bhadrachalamభద్రాచలంలో చలువ పందిళ్ళతో అలంకరించిన మిథిలా స్టేడియంలో శ్రీ సీతారాముల కల్యాణం ఏప్రిల్‌ 5న అంగరంగ వైభవంగా జరిగింది. భక్తజన ప్రభంజనం ఈ వేడుకను తిలకించి పులకించింది. భక్తుల జయజయ ధ్వానాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, విద్వాంసుల మంగళవాయిద్యాల నడుమ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ కల్యాణ వేడుకలు కనుల పండువగా సాగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచేగాక దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన లక్షలాది మంది భక్తజన సమూహంతో మిథిలాస్టేడియం కిక్కిరిసిపోయింది. భక్తుల పుణ్యస్నానాలు, మొక్కులు తీర్చుకోవడంతో గోదావరీ తీరం జనసంద్రమైంది.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఈ వేడుకలకు హాజరు కాకపోవడంతో, ఆయన కుటుంబం తరఫున మనుమడు హిమాన్షు పట్టువస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఇతర దేవాలయాలవారు కూడా శ్రీ సీతారామ స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు.

ఉదయం 8 గంటలకు దేవాలయంలో తొలుత ధ్రువమూర్తులకు కల్యాణం నిర్వహించారు. అనంతరం స్వామివారికి కల్యాణమూర్తుల అలంకారం గావించి 9.30 గంటల ప్రాంతంలో బాజాభజంత్రీలు, వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల కోలాహలం మధ్య కల్యాణమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో మిథిలా స్టేడియంలో శిల్పకళాశోభితమైన ప్రత్యేక కల్యాణ వేదిక వద్దకు ఊరేగింపుగా తీసుకొనివచ్చారు.

విష్వక్సేనపూజ, ఏకాంత ఆరాధన నిర్వహించారు. యజ్ఞోపవీత ధారణ, వరపూజ గావించారు. స్వామివార్లకోసం భక్త రామదాసు చేయించిన ఆభరణాలలో స్వామివారికి పచ్చల పతకం, సీతాదేవికి చింతాకు పతకం, లక్ష్మణస్వామికి రామమాడలు అలంకరించి మధుపర్కం సమర్పించారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్‌ లగ్నంలో జీలకర్ర బెల్లం సీతారాములపై వుంచి, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకలు నిర్వహించారు. శ్రీరామ, జయరామ అంటూ భక్తుల జయజయ ధ్వానాల మధ్య కల్యాణం కమనీయంగా, రమణీయంగా జరిగింది.

కల్యాణ సమయంలో భద్రాద్రి ఆలయం విశిష్టత, వైకుంఠ రాముని ప్రాశస్త్యాన్ని, భక్త రామదాసు సేవలను, ఆయన సీతారాములకు చేయించిన వివిధ ఆభరణాల ప్రాధాన్యతను వేదపండితులు వివరించారు.

వైభవంగా పట్టాభిషేకం

కల్యాణం జరిగిన మరుసటి రోజు, ఏప్రిల్‌ 6న మిథిలా స్టేడియంలో శ్రీ సీతారామ స్వామివారికి మహాపట్టాభి షేకం ఘనంగా నిర్వహించారు. పట్టాభిషేక మహోత్సవంలో భాగంగా, రామాలయ ప్రాంగణంలోని యాగశాలలో ఉదయం చతుస్థానార్చన హోమం నిర్వహించారు. స్వామివారి పాదాలకు అభిషేకాలు, ప్రత్యేక పూజల అనంతరం కల్యాణ మూర్తులను దేవాలయం నుంచి ఊరేగింపుగా మిథిలా స్టేడియానికి తీసుకొనివచ్చారు. స్వామివారికి రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు ఆయన రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆరాధన, విష్వక్సేన పూజ, పుణ్యహవచనం అనంతరం పాదుకలు, రాజముద్రిక, స్వర్ణకిరీటం, స్వర్ణచక్రాలకు పూజలు నిర్వహించి రామయ్యకు అలంకరించారు. ముత్యాలహారం, రామదాసు కాలంనాటి బంగారు పాదుకలు, రాజదండం, రాజముద్రిక, ఛత్రం సమర్పించి, బంగారు ఆభరణాలను కూడా స్వామివారికి అలంకరించారు. ఈ వేడుక విశిష్టతను, శ్రీరాముడు లోక కల్యాణం కోసం చేసిన త్యాగాలను, శ్రీరాముని పాలనను వేదపండితులు ఈ సందర్భంగా వివరించారు.

శ్రీరామ పట్టాభిషేకాన్ని భక్తులు కనులారా వీక్షించి పులకించారు. ఈ కార్యక్రమాలలో జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

అన్ని హంగులతో భద్రాద్రి అభివృద్ధి: సీఎం

భద్రాచలంలోని పుణ్యక్షేత్రం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని అన్ని హంగులతో అద్భుతంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించారు. భద్రాద్రి క్షేత్ర అభివద్ధికి ఇప్పటికే 100 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, మరిన్ని నిధులు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా వున్నదని ముఖ్యమంత్రి చెప్పారు.

దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏప్రిల్‌ 12న భద్రాద్రి ఆలయ అర్చకులతోకలసి ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భద్రాద్రి ప్రసాదాన్ని కె.సి.ఆర్‌ కు అందించి ఆశీర్వదించారు. భద్రాద్రి ఆలయంలో నిర్మించాల్సిన కట్టడాలకు సంబంధించి దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ శిల్పితో చర్చిస్తామని సి.ఎం తెలిపారు.

Other Updates