harishrao2యాసంగి పంటకోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని చెరువుల కింద రైతులకు సాగునీరు ఇవ్వాలని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. నవంబర్‌ 3న సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో మంత్రి హరీశ్‌రావు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఈసారి వర్షాలు సమద్ధిగా కురవడంతో చెరువుల్లో జలకళ ఉట్టిపడుతున్నదని, వాటి నుంచి రైతులకు సాగునీరు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు మంత్రి విజ్ఞప్తి చేశారు. నీటిపారుదల, వ్యవసాయం, ఉద్యానశాఖ, రెవెన్యూ అధికారులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో సమన్వయం సాధిస్తూ యాసంగి పంటకు సాగునీటి ప్రణాళికను సిద్ధం చేయాలని, చెరువుల పరిధిలో సమావేశాలు పెట్టి నీటి లభ్యతపై శాస్త్రీయంగా అంచనా వేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

చెరువులు, ఆయకట్టు మ్యాపింగ్‌

భవిష్యత్‌లో చెరువులు, ఆయకట్టులు కబ్జాలు కాకుండా ఉండేందుకు మ్యాప్‌లు రూపొందించాలని జిల్లా కలెక్టర్లకు మంత్రి సూచించారు. జిల్లాల పునర్విభజన తర్వాత కలెక్టర్లంతా ఉత్సాహంగా, ప్రోయాక్టివ్‌గా పనిచేస్తున్నారని ప్రశంసించారు. సాగునీటి ప్రాజెక్టుల పట్ల రాష్ట్రప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ పట్టుదలగా ఉన్నారని సమావేశంలో మంత్రి హరీశ్‌రావు వివరించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అత్యంత కీలకమైన భూసేకరణకు ప్రతి కలెక్టర్‌ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే రైతులకు జీవో నంబర్‌ 123 కింద పరిహారం ఇవ్వాలని, అలా వీలుకాని పక్షంలో 2013 చట్టం కింద భూసేకరణ జరుపాలని అన్నారు. మధ్యప్రదేశ్‌లో సాగునీటి రంగంలో అమలుచేస్తున్న టేల్‌ టు హెడ్‌ పద్ధతిలో నీటిపంపిణీ జరుగుతుందని, కలెక్టర్లు తమ జిల్లాలోని ఒక ప్రాజెక్టు లేదా ఒక డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ నుంచి ప్రయోగాత్మకంగా ఈ విధానానికి శ్రీకారం చుట్టాలని హరీశ్‌రావు సూచించారు.

నెలాఖరులోగా మిషన్‌ కాకతీయ-3 ప్రతిపాదనలు

కాకతీయ మూడో దశ కోసం ఈ నెలాఖరులోగా ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్లకు మంత్రి సూచించారు. తక్కువ వర్షపాతం నమోదైన మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఎంకే-3 కింద పనులను చేపట్టాలన్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న చెరువులకు మరమ్మతు పనులు చేపట్టాలని, గొలుసుకట్టు చెరువులకు చెందిన ఫీడర్‌ చానళ్లు, డైవర్షన్‌ చానళ్ల పనులను ఎంకే-3 కింద ప్రతిపాదనలు పంపాలని మంత్రి కోరారు. డిసెంబరులో టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి, జనవరిలో కాకతీయ మూడోదశ పనులను ప్రారంభిస్తామని హరీశ్‌రావు తెలిపారు. పనుల తీరును పరిశీలించేందుకు కలెక్టర్లకు వాట్సప్‌ గ్రూప్‌లను ఏర్పాటుచేస్తామని తెలిపారు. భేటీలో జిల్లా కలెక్టర్లు, స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ ఎస్‌కే జోషి, సెక్రెటరీ వికాస్‌రాజ్‌, ఈఎన్సీలు మురళీధర్‌రావు, విజయ్‌ ప్రకాశ్‌, కాడా కమిషనర్‌ డాక్టర్‌ మల్సూర్‌, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే పాల్గొన్నారు.

డిసెంబర్‌లో ‘భక్త రామదాసు’

ఖమ్మం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని డిసెంబర్‌ మొదటివారంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నట్టు భారీనీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు. కొత్తగా చేపడుతున్న కాళేశ్వరం, దేవాదుల, అనంతగిరి, మల్లన్నసాగర్‌, రంగనాయకసాగర్‌, మేడారం, రామడుగు ప్రాజెక్టులకు కావాల్సిన విద్యుత్‌, అందుకు అయ్యే వ్యయంపై కూడా అధికారులతో మంత్రి చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు అవసరమైన విద్యుత్‌ లైన్లు, సబ్‌స్టేషన్ల నిర్మాణం, తదితర అంశాలను అడిగి తెలుసుకొన్నారు.

6,7,8 ప్యాకేజీలతోపాటు మల్లన్నసాగర్‌ వరకు విద్యుత్‌ సరఫరాకు రూ.3300కోట్ల వ్యయం అవుతుందని మంత్రికి విద్యుత్‌ శాఖ అధికారులు వివరించారు. ఇందులో 25 శాతం వ్యయాన్ని ఇరిగేషన్‌శాఖ భరించేలా తగిన చర్యలు తీసుకోవాలని కాళేశ్వరం సీఈ వెంకటేశ్వర్లుకు మంత్రి హరీశ్‌రావు సూచించారు. అనంతగిరి, మల్లన్నసాగర్‌, రంగనాయకసాగర్‌, ఇతర ప్రాజెక్టుల వద్ద సబ్‌స్టేషన్ల నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని ఇరిగేషన్‌శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎండీ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. ప్రాజెక్టులకు కావాల్సిన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.

Other Updates