భారత రాజ్యాంగం చదువుకొన్న ప్రతి ఒక్కరికి కేశవానంద భారతి పేరు చిరపరిచితం.
ఆయన కేరళ రాష్ట్రంలోని కాశీరఘడ్ జిల్లాలోని ఎడ్నీర్ మఠాధిపతి. ఆయన 6 సెప్టెంబర్ 2020న తన 79వ యేట మరణించారు. ఆయన వేసిన రాజ్యాంగ పరమైన కేసులో మౌలిక నిర్మాణం (బేసిక్ స్ట్రక్చర్) సిద్ధాంతాన్ని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది.
మంగారి రాజేందర్
ఆయన ఆశ్రమానికి చెందిన ఆస్తులని ప్రభుత్వం భూ సంస్కరణ చట్టం పేరుతో తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆయన సుప్రీంకోర్టులో కేసుని దాఖలు చేశారు. ఆశ్రమానికి ఆదాయ వనరులు ఇచ్చే ఏకైక వనరు అదేనని ఆయన తన దరఖాస్తులో తెలియచేశారు. ఆ శాసనాన్ని సవాలు చేస్తూ కేసుని దాఖలు చేశారు. అధికరణ 24, 25, 26కి చేసిన రాజ్యాంగ సవరణని, అదే విధంగా కేరళ భూ సంస్కరణ (సవరణ) చట్టం, 1969 అందులో సవాలు చేశారు. మతాన్ని ప్రచారం చేసుకునే ప్రాథమిక హక్కుని రాజ్యాంగంలోని అధికరణ 25 తెలియజే సిందని, మత స్వేచ్ఛని అధికరణ 26 ప్రసాదించిందని, ఆస్తి హక్కుని ఆర్టికల్ 31 ఇచ్చిందని ఆయన 31 మార్చి 1970లో దాఖలు చేసిన కేసులో పేర్కొన్నారు.
ఆయన తరఫున ప్రఖ్యాత న్యాయవాది నానీ పాల్కీవాలా వాదించారు. ఈ కేసుని 13 మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విన్నది. ఇంత మంది న్యాయమూర్తులు ఒక కేసు వాదనని వినడం అదే మొదటిసారి. అంతేకాదు 69 రోజుల పాటు ఈ వాదనని సుప్రీంకోర్టు విన్నది.
పార్లమెంట్ అధికారాల గురించి ఈ తీర్పు చాలా ప్రముఖమైనది. రాజ్యాంగానికి చేసిన 24వ రాజ్యాంగ సవరణని ఈ కేసులో భారతి సవాలు చేశారు. ఈ సవరణ ప్రకారం రాజ్యాంగంలోని ఏ అధికరణైనా పార్లమెంట్ సవరించవచ్చు. గోక్ నాథ్ కేసులో సుప్రీం కోర్టు ఏర్పరచిన ప్రతిబంధకాన్ని అధిగమించడానికి ఈ సవరణని తెచ్చారు.
రాజ్యాంగంలోని అధికరణ 368 ప్రకారం రాజ్యాంగానికి సవరణలు తీసుకొని రావచ్చు. ప్రాథమిక హక్కుని కూడా సవరించవచ్చు. అదే విధంగా వాటిని నియంత్రించవచ్చు అన్న ప్రశ్న మొదటిసారిగా శంకరీ ప్రసాద్ కేసులో ఉదయించింది. రాజ్యాంగానికి 1951లో చేసిన మొదటి సవరణ ద్వారా ఆర్టికల్ 31ఎ, 31బి ని చేర్చారు. వాటిని శంకరీ ప్రసాద్ కేసులో సవాలు చేశారు. దీనివల్ల ప్రాథమిక హక్కు నియంత్రణ జరుగుతుందని, అందుకని ఆ సవరణ చెల్లదని ప్రకటించమని ఈ కేసులో సవాలు చేశారు. అయితే సుప్రీంకోర్టు ఈ వాదనతో ఏకీభవించలేదు. ప్రాథమిక హక్కుని కూడా సవరించే అధికారం పార్లమెంట్‌కే వుందని సుప్రీంకోర్టు సజ్జన్ సింగ్ కేసులో చెప్పిన విషయాన్నే ఈ కేసులో కూడా స్పష్టం చేసింది.
17వ రాజ్యాంగ సవరణ ద్వారా, తొమ్మిదవ షెడ్యూల్ లో ఏర్పరచిన కొన్ని శాసనాలని సవాలు చేస్తూ గోక్‌నాథ్ కేసు దాఖలైంది. ప్రాథమిక హక్కుకి సవరణలు చేసే హక్కు పార్లమెంట్‌కి లేదని శంకరీ ప్రసాద్ కేసులో ఇచ్చిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు త్రోసి పుచ్చింది. ఈ ప్రతిబంధకాన్ని అధిగమించడానికి పార్లమెంట్ రాజ్యాంగానికి 24వ సవరణలు తెచ్చింది.
కేశవానంద భారతి వేసిన కేసులో పార్లమెంట్ అధికారం మీద తీవ్రమైన చర్చ జరిగింది. సుప్రీంకోర్టు మొదటిసారిగా మౌలిక నిర్మాణం (బేసిక్ స్ట్రక్చర్) అన్న సిద్ధాంతాన్ని ఈ కేసులో ప్రతిపాదించింది. రాజ్యాంగాన్ని వాఖ్యానించే సంస్థగా, మధ్యవర్తిగా సుప్రీంకోర్టు వ్యవహరిస్తుంది. ఈ కేసులో 24వ సవరణ, 25వ సవరణ, 29వ సవరణ మీద కూడా చర్చ జరిగింది. గోక్‌నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మొజారిటీ తీర్పుతో సుప్రీంకోర్టు రద్దు చేసింది. రాజ్యాంగానికి సవరణలు తెచ్చే అధికారం పార్లమెంట్‌కు వుంది కానీ, రాజ్యాంగ నిర్మాణానికి సవరణలు తెచ్చే అధికారం లేదని సుప్రీంకోర్టు మెజారిటీ తీర్పుతో ప్రకటించింది. రాజ్యాంగాన్ని గాయపరిచే హక్కు, నాశనం చేసే హక్కు, మార్చే హక్కు పార్లమెంట్‌కి లేదని సుప్రీంకోర్టు ఈ తీర్పులో పేర్కొంది.
రాజ్యాంగ పురోగతిలో ఈ తీర్పు ఓ మైలురాయి. ఈ తీర్పుని 7:6 న్యాయమూర్తుల అభిప్రాయంతో వెలువరించారు. రాజ్యాంగానికి సవరణలు చేసే హక్కు పార్లమెంట్‌కి వుంది కానీ మౌలిక నిర్మాణం మార్చే హక్కు లేదు. ఇదీ ఈ కేసులోని సారాంశం. ఇంతకీ ఈ మౌలిక నిర్మాణం అంటే ఏమిటి? అన్న సందేహం సహజంగానే వస్తుంది. మౌలిక నిర్మాణం గురించి ఒక్కో న్యాయమూర్తి (7) ఒక్కో విధంగా వివరించారు. ఒక్కో విధంగా అనే బదులు ఒకరు చెప్పిన దాన్ని మరొకరు పొడిగించారని చెప్పవచ్చు.
అప్పటి ప్రధాన న్యాయమూర్తి
సిక్రీ ఈ విధంగా వివరణలు ఇచ్చారు.
రాజ్యాంగమే అత్యున్నతమైనది
రిపబ్లికన్, ప్రజాస్వామ్య ప్రభుత్వం
సెక్యుర్ లక్షణాలు, శాసన, కార్యనిర్వాహక,
న్యాయవ్యవస్థ, వేరువేరు అధికారాలు
ఫెడరల్ లక్షణాల రాజ్యాంగం
షెలాబ్ మరియు గ్రోవర్ న్యాయమూర్తుల ప్రకారం…
ఇవి కూడా మౌలిక నిర్మాణంలో భాగాలే.
సంక్షేమ రాజ్యం
జాతి ఐక్యత
సార్వభౌమత్యం
న్యాయమూర్తులు ఉనెగ్టా, ముకర్జియాల ప్రకారం కూడా దాదాపు ఇవే. న్యాయమూర్తి జగన్‌మోహన్ రెడ్డి ప్రకారం
సార్వభౌమ, ప్రజాస్వామ్య, రిపబ్లిక్
సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం
భావ ప్రకటనా స్వేచ్ఛ, విశ్వాసం, భక్తి
సమానత్వం, సమాన అవకాశాలు.
ఈ అంశాలకి భంగం కలగకుండా రాజ్యాంగానికి సవరణలు చేసే హక్కు పార్లమెంట్‌కి వుంటుంది. ఇది కేశవానంద భారతి కేసులోని సారాంశం. ఈ లిస్ట్‌ని గమనించినప్పుడు మన రాజ్యాంగ మౌలిక నిర్మాణం కన్పిస్తుంది. ఇది రాజ్యాంగ చరిత్రలో చాలా ప్రముఖమైన తీర్పు.
సాదువు కేశవానంద భారతి మృతితో ఈ విషయాను మళ్ళీ గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఏర్పడిరది.