భక్తి భావం విరాజిల్లేలా, ప్రకృతి అందాలు ద్విగుణీకృతమయ్యేలా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, ఆహ్లాదపరిచేలా యాదగిరిగుట్ట ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికే వన్నె తెచ్చే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలను చక్కగా తీర్చిదిద్దడం కోసం తయారైన డిజైన్లను ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ఆగస్టు 31న క్యాంపు కార్యాయంలో పరిశీలించారు.
ఆలయ స్థపతి ఆనంద్‌సాయి, ఆర్కిటెక్టు రాజు, జగన్ తదితరులు రూపొందించిన డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రధాన గుట్టపై దాదాపు ఆరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే ప్రధాన దేవాలయ ప్రాంగణం, నాలుగు మాడ వీధులు, నాలుగు రాజ గోపురాలు, కాలి నడక మార్గం, భక్తుల క్యూ కాంప్లెక్సు, బ్రహ్మోత్సవాలు జరిగే ప్రాంతం, ఈశాన్యంలో వచ్చే పుష్కరిణి విస్తరణ, తూర్పున ఉండే శివాలయం, ఆంజనేయస్వామి విగ్రహం, పశ్చిమాన ఉండే ప్రధాన ప్రవేశ ద్వారం తదితర నిర్మాణ డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు.
ఆలయ ప్రాంగణంలోనే నాలుగు వైపుల పాకశాల, అద్దాల మండపం, కళ్యాణ మండపం, యాగశాల నిర్మాణాలకు కూడా డిజైన్లు తయారయ్యాయి. గతంలో నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో, యాదగిరిగుట్టను సందర్శించినప్పుడు పరిశీలించిన సమయంలో ముఖ్యమంత్రి కె.సి.ఆర్ చేసిన సూచనలకు అనుగుణంగా డిజైన్లు రూపొందించనున్నట్లు ఆయ శిల్పులు చెప్పారు. యాదగిరిగుట్ట ప్రధాన ఆలయంతో పాటు చుట్టు పక్కల ఉన్న కొండలు, గుట్టలు, ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడెక్కడ ఏ నిర్మాణాలు రావాలన్న విషయంలో కూడా ఈ సమీక్షలో స్పష్టత వచ్చింది.
ప్రధాన ఆలయంలో భాగంగానే పుష్కరిణి, కళ్యాణ కట్ట, దేవాలయానికి అభిముఖంగా దేవుడి వస్తువులు లభించే షాపులు, మండల దీక్షలు చేసే వారి కోసం వసతి, భక్తులు బస చేయడానికి వీలుగా కాంప్లెక్సు నిర్మించాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రస్తుతం గుహలో కొలువైన లక్ష్మీనరసింహస్వామి మూల విరాట్ యథావిధిగానే ఉండాలని, మిగిలిన ప్రాంతమంతా ఆగమ శాస్త్ర నియమాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఆలయం పవిత్రత దృష్ట్యా ప్రధాన ఆలయం చుట్టూ మాడ వీధులు ఉండాన్నారు. గుట్టపై ఏక కాలంలో 30 వేల మంది భక్తులు కలియ తిరిగినా ఇబ్బంది కలగని విధంగా నిర్మాణాలు ఉండాలన్నారు. భక్తులు సేద తీరడానికి వీలుగా గుట్ట ప్రాంతాన్ని ప్రకృతి రమణీయత ఉట్టిపడే విధంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రధాన గుట్ట చుట్టూ ఉన్న ఇతర గుట్టలను కూడా చక్కగా తయారు చేయాన్నారు.
అతిథి గృహాలు, కాటేజీలు, అందమైన ఉద్యాన వనాలు, విశామైన రోడ్లు, గుట్టపైకి వచ్చి వెళ్ళడానికి వేరు వేరు దారులు ఉండాలన్నారు. గుట్ట కింది భాగంలో 2500 మంది పట్టే విధంగా మంచి కళ్యాణ మంటపం నిర్మించాలన్నారు. యాదగిరిగుట్ట సమీపంలోని బస్వాపూర్ చెరువును పెద్ద రిజర్వాయర్‌గా మారుస్తున్నామన్నారు. రిజర్వాయర్‌కు అనుబంధంగా మైసూర్ బృందావన్ గార్డెన్ తరహాలో థీమ్ పార్క్ నిర్మించాలన్నారు. మొత్తం యాదగిగుట్ట ప్రాంతమంతా భక్తి పారవశ్యం నిండాలని, కుటుంబ సభ్యులతో సహా వచ్చేవారు ఆనందంగా, ఆహ్లాదంగా గడిపే వాతావరణం సృష్టించాలన్నారు. యాదగిరిగుట్ట ప్రాంతమంతా సెంట్రలైజ్‌డ్ మైక్ సిస్టం ఏర్పాటు చేయాని, నిత్యం స్తోత్రాలు వినిపించాలని సీఎం చెప్పారు.
భక్తులకు సరిపడే విధంగా మంచినీటి సరఫరా ఉండాలని, మెరుగైన మురుగునీటి నిర్వహణ ఉండాలన్నారు. యాదగిరిగుట్ట డెవలప్‌మెంట్ అధారిటీ వైస్ ఛైైర్మన్, సిఇఓ జె.కిషన్‌రావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
యాదాద్రికి రూ.5 కోట్ల విరాళం
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రాన్ని ‘యాదాద్రి’ పేరుతో దివ్యధామంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు దాతల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. యాదగిరిగుట్ట అభివృద్ధి పనులలో పాలుపంచుకొనేందుకు తాజాగా రాజు వెగేస్నా ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ఫౌండేషన్ ఛైర్మన్ అనంతకోటి రాజు వెగేస్నా, ట్రస్టీలు ఆనంద్ రాజు, రాజేశ్ తిరుమల రాజు, కరీంనగర్ ఎం.పి బి.వినోద్ కుమార్ సెప్టెంబర్ 6న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావును క్యాంపు కార్యాయంలో కలుసుకొని ఈ మేరకు తమ సుముఖతను వ్యక్తంచేశారు. యాదగిరిగుట్టలో అన్న ప్రసాదం కాంప్లెక్స్ నిర్మాణానికి, రక్షిత మంచినీటి ప్లాంట్ నిర్మాణానికి ఈ ఫౌండేషన్ తరఫున 5 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు వారు ముఖ్యమంత్రి కె.సి.ఆర్ కు హామీ పత్రాన్ని అందచేశారు.
యాదగిరిగుట్టతో పాటుగా ధర్మపురి, భద్రాచలం, బాసర, వేములవాడ, కొమురవెల్లి, బంజారాహిల్స్, కాళేశ్వరం, మహేశ్వరం పిరమిడ్, వరంగల్ భద్రకాళి, జమలాపురం, హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని దేవాయాల్లో మంచినీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి కూడా ఫౌండేషన్ ముందుకు వచ్చింది.
హైదరాబాద్ లోని ఎండోమెంట్ భవన్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, చంచల్ గూడా జైలు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లు, పోలీస్ మెస్, సాలార్ జంగ్ మ్యూజియం, సి.ఐ.డి కార్యాయం, పోలీస్ బెటాలియన్స్ లో కూడా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్టు వారు ముఖ్యమంత్రికి తెలిపారు.
వరంగల్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో కూడా వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు వెగేస్నా ఫౌండేషన్ సుముఖత వ్యక్తంచేసింది.
ఈ ఫౌండేషన్ ఇప్పటికే తిరుమ తిరుపతి దేవస్థానంలో 21 కోట్ల రూపాయల వ్యయంతో అన్నదాన సత్రం, 5 కోట్ల రూపాయలతో జలప్రసాదం, ద్వారకా తిరుమలలో 15 కోట్ల రూపాయల వ్యయంతో హాస్పటల్ ను ఏర్పాటుచేసింది.