నుదిటి రాతలను రాసేది ఆ బ్రహ్మ అయితే.. విద్యార్థుల చేతిరాతను మార్చుతున్నారు. ఈ మాస్టారు. తలరాతను మార్చడం ఎవ్వరితోనూ కాదని సరి పెట్టుకుంటాం. కానీ చేతి ”రాత” ను మార్చేయడానికి మన సిద్ధిపేటకు మాస్టారున్నారని ”చేతి రాత” మారితే బతుకంతా మారిపోతుందంటారు.. మన ఎజాజ్‌ అహ్మద్‌. తాను రాసిన ” అందమైన చేతిరాత అందరికీ సాధ్యమే” అనే పుస్తకాన్ని రూపొందించి సమాజానికి నేడు మార్గదర్శకంగా నిలిచారు. కవిగా, గాయకుడిగా, రచయితగా, వ్యాఖ్యాతగా విద్యార్థులకు అందమైన చేతిరాతను నేర్పే రూపకర్తగా బహుముఖ ప్రజ్ఞాశాలి ఎజాజ్‌ అహ్మద్‌ పై ” ప్రత్యేక కథనం”..

మామిడాల రాము
tsmagazine
ఎన్ని తెలివి తేటలున్నా.. ఎంత చురుకుదనం ఉన్నా చేతి రాత బాగా లేకపోతే.. విద్యార్థి పరీక్షల్లో గట్టెక్కడం కష్టమే. ఇది చాలా మంది పెద్దలకూ, పిల్లలకు అనుభవంలో ఉన్న విషయమే. అందుకే అక్షరాలు రాయడం మొదలు పెట్టిన నాటి నుంచి అందంగా, గుండ్రంగా రాయాలని పిల్లలకు చెబుతుంటారు. అందమైన చేతిరాత ఉంటే ఉపాధ్యాయులను ఆకట్టుకోవడం చాలా సులువు. చదువులో రాణించడం సులభం. రాతేదో.. బ్రహ్మ విద్య అన్నట్లు చెబుతుంటారు. కానీ సరిగ్గా అభ్యాసనం చేస్తే కుదురుగా రాయడం ఇట్టే వచ్చేస్తదని, అది భరోసానిస్తదని ఎజాజ్‌ అహ్మద్‌ అంటున్నారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట శుభోదయ విద్యాలయం ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. 1994 సంవత్సరంలోనే ”అందమైన చేతిరాత అందరికీ సాధ్యమే” అనే పేరుతో మొదట తెలుగులో, తర్వాత ఇంగ్లీషు, హిందీల్లో వచ్చిన ఆయన పుస్తకం వేలమంది విద్యార్థుల చేతిరాతను తలరాతను కూడా మార్చింది. సాధారంగా ఎవరైనా అనుకున్నది సాధించడంతో సంతప్తి పడతారు. తమ విజయ రహస్యాన్ని మరొకరితో పంచుకునేందుకు ఇష్ట పడరు. కానీ ఎజాజ్‌ అహ్మద్‌ తీరు అది కాదు. అదే చేతిరాతను మార్చుకునేలా ఎజాజ్‌ చేసిన ప్రయాణమే ఆయనను పుస్తకం రాసేలా చేసిందని చెప్పాలి. మరెంతో మంది విద్యార్థులను చక్కగా రాసేలా చేసింది.

కష్టాల దారిన నడిచారు .. గీసే ”గీత”తో ఖండాంతర ఖ్యాతి పొందారు.
ఏజాస్‌ అహ్మద్‌ తండ్రి ఆయుబ్‌ అలీ ఆటోలు కిరాయికి ఇచ్చేవారు. ఆయనకు దిన పత్రికల ఏజెన్సీ కూడా ఉండేది. దీంతో ఎజాజ్‌ ఉదయం దిన పత్రికలు పంచేవారు. సాయంత్రం ఆటో నడిపేవారు. ఇలా మొదటి నుంచి ఆయన కష్టాల దారినే నడిచారు. కానీ చదువునెప్పుడూ నిర్లక్ష్యం చెయ్యలేదు. బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత పై చదివించలేదు. ఆటో నడుపుతూ నీ కాళ్ల మీద నీవు నిలబడాలని తండ్రి చెప్పారు. ఏం చెయ్యాలో తెలియక సిద్ధిపేటలో ఉన్న తన చిన్నాన అబ్దుల్‌ ఖాదర్‌ దగ్గరికి చేరుకుని కొన్నాళ్లు హమాలీగా పని చేశారు. తర్వాత ఒక పాఠశాలలో ఒకటవ తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయుడిగా చేరాడు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మధుసూదన్‌ అందంగా అక్షరాలు రాస్తూ, ఇతరులను కూడా అందంగా అక్షరాలు రాయాలని ప్రోత్సహించేవారు. ఆయన శిష్యరికంలో ఎజాజ్‌ అహ్మద్‌ తన చేతిరాతకు మెరుగులు దిద్దుకున్నారు. సులభమైన పద్ధతిలో అందమైన చేతిరాతకు పిల్లలకు, పెద్దలకు నేర్పించడం ఆరంభించారు. ఆ అనుభవంతో ”అందమైన చేతిరాత అందరికీ సాధ్యమే” అన్న పుస్తకాన్ని తెచ్చారు. ఆరవై పేజీల పుస్తకంలో మూడు భాషలకు సంబంధించి నాలుగేసి చాప్టర్లు ఉంటాయి. ప్రతి అక్షరాన్ని రాయడమెలా విద్యార్థులు, ఉపాధ్యాయులకు సూచనలు ఉంటాయి. తర్వాత చాప్టర్లలో కొన్ని టెక్నిక్స్‌ కూడా పొందుపర్చారు. కొందరు భాగస్వాములతో కలిసి తాను ప్రారంభించిన

”శుభోదయ విద్యాలయం”లోని పిల్లలకు మొదట్లో ఈ పుస్తకాన్ని అందించారు. వారి చేతిరాత మెరుగుపడటంతో ఇది ఎక్కువ మంది విద్యార్థులకు అందితే మంచిదన్న భావన ఆయనలో బలపడింది. ఈయన రాత మొదలు పెడితే.. అక్షరాలూ ఒదిగిపోవాల్సిందే. ఈయన గీసిన గీతకు దేశ విదేశాల్లో అభిమానులు మొదలయ్యారు. ఇంగ్లీషులో కలిపిరాతను ఎలా రాయాలో వివరిస్తూ రూపొందించిన వీడియో ప్రపంచ వ్యాప్తంగా హల్‌ చల్‌ చేస్తున్నది. ఈయన ప్రతిభను మెచ్చి వీడియోను అమెరికా ఎన్‌ టీడీ చానల్‌ ప్రసారం చేసింది. ఫేస్‌ బుక్‌ లో 1, 11, 46, 936 వీవర్స్‌ సాధించింది. అమెరికాలో ఎన్‌ టీడీ చానల్‌ లో ఈ వీడియోను ప్రసారం చేస్తే నెల రోజులల్లో 69, 74, 569 మంది వీక్షించారు.
tsmagazine
బహుముఖ ప్రజ్ఞాశాలి..
ఎజాజ్‌ అహ్మద్‌ ఉపాధ్యాయుడిగా చేతిరాతతో పాటు స్థానిక టీవీ ఛానల్‌లో తెలుగు వార్తలు చదువుతారు. మరో వైపు పలు కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తూ.. ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈయన చిన్న చిన్న సందేశాత్మక గీతాలు, రాసి, పాడి, పాడించి అభినయించే వారు. తెలంగాణ పాటలపై కోలాటం, యోగ్‌ చాప్‌, నృత్య రూపకాలను రూపొందించి హైదరాబాదు, కరీంనగర్‌, నిజామాబాదు, సంగారెడ్డి, పెద్దపల్లి, సిద్ధిపేట, మెదక్‌ తదితర ప్రాంతాలల్లో విద్యార్థులతో కలిసి వందలాది ప్రదర్శనలు చేశారు. ముస్లిం అయినప్పటికీ తెలుగు పద్యాలు, సంస్కృత శ్లోక్లాలు, హనుమాన్‌ చాలీసా వంటి వాటిని ధారాళంగా ఆలపిస్తూ మతసామరస్యానికి ప్రతీక గా నిలుస్తున్నారు. ఈయనకు తెలుగు విశ్వ విద్యాలయం, మహారాష్ట్రకు చెందిన కళాభారతి సంస్థలు సేవా పురస్కారాలను అందించాయి. ఇప్పటికే అనేక జిల్లాలోని స్కూళ్ళల్లో విద్యార్థులకు చేతిరాతను నేర్పించేందుకు నిత్య కృషీవలుడుగా శ్రమిస్తూనే ఉన్నారు.

Other Updates