ప్రాదేశిక చిత్రకారుడుగా తన కళా జీవితాన్ని విద్యార్థి దశలోనే ప్రారంభించిన పెండెం గౌరీశంకర్‌ పల్లెపట్టులోని ప్రకృతికి, పడుచులకు, ప్రేమికులకు, దంపతులకు, పులువురు ప్రముఖులకు, పట్టణాలలో బతుకుభారమైన అట్టడుగు వర్గాల ప్రజానీకానికి తన చిత్రాలలో వాస్తవిక దృష్టితో చోటు కల్పించాడు.

పరిసరాలోని రమణీయతను
తనలో చిగురించిన కొంగ్రొత్త
భావాలను కలగలిపి వినూత్న రీతిలో తైలవర్ణ చిత్రాలు వేశాడు. అయినప్పటికీ ప్రతిచిత్రం కూడా సాధారణ
ప్రేక్షకుణ్ణి తికమకపెడుతుంది.
నైరూప్య చిత్రకళలో రూపంతో
సంబంధంలేని భావం బతుకుతుంది

రంగుల-రేఖల-రసరమ్య-గీతాలురంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లో 1936లో వీరయ్య-సత్యమ్మ దంపతులకు జన్మించిన గౌరీశంకర్‌ సుమారు గత అరవై సంవత్సరాల కళాయాత్రలో ముంబై స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో (1961), హైదరాబాద్‌లోని లలితకళ కళాశాల (1961)లో డ్రాయింగ్‌లో, పెయింటింగ్‌లో డిప్లొమా అనంతరం హైదరాబాద్‌లోనే వ్యష్టి చిత్రకళలో పోస్ట్‌ డిప్లోమా (1962), పిదప బరోడాలోని ఎం.ఎస్‌. విశ్వవిద్యాయంలో గ్రాఫిక్స్‌లో పోస్ట్‌ డిప్లొమా (1963-64) చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌ లలిత కళ కళాశాలలో అధ్యాపకుడై, పిదప పెయింటింగ్‌ విభాగానికి ప్రధానాచార్యుడు కావడం,అక్కడే 1996లో ఉద్యోగ విరమణ చేయడం వల్ల ఆయన వృత్తి, ప్రవృత్తి ఒక్కటే కావడంతో ఆయన సమకాలీన చిత్రకళారంగంలో ఎన్నెన్నో ప్రయోగాలు చేశాడు. నైరూప్య చిత్రకళకు ప్రాణం పోశాడు. ప్రశంసలు పొందాడు.

రంగుల-రేఖల-రసరమ్య-గీతాలుa1967 వరకు ప్రాథమికంగా ప్రకృతి చిత్రాలు గీయడంలో ప్రముఖుడుగా పేరొందిన గౌరీశంకర్‌, సమకాలీన చిత్రకళారంగంలో వస్తున్న ధోరణులను, పరిసరాలలోని రమణీయతను తనలో చిగురించిన కొంగ్రొత్త భావాలను కలగలిపి వినూత్న రీతిలో తైవర్ణ చిత్రాలు వేశాడు. అయినప్పటికీ ప్రతిచిత్రం కూడా సాధారణ ప్రేక్షకుణ్ణి తికమకపెడుతుంది. నైరూప్య చిత్రకళలో రూపంతో సంబంధంలేని భావం బతుకుతుంది. ఆ మాటకు వస్తే గౌరీశంకర్‌ చిత్రాలలో ఏది కూడా పూర్తిగా నైరూప్య వాదానికి చెందింది కాదు. కాని ఆయన పేర్కొంటున్నట్టుగా పల్లెగాని, పరిసరాలు గాని, లోయలు గాని వాటిలో ఎక్కడున్నాయి? లేనే లేవు అని వాదించే వారు కూడా లేకపోలేదు. అందుకు కారణం అచ్చు గుద్దినట్లుగా ఆయా అంశాలు ఈనాటి ఆయన చిత్రాల్లో కనిపించకపోవడమే. అయితే భావంలో అవి అమోఘమైనవి. రంగు సౌందర్యం, అలంకరణ రీత్యా ఆయన వ్యక్తిగత కళారీతిని అవి ద్యోతకం చేస్తాయి. ఒక్క మాటలో ఆయన చిత్రాలు రంగుల రేఖల రసరమ్య గీతాలు.

దేశంలోని అనేక మహానగరాలో దాదాపు అరవై సంవత్సరాలుగా ఎన్నో వ్యష్టి, సమష్టి చిత్రకళా ప్రదర్శనలు నిర్వహించి గౌరీశంకర్‌ తన సత్తా చాటాడు. పలు అవార్డులను పొందాడు.

గ్రాఫిక్‌ కళలో ఆరితేరిన గౌరీశంకర్‌ ప్రింటు తయారీలో సమకాలీన ‘కలీగ్రఫీ టెక్నిక్‌’ అనే అంశంపై ఎమిరిటస్‌ ప్రొఫెసర్‌గా పరిశోధన పూర్తిచేశారు.

కుడ్య చిత్రకళలో గౌరీశంకర్‌ది అందె వేసిన చేయి. హైదరాబాద్‌లోని బి.హెచ్‌.ఇ.ఎల్‌. పాలన భవనంలోని సెమినార్‌ హాల్‌. 1978లో వేసిన కుడ్యచిత్రం, హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ భవనంపై 1979లో రూపొందించిన కుడ్యచిత్రం, హైటెక్‌ సిటీలోని విదేశ్‌ సంచార నిగమ్‌ లిమిటెడ్‌ గేట్‌వే భవనంపై 2000 సంవత్సరంలో వేసిన కుడ్య చిత్రం, అంతకు ముందే చర్లపల్లిలోని టెలికాం ఇంజనీరింగ్‌ సెంటర్‌ వారికి రూపొందించిన కుడ్యచిత్రం గౌరీశంకర్‌ సృజనాత్మక శక్తికి ప్రతిబింబాలు.

వీరి చిత్రాలను కేంద్ర లలితకళా అకాడమీ, నేషనల్‌ గ్యాలరీ ఆఫ్‌ మాడ్రన్‌ ఆర్ట్‌, పార్లమెంట్‌, పలు రాష్ట్ర మ్యూజియా, అనేక పరిశ్రమలు, ఫోర్డ్‌ ఫౌండేషన్‌, భారతదేశంలోని కొన్ని విదేశీ రాయబార కార్యాలయాలు, దేశవిదేశాల్లోని పలువురు కళాభిమానులు సేకరించారు.

ఎనభై సంవత్సరాల వయస్సులోనూ ఆయన చిత్రాలు గీస్తూనే ఉన్నారు. సమస్త ప్రాణికోటిని హడలెత్తిస్తున్న వాతావరణ కాలుష్య సమస్యను ఎదుర్కోవడానికి దోహదం చేసే పచ్చని చెట్లని పరిరక్షించాలనే సూత్రం నేపథ్యంలో కొంతకాలం క్రితం వీరు గీసిన చిత్రాలు సాధారణ ప్రేక్షకులను సైతం రంజింపచేశాయి. ఈ అంశంపై ఆయన గీసిన చిత్రాలు నైరూప్యమైనా, నేనున్నానంటూ మధ్య మధ్య ఏదో మొక్క తొంగిచూస్తుంది. మరోతల ప్రాణం పోసుకుంటుంది. లేదా రంగురంగు పూవేదో ఫక్కున నవ్వినట్టు స్ఫురిస్తుంది. 113 X 293 సెంటీమీటర్ల భారీ కాన్వాస్‌పై చిత్రించిన అడవుల రక్షణ, మొక్కల పరిరక్షణ అనే చిత్రాలతోపాటు మొక్కలు, మొక్కలపై మేఘాలు, మైదానాలు, పర్వతాల ఫాంటసీకి అద్దంపట్టిన చిత్రాలన్నీ ఆయన ప్రతిభా వ్యుత్పత్తులకు వ్యక్తం చేయడంతోపాటుగా, నయనానందకరంగా ఉన్నాయి.

 

Other Updates