వ్యవసాయం వైపు యువతను ఆకర్షింపజేయడానికి ఆ రంగాన్ని లాభసాటిగా మార్చాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్‌ ఆడిటోరియంలో జరిగిన ‘యూత్‌ యాజ్‌ టార్చ్‌ బేరర్స్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఓరియెంటెడ్‌ అగ్రికల్చర్‌ ఇన్‌ సౌత్‌ ఇండియా’ వర్క్‌షాప్‌ ముగింపు సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

భవిష్యత్తులో వ్యవసాయంలో తెలంగాణ ప్రధాన రాష్ట్రంగా మారనుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి నదులు పారుతున్నా, మంచి సారవంతమైన నేలలున్నా కూడా తెలంగాణ వ్యవసాయంలో చాలా నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. అందుకే ప్రోఫెసర్‌ జయశంకర్‌ వంటి మేధావులు నీళ్ళు, నిధులు, నియామకాలు ప్రధాన నినాదాలుగా 14 ఏళ్ళు పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ సాధించారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయమే ప్రధాన అజెండాగా అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. కృష్ణా, గోదావరి నదులపై అనేక ఎత్తిపోతల పథకాలు ప్రారంభించారని, మిషన్‌ కాకతీయ ద్వారా చిన్ననీటి వనరులు పునరుద్ధరించగ లిగారని ఆయన పేర్కొన్నారు. ముందు ముందు తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. అప్పుడు వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సమస్యగా మారుతుందని అన్నారు. ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి వర్క్‌షాపులు రాష్ట్ర, జిల్లా స్థాయివరకు నిర్వహించడం ద్వారా యువతని వ్యవసాయం, వాల్యూఎడిషన్‌, ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌ల వైపు ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేయాలని వినోద్‌కుమార్‌ సూచించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి మాట్లాడుతూ తెలంగాణలో సాగునీటి సౌకర్యాల కల్పన, వాతావరణ అనుకూల పరిస్థితుల వల్ల వరి ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని అన్నారు. వ్యవసాయ డిగ్రీ తీసుకున్న యువకులు ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మారాలని సూచించారు. టిహబ్‌ మాదిరిగానే పిజెటిఎస్‌ఎయు కూడా అగ్రిహబ్‌గా ఏర్పాటు చేయాలని సూచించారు. సరైన ఇన్‌పుట్స్‌ అందించడం, ఉత్పత్తి వ్యయం తగ్గించడం, ఉత్పత్తి, ఉత్పాదకత పెంచడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా చేయవచ్చని జోషి అన్నారు.

ఒకప్పుడు పేదవాడి ఆహారం అయిన కొర్రలు, సజ్జలు వంటి చిరుధాన్యాలు నేడు ధనవంతుల ఆహారంగా మారాయని తెలంగాణ నాబర్డ్‌ ఛీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ విజయ్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. మారుతున్న వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌ జరగాలని ఆయన సూచించారు. ఈ రంగాల్లో నాబర్డ్‌ గ్రామీణ, వ్యవసాయ యువతకి అధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు.

యువత పెద్ద సంఖ్యలో ఉండడం భారతదేశానికి ఒక మంచి అవకాశమని ట్రస్ట్‌ ఫర్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌ ఛైర్మన్‌ పరోడా అన్నారు. తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలు రైతు అభ్యున్నతికి మంచి చర్యలు చేపట్టాయన్నారు. రైతు కేంద్ర బిందువుగా విధాన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు. వ్యవసాయ విద్యని పాఠశాల స్థాయినుంచే బోధించాలన్నారు. స్వల్పకాలిక ఒకేషనల్‌ కోర్సులు ప్రారంభించాలన్నారు. మిషన్‌ ఆన్‌ యూత్‌ ఇన్‌ అగ్రికల్చర్‌ ఏర్పాటు చేయాలని పరోడా సూచించారు. ఈ రెండురోజుల సదస్సులో అనేక మంచి చర్చలు, ఉపయోగకరమైన సూచనలు వచ్చాయని పిజెటిఎస్‌ఎయు ఉపకులపతి డాక్టర్‌ వి. ప్రవీణ్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా వర్క్‌షాపులో మంచి ఆలోచనలు కనపరచిన వారికి మొదటి, రెండు బహుమతులు, మూడు కన్సోలేషన్‌ బహుమతులు అందచేశారు.

ఈ కార్యక్రమంలో ఇతర దక్షిణాది రాష్ట్రాల వర్సిటీల వైస్‌ఛాన్స్‌లర్లు, మాజీ వైస్‌ ఛాన్స్‌లర్లు, ఐసిఏఆర్‌ సంస్థల డైరెక్టర్లు, శాస్త్రవేత్తలు, బ్యాంక్‌ల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Other Updates