ktrఅంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణనిస్తే భారతదేశం తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీ రామారావు అన్నారు.. దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత పెద్దసంఖ్యలో ఉన్నప్పటికీ.. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలున్నవారి సంఖ్య తగినంతగా లేదని మంత్రి పేర్కొన్నారు. వారందరికీ సరైన శిక్షణ ఇవ్వటానికి వీలుగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని చెప్పారు. శ్రీలంకలో జరిగిన మానవ వనరుల శిఖరాగ్రసదస్సు-2016లో మంత్రి కేటీఆర్‌ ఆగస్ట్‌ 11న పాల్గొన్నారు. ఈ సదస్సుకు శ్రీలంక ప్రధాని రణిల్‌ విక్రమసింఘేతోపాటు వివిధ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. భారతదేశ ప్రతినిధిగా హాజరైన కేటీఆర్‌.. భవిష్యత్‌ అవసరాలకు తగిన శ్రామికశక్తి- భారత్‌ అనుభవాలు అనే అంశంపై ప్రసంగించారు. ప్రసంగ పాఠం వివరంగా..

భారతదేశంలో అతి చిన్న వయస్సున్న రాష్ట్రం తెలంగాణ నుంచి నేను వచ్చిన విషయం బహుశా మీకు తెలిసే ఉంటుంది. మా రాష్ట్రం ఆవిర్భవించి రెండు సంవత్సరాలు అవుతుంది. అందుకే స్టార్టప్‌ స్టేట్‌గా పిలుస్తున్నాం. ప్రసంగం అంశంలోకి వెళ్లే ముందు మానవ వనరులు, నైపుణ్యశిక్షణలకు సంబంధించి అంతర్జాతీయస్థాయిలో ఉన్న ధోరణులను తెలియజేస్తా. కొత్తగా పని/ ఉద్యోగాల కోసం ప్రతిరోజు సగటున 25వేల మంది శ్రామిక మార్కెట్లోకి వస్తున్నారు. ఇదే పరిస్థితి 2020 వరకూ కొనసాగుతుంది. ఓవైపు మానవ వనరుల ప్రవాహం ఈ విధంగా కొనసాగుతున్నప్పటికీ.. రాబోయే పదేండ్లలో దాదాపు 50 కోట్ల ఉద్యోగాలకు అవసరమైన నిపుణులైన అభ్యర్థులు దొరికే పరిస్థితి ఉండదని తెలుస్తున్నది. అంటే యువతకు నైపుణ్య శిక్షణను ఇవ్వటం ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు.

మా దేశం విషయానికొస్తే.. ప్రపంచంలోనే అత్యధికసంఖ్యలో యువత ఉన్న దేశంగా భారతదేశానికి పేరుంది. దేశ జనాభాలో 54 శాతం మంది 25 ఏండ్లలోపువారే. జనాభాలో 62 శాతం మంది ఏదో ఒక పనిలో ఉన్నారు. వీరిలో 15 నుంచి 59 సంవత్సరాల వయస్సు వారున్నారు. భారతదేశానికి యువత అతిపెద్ద అనుకూలత. అయితే దీనికో పరిమితి ఉంది. ఇంత భారీ సంఖ్యలో యువతీ యువకులు ఉన్నప్పటికీ.. వారిలో ఉపాధి నైపుణ్య శిక్షణ తీసుకున్న వాళ్లు ఎనిమిది శాతం మంది మాత్రమే. బ్రిటన్లో ఇది 68 శాతం, అమెరికాలో 52 శాతంగా నమోదైంది. 2022 నాటికి భారతదేశంలో 70 కోట్ల మంది పనిచేసేవారి జాబితాలోకి చేరబోతున్నారు.

ఇందులో 50 కోట్లమందిని నైపుణ్యం ఉన్న శ్రామికులుగా మార్చాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. దీనికోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఐటీఐల ద్వారా పారిశ్రామిక శిక్షణను ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా యువతకు అందిస్తున్నది. దీనిని మరింత మెరుగుపరుస్తూ.. ప్రపంచ యువత నైపుణ్యదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత ఏడాది జూలైలో జాతీయ నైపుణ్య అభివృద్ధి మిషన్‌ని ప్రారంభించారు. ఇండియాను స్కిల్డ్‌ ఇండియాగా మార్చడమే ధ్యేయంగా ఈ మిషన్‌ కార్యకలాపాలు నడుస్తున్నాయి. యువత నైపుణ్య శిక్షణలో దేశంలోని రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ కొనసాగుతున్నది.

రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సకల సౌకర్యాలు

తెలంగాణరాష్ట్రం భారతదేశంలో 12వ అతిపెద్దరాష్ట్రం. రాష్ట్రంలోని 42 శాతం జనాభా పట్టణాల్లో నివసిస్తున్నది. యువతకు నైపుణ్య శిక్షణను ఇవ్వాల్సిన అవసరాన్ని మా ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే పరిశ్రమలకు అంతరాయం లేని విద్యుత్‌ను అందించగలుగుతున్నాం. రాబోయే మూడుసంవత్సరాల్లో రాష్ట్రంలో 14 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా ప్రణాళికలను రూపొందించాం. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమిని ల్యాండ్‌ బ్యాంక్‌ రూపంలో 1.50 లక్షల ఎకరాలు సిద్ధంగా ఉంచాం.

పరిశ్రమల ఏర్పాటు అనుమతుల జారీకి సరళమైన విధానాన్ని తీసుకొచ్చాం. స్వీయధ్రువీకరణ ద్వారానే అనుమతులను ఇస్తున్నాం. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని 15 రోజుల్లో అనుమతులు పొందే విధంగా సులభతరం చేశాం. 2015 జూన్‌లో టీఎస్‌ఐపాస్‌ పేరుతో నూతన పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించాం. ఇప్పటి వరకు రూ.46వేల కోట్ల పెట్టుబడులతో 2,300 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశాం. వీటి ద్వారా 1.75 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో తయారీ, పారిశ్రామిక రంగాల ప్రగతి 16 శాతంగా నమోదైంది. దీనిని ఇంకా పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాం.

అంతర్జాతీయస్థాయిలో ఫార్మాసిటీ

హైదరాబాద్లో 14వేల ఎకరాల్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేయనున్నాం. బల్క్‌డ్రగ్స్‌ కేంద్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయటం కోసం అంతర్జాతీయస్థాయిలో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నాం. పరిశోధన, అభివృద్ధితోపాటు ఫార్మాయూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం. వరంగల్లో రెండు వేల ఎకరాల్లో టెక్స్‌టైల్‌ పార్కును నిర్మిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఐటీసేవల రంగంలో ముందంజలో ఉంది. ప్రపంచంలోని భారీ ఐటీ కంపెనీలైన యాపిల్‌, ఆమెజాన్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌ లాంటి సంస్థలు అమెరికా తరువాత తమ అతి పెద్ద కార్యాలయాలను హైదరాబాద్‌లోనేే ఏర్పాటు చేస్తున్నాయి. నోవార్టిస్‌ వంటి ప్రతిష్ఠాత్మక కంపెనీ హైదరాబాద్‌లో ఏడు వేల మంది ఉద్యోగులతో తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నది. దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్‌ సెంటర్‌ టీ హబ్‌ను తెలంగాణలో ఏర్పాటుచేశాం. స్టార్టప్‌లకు టీ హబ్‌ ఎంతగానో ఉపయోగపడుతున్నది.

ఐదేండ్లలో పది లక్షల మందికి శిక్షణ

రాబోయే ఐదు సంవత్సరాల్లో పది లక్షల మంది యువతకు ఉపాధికి అవసరమైన నైపుణ్య శిక్షణను ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించాం. ఈ మేరకు విద్యాసంస్థలు, ప్రభుత్వం, పరిశ్రమలకు మధ్య అనుసంధానకర్తగా ఉండటానికి మా ప్రభుత్వం తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌)ను ఏర్పాటు చేసింది. త్వరలో తెలంగాణ స్టేట్‌ స్కిల్స్‌ మిషన్‌ను కూడా నెలకొల్పనున్నాం. దీనిద్వారా.. రాష్ట్రంలో చేపడుతున్న నైపుణ్య శిక్షణ విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకొస్తాం. విద్యార్థులకు చదువుతో పాటు ఇంటర్న్‌షిప్‌ కోర్సును తప్పనిసరి చేయనున్నాం. వృత్తివిద్యా కోర్సులను అందించే కాలేజీలను తప్పనిసరిగా పరిశ్రమలతో అనుసం ధానించాలనే నిబంధన విధిస్తాం. స్టార్టప్‌లను మరింత ప్రోత్సహించటం కోసం రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సర్కిల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (రీచ్‌) ఏర్పాటు చేశాం అని మంత్రి కేటీఆర్‌ వివరించారు.

కేటీఆర్‌ తన పర్యటనలో భాగంగా శ్రీలంకలోని భారత హైకమీషనర్‌ వై కె సిన్హాతో సమావేశం అయ్యారు. శ్రీలంక, తెలంగాణ మధ్య వ్యాపార వాణిజ్య సంబంధాల పెంపును చర్చించారు. కొలంబో, హైదరాబాద్‌ మధ్య నేరుగా విమాన సౌకర్యం గురించి చర్చించారు. శ్రీలంక కంపెనీలతో హెల్త్‌ కేర్‌, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు, టూరిజం రంగాల్లో జాయింట్‌ వెంచర్లు ఏర్పాటు చేసేందుకు సహకరించాలన్నారు. భారత హైకమీషన్‌ నుంచి పూర్తి స్ధాయి సహాయ సహకారానికి హై కమీషనర్‌ హమీ ఇచ్చారు.

కమీషనర్‌ భేటి తర్వాత మంత్రి పలు కంపెనీలతో భేటి అయ్యారు. జాన్‌ కీల్స్‌ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయిన మంత్రి తెలంగాణలోఉన్న అవకాశాలను వివరించారు. జాన్‌ కీల్స్‌ కంపెనీ అత్యధిక ఫుడ్‌ ప్రాసెసింగ్‌, టెక్స్‌ టైల్‌,లాజిస్టిక్స్‌ వ్యాపారాలు ఉన్న ప్రముఖ శ్రీలంక కంపెనీ. తెలంగాణలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌, లాజిస్టిక్స్‌ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

మలేషియా దేశపు పేరక్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జాంబ్రీ అబ్దుల్‌ కదిర్‌ తో కొలంబోలో సమావేశం అయ్యారు. మలేషియా పర్యటన సందర్భగా చర్చించిన పలు అంశాలను మంత్రి కెటి రామారావు జాంబ్రీతో చర్చించారు. శ్రీలంకలో 20 గార్మెంట్‌ ఫ్యాక్టరీలున్న హైద్రమణి కంపెనీ ప్రతినిధులతో మంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న టెక్స్‌ టైల్‌ పార్కులో పెట్టుబడులను పెట్టాల్సిందిగా మంత్రి కెటిఆర్‌ కోరారు.

Other Updates