మా వేములవాడ కథలు

మా వేములవాడలో దసరా పండుగ చాలా బాగా జరుగుతుంది. మహలక్ష్మీ గుడి దగ్గర జమ్మి చెట్టు దగ్గరికి ఊరు ఊరంతా కదిలి వస్తుంది.

రాజరాజేశ్వరుడు, అనంతపద్మనాభ స్వామి సేవలు కూడా అక్కడికి తరలి వస్తాయి. రెండు సేవలను చూసి ఊరు ఊరంతా తరిస్తుంది. ఊరు చుట్టూ దేవుడి సేవలు తిరుగుతాయి. హారతులతో ప్రతి మలుపూ దేవుని సేవల ముందు వెలుగుతాయి.

దసరా తరువాత నాలుగు రోజులకి సిరిసిల్ల రథం పున్నమ చాలా గొప్పగా జరుగుతుంది. మా వూర్లో జాతర ఎలా జరుగుతుందో, అట్లాగే సిరిసిల్లలో రథం పున్నమ జరుగుతుంది. శివరాత్రి సమయంలో మా వూర్లో జాతర జరిగితే, దసరా తరువాతి పున్నమ రోజు సిరిసిల్లలో రథ పున్నమ జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి రథం వూరు వూరంతా తిరుగుతుంది. అంటే ప్రధాన రహదారుల్లో తిరుగుతుంది. మా రాజేశ్వరుడి సేవలను జనాలు తమ భుజాల మీద మోసుకొని తీసుకెళ్తే, వెంకటేశ్వర స్వామి రథాన్ని లాక్కొని తీసుకెళ్తారు. హరి హరుల సేవల క్రింది నుంచి అటూ ఇటూ వెళ్లడాన్ని పాపనాశనంగా మా వూరి ప్రజలు భావిస్తే, వెంకటేశ్వర స్వామి రథం కదలక ముందు రథం పై దాకా వెళ్ళి దర్శనం చేసుకోవడాన్ని పాపనాశనంగా సిరిసిల్ల ప్రజలు భావిస్తారు.

రథం పున్నమకి సిరిసిల్ల చుట్టు ప్రక్కల వున్న గ్రామాల ప్రజలు తరలి వస్తారు. ఆ రోజు ఊరునిండా పండుగ వాతావరణం. కొత్త బట్టలు అమ్మే దుకాణాలు, ఇంటికి అవసరమైన వస్తువులని అమ్మే దుకాణాలు ఎన్నో వెలిసి అందరినీ ఆకర్షిస్తాయి.

పిల్లలని ఆకర్షించేవి లెక్కలేనన్ని. బెలూన్లు, లాయిలప్పలు, పిల్లన గ్రోవులు, దూది మిఠాయిలు, ఎర్రమిఠాయిలు ఇట్లా ఎన్నో.

మా చిన్నప్పుడు రథం పున్నమకి సిరిసిల్లకి వెళ్ళడం తప్పనిసరి. అక్కడ మా పెద్దమ్మ వుండేది. ఆమె భర్త రామచంద్రం మా పెద్దనాయన. ఆయన న్యాయవాది. నేను పుట్టక ముందే ఆయన చనిపోయాడు. మా పెద్దమ్మ కూతురు విశాలాక్షి. ఆమెను మేం సిరిసిల్ల అక్కయ్య అని పిలిచే వాళ్ళం. ఆమె భర్త కూడా న్యాయవాదే.

మా పెద్దనాయన ఇల్లు చాలా పెద్దగా ఓ రాజప్రసాదంలా వుండేది. ఇరువై మెట్లు ఎక్కితే గానీ ఇంట్లోకి వెళ్ళే అవకాశం వుండేది కాదు. కచేరీ, అక్కడ పెద్దనాయన నిలువెత్తు ఫోటో. న్యాయమూర్తితో న్యాయవాదులు దిగిన ఫోటోలు. ఇట్లా ఎన్నో కచేరీ హాల్లో కనిపించేవి. రెండు మూడు అల్మైరాలు. వాటి నిండా లా పుస్తకాలు, ఫైళ్ళు. మాకు ఓ గొప్ప ఆకర్షణగా అనిపించేది.

అక్కడి నుంచి లోపలికి వెళ్తే ఓ గది, ఓ హాలు, దాని తరువాత కూడా ఓ గది, హాలూ, రెండు హాళ్ళ నుంచి కుడివైపు తిరిగితే అక్కడ మరో చిన్న ఇల్లు వుండేది. అక్కడ వంటిల్లు, దొంతులర్ర, దేవునర్ర, ఇంకా రెండు అర్రలు వుండేవి. అక్కడి నుంచే పైకి వెళ్లడానికి మెట్లు వుండేవి. పైన బంగ్లా మీద ఓ గది, ఓ హాలూ వుండేది. వాటికి రెండు వైపులా రెండు వరండాలు వుండేవి. వాటికి ఎత్తైన గోడలు. పిల్లలు క్రిందకు పడే వీలు లేనంతగా ఎత్తు వుండేవి.

రథం పున్నమకి మేం చిన్నప్పుడు వెళ్ళినప్పుడు ఆ పైన వుండటానికి ఎక్కువ ఇష్టపడేవాళ్ళం. ఆడుకోవడానికి కావల్సినంత జాగా వుండేది. పిల్లలమైన మమ్మల్ని, అక్కడ పడుకొమ్మని మా సిరిసిల్ల అక్కయ్య చెప్పేది.

నేను ఆరవ తరగతి చదువుతున్నప్పుడు రథం పున్నమకి సిరిసిల్ల వెళ్ళాం. మా గుణక్క, రాణి, శివప్రసాద్‌, భాగ్యం, రాజేందర్‌లమి కలిసి వెళ్ళాం. రథం పున్నమకి సిరిసిల్ల వెళ్ళడం మాకు ఓ గొప్ప అనుభవం. మాకు ఇష్టమైన వంటలు చేసిపెట్టేది మా అక్కయ్య. గడ్డ పెరుగును ప్రత్యేకంగా మీగడతో వుంచి మాకు పెట్టేది. వీటన్నింటితో బాటూ మాకు గొప్ప ఆకర్షణ మా పెద్దమ్మ. రథం పున్నమకి వారం రోజుల ముందే ఆమె బ్యాంక్‌ నుంచి డబ్బులు తెప్పించి పెట్టుకునేది.

అందరం స్నానం చేసి, టిఫిన్లు తిన్న తరువాత దొంతులర్ర ముందు కూర్చోవాల్సిందే. మా పెద్దమ్మ పూజ ముగించుకొని అక్కడికి వచ్చేది. ఆమె చేతిలో రెండు రూపాయల నోట్ల కట్ట వుండేది. మా ముందు ఆమె కూర్చొని ఒక్కొక్కరిని పిలిచి రెండు రూపాయలు, ఒక్కోసారి మూడు రూపాయలు జాతరలో ఏమన్నా కొనుక్కోమని ఇచ్చేది.

చిన్న వాళ్లని ముందుగా పిలిచి డబ్బులు ఇచ్చేది. నేనూ, రాజేందర్‌, శివ ప్రసాద్‌ చిన్న పిల్లలం కాబట్టి మాకు మూడు రూపాయలు ఇచ్చింది. ముగ్గురు ఆడ పిల్లలకి నాలుగు రూపాయలు ఇచ్చింది. మాకు వాళ్ళ కన్నా ఒక రూపాయి తక్కువ ఇవ్వడం బాధ కలిగించినా మేం ఏమీ అనలేదు. మేం ఊహించింది రెండు రూపాయలే. ఒక రూపాయి మేం అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చిందని సంతోషపడ్డాం.

అప్పుడు ఆ డబ్బే చాలా పెద్ద మొత్తం. మా సంతోషంలో కొంత వెలితిని కనిపెట్టి మా పెద్దమ్మ ఇలా అంది.

”ఒరేయ్‌ బాబూలూ! ఆడపిల్లలు కొనుక్కునేవి జాతరలో ఎక్కువ వుంటాయి. అందుకే వాళ్ళకి మీ కన్నా ఒక రూపాయి ఎక్కువ ఇచ్చాను.”

మేం ఏమీ మాట్లాడలేదు.

ఆ డబ్బులు తీసుకొని నేనూ, రాజేందర్‌ బయటకు పరుగెత్తుకొని వెళ్ళాం. ఇంటి నుంచి తెచ్చుకున్న రూపాయితో కలిపి మా దగ్గర నాలుగు రూపాయలు వున్నాయి. దేవుని దర్శనం చేసుకొని సిరిసిల్లా అంతా తిరిగి సాయంత్రం ఆరుగంటలకి ఇంటికి వచ్చాం.

అప్పటికే అందరూ వేములవాడకి వెళ్ళి పోయారు. మమ్మల్ని వదిలి వాళ్ళు వెళ్ళి పోవడం మాకు ఆశ్చర్యం వేసింది.

”ఇంత సేపు ఎక్కడికి పోయినారు. మీ కోసం వాళ్ళు చూసి చూసి వెళ్ళి పోయినారు. రేపు ప్రొద్దున బడి వుందని వెళ్ళిపోయారు.” చెప్పింది మా అక్కయ్య.

మాకు ఆ రోజు వెళ్ళాలని లేదు. మా మనస్సులోని భావాన్ని ఆమె కనిపెట్టి ”రేపు ఉదయం వెళ్దురు. ఇప్పుడు చీకటి అయ్యింది” అంది అక్కయ్య.

హమ్మయ్య అనుకున్నాం రాజేందర్‌, నేనూ. భోజనం చేసి బంగ్ల మీదకి పరుగు తీశాం.

మేం లేచే సరికి తొమ్మిది దాటింది. ఆగయ్య మామ వచ్చి మమ్మల్ని లేపే దాకా మేం లేవలేదు. ముఖం కడుక్కొని, స్నానం ముగించుకొని వచ్చేసరికి టిఫిన్‌ రెడీ చేసి పెట్టింది మా అక్కయ్య.

”టిఫిన్‌ తిని వేములవాడకి బయల్దేరండి. కనీసం పగటి పూట బడికైనా అందుతారు”. అంది అక్కయ్య.

ఆ రోజు బడి ఎగ్గొట్టాలనే మా ప్లాను. అందుకే నిన్నటి రోజు ఆలశ్యంగా ఇంటికి వచ్చింది.

టిఫిన్‌ చేసిన తరువాత ఇద్దరమూ బస్టాండ్‌కి బయల్దేరాం. జాగ్రత్తగా వెళ్ళమని అక్కయ్య, పెద్దమ్మ ఇద్దరూ చెప్పారు. అక్కయ్య మాకు చెరో రూపాయి ఇచ్చింది. జాతరలో ఖర్చుపెట్టుకోగా మా దగ్గర చెరి రూపాయిన్నర మిగిలి వున్నాయి. అక్కయ్య రూపాయి ఇచ్చింది. మా ఇద్దరి దగ్గర చెరి రెండున్నర రూపాయలు వున్నాయి.

బస్టాండు వైపు నడుస్తున్నాం. ఇంకా జాతర వాసనలు పోలేదు. పిల్లల బొమ్మలు అమ్మేవాళ్ళు అక్కడక్కడ కన్పిస్తున్నారు. మా సంచుల్లో చాలా వస్తువులు వున్నాయి. అందుకని మళ్ళీ ఏవిూ కొనుక్కోవాలని అన్పించలేదు.

బస్టాండు దగ్గర్లో ఓ వ్యక్తి బట్ట పరిచి మూడు పత్తాలతో (ప్లే కార్డు) ఏదో ఆడుతున్నాడు. చుట్టూ ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు వున్నారు.

రాణి బొమ్మను చూపించి మూడు పత్తాలని అటూ ఇటూ నేర్పుగా తిప్పి ఆ బట్ట మీద పెట్టాడు. రాణి బొమ్మ మీద రూపాయి పెడితే రెండు రూపాయలు ఇస్తానని, అలా కానప్పుడు ఆ రూపాయిని తానే తీసుకుంటానని చెప్పాడు. ఆ మూడు పత్తాల్లో రాణి బొమ్మని గుర్తించడం చాలా సులువని నేనూ, రాజేందర్‌ అనుకున్నాం.

అప్పటికే ఆడుతున్న వాళ్ళు వెళ్ళి పోయారు. నేనూ, రాజేందర్‌మే మిగిలాం.

రాణి బొమ్మ వున్న కార్డుని మాకు చూపిస్తూ అతను మూడు పత్తాలని అటూ ఇటూ నేర్పుగా తిప్పి ఆ బట్ట మీద పెట్టాడు.

నేను ఒక పత్తా మీద ఆఠానా పెట్టాను. అది రాణి బొమ్మే. నాకు రూపాయి ఇచ్చాడు. రాజేందర్‌కి ఉత్సాహం వచ్చింది.

రెండవ సారి మళ్ళీ రాణి బొమ్మను చూపిస్తూ పత్తాలని ఆ బట్టమీద వేశాడు. రాజేందర్‌ ఉత్సాహంగా ఓ పత్తా మీద రెండు రూపాయలు వేశాడు. దాని క్రింద రాణి లేదు. రాజు వున్నాడు. మా ఇద్దరికీ ఆశ్చర్యం వేసింది. మా కళ్ళు ఎలా మోసపోయినాయో అర్థం కాలేదు. నిరుత్సాహ పడ్డాం

”ఆడండి బాబూ ఆడండి! మూడు పత్తాల్లో ఒక పత్తాని గుర్తుపట్టుడు సులువూ” అంటూ ఊరించాడు.

మళ్ళీ చూపించి మూడు పత్తాలని కిందకు వేశాడు. ఈ సారి ఎలాగైనా గెలవాలి అనుకొని ఇద్దరమూ జాగ్రత్తగా చూసి రెండు రూపాయలు వేశాం. ఫలితం లేదు.

మరో రెడు ఆటలు ఆడాం.

ఇద్దరి దగ్గర వున్న డబ్బులు అన్నీ పోయినాయి. దిగాలు పడి పోయాం. ఏం చేయాలో తోచలేదు. అగాధం లోకి పోయిన భావన కలిగింది. వూరికి పోదామంటే డబ్బులు లేవు. ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కయ్య ఇంటికి తిరిగిపోదామంటే మొఖం చెల్లడం లేదు.

ఓ రెండు గంటలు వూరిలో అటూ ఇటూ తిరిగాం. సమయం దాదాపు మూడవుతోంది. ఆకలిగా వుంది. గత్యంతరం లేదు. అక్కయ్య దగ్గరికి వెళ్ళడం తప్ప మరో మార్గం కన్పించలేదు.

చివరికి ఇద్దరం ఆలోచించి ఓ కథని సృష్టించాం. దారిలో ఎవరో వ్యక్తి బెదిరించి మా దగ్గర నుంచి డబ్బులు లాక్కున్నాడని చెప్పాలని నిర్ణయించుకున్నాం. అక్కయ్య ఇంటికి చేరుకున్నాం. లోపలికి వెళ్ళాలంటే ఏదో బెదురు. ఎవరిని అడిగినా ఇదే రకంగా కథ చెప్పాలని మరోసారి అనుకొని లోనికి వెళ్ళాం.

మా ఇద్దరిని చూసి అక్కయ్య ఆశ్చర్యపోయింది.

మా ఇద్దరి మొఖాలు తిండిలేక పీక్కుపోయినాయి. ఉదయం నుంచి ఎండలో తిరగడం వల్ల నీరసంగా కూడా కన్పించాం.

”ఏం జరిగింది” అడిగింది అక్కయ్య.

ఇద్దరం అనుకున్న కథ విన్పించాం. అక్కయ్య నమ్మిందో లేదో తెలియదు కానీ కాళ్ళూ చేతులూ కడుక్కొని వంటింట్లోకి రమ్మని చెప్పింది.

అలాగే వెళ్ళాం. రెండు కంచాల్లో అన్నం పెట్టింది. భోజనం చేశాం.

”రేపుదయం ఆగయ్య మామ మిమ్మల్ని బస్టాండు దాకా వచ్చి బస్సు ఎక్కిస్తాడు. బంగ్ల మీద పోయి ఏదన్నా పుస్తకం చదువుకొండి” చెప్పింది అక్కయ్య.

రాత్రి భోజనం చేసిన తరువాత మళ్ళీ ఇలా చెప్పింది.

”ఉదయాన్నే నిద్రలేచి రెడీ కండి. ఆగయ్య మామ మిమ్మల్ని బస్సు ఎక్కించి వచ్చి ఇంటి పనులు చేస్తాడు.”

బంగ్ల మీదికి పోయి పడుకున్నాం. బతుకు జీవుడా అనుకున్నాం. మా కథ బయట పడలేదని సంతోషించాం.

ఉదయాన్నే త్వరగా లేచాం. ఆగయ్య మామ పాలు పిండి తీసుకొని అక్కయ్యకి ఇచ్చాడు. మేం టిఫిన్‌ చేసి రెడీ అయ్యే సరికి తొమ్మిది దాటింది.

”ఆగయ్యా! వీళ్ళను వేములవాడ బస్సు ఎక్కించిరా” అని ఆగయ్యకు చెప్పింది.

మళ్ళీ మాకు చెరో రూపాయి ఇచ్చింది.

ఆగయ్య మామ వెంట మేమిద్దరం బస్టాండుకి నడిచాం.

ఆగయ్య మామ ముందు నడుస్తున్నాడు.

ఆయన వెనుక మేం నడుస్తున్నాం.

బస్టాండు దరి దాపుల్లోకి రాగానే నిన్నటి ప్రదేశంలో ఆ పత్తాల ఆటవాడు కన్పించాడు.

మమ్మల్ని చూసి గుర్తుపట్టాడు.

”రండి బాబూ! రండి. చూడండి రెట్టింపు డబ్బులు గెలవండి” గట్టిగా అనడం మొదలు పెట్టాడు.

ఇద్దరమూ క్షణకాలం అక్కడ నిలిచిపోయాం. మళ్ళీ ఆడాలన్న కోరిక ఇద్దరిలో కలిగింది.

ఆగయ్య మామ వెనక్కి తిరిగి చూశాడు.

”నువ్వు వెళ్ళు మామ. మేం వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి” అన్నాను.

ఆగయ్య మామ మా ఉద్దేశ్యాన్ని పసిగట్టాడు. ”నిన్న ఈ ఆట ఆడే డబ్బులు పోగొట్టుకున్నారు. అంతేకదా! మళ్ళీ ఆడదామని చూస్తున్నారా?” గద్దింపుగా అన్నాడు.

”కాదు. కాదు” అని అన్నాం ఇద్దరమూ.

”అరేయ్‌! ఈ పిల్లలతో నీ ఆట ఏందిరా! తీయ్‌, నీ బిఛాణా ఎత్తేయ్‌” వాడిని బెదిరిస్తూ గట్టిగా అన్నాడు.

ఆగయ్య మామ గొంతులోని కాఠిన్యాన్ని చూసి, ఆయన పర్శనాలిటీని చూసి వాడు అక్కడి నుంచి బిఛాణా ఎత్తేశాడు.

”నడవండి”! అన్నాడు.

ఇద్దరమూ ఏమీ మాట్లాడకుండా బస్టాండుకి వచ్చాం.

బస్సు ఎక్కిన తర్వాత ”జాగ్రత్తగా వెళ్ళండి” అన్నాడు మామ.

”మామా! అక్కయ్యతో ఏమీ చెప్పకు” అన్నాం ఇద్దరం ఒకేసారి.

చిన్న నవ్వు నవ్వి మామ వెళ్ళి పోయాడు. బస్సు కదిలింది.

మా సంగతి అక్కయ్యకు ఆగయ్య మామ చెప్పినట్టు అన్పించలేదు కానీ, చాలా కాలం మామ కన్పిస్తే కాస్త బెరుగ్గా, భయం భయంగా వుండేది.

ఓ ఇరువై ఏళ్ళ తరువాత రథం పున్నమకి సిరిసిల్ల వెళ్ళినప్పుడు ఆగయ్య మామ కన్పించాడు.

”మామా! పత్తాలు ఆడదామా!” అన్నాను సరదాగా.

”అట్లనే” అన్నాడు నవ్వుతూ.

నేను ఆరవ తరగతి చదువుతున్నప్పుడు రథం పున్నమకి సిరిసిల్ల వెళ్ళాం. మా గుణక్క, రాణి, శివప్రసాద్‌, భాగ్యం, రాజేందర్‌లమి కలిసి వెళ్ళాం. రథం పున్నమకి సిరిసిల్ల వెళ్ళడం మాకు ఓ గొప్ప అనుభవం.

రాణి బొమ్మను చూపించి మూడు పత్తాలని అటూ ఇటూ నేర్పుగా తిప్పి ఆ బట్ట మీద పెట్టాడు. రాణి బొమ్మ మీద రూపాయి పెడితే రెండు రూపాయలు ఇస్తానని, అలా కానప్పుడు ఆ రూపాయిని తానే తీసుకుంటానని చెప్పాడు. ఆ మూడు పత్తాల్లో రాణి బొమ్మని గుర్తించడం చాలా సులువని నేనూ, రాజేందర్‌ అనుకున్నాం.

జింబో

Other Updates