rajapetaయాదగిరి గుట్టకు 20 కిలో మీటర్ల దూరంలో వెలసిన ఈ కోట 1775లో రాజరాయన్న అనే రాజు నిర్మించడమేగాక రాజాపేట గ్రామాన్ని కూడా ఏర్పాటు చేశారు.అలనాటి మహోన్నత వైభవానికి, గత కాలపు చరిత్రకు సజీవ సాక్ష్యంగా నేటికీ దర్పంగా నిలుస్తోంది రాజాపేట కోట.

ప్రాచీన భారతదేశ చరిత్రలో దక్కను ప్రాంతానికి ముఖ్యంగా హైదరాబాదు సంస్థానానికి ప్రత్యేక స్థానం ఉంది. నిజాం వంశ స్థాపకుడైన మొదటి నిజాముల్‌ముల్కు తండ్రి ఇరాన్‌ ఖలీఫా వంశానికి చెందిన వాడు. క్రీ.శ.1724 అక్టోబర్‌ 11న ఔరంగాబాదు సమీపాన ‘సెక్కర్‌ఖేడ్‌’ వద్ద జరిగిన యుద్ధంలో ఆయన ‘ముబారిజ్‌ఖాన్‌’ను ఓడించి చంపేశాడు. ఢిల్లీ చక్రవర్తి మహమ్మదుషా నిజాంకు ‘ఆసిఫ్‌జా’ అనే బిరుదు ప్రసాదించి దక్కన్‌ సుబేదారుగా నియమించాడు. అప్పటి నుండి నిజాం రాజ్యం ఉత్తరాన నర్మదానది వరకు దక్షిణాన కర్ణాటక వరకు తూర్పుపడమరల సముద్రం వరకు వ్యాపించింది. క్రీ.శ.1724 నుండి నిజాం రాజ్యం సుస్థిరత పొంది క్రీ.శ.1948 సెప్టెంబర్‌ 18 వరకు అనగా 224 సం||ల పాటు రాజ్యపాలన సాగింది. ఏడవ నిజాం అయిన మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ కాలంలో నిజాం రాజ్యం 16 జిల్లాలుగా 82698 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగి ఉండేది. ఆనాటి హైదరాబాదు రాష్ట్రం సర్ఫేఖాన్‌ (నిజాం స్వంత జాగీరు) పాయెగాలు (రాజ బంధువుల జాగీర్లు), జాగీర్లు (వ్యక్తులవి) మరియు రాజాల సంస్థానాలుగా విభజింపబడింది. నిజాం సంస్థానం 59.21% మాత్రమే దివానీ లేక ఖల్సా ప్రాంతాలుగా ఉండి పరిపాలన నేరుగా ఉండేది. సంస్థానంలో నాలుగు విధాలైన పాలన ఉన్నా మొత్తం పాలన నిజాం ప్రభుత్వ కనుసన్నల్లో ఆయన అజమాయిషీలో జరిగేది. జాగీర్‌దార్లు, సంస్థానాధీశులు, ఆయన హుకుంలను అమలు చేసేవారు. అలాంటి నిజాం రాచరిక పాలనలో గొప్ప చరిత్రకు సాక్షీభూతంగా నిలిచిన సంస్థానం ‘రాజాపేట కోట’.

అలనాటి మహోన్నత వైభవానికి, గత కాలపు చరిత్రకు సజీవ సాక్ష్యంగా నేటికీ దర్పంగా నిలుస్తోంది రాజాపేట కోట. యాదాద్రి జిల్లా రాజాపేట కేంద్రంలో నిర్మించిన ఈ కోట నేటికీ వేలాది పర్యాటకులను అమి తంగా ఆకర్షిస్తోంది. పర్యాటకులను కోటలోని అద్భుత శిల్పకళ అబ్బురపరు స్తోంది. ఎందరో రాజుల దండయాత్రలను, రణతంత్రాలను, గెలుపోటములను తనలో దాచుకున్న రాజాపేట కోట నిజాం నవాబుల కాలంలో మరింత ప్రత్యేకంగా నిలిచింది. రాజకీయ శక్తుల సమీకరణలో రాజ్యస్థాపనలో ముఖ్యపాత్ర వహించింది. యాదగిరి గుట్టకు 20 కిలో మీటర్ల దూరంలో వెలసిన ఈ కోట 1775లో రాజరాయన్న అనే రాజు నిర్మించడమేగాక రాజాపేట గ్రామాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కోట చుట్టూ 18 అడుగుల ఎత్తుతో శత్రు దుర్భేద్యమైన రాతి గోడను కట్టించారు. శత్రువుల దాడి నుండి తప్పించుకోవడానికి కోట లోపలి నుంచి రహస్య సొరంగ మార్గాలు తవ్వించారు. కోట లోపల అతి సుందర రాజ భవనాలు, రాణుల అంతఃపురాలు, మంత్రులు, సేనాపతుల ఆవాసాలతో పాటు, స్నానవాటికలు నిర్మించారు. శత్రుసైన్యం లోపలికి ప్రవేశించకుండా కోట గోడల ముందు 20 అడుగుల లోతైన పెద్ద కందకం తవ్వించి అందులో ఎల్లప్పుడూ నీరు ఉండటానికి వీలుగా ఎగువన పడమటి వైపు గోపాలచెర్వు నుంచి కందకంలోకి నీరు నిరంతరం పారించారు. అందులో వారు మొసళ్ళను పెంచేవారు. విష సర్పాలను వదిలేవారు. కోట ముఖ ద్వారానికి 32 అడుగుల ఎత్తయిన ధృడమైన ద్వారాలను అమర్చారు. మొదటి ముఖ ద్వారం నుంచి మూడో ముఖ ద్వారం వరకు విశాలమైన సుదీర్ఘమైన రాచమార్గం ఉంది. రెండున్నర శతాబ్ధాల క్రితం నిర్మించిన రాజు నివాసం, అంతఃపురం, అద్దాల మేడ, అతిథి గృహాలు, స్నానవాటికలు, గిరిగిరిమాల్‌, ఎత్తైన బురుజులు, కారాగారం, మంచినీటి కొలను, నాటి సైనికుల శిక్షణ స్థలం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అడుగడుగునా సైనికుల పహారా నిరంతరం కొనసాగడానికి వీలుగా నిర్మించిన కట్టడాలు మనల్ని అబ్బురపరుస్తాయి.

ఇక్కడి స్థల పురాణాన్ననుసరించి పూర్వం రాజాపేట గ్రామ ప్రాంతం దట్టమైన అడవిగా ఉండేది. ‘రాజా రాయన్న కోట’ నిర్మాణానికి తగిన ప్రదేశాన్ని వెదుకుతూ ఆలేరు ప్రాంతాన ఉన్న గుండ్లగూడెం దగ్గర కొంత భాగంలో కోట నిర్మాణం చేశాడు. అనంతరం ఆ గ్రామం పేరును తెలుసుకొని కోట నిర్మాణానికి అది అనువైన ప్రాంతం కాదని భావించి కోట కట్టడం ఆపుచేసి తనపేరుతోనే కోట నిర్మాణం మరో ప్రాంతంలో జరగాలని నిర్ణయించుకొని రాజాపేట ప్రాంతానికి వచ్చాడు. ఒక చోట అతనికి అమ్మవారి దేవాలయం కన్పించింది. ఆ దేవాలయ సమీపంలోని కొండల్లో కొందరు మునులు తపస్సు చేస్తూ కనిపించారు. ఆ మునులకు రాయన్న భక్తి ప్రపత్తులతో నమస్కరించి తన మనసులోని కోరికను వెల్లడించాడు. అందుకు ఆ మునులు సంతోషించి రాయన్నకు కోట నిర్మాణానికి అనువైన స్థలాన్ని చూపించారు. వారు చూపించిన స్థలంలో ఆయన కోట మరియు నగరాన్ని నిర్మించి క్రమంగా రాయన్నపేటగా నామకరణం చేశాడు. రాయన్నపేటే క్రమంగా రాజాపేటగా మారింది.

నాటి నిజాం నవాబుల పాలనలో మొత్తం 14 సంస్థానాలు ఉండేవి. అందులో సంస్థాన్‌ నారాయణపురం, సంస్థాన్‌ రాజాపేటలను ప్రధాన పాలనా కేంద్రాలుగా చేసుకొని వారు పాలనా కార్యకలాపాలు జరిపేవారు. గద్వాల, వనపర్తి, జటప్రోలు, అమరచింత పాల్వంచ సంస్థానాలు స్వంత పాలనాధికారాలు కలిగి ఉండేవి. ఇక్కడ సంస్థానాధీశుల ప్రధాన విధి ప్రజల రక్షణ మరియు వ్యవసాయం. తమ సంస్థానంలోని ప్రభుత్వ భూము లను వారు కౌలుకిచ్చి సేద్యం చేయించేవారు. ‘రాజరాయన్న’ తరువాత రాజా వెంకటనారా యణరావు బహదూర్‌ కొంతకాలం రాజ్యాధికారం చేసాడు. ఆయన అనంతరం భార్య జానకమ్మ సం స్థాన పాలన కొనసాగించింది. నాడు దేవాలయాలు, గొలుసుకట్టు చెరువుల నిర్మాణం సంస్థానంలో అనేకంగా చేపట్టారు. కొంత భూమిని పేదలకు దానం చేశారు. వీరి పాలనలోనే సంస్థాన్‌ నారాయణపురం ఏర్పాటు జరిగింది. వీరి కాలంలో పాలన అత్యంత వైభవంగా జరిగిందని పెద్దలు చెబుతుంటారు. అనంతరం రాజా వెదిరి వెంకటనారాయణరావు కుమారుడు రాజా జశ్వంత్‌రావు ఈ ప్రాంతాన్ని చాలాకాలం పాటు పరిపాలించారు. వీరి కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడింది. అక్కడి నుంచే సంస్థానానికి సంబంధించిన ఆస్తులని, కోటని స్థానికుల సహాయంతో కాపాడుకుంటున్నారు.

రాజాపేట కోటలోని నాటి శిల్పుల అసమాన ప్రతిభకు పట్టం కట్టే అద్భుత శిల్పాలు అడుగడుగునా మనకు దర్శనమివ్వ డమేగాక వారి ప్రతిభ మనల్ని అబ్బురపరుస్తోంది. అడుగడు గునా వివిధ కట్టడాలపై కనిపించే రాచరిక చిహ్నాలు ఈ ప్రాంత ఔన్నత్యాన్ని కళ్ళకు కట్టినట్టుగా చాటుతున్నాయి. ప్రధాన దుర్గంలో పటిష్ఠంగా ప్రణాళికాబద్ధంగా నిర్మించిన ప్రతి గడి ఎంతో సుంద రంగా ఉంటుంది. దర్వాజాలు, బాల్కానీలు, బురుజుల నిర్మాణ శైలి మనల్ని కట్టిపడేస్తుంది. కోటలోని అద్దాల మేడపైకి ఎక్కేందుకు వీలుగా గుండ్రంగా మెట్లు నిర్మించారు. భవనంలోని గదుల్లో చెక్కిన శిల్పాలు సింహాసనాలు పోలిన కుర్చీలు అనేకం కన్పిస్తాయి. విజయనగర రాజుల శిల్పరీతి కొద్దిగా ఈ నిర్మాణాల్లో మనకు కానవస్తుంది.

మొదటి నిజాం కాలాన గట్టుప్పల్‌ ప్రాంతంలో సింగీత్‌రావు మన్నెవార్‌ అనే గజదొంగ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో దోపిడీలు చేస్తూ ప్రజల ధన, మాన, ప్రాణాలను హరించేవాడు. ‘మన్నె వార్‌’ ఆగడాలతో ప్రజలకు ప్రతిరోజు ‘కాళరాత్రులే. అదే సమయంలో మంచల్‌ రెడ్డి ధైర్య సాహసాలతో గజదొంగను వేటాడి అతని తల నరికి రాజుచేత నారాయణ పురం ప్రాంతాన్ని ఇనాంగా పొందాడు. కొంత కాలానికి మంచల్‌రెడ్డి చనిపోగా అతని సోదరుడైన సోమిరెడ్డిని నిజాం ప్రభువు నారాయణపురం పటే లుగా నియమించాడు. క్రి.శ. 1701లో సోమిరెడ్డి నారాయణపురం గ్రామాన్ని నిర్మించాడు. సోమిరెడ్డి కొడుకు రాయన్‌రెడ్డి అమిత ధైర్య సాహసాలు కలవాడు. నిజాం పరిపాలనను ధిక్కరించిన నాటి విజయనగర రాజును పట్టుకొని వచ్చినందుకు రాజు మెచ్చి రాయన్‌రెడ్డికి సర్‌ మన్నెవార్‌, సర్‌ దేఖ్‌ముఖ్‌, సర్‌ దేశ్‌పాండె, సర్‌ నాదెగడుపు మొదలైన బిరుదులిచ్చి రాచకొండ, భువనగిరి, అడవిమర్రి, షాద్‌నగర్‌, నర్సికొండ ఇందుర్తి, ఇంద్రియాల్‌, ఇబ్రహీంపట్నం మొదలైన పరగణాలకు అధిపతిగా నియమించాడు. రాయన్న తర్వాత అతని కుమారుడు రాజు వెదిరె వెంకట నారాయణరావు బహద్దూర్‌ రాజాపేట రాజ్యాధికారం చేపట్టాడు. ఈయన రాజాపేట గ్రామంలోని వేంకటేశ్వరస్వామి (మఠం) దేవాలయానికి క్రీ.శ. 1782లో షాకరుదాసు బైరాగికి కొంతభూమిని దానం చేశాడు. ఈ భూదాన పత్రిక రాసినవాడు గంగరాజు రాములు కులకర్ణి. అందుకు ప్రతిగా ప్రతి సంవత్సరం భూమి పంటఫలం అనుభవిస్తూ దేవాలయంలో నిత్య నైవేద్య దీపారాధన జరపటంతోపాటు భక్తులకు ఆశీర్వచనం చేస్తూ సుఖంగా ఉండునట్లు ఆ దానపత్రంలో ఆయన పేర్కొన్నాడు. క్రీ.శ.1775లో రాజాపేట కోట నిర్మాణం చేసిన రాయన్న తర్వాత అతని కొడుకు వెదిరే వెంకటనారాయణరావు రాజైనట్లు ఈ దాన శాసనం ద్వారా తెలుస్తుంది.

రాజా వెదిరె వెంకటనారాయణరావు తన పేరుతో నారాయణపురం సంస్థానాన్ని స్థాపించాడు. నారాయణరావుకు సంతానం లేని కారణంగా రాజాపేటలోని తన సోదరుని కుమారుడు రామేశ్వరరావు రాంచందర్‌ను దత్త పుత్రుడుగా స్వీకరించాడు. తర్వాత కొంత కాలానికి నారాయణరావుకు కొడుకు పుట్టగా రాజా రాయన్న అని నామకరణం చేశాడు. నారాయణరావు చనిపోగానే రాజారాయన్నకు రాజ్యాధికారం ఇచ్చాడు. రామేశ్వర రావు రాంచందర్‌కు రాజ్యం రాదని తెలియగానే విలువైన ఆస్తులన్నీ రాజపేటకు తరలించారు. తనకే వారసత్వపు హక్కులు చెందుతాయని వివాదం లేవనెత్తాడు. నాటి నిజాం ప్రభువు రాయన్నను చదివించేందుకు హైదరాబాదుకు తీసుకొని పోయాడు. మీర్‌లాయక్‌ అలీ, సర్‌ సాలార్జంగులతో చదువుకొన్న రాయన్న యుక్త వయస్సు రాగానే ఇస్లాం మతం పట్ల ఆకర్షించబడి ఆ మతంలో చేరాడు. ఇది గోపమ్మకు ఇష్టం లేదు. ఇప్పటి నుండే రాజపేటకు నారాయ ణపురానికి సంబంధాలు తెగిపో యాయి.

ఇస్లాం మతంలో చేరిన రాయన్న అనేక మందిని వివాహం చేసుకున్నాడు. వారిలో రాజమ్మ, చింతపల్లి జమీందారు కూతురు సీతమ్మ, గార్లపల్లి నర్సయ్య కూతురు రంగమ్మ, షేక్‌ మహమ్మదు కూతురు రసూల్‌ బీ, జైనాల్‌ భేగం, హుసేనీ భేగంలు ప్రసిద్ధులు.

రాజాపేట సంస్థానాధీశులు మహా శివభక్తులు. ప్రతిదినం శివపూజ లేనిదే వారు భోజనాలు చేసేవారుకారు. రాజాపేట నుండి నారాయణపురానికి వెళ్ళే దారిలోని వలిగొండ గ్రామాన శివాలయం నిర్మించి, దేవుని పేర భూదానాలు చేశారు. నారాయణపురానికి వెళ్ళే సందర్భంలో వలిగొండలో వారు తప్పకుండా మజిలీ చేసేవారు.

రాజాపేట సంస్థానం కింద తొమ్మిది గ్రామాలుండేవి. అవి రాజాపేట, కుర్రారం, నమిలె, మసాయిపేట, కోరుకొండ, పెద్దపాడు, సాదువెల్లి, చల్లూరు, వెంకిరాల, రాజాపేటలో తహశీలు ఆఫీసు కూడా ఉండేది.

రాజాపేట కోట నిర్మాణం ప్రణాళికాబద్ధంగా, శతృదు ర్భేద్యంగా నిర్మించినట్లు కనిపిస్తుంది. ప్రధానమైన కోట చుట్టూ లోతైన ఆగడ్త ఉంది. గ్రామానికి పడమర వైపున ఉన్న గోపాల చెరువు నీరు ఆగడ్తలోనికి ప్రవహించేటట్లు ఏర్పాటు చేశారు. కోటకు రెండు ఎత్తయిన ప్రధాన ద్వారాలున్నాయి. వాటి పక్కన రెండు బురుజులు నిరంతరం సైనికులుకాపలాకా యుటానికి నిర్మించారు. ప్రధాన ద్వారం దాటిన తర్వాత మహా రాజ నివాసమయిన రెండవ కోట కనిపిస్తుంది. దానిక్కూడా ఎత్తయిన ప్రధాన ద్వారం ఉంది. దాని తర్వాత రాణీవాస మందిరాలు, మంత్రులు నివసించే భవనాలున్నాయి. అతిథులు నివసించ డానికి కూడా భవనాలు నిర్మించబడ్డాయి. ప్రస్తుతం ఇవన్నీ జీర్ణావస్థలో ఉన్నాయి. ఈ కోటలో ఒక దేవాలయంతో పాటు లోతైన పెద్దభావి ఉంది. ఆ రాతి నిర్మాణాలు పరికించినప్పుడు నాటి శిల్పుల అద్భుత ప్రతిభతోబాటు అలనాటి గొప్ప శైలి మనల్ని ఆశ్చర్యకితుల్ని చేస్తుంది. ప్రతి నిర్మాణం గొప్ప శిల్ప, కళాఖండంగా చెప్పుకోవచ్చు.

రాజాపేట కోటలోని నాటి శిల్పుల అసమాన ప్రతిభకు పట్టం కట్టే అద్భుత శిల్పాలు అడుగడుగునా మనకు దర్శనమివ్వ డమేగాక వారి ప్రతిభ మనల్ని అబ్బురపరుస్తోంది. అడుగడు గునా వివిధ కట్టడాలపై కనిపించే రాచరిక చిహ్నాలు ఈ ప్రాంత ఔన్నత్యాన్ని కళ్ళకు కట్టినట్టుగా చాటుతున్నాయి.

Other Updates