ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిలో పర్యటించారు. తొలుత యాదాద్రి చుట్టూ తిరిగి ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రధాన ఆలయమున్న గుట్టపైనా, టెంపుల్ సిటీగా అభివద్ధి చేస్తున్న గుట్టపైనా, ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మిస్తున్న గుట్టపైనా జరుగుతున్న నిర్మాణాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. తర్వాత బాలాలయంలో శ్రీ లక్ష్మీ నర్సింహస్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు లక్ష్మీ నర్సింహచార్యులు ఆధ్వర్యంలో వేద పండితులు ముఖ్యమంత్రికి ఆశీర్వాదం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రధాన దేవాలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ప్రధాన ఆలయం, మంటపం, గర్భగుడి, బాహ్య ప్రాకారాలు, అంతర ప్రకారాలు, మాడవీధులు, రథశాల, వ్రత మంటపం, ధ్వజస్తంభం, ప్రసాదం కౌంటర్లు, శివాలయం పనులను పరిశీలించారు. అధికారులకు, శిల్పులకు తగు సూచనలు చేశారు. ప్రధాన ఆలయమున్న ప్రాంతంలోని 173 ఎకరాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆ తర్వాత టెంపుల్ సిటీగా అభివద్ధి పరుస్తున్న గుట్టను సందర్శించారు. అక్కడి పనులను పరిశీలించారు. రెండు గుట్టలను కవర్ చేస్తూ ఔటర్ రింగు రోడ్డు నిర్మిస్తామని, నిధులు వెంటనే మంజూరు చేస్తామని చెప్పారు. యాదాద్రి దేవాలయం పునర్నిర్మాణ పనులన్నింటినీ సమాంతరంగా చేయాలని చెప్పారు.
వందల ఏళ్ల పాటు నిలిచిపోయే శాశ్వత నిర్మాణం కాబట్టి ఎలాంటి తొందరపాటు, తొట్రుపాటు లేకుండా పనులు చేయాలని, నాణ్యత విషయంలో రాజీపడవద్దని సూచించారు.
అన్నదాన సత్రం కోసం రాజు వెగెస్నా 10 కోట్ల విరాళం:
యాదాద్రిలో అన్నదాన సత్రం నిర్మించడం కోసం హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో పలు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాజు వెగెస్నా ఫౌండేషన్
సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు రూ.10 కోట్ల విరాళం అందించారు. ఫౌండేషన్ అధ్యక్షుడు అనంత కోటి రాజు, కార్యదర్శి ఆనంద రాజుల ఆధ్వర్యంలో యాదాద్రిలో ముఖ్యమంత్రిని కలుసుకున్న సభ్యులు చెక్కు రూపంలో విరాళం అందించారు. అన్నదాన సత్రం నిర్మాణానికి ఇంతకంటే ఎక్కువ వ్యయం అయినా భరిస్తామని వారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. యాదాద్రిలో సత్రాలు, గెస్టు హౌజులు నిర్మించడానికి చాలా మంది దాతలు ముందుకు వస్తున్నారని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటికి 43 మంది దాతలు తలా రూ.2 కోట్లు ఇవ్వడానికి ముందు కొచ్చారన్నారు. వారందరికీ సిఎం ధన్యవాదాలు తెలిపారు.