morarji-desai

మొరార్జీ దేశాయ్‌ జీవితాన్ని కాచి వడపోసి – ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన స్థితప్రజ్ఞుడు.జయప్రకాశ్‌ నారాయణ్‌తో కలిసి అత్యవసర పరిస్థితిపై నైతిక పోరాటం జరిపిన వ్యక్తి. త్రికరణశుద్ధిగా గాంధేయవాద జీవితం గడిపిన ఆదర్శమూర్తి. ఆయన అభిమానానికి పాత్రుడు. కానీ, ఎవరినీ అనుకరించలేదు. అందరి గౌరవాన్ని చూరగొన్న వ్యక్తి. కానీ ఎవరికీ ఒకపట్టాన అంతుపట్టలేదు.

గుజరాత్‌లోని భడేలీ గ్రామంలో 1896లో జన్మించిన మొరార్జీ దేశాయ్‌ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నా బ్రిటిష్‌ పాలకుల ఆధిపత్యంలోని, ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌లో చేరడానికి ఆయనేమీ సందేహించలేదు. 1918లో డిప్యూటీ కలెక్టరుగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో ప్రారంభమైంది. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత దేశ ప్రప్రథమ కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా ప్రధాని కార్యాలయంలో అడుగుపెట్టారు.

రాజకీయ జీవితంలో భాగంగా ఆయన 1937లో బొంబాయి శాసనసభకు ఎన్నికయ్యారు. పదిహేనేళ్ళ అవిభక్త బొంబాయి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటికి ఆయన అసాధ్యాల్లోకెల్లా అసాధ్యమైన గాంధేయవాద సూత్రాలను తన జీవిత సరళిగా మార్చుకోవడంలో కృతకృత్యులయ్యారు. బొంబాయి ముఖ్యమంత్రిగా మద్యపాన నిషేధాన్ని ప్రవేశపెట్టి, చలనచిత్రాల్లో ముద్దులను రద్దుచేసి, అర్థరాత్రివేళ రెస్టారెంట్లు మూసివేయాలని ఆదేశించి సంచలనం సృష్టించిన మొరార్జీ, కేంద్ర ఆర్థికమంత్రి అయిన తరువాత బంగారంపై నియంత్రణకు ఆదేశించి మరో కలకలానికి కారకులయ్యారు. నిలువెత్తున స్వర్ణాభరణాలు ధరించి పార్లమెంటుకు వచ్చిన మహిళా సభ్యురాలిని నిర్మొహమాటంగా మందలించిన ధీరుడాయన. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించిన ఏకైక ఆర్థికమంత్రి. మొరార్జీ పరిపాలనాదక్షుడు. భయమెరుగని నాయకుడు. ఆయన కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు అమెరికా పర్యటనలో ఉండగా అమెరికా అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌. కెనడీతో సంభాషణలో గోవాపై భారత్‌ తీసుకున్న సైనిక చర్య వచ్చింది. ఆ విషయాన్ని అమెరికాకు మీరు ముందుగా తెలియజేయలేదని కెనడీ ప్రశ్నించాడు. దీనికి మొరార్జీ-‘నిజమే! మీరు కూడా అదే పని చేశారు. క్యూబాపై అమెరికా సైనిక చర్యకు దిగినప్పుడు మీ ప్రభుత్వం భారత ప్రభుత్వం అనుమతి కోరలేదు కదా! అని సమాధానమిచ్చి కెనడీని నిరత్తురుణ్ణి చేశారు.

సాధారణ ప్రమాణాలకు విరుద్ధంగా కనిపించే తన అలవాట్లమీద ఎన్నో జోక్స్‌ పుట్టుకొస్తున్నాయన్న విషయం ఆయనకు తెలుసు. ఎవరు ఎంత పరిహాసమాడినా ఆయన మూత్రం తాగే అలవాట్లనేవీ మార్చుకోలేదు. ఒకసారి మూత్ర పాన చికిత్సపై అమెరికన్‌ పాత్రికేయుడు ప్రశ్నించినప్పుడు ఆయన, ‘అవును, నా మూత్రం నేను తాగుతాను. నేనేమీ మిమ్మల్ని నా మూత్రం తాగమనలేదే’ అని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. ఆయన దేశ ప్రధాని అయినప్పుడు ఆయన ప్రభుత్వం ఇరుగు పొరుగు దేశాలతో అప్పటివరకు ఉన్న వైషమ్యాలకు స్వస్తిచెప్పి అద్భుతమైన సంబంధాలను ఏర్పరచుకుంటే, ఈ వాస్తవాన్ని గుర్తించో ఏమో, పాకిస్థాన్‌ ఆయనకు తమ దేశంలో అత్యున్నత స్థాయి పురస్కారమైన ‘నిషాన్‌-ఎ-పాకిస్థాన్‌’ను అందజేసింది. అదే ఏడాది ఆయనకు స్వదేశంలో అత్యున్నత పురస్కారమైన భారత రత్న లభించింది.

జి. వెంకటరామారావు

Other Updates