భారతదేశంలో 58సార్లు అరెస్టయిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నాడా? అని ప్రశ్నిస్తే ‘నేనున్నానని అనేవారు రాజ్‌నారాయణ్. కాంగ్రెస్ 30 సంవత్సరాల పరిపాలనలో ఆయన 15 సంవత్సరాలు జైల్లోనే గడిపారు.
కాంగ్రెస్‌వారు రాజ్‌నారాయణ్‌తో ఎన్నడూ రాజీకి రాలేదు. 1977 మార్చి 24న ప్రధానిగా ఎన్నికైన మొరార్జీదేశాయ్ రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైనప్పుడు రాజ్‌నారాయణ్ అక్కడికి రాగానే ప్రతిపక్ష నాయకుడైన వై.బి. చవాన్ దగ్గరికి వెళ్ళి ఆయనకు అభివాదం చేయ బోయాడు. పెద్దగడ్డంతో, ఆకుపచ్చ రువాలు చుట్టుకున్న రాజ్‌నారాయణ్‌ని చూడగానే చవాన్ తల పక్కకు తిప్పుకున్నారు. ఆయన ముఖం చూడలేదు.
ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన రాజ్‌నారాయణ్
కుటుంబ నియంత్రణపట్ల అంత ఉత్సాహం చూపపకపోగా ఈ ఆరోగ్యమంత్రి కుటుంబ నియంత్రణాన్ని ఆత్మ సంయమనంతో ఉముడిపెట్టారు. పురాణాలలో శ్రీరాముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి ఉదాహరించి సీతారాములవలె భార్యాభర్తలని దూరం ఉండమన్నారు. ఇంకో అడుగు ముందుకు వేసి పరమ శివుని వలె మీరెవ్వరైనా శస్త్ర చికిత్స చేయగలరా? అని వైద్య నిఫుణులను ప్రశ్నించారు.
ఎప్పుడూ ఎవరి అదుపు ఆజ్ఞలలో ఉండని ఆరోగ్యమంత్రి రాజ్‌నారాయణ్ ఒకసారి లోక్‌సభలో తాను ధరించిన బ్యాడ్జి తీయవలసి వచ్చింది. ఢిల్లీలో కిసాన్ దినోత్సవాల సందర్భంగా ఆయన ఈ బ్యాడ్జీ ధరించారు. ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యుడు లేచి, రాజ్‌నారాయణ్ బ్యాడ్జి పెట్టుకొని సభకు హాజరుకావడంపట్ల తన అభ్యంతరం తెలిపి ఈ విషయంలో స్పీకరు రూలింగ్ ఇవ్వాలని కోరారు. సభలో సభ్యులు బ్యాడ్జీలు ధరించరాదని స్పీకర్ కె.ఎస్. హెగ్దే అన్నారు. రాజ్‌నారాయణ్ వెంటనే బ్యాడ్జీని తీసివేశారు.
మొరార్జీదేశాయ్‌ని ప్రధానమంత్రి పదవినుంచి తొలగించాలన్న తన ప్రతిజ్ఞ నెరవేరినందుకు రాజ్‌నారాయణ్ శాస్త్రోక్తంగా తలగుండు చేయించుకున్నాడు. తన ప్రతిజ్ఞ నెరవేరినందుకు ఆయన అలా చేయడం 22 నెలల్లో అది రెండవసారి. 1977లో లోక్‌సభ ఎన్నికలలో ఇందిరాగాంధీని ఓడించినందుకు ఇదే విధంగా గుండు చేయించుకున్నాడు.
చరణ్‌సింగ్ మంత్రివర్గంలో పనిచేసిన 24 రోజులు రాజ్యాంగేతర పీఠాధిపతిగా వినూత్నావతారం దాల్చి లేని అధికారాలు చెలాయించుకున్నాడు రాజ్ నారాయణ్.
గోఖలే ఉదంతం ‘విభీషణా వెళ్లిపో’
1906లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి గోపాలకృష్ణ గోఖలే అధ్యక్షుడు. బ్రిటిష్ వస్త్ర బహిష్కారం, బ్రిటిష్‌వారితో సంబంధ నిరాకరణవలన భారతదేశానికి లాభానికన్నా నష్టమే ఎక్కువ కలుగుతుందని గోఖలే వాదించడంవలన కాంగ్రెస్‌లో చీలికలు ఏర్పడ్డాయి. మరుసటి సంవత్సరం కలకత్తాలో జరుగబోతున్న కాంగ్రెస్ సమావేశానికి గోఖలే హాజరైనప్పుడు ‘విభీషణా వెళ్ళిపో!’ అనే శీర్షికతో ‘వందేమాతరం’ పత్రిక గోఖలేపైన సంపాదకీయం రాసింది. రాతియుగంలో తన అన్నను వదిలి, సముద్రం ఆవల ఉన్న రాముని లంకకు ఆహ్వానించి, లంకను ధ్వంసం చేయించిన విభీషణుని వలెనే గోపాలకృష్ణ గోఖలే తన దేశస్థులను పరిత్యజించి, బ్రిటిష్ పక్షం చేరాడని ఆ పత్రిక సంపా దకీయ సారాంశం. గోఖలే శిష్యులైన శ్రీనివాసశాస్త్రి మొదలైన నాయకులకు తన గురువును దేశద్రోహిగా చిత్రించినందుకు విచారం కలిగింది కానీ విభీషణుని గురించి యధార్థం తెలిసిన వారెవరూ అతన్ని దేశద్రోహి అనటానికి సాహసించరు.