కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి వందకోట్ల రూపాయలు కెేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. జూన్ 18న ఆయన ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటి సారిగా వేములవాడకు కుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ అభివృద్ధికి చేపట్టవలసిన పనులు విషయంలో జిల్లా అధికారులతో చర్చించారు. తన వివాహం ఈ ఆలయంలోనే 47 సంవత్సరాల క్రితం జరిగిందని సిఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆలయంలో స్థలం ఎక్కువగా లేదని, దీని కోసం పక్కనున్న చెరువు నుంచి స్థలాన్ని సేకరించి ఆలయంలో స్థలాభావం లేకుండా చూడాలన్నారు. చెరువుకు వెనక భాగంలో ఉన్న స్థలాన్నికలిపి చెరువును అభివృద్ధిపరచి అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. దీన్ని ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. బడ్జెట్‌లో ప్రతిఏటా రూ.100కోట్లు అభివృద్ధిపనులకు కేటాయిస్తామని పేర్కొన్నారు.
ఆలయ ప్రాంగణాన్ని విస్తరించేవిషయంలో ఆగమశాస్త్ర ప్రకారం జరిగేలా శృంగేరి, కంచికామకోటి పీఠాధిపతును సంప్రదిస్తామన్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న కల్యాణకట్టను తొలగిస్తామని, విశాలమైన కల్యాణ మండపాన్ని నిర్మిస్తామని తెలిపారు. సిరిసిల్ల`వేములవాడ రోడ్డును నాలుగులైన్ల రోడ్డుగా విస్తరించే పనులు ప్రారంభమయ్యాయని, ఆలయం పక్కనున్న చెరువు కట్ట విస్తీర్ణాన్ని పెంచి చెరువుకట్ట వద్ద ఆహ్లాదకరమైన వాతారవణం ఉండేలా చూస్తామన్నారు. శృంగేరీపీఠం వారి మార్గదర్శనంలో వేదపాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. వేములవాడ సమీపంలోని సంకెనపల్లి వద్ద చెక్‌డ్యాం నిర్మాణం చేపడతామని వెల్లడించారు.
త్వరలో టెంపుల్ అథారిటీ
వేములవాడ అభివృద్ధికోసం ప్రత్యేకంగా వేములవాడ టెంపుల్ అథారిటీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ అథారిటీ ద్వారా అభివృద్ధిపనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని,వేములవాడ ప్రాంతం అతిసనాతన మహాక్షేత్రమన్నారు. ఇక్కడికి ఎక్కువ మంది భక్తులు వస్తున్నారని, భక్తులు రద్దీకి తగ్గట్టుగా వసతి సౌకర్యాలు ఏర్పా టుకు అన్ని చర్యలు చేపడతామన్నారు. నాంపల్లిలోని 124 ఎకరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ పర్యాటక కేంద్రంగా భాసిల్లేలా చర్యలు తీసుకుంటామన్నారు. వేములవాడను వేద, సంస్కృత పాఠశాలకు నిలయంగా మారుస్తామన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కుమార్తె, నిజామాబాద్ ఎం.పి. కవిత, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వీరు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆలయ సిబ్బంది ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికారు.