యెల్ది-మాణిక్యాల-వెలుగులుసంస్కృతకవి భర్తృహరి సుభాషితాలను ఏనుగు లక్ష్మణకవి సుభాషిత రత్నాలుగా మలిచి తెలుగు వారికందించారు. ఆ తోవలోవి కాకున్నా ఆ కోవకే చెందినవి యెల్ది మాణిక్యాలు. ఇందులో యెల్ది సుదర్శన్‌ తన జీవితానుభవాల నుంచి ఏర్చికూర్చిన 108 ముక్తక మాణిక్యాలున్నాయి. వృత్తిరీత్యా ముంబాయిలో త్యాలు,రత్నాలు,మాణిక్యాల వ్యాపారం చేసే ప్రవాస తెలంగాణీయుడు సుదర్శన్‌.అయితే ప్రవృత్తిలోనూ తన వృత్తి ధర్మాన్ని ప్రతిబింబిస్తూ యెల్ది రత్నాలు, యెల్దిముత్యాలు, యెల్ది పగడాలు వంటి పేర్లతో ఇంతకు పూర్వం ఐదు కవితా సంకలనాలు అందించారు. ఇవి యెల్ది మాణిక్యాలు అనే మినీకవితలు. ఇవి నిజంగా మట్టిలో వెతికి పట్టినవే. చేతుల్లో పుస్తకాలను చూసిరాసినవి కావు. చేతల్లో.. లోకాన్ని కాచి వడబోసిన అనుభవాల నుంచి తీసి రాసినవి.

అతి సర్వత్ర వర్జయేత్‌ అన్నది ఆర్యోక్తి. అది అతని ఆనుభవిక దృష్టిలో ఇట్లా మాణిక్యమై మెరిసింది. జీవిత రహస్యం ఇదే / ‘‘అతి’’ అయినా నష్టం చేస్తుంది / ‘‘మితం’’ అయితే కష్టం కలిగిస్తుంది / ‘‘జాగ్రత్త’’ సంతోషాన్నిస్తుంది అంటూ ఏ విషయంలోనైనా జాగ్రత్తనే ప్రధానమని చెబుతారు. మంచి జ్ఞాపకాలను, నేస్తాలను మరువొద్దు అన్నమాట చెప్పీచెప్పక మనలో ఉన్న మంచి జ్ఞాపకాలు / మన నేస్తాలు / వాటిని నెమరువేసుకుంటూ / ముందుకు సాగిపో అని వాటివల్ల ప్రగతిదాయకమైన ప్రయోజనం ఉందని వెల్లడిస్తారు. పోరాడితే పోయేదేం లేదు బానిస సంకెళ్లు తప్పఅన్న ఉద్యమాల ఉధృతిలో పుట్టిన నినాదాన్ని కాదనరు. కాని అనుమానాలు అంతకంటే భయంకరమని బానిస సంకెళ్లు / వదులుకోవచ్చేమో కాని / అనుమానాల సంకెళ్లతో / బానిసలవ్వడం ఖాయం అంటారు. ధన సంపాదనకు ధర్మమే ప్రధానమన్న విషయాన్ని డబ్బు వెనుక పరుగులు పెడుతున్న లోకాన్ని చూపిస్తూ ఇట్లా చెబుతారు. గల్ఫ్‌ డబ్బులతో గతితప్పిన పల్లెలలో / ప్రశాంతతేది / సాంకేతిక డబ్బులతో శృతి తప్పిన పట్టణాలలో / మానవసంబంధా లెక్కడ. ఇదీ వీరి కలంనేత్రానికి ఉన్న సుదర్శన శక్తి. మనచుట్టూ మనకు నిత్యం అగుపడే విషయాలనే వీరు సరికొత్తగా చూస్తారు.

కావ్యారంభంలోని ఒక్కో మినీకవితలో చెట్టు, కొవ్వొత్తి, పండుటాకు, ఏరు, పువ్వులకు నమస్కరించారు. అడ్డుపడే రాళ్లురప్పలు కష్టాలుగా, హాయికలిగించే పల్లాలు సుఖాలుగా సాగిపోయే ఏరు వీరికి ఆదర్శమైంది. అందుకే కష్టసుఖాలకు చలించక / గలగల పారుతున్న / ఏరుకు / వందనం వందనం అని మొక్కారు.
శరీరానికి గాయమైతే / రక్తం వస్తుంది / హృదయానికి గాయమైతే / కన్నీళ్లొస్తాయి అంటూ వీరు కన్నీటికి భాష్యం చెప్పిన తీరు అమోఘం. ఇట్లా తేలికైన మాటలతో బరువైన భావాలను మోయించగల నైపుణ్యం వీరి సొంతం.ఆయన అందించిన మాణిక్యాలు నిక్కమైనవి. శుద్ధమైనవి. వాటి ప్రకాశం అంతటా ప్రసరించాలి. ప్రతిఫలించాలి.

Other Updates