సంస్కృత, తెలుగు భాష లలో విశేష పాండిత్య ప్రకర్షలే కాక వ్యాకరణాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని ప్రయోగాలు చేయగలిగి తెలుగు సాహిత్యానికి- ప్రత్యేకించి వైష్ణవ సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన శాకారంచేటి వెంకటరాఘవాచార్యుల సాహిత్య కృషిని సంక్షిప్తంగానైనా-సమగ్రంగా వివరించే ప్రయత్నం- ‘రాఘవీయం’.
సంస్కృత, తెలుగు భాషలలోనేకాక తమిళభాషతో ఉన్న పరిచయంతో అనేక విలువైన రచనలకు రాఘవా చార్యులవారు తెలుగు వ్యాఖ్యానాలు, వివరణలు రచించారు. ముఖ్యంగా వైష్ణవులకు ఆరాధ్యుడు, కలియుగదైవంగా వెంకటేశ్వరస్వామి అంశంతో జన్మించినట్లు భావించే వేదాంత దేశికులు సంస్కృతంలో రచించిన కావ్యాలను, స్తోత్రాలను తెలుగువారికి పరిచయం చేసిన ‘ఘనత’ రాఘవాచార్యులవారిది. దేశికుల సాహిత్యం-వైష్ణవులకు వారం – సాహిత్య అభిమానులకు అత్యంత ప్రియం. దేశి కుల రచనలలో విశేష ఖ్యాతి పొందిన ‘పాదుకా సహస్రం’ యాదవాభ్యుదయ కావ్యాలకు తెలుగులో విపులమైన వివరణలు ఇవ్వగలిగిన ప్రతిభావంతుడు రాఘవాచార్యులు.
24 సంపుటాలుగా ప్రచురితమైన రాఘవాచార్యులవారి రచనలను సుప్రసిద్ధ పండితులచే సమీక్షలు చేయించ డం-ప్రకాశకులు సంపాదకీయంలో పేర్కొన్నట్లుగా రాఘవాచార్యుల రచనలను చదవలేక పోయినవారికి ఎంత గానో ఉపయోగపడుతుంది. పాఠకులలో రాఘవాచార్యు లవారి రచనలను చదవాలనే అభిలాషను పెంచుతుంది.
రాఘవీయంలో ప్రసిద్ధులు వ్రాసిన రచనలతోపాటు రాఘవాచార్యులు వారు స్వయంగా వ్రాసిన ‘వేదాంత దేశికుల సంగ్రహ జీవిత చరిత్ర’, తమ జీవితాన్ని వివరించే ‘స్వవిషయం’ చేర్చడం ప్రశంసనీయం.
-కాళ్లకూరి పాండురంగారావు
ప్రతులకు:
తిరుమల ఛారిటబుల్ ట్రస్ట్,
గ్రంథమాల, అహోబిలమఠం,
2-2-20/282, డి.డి. కాలనీ,
హైదరాబాద్-13.