తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ‘యాదాద్రి’ పేరుతో దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దే పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర తొలి అవతరణోత్సవాలకు కొద్దిరోజుల ముందుగా మే 30వ తేదీన చినజీయర్ స్వామి సమక్షంలో దేవస్థానం అభివృద్ధి పనులకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు శ్రీకారం చుట్టారు.
ముందుగా స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎత్తు పెంచుతూ పునర్నిర్మించనున్న రాజగోపురం, మహాప్రాకారం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పెద్దగుట్ట వద్ద ఏర్పాటుచేసిన శిలాఫకాన్ని ఆవిష్కరించడంతో పనులు ప్రారంభమయ్యాయి. ఆలయ రాజగోపురం పునర్నిర్మాణ కార్యక్రమాన్ని గవర్నర్ దంపతులు ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించగా, అనంతరం ముఖ్యమంత్రి కె.సి.ఆర్, చినజీయర్ స్వామి, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి జ్యోతిప్రజ్వలన కావించారు. అనంతరం రాజగోపుర పునర్నిర్మాణ పనులు ప్రారంభ సూచకంగా శిలాఫకాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం 22 అడుగులు ఎత్తుగల ఆలయ రాజగోపురాన్ని 40 అడుగుల వరకూ ఎత్తు పెంచి నిర్మించనున్నారు. అప్పుడు ఆలయ రాజగోపురం సుదూరంనుంచే భక్తులకు దర్శనమీయనుంది.
రాజగోపురం పనులకు శ్రీకారం చుట్టిన అనంతరం ప్రక్కనేగల పెద్దగుట్టవద్దకు చినజీయర్ స్వామి, ముఖ్యమంత్రి, గవర్నర్ బృందం చేరుకొని మొత్తం 2069 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధిచేయనున్న ‘యాదాద్రి’ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ విస్తీర్ణంలో భక్తుల వసతికోసం కాటేజీలు, వేదపాఠశాల, తదితర అభివృద్ధి కార్యక్రమాలతోపాటు నృసింహ అభయా రణ్యం పేరుతో చక్కటి పూలతోటలు, మొక్కలు పెంచనున్నారు.
అంతకు ముందు, ఆలయ అభివృద్ధికి సంబంధించిన ఫోటోప్రదర్శనను, రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ముఖ్యమంత్రి, చిన జీయరు స్వామి వీక్షించారు. నవగిరులుగా అభివద్ధి చేయనున్న ‘యాదాద్రి’ దివ్య క్షేత్రంలో నాలుగు మాడవీధులతోపాటు, నాలుగు దిక్కులా నాలుగు గోపురాలు వుండే విధంగా ఆలయ పునర్నిర్మాణం జరగనుంది. కల్యాణ మండపం, పాకశాల, యాగశాల తదితర నిర్మాణాలు చేపడతారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ఛైర్మన్‌గా యాదగిరిగుట్ట దేవాలయ ప్రాధికార సంస్థ తొలి సమావేశం కూడా నిర్వహించారు. రెండుమూడేళ్ళలో ‘యాదాద్రి’ అభివృద్ధి పనులు అన్నీ పూర్తికావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.