1969 మార్చి 25న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ సంస్థగా ఆవిర్భవించిన తెలంగాణ ప్రజా సమితిని 16 నెలల తర్వాత 1970 జూలై 23న పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మార్చాలని ప్రజాసమితి రాష్ట్ర మండలి నిర్ణయించింది. ప్రజా సమితిని రాజకీయ పార్టీగా మార్చే సమస్యను పరిశీలించ వలసిందిగా కోరుతూ తెలంగాణ ప్రజా సమితి కొంత కాలం క్రితం ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ రాజకీయ పార్టీగా మార్చాలన్న ప్రతిపాదనను బలపర్చింది. కమిటీ సిఫార్సును ప్రజా సమితి కార్యవర్గం, రాష్ట్ర మండలి ఆమోదించినది. 1970 ఆగస్టు ఒకటి నుండి ప్రజా సమితి సభ్యులను చేర్చుకోవడం ప్రారంభించి 10 లక్షల మంది సభ్యులను చేర్పించాలని లక్ష్యం పెట్టుకుంది. దీన్ని మూడు నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు.
”తెలంగాణ ప్రజాసమితి రాజకీయ పక్షంగా ఇంతకు పూర్వమే పని చేస్తున్నా, 1971 జనవరి నుంచి లాంఛన ప్రాయంగా అన్ని విధాల రాజకీయ పక్షంగా పనిచేయగలద”ని డా|| ఎం. చెన్నారెడ్డి పత్రికా విలేకరుల గోష్ఠిలో తెలియజేశారు. ”ప్రత్యేక తెలంగాణ సాధనే ఈ పార్టీ ప్రధాన లక్ష్యం” అని ఆయన అన్నారు.
ప్రజా సమితి రాష్ట్ర కౌన్సిల్ తీర్మానాలను డా|| చెన్నారెడ్డి పత్రికలకు విడుదల చేసారు. ”జనవరిలో జరిగే రాష్ట్ర స్థాయి సమావేశంలో ఈకొత్త పార్టీ లాంఛనప్రాయంగా అవతరిస్తుంద”ని డా|| రెడ్డి అన్నారు.
ప్రజా సమితి సభ్యత్వ రుసుము 20 పైసలు. కనీస వయస్సు 18 సం||లు. క్రియాశీలక సభ్యులు 50 వేల మంది ఉంటారు. వీరు రూ. 5లు చెల్లించాలి. ఒక్కో క్రియాశీలక సభ్యుడు 50 మంది ప్రాథమిక సభ్యులను చేర్పించాలి. గ్రామం నుండి పై స్థాయి వరకు పార్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రజా సమితి నిర్ణయించింది.
పార్టీ నియమావళికై కమిటీ
ప్రజా సమితి నియమావళిలో అవసరమగు మార్పులను సవివరంగా పరిశీలించడానికి ఒక కమిటీని రాష్ట్ర కౌన్సిల్ నియమించింది. ఈ కమిటీలో… కె. అచ్యుతరెడ్డి, టి. అంజయ్య, ఎస్. వెంకట్రామ రెడ్డి, జి.వి. సుధాకర రావు, జి. రాజారామ్, ఎం.ఎం. హాషీం, జి. వెంకటస్వామి, బద్రీవిశాల్ పిట్లీ, ఎస్.బి. గిరి, ఎ. మదన్‌మోహన్, బి. రామ్‌దేవ్, టి. గోవింద్ సింగ్, ఎన్. నరోత్తమ రెడ్డి, పి. నరసింగరావు, కె.వి. కేశవులు, టి. పురుషోత్తమ రావు, పి. రామచంద్రారెడ్డి, వైక్ అలీఖాన్, సత్యనారాయణ రావు, జి.ఎం. లోథీ, ఎం. రామరెడ్డి, జె. ఈశ్వరీ బాయి, శాంతాబాయి ఉన్నారు.
నూకల అరెస్టు అక్రమం – ప్రజా సమితి
ప్రజా సమితి ఆమోదించిన తీర్మానాలలో మరొక ముఖ్యమైన తీర్మానం… అసెంబ్లీలో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నాయకుడు నూకల రామచంద్రారెడ్డి ఆరెస్టును ఖండిస్తూ… అధికార పార్టీ చర్యను నిరసిస్తూ.. వ్యక్తి ధన మాన ప్రాణాలకు రక్షణ లేదని ప్రజా సమితి విమర్శించింది.
”రాజకీయ ప్రత్యర్థుల ఏరివేతకై అధికార తంత్రాంగం”
నూకల అరెస్టుపై చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్
నూకల రామచంద్రారెడ్డి వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ ఫిబ్రవరి 6న 35 మంది, శాసన సభ్యులు ‘తెలంగాణ ఐక్య సంఘటన’ను ఏర్పాటు చేసారు. శాసన సభలో ఈ యునైటెడ్ ఫ్రంట్ నాయకునిగా నూకల రామచంద్రారెడ్డిని ఎన్నుకున్నారు. ఐదారు నెలలుగా నూకల రామచంద్రారెడ్డి తెలంగాణ అంశంపై కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నందునే కక్ష్య సాధింపుగా రాజకీయ ప్రత్యర్థుల ఏరివేతలో భాగంగా నూకల పై ఐపిసి 307 సెక్షన్ పై అక్రమ కేసు బనాయించారని డా|| మర్రి చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ ఆరోపించారు.
నూకల అరెస్టుపై ‘జనధర్మ’ పత్రిక కథనం :
వరంగల్ నగరం నుండి ప్రముఖ సంపాదకులు ఎం.ఎస్. ఆచార్య వెలువరిస్తున్న ‘జనధర్మ’ వార పత్రిక నూకల రామచంద్రారెడ్డి అరెస్టు పై 16-7-1970 సంచికలో బ్యానర్ వార్తను ప్రచురించింది.
పంచాయితీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజైన జూలై 13కు పూర్వమే వారం నుండి సిరోల్ గ్రామం (మహబూ బాబాద్ సమితి)లో పరిస్థితి విషమంగా వున్నది. నూకల అనుచరుల పై ప్రత్యర్థి వర్గం దాడి చేసి గాయపర్చిన ఘటన జరిగింది. ఈ ఘటనను రామచంద్రారెడ్డి స్వయంగా సబ్-ఇన్స్‌పెక్టర్ దృష్టికి తేవటమే గాక స్వయంగా పరిస్థితిని అవగాహన చేసుకోవడానికి ఆ గ్రామ పరిధిలోని తండాలకు మరో ముగ్గురితో కలిసి వెళ్ళారు. ఒక తండా సమీపానికి వెళ్ళగానే సుమారు 50 మంది ఆయనపై దాడి చేశారు. వెంట వున్న రామిరెడ్డి, కృష్ణారెడ్డి పై బడి చితక బాదినారు. ఆ దెబ్బల వలన రామిరెడ్డి తలపగిలి రక్తం కారుతున్నా వదలకుండా కర్రలతో అతన్ని కొడుతుంటే అతన్ని కాపాడటానికి రామచంద్రారెడ్డి అడ్డుగా పడుకున్నాడు. ఆయనను కూడా కర్రలతో కొడుతుంటే తమ రక్షణ కోసం గత్యంతరం లేక రామచంద్రారెడ్డి తన రివాల్వర్ తీసి గాల్లోకి రెండు సార్లు కాల్చారు. ప్రత్యర్థులు ఒక్క క్షణం స్థంభించినా గుంపుగా రామచంద్రారెడ్డి పై దాడి చేసి ఆయన చేతిలోని రివాల్వర్‌ను లాక్కున్నారు. మళ్ళీ కొడుతుంటే తండాలోని లంబాడీలు వచ్చి రామచంద్రారెడ్డిని కాపాడినారు.
ఈ సంఘటన జరిగిన వెంటనే గాయాలతో రామచంద్రారెడ్డి, ఇతరులు సిరోలుకు వెళ్ళి సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌కు వివరించారు. కొద్ది క్షణాలకే సాయంత్రం 4.30ని||లకు అడిషనల్ ఎస్.పి. అక్కడికి చేరుకొని దాడిచేసిన వారిని వదిలి రామచంద్రారెడ్డి, అతని సహచరులు 6గురిపై ఐపిసి 307 సెక్షన్ క్రింద ‘ప్రత్యర్థులను రివాల్వర్‌తో చంపడానికి ప్రయత్నించార’ని కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ”ఉపముఖ్యమంత్రి జె.వి. నరసింగరావు వారం క్రితం మానుకోటకు వచ్చి పోలీసు అధికారులతో తంత్రాంగం జరిపినందుకే రామచంద్రారెడ్డిపై కేసు పెట్టారని తెలంగాణవాదులు ఆరోపించారు.
కొండా వెంకటరంగారెడ్డి కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి (80) దీర్ఘకాలం అస్వస్థత అనంతరం జూలై 24 రాత్రి 10.30ని||లకు హైదరాబాద్‌లో మరణించారు. 1890 డిసెంబర్ 12న కె.వి. రంగారెడ్డి హైదరాబాద్‌కు 16 మైళ్ళ దూరంలోగల పెద్ద మంగళారం (చేవెళ్ళ తాలూకా) గ్రామంలో జన్మించారు. 1907లో ఉర్దూ మిడిల్ పరీక్షలో ఉత్తీర్ణులైనారు. 1909లో న్యాయ శాస్త్ర పరీక్ష పాసై ప్రాక్టీసు ప్రారంభించారు. 1910 నుండి 1920 వరకు జిల్లా కోర్టులో, 1920 నుండి 1932 వరకు సెషన్స్ కోర్టులో, 1932 నుండి 1940 వరకు హైకోర్టులో ప్రాక్టీసు చేశారు.
కె.వి. రంగారెడ్డి తొలిసారి 1936లో హైదరాబాద్ శాసన మండలికి ఎన్నికైనారు. 1950లో పార్లమెంట్‌కు ఎన్నికై 1952 దాకా కొనసాగారు.
నిజాం రాష్ట్రాంధ్ర జన సంఘం ఆవిర్భావం నుండి ఆ సంఘం కొనసాగింపుగా ఏర్పడిన నిజాం రాష్ట్రాంధ్ర మహా సభకు నాయకత్వం వహించారు. 24-2-1922న రెడ్డి కాలేజీలో కె.వి. రంగారెడ్డి అధ్యక్షతన నిజాం రాష్ట్రాంధ్ర జన సంఘం తొలి సభ జరిగింది. భువనగిరిలో 1944లో జరిగిన 11వ ఆంధ్రమహాసభలో అధ్యక్ష బాధ్యతలను రావి నారాయణ రెడ్డికి అప్పగించారు. ఐదవ, పదవ ఆంధ్ర మహాసభలకు అధ్యక్షునిగా వ్యవహరించారు. స్టేట్ కాంగ్రెస్‌లో ముఖ్యనాయకునిగా వున్న కె.వి. రంగారెడ్డి ముల్కి నిబంధనలు అమలు చేయాలని పలుమార్లు అప్పటి పాలకులపై ఒత్తిడి తెచ్చారు. బూర్గుల మంత్రి వర్గంలో రెవెన్యూ, ఆబ్కారీ, అటవీ మంత్రిగా పనిచేసారు. మంత్రిగా వుంటూనే చెన్నారెడ్డి, జె.వి. నర్సింగా రావులతో కలిసి, ‘విశాలాంధ్ర’కు వ్యతిరేకంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 1954-56లో పోరాడినారు. పెద్దమనుషుల ఒప్పందంపై సంతకం చేశారు. నీలం సంజీవరెడ్డి మంత్రి వర్గంలో హోం మంత్రిగా, సంజీవయ్య మంత్రి వర్గంలో ఉపముఖ్యమంత్రిగా పని చేశారు.
కె.వి. రంగారెడ్డికి శాసన సభ జోహార్లు
మాజీ ఉపముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి మరణానికి సంతాపం వెల్లడిస్తూ ఆయన కుటుంబానికి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి సానుభూతిని తెలియజేస్తూ సభలో తీర్మానం ప్రవేశ పెట్టారు. తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన తర్వాత ఆయన గౌరవార్థం సభను వాయిదావేశారు.
తీర్మానాన్ని ప్రవేశపెడ్తూ ముఖ్యమంత్రి ”తనకు అప్పగించిన మంత్రిత్వ శాఖలను కడుసమర్థతతో నిర్వహించి ప్రజల ప్రేమానురాగాలకు పాత్రులైనారు. పట్టుదలతో కార్యక్రమాలను చేపట్టేవారు. తెలుగు జాతి జీవనంలో ఒక విధమైన ప్రత్యేక గౌరవస్థానాన్ని వారు పొందారు. వీరి మృతి మన రాష్ట్రానికే కాక మొత్తం దేశానికే తీరనిలోట’ని అన్నారు.
తెలంగాణ రీజనల్ కమిటీ తొలి అధ్యక్షునిగా పనిచేసిన కె. అచ్యుత రెడ్డి మాట్లాడుతూ ”జాగీర్ రైతుల హక్కుల రక్షణకు ఆయన చేసిన సేవ మరువరానిదని, తెలంగాణ పితా మహుడుగా, ఉక్కు మనిషిగా వారి పేరు చిరస్థాయిగా వుంటుంది. జీవిత చరమాంకంలో కూడా తమ ప్రాంత ప్రజల శ్రేయస్సు కొరకు ఆరాటపడుతూనే వుండేవార”ని అన్నారు. సి.హెచ్. రాజేశ్వరరావు (సిపిఐ) మాట్లాడుతూ… ”ఆయన జీవిత చరిత్ర తెలంగాణ రాజకీయాలతో సంపూర్ణం గా పెనవేసుకు పోయింది. తెలంగాణ జాతీయోద్యమ నిర్మాణానికి బహువిధాల కృషి చేశారు. తమ రాజకీయ వ్యతిరేకులతో కూడా సరళంగా, సహృదయంతో వ్యవహరించే వార”ని అన్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ మాట్లాడుతూ… ”తెలంగాణ ప్రజలలో రాజకీయ చైతన్యం కల్పించిన నాయకులలో ముఖ్యులు. రాష్ట్రాల పునర్నిర్మాణ సమయంలో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడాలని వాదించారు. పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు అంగీకరించి తర్వాత ఆ ఒప్పందం సంతృప్తికరంగా అమలు జరగక పోయినప్పుడు ప్రత్యేక తెలంగాణ తప్ప గత్యంతరం లేదని నొక్కి వక్కాణించార”ని అన్నారు.
కుడిపూడి ప్రభాకర్ రావు (పిడిపి) మాట్లాడుతూ పోచంపాడు దక్షిణ కాల్వకు కె.వి. రంగారెడ్డి పేరు పెట్టార’ని అన్నారు. శాసన సభ్యులు రజబ్ అలీ, కె. రామనాథం,
డా|| టి.ఎస్. మూర్తి, జె. చొక్కారావు, అరిగె రామస్వామి, సి. జంగారెడ్డి, అన్నదాత మాధవరావు, వావిలాల గోపాల క్రిష్టయ్య, బద్రివిశాల్ పిట్టీ, పి. గోవర్థన రెడ్డి, వాసుదేవ నాయక్. సి.వి.కె. రావు, శ్రీమతి ఈశ్వరీబాయి తదితరులు కె.వి. రంగారెడ్డి మరణం పట్ల సంతాపం తెలియజేస్తూ ప్రసంగించారు. అనంతరం సభను వాయిదా వేశారు.