శ్రీధర్ రావు దేశ్ పాండే
రాజోలిబండ చరిత్ర
ఉమ్మడి రాష్ట్రంలో ఆర్‌డిఎస్‌ది ఒక విషాద గాథ. ఆర్‌డిఎస్ చరిత్రను ఒక సారి మననం చేసుకోవాల్సి ఉన్నది. తుంగభద్ర జలాలను వినియోగించు కోవడానికి హైదరాబాద్ ప్రభుత్వం రాజోలి బండ గ్రామం వద్ద ఆనకట్ట నిర్మాణానికి ప్రతిపాదించింది.1944 లో పూర్వపు హైదరాబాద్ రాజ్యానికి , బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉన్న మద్రాస్ రాష్ట్రానికి తుంగభద్ర జలాల వినియోగం పై ఒక ఒప్పందం కుదిరింది. అప్పటికే బ్రిటిష్ ప్రభుత్వం ఆర్‌డిఎస్‌కు దిగువన సుంకేసుల ఆనకట్ట, కె సి కెనాల్ నిర్మాణం జరిపింది. 1944 ఒప్పందంలో ఆర్‌డిఎస్ ఆనకట్ట వద్ద ఎడమవైపున హైదరాబాదు రాష్ట్రానికి ఆర్‌డిఎస్ కెనాల్ ద్వారా మళ్లించే నీరు మరియు నదిలో ఆనకట్ట దిగువన సుంకేసుల ఆనకట్ట ద్వారా కేసీ కెనాల్‌కు వెళ్లే నీళ్ళు సమానంగా ఉండాలని అంగీకారం కుదిరింది. 1956 లో రాష్ట్రాల పునర్విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా ఆంధ్రప్రదేశ్‌కు, రాయచూర్ జిల్లా కర్నాటక రాష్ట్రాలకు బదిలీ అయినాయి. తుంగభద్ర జలాల వాడకంలో మద్రాస్ రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రాలకు బదులు ఆంధ్రప్రదేశ్ , కర్నాటక రాష్ట్రాలు వచ్చి చేరినాయి.1944 లో హైదరాబాద్ , మద్రాస్ రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బుట్ట దాఖలు చేసింది. ఈ ఒప్పంద వివరాలను 1970 వ దశకంలో కష్ణా జలాల పంపిణీ కోసం ఏర్పాటు అయిన బచావత్ ట్రిబ్యునల్ ముందు పెట్టకుండా కేసీ కెనాల్ కు ఎక్కువ నీటి కేటాయింపు చేయించుకొన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
1944లో కుదిరిన ఒప్పందం ప్రకారం కేసి కెనాల్‌కు రాజోలిబండ కాలువకు తుంగభద్ర నీటిలో సమాన వాటా రావాలి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1944 ఒప్పందాన్ని ఉల్లంఘించింది.1970వ దశకంలో, బచావత్ ట్రిబ్యునల్ ముందు ఆర్డీఎస్ కాలువకు, కేసీ కెనాల్ కు సమానంగా నీటిని కేటాయించాలని వాదించాల్సిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కేసీ కెనాల్ కు 69.4 టీఎంసీలు, ఆర్‌డిఎస్ కెనాల్ కు 15.9 టీఎంసీలు డిమాండు చేశాయి. జూన్ 1944 ఒప్పందం ప్రకారం కేటాయింపులు జరపాల్సిన అవసరం లేదని తెలియజేసింది. ఇది ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు మహబూబ్ నగర్ జిల్లాకు చేసిన క్షమార్హంకాని అన్యాయం. వాదనలు విన్న ట్రిబ్యునల్ కెసీ కెనాల్ కు 39.9 టీఎంసీలు, మహబూబ్ నగర్ జిల్లాకు 15.9 టీఎంసీలు, రాయచూర్ జిల్లాకు 1.2 టి ఎం సి ల కేటాయింపులు చేసింది.
ఆర్‌డిఎస్ పై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వివక్ష
బచావత్ ట్రిబ్యునల్ ఎదుట ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వివక్షా పూరితంగా పెట్టిన డిమాండ్ల కారణంగా కేసి కెనాల్ కు 39.9 టీఎంసీలు దక్కగా, రాజోలి బండకు 17.10 టీఎంసీలు (15.9 టీఎంసీలు మహబూబ్ నగర్ జిల్లాకు, 1.2 టిఎంసిలు రాయచూర్ జిల్లాకు) మాత్రమే దక్కాయి. కేసి కెనాల్ ఆయకట్టును 2.78లక్షల ఎకరాలుగా నిర్ధారించగా రాజోలిబండ ఆయకట్టు ను 92,900 ఎకరాలుగా (87,000 ఎకరాలు మహబూబ్ నగర్ కు) నిర్ధారించారు. ఇది రాజోలిబండకు ఎదురైన మొదటి అన్యాయం.రాజోలిబండ ఆనకట్ట నిర్మాణం 1958లో పూర్తి అయ్యింది. రాజోలిబండ నిర్మాణం జరిపేటప్పుడు ఏర్పాటు చేసిన పది నిర్మాణపు తూముల్లో ఏడింటిని మూసివేసి మూడింటిని అట్లాగే తెరిచి ఉంచడం వల్ల రాజోలిబండకు న్యాయంగా దక్కవలసిన వాటా ఎప్పుడు దక్కలేదు. ఇది రెండో అన్యాయం. 15.9.1 టీఎంసీల తుంగభద్ర జలాలను మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల తాలూకాలో 7 గ్రామాల్లో, ఆలంపూర్ తాలుకాలో 67 గ్రామాల్లో మొత్తం 87,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన రాజోలిబండ కాలువ గత 15 సంవత్సరాల్లో సగటున 5.5 టీఎంసీలకు మించి దక్కలేదని రికార్డులు చెపుతున్నాయి. 87,500 ఎకరాలకు బదులు 30 వేల ఎకరాలకు మించి సాగు కాలేదు. అంటే మొత్తం ఆయకట్టులో సాగునీరు అందుతున్నది 36% ఆయకట్టుకే. 64% ఆయకట్టు నీరందక దుర్భిక్ష ప్రాంతంగా మిగిలిపోయింది. తెలంగాణాకు సాగునీటి రంగంలో జరిగిన అన్యాయాల్లో రాజోలిబండ ఒక సజీవ సాక్ష్యం. ఒకవైపు కష్ణా నది , మరొక వైపు తుంగభద్రా నది మధ్యలో ఉన్న నడిగడ్డ ప్రాంతం అయిన పాలకుల నిర్లక్ష్యం, ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధుల చేతకానితనం వల్లసాగునీటికీ నోచుకోకుండా దశాబ్దాలుగా కరువు ప్రాంతంగా మగ్గిపోయింది. అదేసమయంలో 39.9 టీఎంసీలు వాడుకోవాలసిన కేసి కెనాల్ సగటున 55 నుంచి 60 టీఎంసీలు ఉపయోగించుకున్నట్లుగా రికార్డులు చెబుతున్నాయి. తర్వాతి కాలంలో సుంకేసుల ఆనకట్ట బ్యారేజీగా మారింది. కె సి కెనాల్ ఆధునీకీకరణ పూర్తి అయ్యింది. ఆర్‌డిఎస్ మాత్రం శిథిలమైన స్థితిలో ఉండిపోయింది. ఉమ్మడి పాలకులు సుంకేసులనే కాదు బ్రిటిష్ వారు కట్టించిన అన్ని ఆనకట్టలను బ్యారేజీలుగా మార్చుకునారు. గోదావరి ఆనకట్ట సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీగా, కష్ణా ఆనకట్ట ప్రకాశం బ్యారేజీగా, సోమశిల ఆనకట్ట సోమశిల బ్యారేజీగా రూపం మార్చుకున్నాయి. తెలంగాణలో ఉన్న పాత ఆనకట్టలు ఆర్‌డిఎస్, సదర్మాట్, ఘన్‌పూర్, దుమ్ముగూడెం ఆనకట్టలు మాత్రం బ్యారేజీలుగా మారలేదు.
రాజోలిబండ ఆనకట్ట ఎడమ వైపున ఆర్‌డిఎస్ కాలువ మొదలవుతుంది. కాలువ మొత్తం పొడవు 143 కిలోమీటర్లు. కర్నాటకలోని రాయచూర్ జిల్లాలో 42.6 కి.మీ. ప్రయాణించి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రవేశిస్తుంది. మహబూబ్ నగర్ జిల్లాలో కాలువ 42.6 కి.మీ. నుంచి 143 కి.మీ. దాకా ఉంటుంది. ఆర్‌డిఎస్ ఆనకట్ట వద్ద తెరిచి ఉంచిన తూముల కారణంగా ఆనకట్ట వద్ద తగినంత నీటి మట్టం లేక నీరు రాక పోవడం ఒక కారణమైతే కాలువల నిర్వహణ లేక శిథిలమై పోవడం చేత నీటి ప్రవాహాలు గణనీయంగా తగ్గిపోయేపరిస్థితి నెలకొన్నది.
కెసిఆర్ రాజోలిబండ పాదయాత్ర
2001 కె.సి.ఆర్. తెలంగాణారాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి తెలంగాణా ఉద్యమానికి ఊపిరి పోసినాడు. కె.సి.ఆర్. తన జల సాధనా ఉద్యమాన్ని ఆర్‌డిఎస్ నుంచే మొదలు పెట్టినాడు. ఆర్‌డిఎస్ కాలువపై పాదయాత్ర చేసి ఆయకట్టు రైతాంగానికి న్యాయం జరగాలని డిమాండ్ చేసినాడు. ఆర్‌డిఎస్ కాలువని ఆధునీకీకరించాలని, ఆర్‌డిఎస్ ఆనకట్ట వద్ద తెరిచి ఉంచిన తూములను మూసివేయాలని డిమాండ్ చేసినాడు. 2003 జూలై 20న రాజోలిబండ పాదయాత్రను కె సి ఆర్ మొదలు పెట్టిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. ఆలంపూర్ నుంచి గద్వాల వరకు 120 కి మీ 30 గ్రామాల గుండా నీటి కోసం సాగిన ఈ పాదయాత్ర చారిత్రా త్మకమైనది. నేనూ కె.సి.ఆర్.తో పాటు ఆ పాద యాత్రలో పాల్గొన్నాను. అపూర్వమైనప్రజా మద్దతుతో సాగిన ఈ పాదయాత్ర ఉమ్మడి రాష్ట్ర పాలకుల్లో ప్రకంపనాలు సష్టించింది.5 రోజుల తర్వాత జూలై 25న గద్వాలలో జరిగిన బహిరంగ సభ తెలంగాణా జల సాధనా ఉద్యమానికి ఊపిరి పోసింది. రాజోలిబండ తూముల మూసివేతపై ప్రభుత్వం దిగి వచ్చేవరకు మడమ తిప్పను, ఢిల్లీ దాకా ఈ సమస్యను తీసుకుపోతాం, రాజోలిబండ ఆయకట్టు రైతాంగానికి న్యాయం జరిగే దాకా పోరాటం ఆగదు అని గద్వాల సభలో కె.సి.ఆర్. ప్రకటించినాడు. గద్వాల సభలో సాగునీటి శాఖా మంత్రి హరీశ్‌రావు, వైద్యఆరోగ్య శాఖామాత్యులు లక్ష్మారెడ్డి, ఆలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విష్ణు వర్ధన్ రెడ్డి కూడా ఉన్నారు.
ఈ ఉద్యమానికి జడిసి తూములు మూసి వేయ డానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. అయితే కర్నూలు జిల్లా ప్రజా ప్రతినిధులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బాలనాగిరెడ్డి బాంబులతో పేల్చివేయడంతో తూముల మూసివేత ఆగిపోయింది. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తెలంగాణా ఉద్యమ తీవ్రతను గమనించి 2008 మూసివేయించినాడు. ఉమ్మడి ప్రభుత్వ ఈ నిర్లక్ష్య వైఖరి, పక్షపాత వైఖరి కారణంగా మొన్నటికి మొన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అసలు జాడ పత్తా లేని రాజోలి బండ కుడి కాలువకు 4 టీఎంసీలను కేటాయించుకోవడం జరిగింది. రాజోలిబండకు కుడి వైపున కర్నూల్ జిల్లా. రాజోలిబండ కుడికాలువ కోసం పట్టు బట్టి 4 టీఎంసీలు సాధించుకున్న ప్రభుత్వం సుంకేసుల బ్యారేజి నుంచి ఎడమ వైపున ఉన్న మహబూబ్ నగర్ జిల్లాకు ప్రయోజనం కల్పించే ఎడమకాలువను డిమాండు చేయలేదు. సుంకేసుల ఎడమ కాలువ డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నదే. అయినా కూడా ఉమ్మడి ప్రభుత్వం సుంకేసుల ఎడమ కాలువ జోలికి పోలేదు. ఇది ఉమ్మడి ప్రభుత్వం మహబూబ్ నగర్ జిల్లాపై ప్రదర్శించిన వివక్ష. ఆర్‌డిఎస్ కెనాల్‌కు కేసి కెనాల్‌తో సమానంగా కేటాయింపులు జరపాల్సిందిపోయి, కొత్తగా ఇంతకుముందు ప్రతిపాదనలోనే లేని కుడికాలువకు కేటాయింపులు చేయడాన్ని తెలంగాణ ప్రాంతానికి జరిగిన తాజా వివక్షకు ఉదాహరణ.
ఆర్‌డిఎస్ కాలువ కింద ఆయకట్టు స్థిరీకరణ.. తుమ్మిళ్ళ పథకం:
రాజోలిబండ మళ్లింపు పథకం ద్వారా సాగు నీరు అందని 55,600 ఎకరాలకు సాగునీరు అందించడానికి ప్రభుత్వం మరో ప్రత్యామ్నాయ పథకాన్ని అన్వేషించింది.రైతాంగానికి దశాబ్దాలుగా ఎదురైన ఈ అన్యాయాన్ని సవరించడానికే తెలంగాణా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సుంకేసుల ఎడమ వైపున తుంగభద్రా నీటిలో తెలంగాణాకు హక్కుగా ట్రిబ్యునల్ కేటాయించిన నీటిని వినియోగించుకోవడానికి పథకం తయారు చెయ్యమని ముఖ్యమంత్రి కె సి ఆర్ ఆదేశించినారు. సర్వే జరిపి, డి పి ఆర్ తయారు చేసిన అనంతరం ప్రభుత్వం ఏప్రిల్, 2017లో జిఓ నంబరు 429 ద్వారామొదటి దశ పనులకు 397 కోట్ల రూపాయలకు పరిపాలనా అనుమతిని మంజూరు చేసింది.
తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం వివరాలు
- మొదటి దశలో తుమ్మిళ్ళ గ్రామం వద్ద తుంగభద్రా నది నుంచి 70 రోజుల్లో 5.44 టిఎంసి ల నీటిని ఎత్తిపోసి ఆర్‌డిఎస్ కాలువలో 75 వ కి మీ వద్ద పోయడం జరుగుతుంది.
- రెండవ దశలో మూడు బ్యాలెన్సింగ్ జలాశయాలకు నీటిని ఎత్తి పోయడం.5.5 మె.వా. సామర్థ్యం కలిగిన రెండు పంపులు, 10.5 మె.వా. సామర్థ్యం కలిగిన ఒక పంపు, మొత్తం 3 పంపులను ఏర్పాటు చేస్తారు.
- రెండు పంపుల డిస్చార్జ్ సామర్థ్యం 9.72 క్యూసెక్కులు (343.26 క్యూసెక్కులు) నేరుగా ఆర్‌డిఎస్ కాలువలోకి వెళతాయి. మూడవ పంపు డిస్చార్జ్ సామర్థ్యం 11.10 క్యూసెక్కులు (392 క్యూసెక్కులు) నేరుగా మల్లమ్మ కుంట జలాశయానికి వెళతాయి.నది నుంచి పంప్ హౌజ్ దాకా 650 మీ పొడవైన అప్రోచ్ చానల్, ఫోర్బే, పంప్ హౌజ్, ప్రెషర్ పైప్ లైన్, సిస్టర్న్ నిర్మించడం, 2.5 మీ వ్యాసం కలిగిన 7.80 కి మీ పొడవైన రెండు పైప్ లైన్ వేయడం, రెండో దశలో 3 జలాశయాలను (మల్లమ్మకుంట, జూలకల్, వల్లూరు) నిర్మించడం జరుగుతుంది.
- మొదటి దశలో సేకరించవలసిన భూమి 94 ఎకరాలు.తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి 2018 వానాకాలంలోనే ఆర్‌డిఎస్ కాలువకు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నది ప్రభుత్వం. ఆ దిశలో ఇప్పటికే టెండర్లు పిలవడం, కాంట్రాక్టర్‌తో 159.12 కోట్లకు ఒప్పందం కుర్చుకోవడం జరిగింది.
- తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం పనులు శర వేగంగా జరుగుతున్నాయి. 625 మీటర్ల అప్రోచ్ చానల్ తవ్వకం, పంప్ హౌజ్ ఫర్ బే తవ్వకం, పంప్ హౌజ్ తవ్వకం ఇప్పటికే పూర్తి అయ్యింది.
- 14.80 కి మీ పైప్ లైన్ లో 10.50 కి మీ ల పైపులు వేయడం పూర్తి అయ్యింది.159.12 కోట్ల ఒప్పందపు విలువలో 60 కోట్ల పనులు పూర్తి అయినాయి. తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం పూర్తి అయితే ఆర్‌డిఎస్ ఆయకట్టు రైతాంగం నీటి కష్టాలు తీరుతాయి.
- 56,500 ఎకరాల ఆయకట్టుకు నికరంగా నీరు అందుతుంది. రెండో దశలో చేపట్టవలసిన జలా శయాల కోసం అవసరమైన భూసేకరణ పూర్తి చేసి జలాశయాల నిర్మాణాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది.
ఉద్యమ సమయంలో ఆర్‌డిఎస్ రైతాంగం కష్టాలను స్వయంగా చూసిన ముఖ్యమంత్రి తెలంగాణా ఏర్పడగానే మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధతో నిధులు కేటాయించి పనులను పూర్తి చేయిస్తున్నారు. సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు నిరంతరం పనులని పర్యవేక్షిస్తునారు. తుమ్మిళ్ళ పథకాన్ని కూడా భక్త రామదాసు ఎత్తిపోతల పథకం లాగానే రికార్డ్ టైం లో పూర్తి చేసి ఆర్‌డిఎస్ రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రణాళికాబద్దంగా పనులని కొనసాగిస్తున్నది ప్రభుత్వం.