సాధారణ నియమాలు
1. అభ్యర్థి కానీ పార్టీ గానీ కుల మత భాషా విద్వేషాలను రెచ్చగొట్టకూడదు.
2. విధానాలు, ప్రోగ్రామ్‌ల పైనే విమర్శలుండాలి. గతంలో చేసిన పని రికార్డుపై
ఉండాలి. వ్యక్తిగత జీవితం పై విమర్శలు ఉండకూడదు.
3. కుల మత ప్రాతిపదికపై ఓట్లు అడగకూడదు. మందిరాలు, మసీదులు,
చర్చీలు, ఇతర ప్రార్థనా ప్రదేశాలను ఎన్నికల ప్రచారం కొరకు వాడరాదు.
4. ఓటు కొరకు డబ్బు ఇవ్వడం, బెదిరించడం నిషేధం. ఒక వ్యక్తి ఓటును
మరొక వ్యక్తి వేయడం చట్ట వ్యతిరేకం.
5. వ్యక్తుల అనుమతి లేకుండా వాళ్ళ భూమిని, బిల్డింగులను ప్రచారానికి
ఉపయోగించరాదు.
6. ఇతర పార్టీల ఎన్నికల ప్రచారాన్ని, మీటింగ్‌లను ఆటంకపరచకూడదు.
సమావేశాలు
1. ప్రతి మీటింగుకు ముందుగానే లిఖితపూర్వకంగా పోలీస్ అనుమతి తీసుకోవాలి.
2. నిషేధాజ్ఞలు / ఆంక్షలు ఉన్న ప్రదేశాల వివరాలు తెలుసుకొని ఆ ప్రదేశాలలో మీటింగ్ పెట్టుకోకూడదు.
3. మీటింగులో మైకు, లౌడ్ స్పీకర్ల వినియోగానికి
ముందుగా అనుమతి తీసుకోవాలి.
4. సమావేశానికి ఎవరైనా ఆటంకం కలిగిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. పార్టీగా వారిపై చర్యలు తీసుకో కూడదు.
ఊరేగింపులు
1. ఊరేగింపు రూటును ముందుగానే
పోలీసులకు తెలియజేయాలి.
2. ఉరేగింపు రూటులో ఏవైనా నిషేధాజ్ఞల
గురించి ముందుగా తెలుసుకోవాలి.
3. పోలింగ్ సమయానికి 48 గంటల ముందు మద్యం
అమ్మకాలు ఉండకూడదు.
4. ఎన్నికల అధికారులు ధృవీకరించిన పాస్ లేకుండా
పోలింగ్ బూత్‌లోకి ఎవరూ ప్రవేశించరాదు.
5. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను ఎన్నికల
పరిశీలకులకు చెప్పాలి.
అధికార పార్టీ
1. ఎన్నికల ప్రాచారాన్ని అధికార పర్యటనలతో
కలిపి చేయకూడదు.
2. అధికార యంత్రాంగాన్ని వాడకూడదు. ప్రభుత్వ
వాహనాలు వాడకూడదు. రెస్ట్ హౌస్ బంగళాలు
అందరికీ ఇవ్వాలి. వీటిపై ఏ ఒక్కరి పెత్తనం
ఉండకూడదు.
3. ప్రభుత్వ ఖర్చుతో మీడియాలో ప్రకటనలు ఇవ్వకూడదు.
4. ఈ రకమైన గ్రాంటులు, పేమెంట్లు కొత్తగా
శాంక్షన్ చేయరాదు.
5. వాగ్దానాలు చేయకూడదు.
6. నూతన భవనాలకు, కార్యక్రమాలకు
శంకుస్థాపనలు చేయరాదు.
7. రోడ్ల నిర్మాణానికి, మంచినీటి సౌకర్యం
కల్పిస్తామని వాగ్దానాలు చేయరాదు.
8. మంత్రులు పోలింగ్ స్టేషన్‌లోకి ప్రవేశించకూడదు.
ఎన్నికల నియమ నిబంధనావళి
1. రాజకీయ పార్టీలన్నీ అంగీకరించిన మార్గదర్శక సూత్రాలు ఈ నిబంధనావళిలో చేర్చబడ్డాయి.
2. ఎన్నికలు స్వేచ్ఛగా పక్షపాతం లేకుండా పారదర్శకంగా
ఎన్నికల నిర్వహణలకు ఈ నియమావళి దోహద
పడుతుంది.
3. ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చెయ్యకూడదు.
ఎన్నికల నియమావళి మొత్తం రాష్ట్రానికి వర్తిస్తుంది.
4. అధికారిక పర్యటనలో ఎన్నికల పనిని కలుపకూడదు.
5. ప్రభుత్వ వాహనాలు ఉపయోగించకూడదు. ప్రభుత్వ
అధికారులు, ఉద్యోగుల బదిలీలపై పూర్తి నిషేధం
ఉంటుంది.
6. మంత్రులు ఎన్నికల అధికారులను పిలవడానికి వీలులేదు.
7. ప్రైవేటు పనికై వచ్చిన మంత్రి ఏ అధికారిని కలవకూడదు.
8. వాహనాలను ఇంటి నుంచి తమ కార్యాలయానికి మాత్రమే
ఉపయోగించాలి.
9. పైలెట్ కార్లు ఎర్ర బుగ్గ కార్లు ఉపయోగించకూడదు.
10. అధికార పార్టీ చేసిన పనుల గురించి తెలిపే ప్రభుత్వ ప్రచార హోర్డింగులు తీసివేయాలి.
11. ఎంపిఎల్‌ఎడిఎస్ క్రింద నిధులు ఇవ్వకూడదు. కొత్త పనులు చేపట్టకూడదు. కొత్త వాటికి ఆమోదం ఇవ్వకూడదు. ఇంతకు మునుపే మొదలైన పనులను కొనసాగించవచ్చు. పూర్తయిన పనులకు చెల్లింపులు చేయవచ్చు.
12. ప్రకృతి వైపరీత్యాలు వస్తే సహాయక కార్యక్రమాలు చేపట్టవచ్చు.
13. అధికార కార్యక్రమాలకు హాజరు కావచ్చు. కానీ రాజకీయ ఉపన్యాసాలు చేయకూడదు.
14. సందేహాలు, అనుమానాలు నివృత్తికై చీఫ్ ఎలెక్ట్రోరల్ ఆఫీసర్‌ను సంప్రదించాలి.
ఎన్నికల ప్రచారం
1. నామినేషన్ దాఖలు చేయడం :
రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం నుంచి వంద మీటర్ల పరిధిలోకి మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. అభ్యర్థితో సహా 5 గురు వ్యక్తులకు మాత్రమే కార్యాలయంలోకి వెళ్లే అనుమతి ఉంటుంది.
2. నామినేషన్ల పరిశీలన :
అభ్యర్థి, ఎలక్షన్ ఏజెంట్ ఒక ప్రతిపాదకుడు, మరో వ్యక్తి (అడ్వకేట్ కావచ్చు) పరిశీలనకు వెళ్ళవచ్చు. దీనికి అభ్యర్థి వ్రాతపూర్వక అనుమతి అవసరం.
3. వాహనాలు :
ఎన్ని వాహనాలైన ఎన్నికల ప్రచారానికి వాడవచ్చు. ఇందుకోసం రిటర్నింగ్ అధికారి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఒరిజినల్ అనుమతి పత్రాన్ని స్పష్టంగా కనబడేటట్టు వాహనానికి అంటించాలి. పర్మిట్ మీద వాహన నెంబర్ అభ్యర్థి వివరాలు ఉండాలి. పర్మిట్ వాహనాన్ని అదే అభ్యర్థికి వాడాలి. దానిని ఇంకో అభ్యర్థికి ఉపయోగిస్తే భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 171 హెచ్ కింద చర్యలు తీసుకోబడతాయి. అనుమతి లేకుండా ఏ వాహనాన్ని ఎన్నికల కొరకై వాడకూడదు. మోటార్ వెహికిల్ యాక్ట్‌కు లోబడి వాహనాలకు అదనపు ఫిట్టింగులు పెట్టుకోవచ్చు.
4. విద్యా సంస్థలు, వారి మైదానాలను ప్రచారానికి వాడకూడదు.
5. ప్రైవేటు భూములు, బిల్డింగుల యజమానుల లిఖితపూర్వక అనుమతి తీసుకొని రిటర్నింగ్ ఆఫీసర్‌కు అందించిన తర్వాతనే గోడ పోస్టర్లు ప్రచారాలు చేయాలి.
6. ఎన్నికల పాంప్లెట్‌లు, కరపత్రాలపై ముద్రణాలయాల పేరు, అడ్రసు విధిగా ఉండాలి.
7. ప్రచారంలో భాగంగా టోపీలు, కండువాలు ఇవ్వవచ్చు. వీటిని ఎన్నికల ఖర్చులో చూపించాలి. చీరలు, చొక్కాలు ఇవ్వకూడదు.
8. దేవుళ్ళ ఫోటోలు, అభ్యర్థి ఫోటోలతో డైరీలు, క్యాలెండర్లు ప్రచురించరాదు. వాహనాల స్టెఫినీ కవర్లపై కూడా మత సంబంధిత ఫోటోలు, అభ్యర్థి ఫోటోలు ఉండడానికి వీలు లేదు.
9. తాత్కాలిక కార్యాలయాలు : ప్రార్థనా స్థలాలకు, పాఠశాలలకు, పోలింగ్ స్టేషన్లకు 200 మీటర్లలోపు అభ్యర్థి టెంపరరీ ఆఫీసు ఉండకూడదు. ఆఫీసుపై తమ పార్టీ జెండాను, బ్యానర్‌ను, పార్టీ చిహ్నాన్ని పెట్టుకోవచ్చు.
10. ఎన్నికల ప్రచార తేదీ ముగిసిన తర్వాత ఓటర్లు కానివారెవ్వరూ నియోజకవర్గంలో ఉండకూడదు. అభ్యర్థికి, ఎలక్షన్ ఏజంట్‌కు ఇది వర్తించదు.
11. రాత్రి 10 గంటల తర్వాత, ఉదయం 6 గంటల లోపు మైకులు, లైడ్ స్పీకర్లు వాడకూడదు.
12. రాత్రి 10 గంటల తర్వాత పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయరాదు. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు ప్రచారం సమాప్తం కావాలి.
ఉదాహరణకు 15 డిసెంబర్ ఉదయం 8.00 సాయంత్రం 5.00 గంటల వరకు ఎన్నికలు జరిగితే ప్రచారం 13 డిసెంబర్ సాయంత్రం 5 గంటలకు పూర్తి చేయాలి.
13. పోలింగ్ ఏజెంట్‌గా ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఓటర్‌గా నమోదై, ఫోటోతో కూడిన ఓటరు గుర్తింపుకార్డు కలిగి ఉండాలి.
14. ఎస్‌ఎంఎస్‌ల ద్వారా అభ్యంతరకర వార్తలను ప్రచారం చేయరాదు. పోలీసు శాఖ అందించనున్న ప్రత్యేక
మొబైల్ నెంబర్లకు అభ్యంతకర ఎస్‌ఎంఎస్‌లను, అలాగే ఆ మొబైల్ నెంబర్‌ను పంపి ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.
15. ఎన్నికల బూత్ : పోలింగ్ స్టేషన్ నుంచి 200 మీటర్ల దూరంలో పెట్టుకోవచ్చు. ఒక టేబుల్, రెండు కుర్చీలు, అభ్యర్థి పేరు, పార్టీ జెండాతో కూడిన ఒక బ్యానర్‌ను పెట్టుకోవచ్చు.
16. పోలింగ్ స్టేషన్ నుంచి 100 మీటర్ల లోపు ప్రచారం నిషేధం. ఈ పరిధిలో మొబైల్ ఫోన్ వాడకూడదు. ఆయుధాలతో సంచరించకూడదు.
17. ఎన్నికల రోజు వాహనాల వాడకం : అభ్యర్థికి ఒక వాహనం, ఎన్నికల ఏజెంట్‌కు ఒక వాహనం అలాగే పార్టీ వర్కర్లకోసం మరో వాహనాన్ని వడవచ్చు. ఒక్కో వాహనంలో డ్రైవర్‌తో సహా 5గురు కన్నా ఎక్కువ మంది ఉండకూడదు.
18. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఓటర్లను వాహ నాల ద్వారా ఎన్నికల బూత్‌కు తీసుకురాకూడదు. ఇది చట్టరీత్యా నేరం.