‘రసమయం’-రాష్ట్ర-సాంస్కృతికం4తెలంగాణ ఉద్యమకాలంలో వివిధ కళారూపాల కళాకారులు పోషించిన పాత్ర మరువలేనిది. ఆ కళాకారులను అందరూ ఆదరించే విధంగా, ప్రభుత్వ పథకాలను ప్రజల మదిలో నిలిపే ఆలోచనలతో కళాకారులందరినీ అక్కున చేర్చుకోవడానికి ప్రభుత్వం ‘‘తెలంగాణ సాంస్కృతిక సారథి’’ని ఏర్పాటు చేసింది. డిసెంబర్‌ 5న సాంస్కృతిక సారథికి ఛైర్మన్‌గా ప్రజా గాయకుడు, మానుకొండూర్‌ ఎంఎల్‌ఏ రసమయి బాలకిషన్‌ని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన నియామక పత్రాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆటపాటల మేళవింపుల కవి, గాయకుడు ‘రసమయి’కి అందజేశారు. ఆ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ చెరువుల పునరుద్ధరణ, వాటర్‌గ్రిడ్‌, హరితహారం మొదలైన కార్యక్రమాలతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా బహుళ ప్రచారం లభించేలా కృషి చేయాలని అన్నారు. మూఢ నమ్మకాలు, సాంఫీుక దురాచారాలపై ప్రజలలో వున్న అపోహలు తొలగిపోయే విధంగా ‘సాంస్కృతిక సారథి’ ప్రచార యుద్ధం చేపట్టాలని సూచించారు.

ఉద్యమంలో తాను చేసిన ప్రచారానికి గుర్తింపు లభించిందని ‘సాంస్కృతిక సారథి’కి ఛైర్మన్‌గా తనను ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కి తాను కృతజ్ఞుడుగా ఉంటానని రసమయి పేర్కొన్నారు. ఉద్యమకారుడికి ఉన్నత పదవిని అప్పగించారని అన్నారు. ఇది ఓ కూలి బిడ్డ పాటను గుర్తించడమేనని, ఈ పదవి ధూంధాంకు, కళాకారులకు అందించిన చేయూతగా పేర్కొన్నారు. ఇకనుండి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకుని పోయేవిధంగా
పలురకాల కార్యక్రమాలను రూపొందిస్తానన్నారు రసమయి బాలకిషన్‌. రసమయిని వరించిన పదవిపట్ల మెదక్‌జిల్లా, సిద్దిపేట మండలంలోని ఆయన సొంతూరు రావురూకులలో ప్రజలు సంబురాలు చేసుకున్నారు.
ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా రవి
తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్‌ తొలి ఛైర్మన్‌గా ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి నాయకుడు పిడమర్తి రవిని ప్రభుత్వం నియమించింది. ఇందులో ఛైర్మన్‌తోపాటు పలు శాఖలకు సంబంధించిన 15మంది అధికారులు సభ్యులుగా ఉంటారు. ఛైర్మన్‌గా నియామక ఉత్తర్వులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా డిసెంబర్‌ 3న పిడమర్తి రవికి అందజేసి అభినందనలు తెలిపారు.

Other Updates