డా. లక్ష్మణ చక్రవర్తి
మూడాశ్వాసాల ప్రంబంధం. ఆరువందల పద్యగద్యలతో కూడిన చంపూ ప్రబంధం. ప్రబంధ లక్షణాలననుసరిస్తూ భాగవత పారమ్యాన్ని వివరించే రచన. ”హరివంశాంతర స్థిత ఆశ్చర్య పర్వంబునందలి శేషధర్మంబుల విశేషంబులు శ్రవణానందులై వినుచుండ” అన్న వచనాన్ననుసరించి హరివంశంలోని యోగభూషణుని కథ ఈ ప్రబంధానికి మూలం అని తెలుస్తుంది. రచయిత ఠంయాల లక్ష్మీనరసింహాచార్యులు ఈప్రబంధాన్ని వేల్పుగొండ లక్ష్మీనృసింహునికి అంకితమిచ్చారు. క్రీ.శ. 1913 నాటి రచన (1835 శాలివాహన శకం).

అవతారిక విశేషాలు:

ఇష్టదేవతా స్తుతి, ఆయుధస్తుతి తరువాత ఆచార్య పరంపరను స్తుతించారు. సంస్కృతాంధ్ర కవివర్గాన్ని సంబోధించారు. కుకవులను ఈగలతో పోల్చి, వారు దుర్గంధాలనే ఆశిస్తారన్నారు. భగవత్‌ పారమ్యాన్ని భక్తుని చరిత్ర ద్వారా ఠంయాలవారు బోధించారు. నిజానికి ఈ రచనను చూసినప్పుడు భగవత్‌ పారమ్య రచనా? భాగవత పారమ్య రచనా? ఆచార్య పారమ్య రచనా? అన్న సందేహం కలుగుతుంది. భాగవత మిషగా భగవత్‌ పారమ్యం ఆ పారమ్యాన్ని నారదుడి ద్వారా బోధించడం వల్ల ఆచార్య ఆవశ్యకత తెలుస్తాయి. కాగా ఈ ప్రబంధం భగవత్‌, భాగవత, ఆచార్య పారమ్యాన్ని చెప్పే రచన.

కథా సంగ్రహం

”యోగభూషణుండు యోగ్య తపస్వియై / పేదతనముబోవ పేర్మి హరి కృ
పాధి పాత్రుడగుచు పరమును గోరక / సిరుల నేలగోరె చెప్పుమయ్య”

అన్న పద్యం కథలోని సమస్య. ఆ సమస్యకు జవాబును చెప్పడమే ప్రబంధ కథా నిర్మాణానికి దారితీసింది. యోగభూషణుడనే భాగవతుని కథ. భార్యాపిల్లలతో కర్మమార్గంలో నడుస్తూనే జ్ఞానమార్గంలో కృషిచేస్తుంటాడు యోగభూషణుడు. అయితే దారిద్య్రబాధను తట్టుకోలేక భార్య ధనం తీసుకురమ్మని చెబుతుంది. ఎవరిని యాచించాలో తెలియక తాను నమ్మిన శ్రీమన్నారాయణుడినే యాచించాలని తపస్సు చేస్తాడు. నారాయణుడు ప్రత్యక్షమై వరాలు ఇస్తాడు. యోగభూషణుడు ధనవంతుడవుతాడు. ఎంత ధనవంతుడైనా భగవన్నామస్మరణమే జీవితంగా ఉంటాడు. యోగభూషణుని భార్య అతిథులను అవమానించడంతో నారాయణానుగ్రహప్రాప్తి తగ్గి ధనధాన్యమంతా నాశనం అవుతుంది. మళ్ళీ తపస్సు చేసి, నాశనమైన సంపదను సంపాదించి, నిరంతరం అతిథుల, ఆచార్యుల, భాగవతోత్తముల సేవ చేస్తూ జీవితాన్ని సాగిస్తాడు.

కావ్య విశేషాలు

తెలుగు సాహిత్యలోకంలో విశిష్టాద్వైత వాఙ్మయం విస్తృతంగానే ఉంది. ఠంయాలవారి వంటి కవుల రచనలు ప్రచురితమైతే ఈ పద్ధతిలో వచ్చిన సాహిత్యం మరింత పరిపుష్టమవుతుంది. ఠంయాలవారి మిగతా రెండు ప్రబంధాలకంటే ఈ రచన విశిష్టాద్వైత సంప్రదాయాన్ని మరింత ఎక్కువగా ప్రచారం చేసిందని చెప్పాలి.

యోగభూషణోపాఖ్యానం కథాపరంగా చూసినప్పుడు దాన మాహాత్మ్యాన్ని వివరిస్తుంది. విశిష్టాద్వైత తాత్త్వికతను భూమికగా చేసుకున్నప్పుడు జీవుడు కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి మార్గాలలో ఈశ్వరుడిని చేరే క్రమం కనిపిస్తుంది. దీనిని కథాగమనానికి అన్వయించి చూసుకున్నప్పుడు ఈ క్రింది క్రమంలో చెప్పవచ్చు.

1) యోగభూషణుడు సంసారంలోఉంటూ నిత్యకర్మా నుష్ఠియై ఉండడం – కర్మ.

2) సంసారంలో ఉంటూనే ఆచార్యుల శ్రీసూక్తిని వింటూ ఉండడం – జ్ఞాన.

3) తన మనసులో భగవంతునియెడల భక్తిని నిలిపి ఉంచడం – భక్తి.

4) చివరికి ఆచార్యకైంకర్యం చేసి మోక్షోపాయంగా ప్రపత్తిని మార్గంగా గుర్తించడం. ఈ చివరి అవస్థ యోగభూషణునిలో మొదటినుంచి ఉన్నట్లున్నా చివరికి ఆచార్యాభిమాన ప్రకటనంతో పతాకస్థాయిని చేరుతుంది – ప్రపత్తి.

పాత్రచిత్రణ పరంగా కావ్యాన్ని అనుశీలించినప్పుడు ఈ క్రమాన్ని కావ్యంలో మనం చూడవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే విష్ణుమార్గాన్ని జీవుడు అనుసరించడానికి అవసరమైన జ్ఞానాన్ని యోగభూషణ కావ్యం అందిస్తుంది. ఈ జ్ఞానాన్ని అందించడంలో ఈ క్రింది అంశాలు ఈ రచనలో ప్రధానంగా ప్రసక్తమైనాయి.

1) అష్టాక్షరీ మాహాత్మ్యం – నారాయణ పారమ్యం; 2) భాగవత మాహాత్మ్యం; 3) దాన మాహాత్మ్యం – తదీయారాధన విశిష్టత; 4) అర్థపంచకం – వివరణ ; 5) అర్చిరాది మార్గం – వివరణ ; 6) ఆచార్యాభిమానం.

1)అష్టాక్షరీ మాహాత్మ్యం – నారాయణపారమ్యం

శ్రీమన్నారాయణుడే మోక్షప్రదాత, పరతత్త్వం. అందుకే ‘ఏకో నారాయణో హరిః’ అని ఆచార్యుల వాక్కు. అతడిని ఉపాసించడమే, అతనిని శరణువేడడమే జీవుని కర్తవ్యం. యోగభూషణుడు శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు చేేస్తున్న సందర్భంలో అతని తపస్సు అగ్నిగా మారి ఇంద్రాది లోకాలను చుట్టుముట్టింది. ఇంద్రుడు ఈ మంటలెక్కడివని అడిగినప్పుడు బృహస్పతి జవాబు చెప్పే ఘట్టమంతా అష్టాక్షరీ పారమ్యాన్ని, నారాయణ పరతత్వాన్ని, భాగవత మాహాత్మ్యాన్ని వివరిస్తాయి. ఈ కావ్యంలో సంస్కృత స్తోత్ర వాఙ్మయాన్ని అనుసరిస్తూ ”అద్యక్షరాష్టాక్షరీ గ్రథితస్తుతి” ఉంది. మంత్రరాజపద స్తోత్రం, సుదర్శనషట్కం పద్ధతిలో అష్టాక్షరీ మంత్రంలోని మొదటి అక్షరాలను గ్రథిస్తూ సాగిన ఎనిమిది పద్యాలు సందర్భానుగుణంగా అష్టాక్షరీ విశిష్టతను వివరిస్తున్నాయి. ప్రాచీనాంధ్ర కవిత్వంలో స్తుతిరూప పద్యాలు కనిపిస్తాయి గానీ ఈ విధమైన అక్షరనియమంతో, మంత్రప్రాధాన్యాన్ని చెబుతూ వివరించేవి చాలా తక్కువేనని చెప్పాలి.

2) భాగవత మాహాత్మ్యం

యోగభూషణుని కథ పరమభాగవతుని కథ. అందువల్ల మిగతా అంశాలకంటే భాగవత మాహాత్మ్యకథనం ఎక్కువగా కనిపిస్తుంది. ఇంద్రుడికి బృహస్పతి యోగభూషణుని మాహాత్మ్యాన్నిచెప్పే సందర్భంలోనూ, యోగభూషణుడు తన భార్యకు భాగవతులను గూర్చి వివరించే సందర్భంలోనూ, భాగవత విశిష్టతను ఠంయాలవారు వర్ణించారు. నిజానికి యోగభూషణ ప్రబంధమంతా అంతర్లీనంగా భాగవత సేవనే ప్రబోధిస్తుంది.

”అఖిలమైన దేవతారాధనలకంటె / పరము విష్ణ్వర్చనంబు సంపత్కరంబు
దానికన్న యెక్కువైనది భాగవ / తార్చనం బటందురాగమోక్తి”

భాగవత సేవయే భగవత్‌ సేవ. అందుకే మిగతా సంప్రదాయాలలో అంత ఎక్కువగా లేని ‘భాగవత కైంకర్యం’ ఇక్కడ ఉండడం ఈ వైష్ణవ సంప్రదాయ ప్రాధాన్యాన్ని సూచిస్తుంది. ఆళ్వారులను, ఆచార్యులను గూర్చి వచ్చిన సాహిత్యమంతా ఒక పద్ధతిలో భాగవత సేవగానే చెప్పాలి. అటువంటి భాగవతులు మోక్షార్థ వ్యాపకులు.

”శ్రీపతి దర్శనమును సంస్థాపించుచు సకలజన వితతికి ప్రాప్య
ప్రాపకులై మోక్షార్థ వ్యాపకులై సంచరించు రచలాంతముగన్‌”

మోక్షార్థ వ్యాపకులంటే ఆచార్యులనే అర్థం. ఉత్తమ భాగవతుడే ఆచార్యస్థానాన్ని అలంకరించగలడు. భాగవతధర్మాలు అనేకం ఉన్నాయి. అందులో యోగభూషణుడు కొన్నింటిని అనుసరించి తర్వాతి వారికి మార్గదర్శకుడైనాడు.

3) దానమాహాత్మ్యం – తదీయారాధన :

యోగభూషణోపాఖ్యాన ప్రబంధ పరమార్థం దాన విశిష్టతను వివరించడమే. ఆ దానగుణంలో ‘తదీయారాధన’ ఒక భాగం. తదీయులంటే తస్య+ఇమే=తదీయాః. భగవంతుడు ‘వీరు నావారని’ ఎవరిని అభిమానిస్తాడో అటువంటి వైష్ణవాగ్రేసరులు తదీయులు. వారి ఆరాధన అంటే వారికి తృప్తిని కలుగజేసి వారి శ్రీముఖాలను వికసింపజేసే వ్యాపారం. యోగభూషణుని అతిథి, అభ్యాగతుల సేవలో ఈ తత్త్వం కనిపిస్తుంది. బ్రాహ్మణ స్వరూపులైనవారిని దేవతలుగా చెప్పడంలో భాగవతోత్తములనే దృష్టిలో ఉంచుకున్నాడని చెప్పాలి.

”వర్ణినాం చ యతీనాం చ పరిచర్యా పరాశ్చయే |
పరనిన్దామకుర్వాణాః తేవై భాగవతోత్తమాః ||”

సాధువులకు, యతీశ్వరులకు పరిచర్యలు చేయడంలో ఆసక్తిని కనబరచేవారు, పరనింద చేయనివారు భాగవతోత్తములు. ఈ లక్షణం యోగభూషణోపాఖ్యాన ప్రబంధ మంతటా వ్యాపించి ఉంది. తన భార్య పరనింద చేయడంవల్లనే ధనధాన్యాలు నశించాయి. అందువల్ల పరనింద చేయడం భాగవతోత్తమ లక్షణం కాదన్న స్ఫురణను తదీయుల ఆరాధనలో భాగంగా యోగభూషణోపాఖ్యానం చెబుతుంది.

యోగభూషణోపాఖ్యానంలో దశదానాలు, షోడశదానాల ప్రస్తావనను ఠంయాలవారు చేశారు. యోగభూషణుడు తన భార్యకు దానమహిమను వివరించే సందర్భంలో దానానికి దానం, భోగం, నాశనం అన్న మూడు గతులున్నాయని చెబుతాడు.

”అవల దానము భోగము నాశనమను
మూడు గతులునుమరి ధనంబునకు జెల్లు
దానమును భోగమును లేనివాని ధనము
నకు తృతీయమె జెల్లు ననంగ వినమె”

అన్నపద్యం ధనానికి పరమార్థం దానమేనన్న సత్యాన్ని చెబుతుంది. యోగభూషణోపాఖ్యాన ఫలశ్రుతిలో కూడ కవి భూదాన మాహాత్మ్యాన్నే ప్రస్తావించారు.

”భూదానమున గల భూరి ఫలంబును
వచియింప శేషుని వశముగాదు
వరుస భూదాన ప్రభావము సర్వంబె
రిగించితిని మీకు మంగళావహ”

మన్న (సీస) పద్యం ఈ అంశాన్ని నిరూపిస్తుంది. భీమఖండం, కాశీఖండాల్లో కూడా భూదానమన్నది ప్రధానమన్న విషయం ప్రసక్తమైంది. ‘భూమి’ పునఃసృష్టి కలది. నిరంతర జీవనానికి ఆధారమైనది. అదీగాక అది ఇచ్చే పంటరూపమైన ధాన్యం ఇహలోకంలో జీవుని పోషణకు, తదీయులైన ఆచార్యుల సేవకు ఉపయోగిస్తుంది. బహుశా యోగభూషణుడు ధనాపేక్ష చేయడంలో ఈ ‘తదీయారాధన’ అంతరార్థంగా నిలిచిందని చెప్పవచ్చు. భూదానం వలన ప్రతి పంటకు పుణ్యం పెరుగుతుందన్నది పౌరాణికులు పెద్దలు భావిస్తారు. అనేక దేవాలయాలకు భూములు దానం చేయడంలో, చేయించడంలో నిరంతర పుణ్యఫలప్రదమైనది భూదాన మన్న స్పృహ ఉందని చెప్పవచ్చు.

4) అర్థపంచకం-వివరణ :

యోగభూషణోపాఖ్యానంలోని మూడవ ఆశ్వాసంలో నారదుడు యోగభూషణునికి ‘అర్థపంచకం’ బోధిస్తాడు. అష్టాదశ రహస్యాలలో అర్థపంచకం ఒకటి.

”ప్రాప్యస్య బ్రహ్మణోరూపం ప్రాప్తుశ్చ ప్రత్యగాత్మనః
ప్రాప్త్యుపాయం ఫలం ప్రాప్తేః తథా ప్రాప్తి విరోధి చ|
వదన్తి సకల వేదాస్యేతిహాస పురాణకాః
మునయశ్చ మహాత్మనః వేద వేదాన్తపారగాః ||”

1) పరమపురుషుని స్వరూప జ్ఞానం; 2) జీవస్వరూప జ్ఞానం; 3) జీవుడు పరమాత్మను పొందడానికి అవసరమయ్యే ఉపాయ జ్ఞానం; 4) అట్లా పొందడం వల్ల లభించే ఆనందజ్ఞానం; 5) దానిని చేరుకోనివ్వకుండా అడ్డుతగిలే సంసారం లేదా పుణ్య పాప జ్ఞానం – వీటిని అర్థపంచకం బోధిస్తుంది. ఈ ఐదు మరో ఐదు రకాలుగా ఉంటుంది. వీటన్నిటిని యోగభూషణోపాఖ్యానంలో ఠంయాలవారు వివరించారు. యోగభూషణంలోని ఈ ఘట్టం జీవుడు పరమాత్మను చేరేందుకు అవసరమైన జ్ఞానాన్ని అందిస్తుంది.

5) అర్చిరాది మార్గం :

జీవాత్మ పరమాత్మను చేరే మార్గ వివరణమే విశిష్టాద్వైతంలో అర్చిరాదిగా భావించబడుతుంది. అష్టాదశ రహస్యగ్రంథంలో ఇది కూడా ఒక భాగం. పరమార్థ శ్లోకద్వయం (అర్చిరాది)గా చెప్పబడే ‘సత్సంగాద్భవ నిస్పృ¬’, ‘ముక్తోర్చిర్దిన పూర్వపక్ష షడుదఙ్మాసాబ్ద’ అన్న శ్లోకాల వ్యాఖ్యానంలా సాగినవి పరమపద ప్రాప్తిలోని పద్యాలు. సామవేదంలోని సారంగా, భగవద్విషయంగా భావించబడే శఠకోపుల తిరువాయ్‌మొళిలోని 10వ పత్తులో చివరి రెండు దశకాలు ముక్తాత్మ పరమపదం చేరే మార్గంలో జరిగే విశేషాలను చెబుతాయి. అదే క్రమాన్ని ఠంయాలవారు ఈ సందర్భంలో అనుసరించారు. ఈ పద్యాలను మాత్రమే ప్రత్యేకంగా గ్రహించి చూస్తే అర్చిరాది మార్గాన్ని బోధించే ఒక సంప్రదాయ గ్రంథం అవుతుంది.

6) ఆచార్యాభిమానం

జీవుడు పరమాత్మను చేరే మార్గాన్ని బోధించేవాడు ఆచార్యుడు. అర్థపంచ కంలోని ఉపాయ స్వరూపంలో చివరిది ఆచార్యాభిమానమే. అర్చిరాది మార్గంలో భగవత్‌ శరణాగతి చేయడానికి అవసరమైన మార్గాన్ని బోధించేవాడు ఆచార్యుడే. అందువల్ల శ్రీమన్నారాయణుని చేరే మార్గం ఆచార్యనిష్ఠవలన మాత్రమే లభిస్తుంది. ఆ తత్త్వం యోగభూషణోపాఖ్యానంలో అక్కడక్కడ కనిపిస్తుంది. యోగభూషణుడు భాగవతుల యెడల ఆచార్యులయెడల ప్రదర్శించే భక్తిప్రపత్తులు, నారదుడి బోధన సందర్భంలో వివరించిన అంశాలు ఇవన్నీ ఆచార్యాభిమానాన్ని ప్రకటిస్తాయి. వరవరమునుల ఉపదేశరత్నమాలలోను, శ్రీవచనభూషణంలోను చివరిగా ఆచార్యాభిమాన ప్రకటన కనిపిస్తుంది. ఈ అంశం ప్రాధాన్యాన్ని చెప్పడానికని పెద్దల అభిప్రాయం. యోగభూషణోపాఖ్యానంలో కూడా ఈ అంశం చివరగా చెప్పడం వలన ఆచార్యాభిమానమే అంతిమోపాయమని తెలుస్తుంది.

మొత్తం మీద యోగభూషణోపాఖ్యానాన్ని గమనించినపుడు భగవత్‌, భాగవత, ఆచార్యమాహాత్మ్యాలను అంతర్లీనంగా, భూదాన మాహాత్మ్యాన్ని ప్రధానంగా చెప్పడానికి రచించినట్లు తెలుస్తుంది.

అనుకరణ – అనుసరణ

పూర్వాచార్యుల శ్లోకాలను ప్రాచీనాంధ్ర కవులను అనుసరించిన ఘట్టాలు కొన్ని ఈ మూడు ప్రబంధాలలో ఉన్నాయి. ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసాలలో ‘వ్యుత్పత్తి’ శాస్త్ర సాహిత్యాల అధ్యయన గాఢతను చెప్పేదే. ప్రాచీన సాహిత్యం, శాస్త్ర రచనలు, సాహిత్యేతర శాస్త్రాలు, వైష్ణవ సంప్రదాయ రహస్య గ్రంథాలను ఠంయాల వారు అధ్యయనం చేశారనడానికి ఈ ప్రబంధాల్లో ఆయా సందర్భాలలో వారు వ్రాసిన పద్యాలు ఉదాహరణలుగా నిలుస్తాయి. కొన్ని సందర్భాలలో సంస్కృత పదబంధాన్ని, శ్లోక పాదాన్ని యథాతథంగా ఇమడ్చడం కూడా వీరి రచనల్లో ఉంది.

”దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతమ్‌ |
తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవతా ||”

అన్న శ్లోక అనువాదం భాగవతోత్తమ మహిమ చెప్పే సందర్భంలోనిది.

”మానుగ జగతియు దేవాధీనము
తద్దేవతయు విధిగ తిరుమంత్రా
ధీనము తన్మనువు ద్విజాధీనము
తద్బ్రాహ్మణుండు దేవతనాకున్‌” (3-32)

ఇదేవిధంగా కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ అన్న శ్లోక అనువాదం కూడా ఠంయాలవారు చేశారు (చూ. 3-23)

నిర్వచనశుభాంగీ కళ్యాణంలో ఆంధ్ర భాగవత గజేంద్రమోక్షంలోని అడిగెదనని కడువడి జను పద్యం పోలికతో ఒక పద్యం ఉంది.

”వెడవెడ విడివడి యడుగులు
కడువడి తడబడగ నగచి కడుయెడనడరన్‌
బడుగు నడు మడరి వడవడ
వడకగ చెరలియడవి జడుపు బడక బడిబడిన్‌”

అదేవిధంగా పెద్దన మనుచరిత్రలోని ఎవ్వతె నీవు భీతహరిణేక్షణ పద్యం పోలికతో –

”ఎవ్వతె వీవు చారు వనజేక్షణ యీ వనభూమిలోన యే
జవ్వని లేక నొంటరిగ సారెకు ద్రిమ్మరుటేల నీవు నిం
దెవ్వని దేశమందునికి యేర్పడు నీ తలి దండ్రి నీ
మవ్వపు పేరు నిన్గొనిన మాన్యుని పేరు వచింపవే దయన్‌”

ఈవిధంగా అక్కడక్కడ పూర్వాచార్యుల, కవుల అనుసరణలు కవికున్న ప్రాచీన సాహిత్య, శాస్త్రరంగాల పరిజ్ఞానాన్ని తెలుపుతాయి.

భాషావిశేషాలు :

ఠంయాలవారి రచనలు చాలా వరకు పద్యకావ్యాలు కావడం చేత భాష విషయంలో ప్రాంతీయత అంతగా కనిపించదు. పద్యకావ్యభాష అంతా ఒకే పద్ధతిలో ఉండడం, దానిని అనుసరించడం వలన భాష విషయంలో వీరు అంత స్వాతంత్య్రాన్ని ప్రదర్శించ లేదు. స్వయంగా తెలంగాణాకు సంబంధించిన వారు కావడం చేత, వైష్ణవ కుటుంబంలో జన్మించడం చేత ఈ రెండు అంశాలకు సంబంధించిన పదాలు వారి రచనలో ఉన్నాయి.

సెబాసు, లగ్గ, బరాబరు, అన్నెం, పున్నెం వంటి తెలంగాణా పదాలు తైరు, సాదం, తళియ, తిరుమణి వంటి వైష్ణవ పరిభాషా శబ్దాలు అక్కడక్కడ కన్పిస్తాయి.

ఠంయాలవారు రచించిన అనేక రచనలలో ఈ మూడు ప్రబంధాలు విశిష్టమైనవి. ఠంయాలవారి ఈ మూడు ప్రబంధాలను గమనించినప్పుడు ఆ రచనలు ఏవిధమైన లక్ష్యంతో రచించినా, అందులో కొంత విశిష్టాద్వైత అంశాలను వివరించడం కనిపిస్తుంది. శృంగార రస ప్రబంధం దాంపత్యనిష్ఠను, ప్రచండ పరశురామం ధార్మికనిష్ఠను ధర్మరక్షణను, యోగ భూషణో పాఖ్యానం భాగవతనిష్ఠను ప్రకటి స్తాయి. ఠంయాలవారు ప్రచండ పరశురామం, యోగభూషణో పాఖ్యానాల్లో ఈశ్వర ప్రకరణ వివరణ, అర్థపంచకం, అర్చిరాది మార్గాలను అంత విపులంగా వర్ణించడానికి ఒక కారణం తోస్తుంది. వారి ఈ రచనలు 20వ శతాబ్దపు ప్రథమార్ధంలో వచ్చాయి. ఆ రోజులలో చాలా మంది వైష్ణవులకు తమిళభాషతో పరిచయముం డేది. కానీ కొందరికి లిపి చదవడానికి వచ్చేది కాదు. రామానుజ పత్రిక నడిపిన శ్రీ ఉ.వే. శ్రీమాన్‌ ప్రతివాది భయంకరం అణ్ణంగరా చార్యుల వారు లిపి తర్జుమా చేసి పుస్తకాలు ప్రచురించేవారు. అదే సమయంలో ‘వైష్ణవ పత్రిక’ ఒకటి పెంటపాడు నుంచి వెలువడేది. దీని స్థాపకులు శ్రీమత్తిరుమల వీరరాఘవా చార్యులవారు. ఈ పత్రికలో దివ్యప్రబంధ అనువాదాలు, సంప్రదాయ గ్రంథ అనువాదాలు వస్తూ ఉండేవి. బహుశా ఇవి ప్రేరణగా నిలిచి ఉండవచ్చు. మరికొందరు తమిళ గ్రంథాలను తెలుగు లిపిలో వ్రాసుకునేవారు. తమిళ లిపి చదవడానికి రాకపోయినా తమిళంలో మాట్లాడ డం కొందరికి వచ్చేది. ఆ తరుణంలో తమిళ సంప్రదాయ గ్రంథాల అనువాదం కూడా ప్రారంభమైంది. బహుశా ఠంయాలవారు ఆయా విషయాలను విపులంగా వివరించడంలో తెలుగువారికి ఈ సంప్రదాయ విశేషాలు మరింత చేరువకావాలనే దృష్టి కూడా ఉండవ చ్చు. సంప్రదాయ విషయ పారీణత ఉభయ వేదాంతాలలో సాధికారికత, శాస్త్ర పురాణేతి హాసాలపై పటుత్వం వారికి స్వయంగా ఉండడం చేత శాస్త్ర సంప్రదాయ విషయాలను కూడా కథారూపంగా ఉన్న ప్రబంధాలలో చెప్పారనిపిస్తుంది. మొత్తం ఠంయాలవారి మూడు ప్రబంధా లను చూసినపుడు రెండు భగవత్‌ పారమ్యాన్ని చెప్పేవి కాగా, ఒకటి భాగవత వైశిష్ట్యాన్ని చెప్పేది. అయినా ప్రచండపరశురామం, యోగ భూషణో పాఖ్యానాలలో చెప్పిన సంప్రదాయ రహస్యాలు విశేషాలు ప్రత్యేకంగా పద్యరూపంలో వచ్చిన సంప్రదాయ రహస్య గ్రంథాలుగా చెప్పవచ్చు.

tsmagazine
tsmagazine
tsmagazine

Other Updates