హైదరాబాద్ విశ్వనగరంగా మారుతున్న తరుణంలో రంగారెడ్డి జిల్లా పరిధిలో పరిశ్రమలను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లీ గ్రామంలో లాజిస్టిక్ పార్క్‌ను మంత్రి కేటీఆర్ విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో మొట్టమొదటి లాజిస్టిక్ పార్క్ ఇదే అని, త్వరలో బాటసింగారంలో మరో లిజిస్టిక్ పార్క్ ప్రారంభం కానుందన్నారు. ఎలిమినేడులో ఎరోస్ స్పేస్ ప్రాజెక్టు రానుందన్నారు. ముఖ్యంత్రి కేసీఆర్ వ్యవసాయ ప్రాంతాలకు పాలమూరు రంగారెడ్డి ద్వారా నీరు అందించేందుకు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. కుంట్లూరులో ఎస్టీపీ నిర్మించడానికి నిధులను మంజూరు చేస్తామన్నారు. ముచ్చర్లలో ఫార్మా క్లస్టర్ రానుందని యువతీ యువకులకు ఎన్నో ఉద్యోగావకాశాలు రానున్నాయన్నారు. 162 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా ఎన్నో పరిశ్రమలను స్థాపించవచ్చన్నారు. ఈ రెండు పార్కులతో పాటు మరో 8 లాజిస్టిక్ పార్కులను నిర్మించనున్నామన్నారు. రెండు రైల్వే టర్మినల్స్ వస్తున్నాయని వాటిని అనుసంధానం చేసుకొని పరిశ్రమలను స్థాపించాలన్నారు.
లాజిస్టిక్ పార్కుల స్థాపనకు నగరం అగ్రభాగంలో ఉందన్నారు. ఇబ్రహీంపట్నం నియోజక వర్గంలోని మున్సిపాలిటీల అభివృద్ధికి 40 కోట్ల నిధులను మంజూరీ చేస్తామన్నారు. అదే విధంగా మహేశ్వరం నియోజక వర్గంలోని మున్సిపాలిటీల అభివృద్ధికి 40 కోట్ల నిధులను మంజూరీ చేస్తామన్నారు. అదే విధంగా మహేశ్వరం నియోజక వర్గం మున్సిపాలిటీలకు కూడా నిధులను మంజూరి చేస్తామని మంత్రి అన్నారు. మనమందరం కోరుకునే అవశ్యకత ఉద్యోగాల కల్పననేనని, పరిశ్రమలు వచ్చినప్పుడు స్థానికులు స్వాగతించాలి, మున్సిపల్ చట్టం ద్వారా చాలా కఠినంగా ఉందన్నారు. పనిచేయకపోతే పదవి పోతుందని మంత్రి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, రంగారెడ్డి జిల్లాలో లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. టిఎస్ ఐపాస్ కింద సింగిల్ విండో వ్యవస్థ ద్వారా పరిశ్రమలను నెలకొల్పేందుకు సకాలంలో అనుమతులను ఇవ్వడం జరుగుతుందని మంత్రి అన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు వీలుగా లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆమె అన్నారు.
స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి అతి పెద్ద లాజిస్టిక్ పార్కు తీసుకు వచ్చినందుకు కేటీఆర్‌కి ధన్యవాదాలు తెలుపుతూ పరిశ్రమలను స్థాపించడానికి ఇక్కడ అనువైన స్థలాలున్నాయని నియోజకవర్గంలో ఒక్కో మునిసిపాలిటీకి 10 కోట్ల రూపాయలను మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు. ఉద్యోగ కల్పన కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు.
అనంతరం జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా చుట్టూ వాతావరణం చాలా బాగుంటుందని కేటీఆర్ కృషి చేయడం ద్వారానే అతి పెద్ద పార్కులు జిల్లాకు తీసుకురావడం జరిగిందన్నారు.
అంకాన్ లాజిస్టిక్ పార్కు యండి రాజశేఖర్ మాట్లాడుతూ.. మంత్రి కేటిఆర్ ఆదర్శంతో తక్కువ కాలంలో ఈ పార్కును పూర్తి చేశామన్నారు. ట్రక్కు డ్రైవర్లకోసం సదుపాయాలను కల్పించామన్నారు. డ్రైవర్లు బాగుంటేనే లాజిస్టిక్ పార్కులు బాగుంటాయన్నారు. ఈ లాజిస్టిక్ పార్కుల వలన మరిన్ని పరిశ్రమలు మన దగ్గరకు వస్తాయన్నారు. అనంతరం పటేల్ గూడ గ్రామంలో 204 డబుల్ బెడ్ రూం ఇండ్లకు మంత్రి శంకుస్థాపన చేశారు. అదే విధంగా హయత్‌నగర్ నుండి కోత్వాల్ గూడ వరకు 4.5 కోట్ల వ్యయంతో చేపట్టిన ఎల్‌ఈడీ వీధి దీపాలను, జిల్లేల్లగూడలో 23 కోట్ల వ్యయంతో నిర్మించే సీవరేజ్ ప్లాంట్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, కొడంగల్ ఎంఎల్‌ఏ నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.