భుతమైన అనుభవంగా ఆయన అభివర్ణించారు.
సీఎం కేసీఆర్ ప్రత్యేకశ్రద్ద వల్లే సాధ్యమైంది : దేవాదాయశాఖ మంత్రి
యాదాద్రి నిర్మాణం విషయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద వహించడం వల్లనే ఐఎస్వో సర్టిఫికెట్ సాధ్యమైందని దేవాదాయశాఖా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. యాదాద్రిలో నిర్మాణ పనులు జరుగుతున్న తీరు అబ్బురపరుస్తున్నదన్నారు.