శ్రీధర్ రావ్ దేశ్ పాండే
విద్యాసాగర్‌రావు తెలంగాణలో ఆచార్య జయశంకర్‌తో కలిసి పనిచేసిన ఉద్యమ శిఖరం. విద్యాసాగర్ రావు వేదిక మీద ఉంటె ఆయన్ని సంబోధిస్తూ కేసీఆర్ అనే మాటలు ‘నీళ్లలో నిప్పులు రగిలించిన వాడు. ‘ఇది అక్షర సత్యం. విద్యాసాగర్ రావు కేంద్ర ప్రభుత్వం నుంచి 1997 లో చీఫ్ ఇంజనీర్ గా పదవీ విరమణ పొందిన తర్వాత ఢిల్లీ నుంచి తన మకాంని హైదరాబాద్‌కు మార్చినాడు. పదవీ విరమణ తర్వాత ఢిల్లీలోఉండి తనకు ఇష్టమైన నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రేడియో కార్యక్రమాలు నిర్వహిస్తూ కాలం గడపడమా లేక హైదరాబాద్ వెళ్లి మరేదైనా వ్యాపకంలోతన కాలాన్ని సద్వినియోగం చేయడమా అన్న మీమాంస కొంత కాలం అతన్ని వేధించింది. చివరికి హైదరాబాద్‌నే ఎంచుకున్నారు. ఆ నిర్ణయం చరిత్రాత్మకమైన నిర్ణయంగా ఆనాడు ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు. తెలంగాణ అతనికి అద్భుతమైన, అనితరసాధ్యమైన చరిత్రాత్మక పాత్ర పోషించడానికి అవకాశాన్నిచ్చిందని చెప్పడానికి ఇప్పుడు నేను సాహసిస్తున్నాను.
జల విజ్ఞానం నీళ్ళు నిజాలు:
ఆ రోజుల్లో వార్త దినపత్రిక సంపాదకుడిగా పని చేస్తున్న కె. రామచంద్రమూర్తి విద్యాసాగర్ రావుకి నీటి సంగతులు రాయడానికి అవకాశాన్నివ్వడం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ అవకాశాన్ని విద్యాసాగర్ రావు గొప్పగా వినియోగించుకున్నారు. మొదటి దశలో నీటికి సంబంధించి జనరల్ విషయాలను రాసినాడు. ఢిల్లీలో ఉన్నప్పుడు
నాటకాలు, రేడియో కార్యక్రమాలకు అనేక వందల తెలుగు స్క్రిప్టులని రాసిన అనుభవంఉన్నవాడు కనుక మంచి వచనం రాయడం అతనికి కొట్టిన పిండి. వార్త దినపత్రికలో ఆయన వ్యాసాలకు పాఠకుల నుంచి మంచి ఆదరణ లభించింది. సంపాదకుల వారు జనరల్ విషయాలపై నుంచి తెలంగాణా ప్రాజెక్టుల స్థితిగతుల పైకి చర్చను మళ్ళించమని విద్యాసాగర్ రావుని కోరినారు.ఆయన తెలంగాణ ప్రాజెక్టులపై రాయడం మొదలుపెట్టే నాటికి తెలంగాణ చైతన్యం కొద్దిగా ఊపందుకున్నది.
1996 లో తెలంగాణ ఉద్యమం పునరుజ్జీవనం పొందిన తెలంగాణ ఉద్యమం తొలి రోజుల్లో బుద్ధిజీవులు చేపట్టిన భావ ప్రచారం విస్తృతం అయ్యింది. సభలు, సమావేశాలు, సదస్సులు, కరపత్రాలు, పుస్తకాల ప్రచురణ, సాంస్కృతిక దళాల నిర్మాణం జరిగినందున 2001 నాటికి తెలంగాణ సాధన కోసమే ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు కావడానికి ఒక నేపథ్యం ఏర్పడింది. టిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత తెలంగాణ ఉద్యమం గుణాత్మకమైన మలుపు తీసుకున్నది. అప్పటిదాకా రాజ్యం అమలు చేసిన తీవ్ర నిర్భంధానికి గురి అయి తెలంగాణలో ప్రజా సంఘాలు పని చేయలేని పరిస్థితిలో, టిఆర్‌ఎస్ ఆవిర్భావంతో తెలంగాణ ఉద్యమ రాజకీయ కార్యకలాపాలకు ఒక ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడింది. తెలంగాణ రాజ్యాంగబద్ధంగా, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి సాధించుకోవాల్సిన సమస్య కాబట్టి తెలంగాణ సాధనకు కొత్త ప్రజాసంఘాల ఏర్పాటు అనివార్యమని తెలంగాణ మేధావులు గుర్తించినారు. టి ఆర్ ఎస్ ఏర్పాటుతో కొత్త తెలంగాణ ప్రజా సంఘాల ఏర్పాటుకు వెసులుబాటు ఏర్పడింది. అనేక ప్రజా సంఘాలు ఏర్పాటు అయినాయి.మేధావులు, కవులు, రచయితలు, కళాకారులువిస్త తంగా రాస్తున్న కాలం అది.ఆ ఉద్యమ వాతావరణంలో విద్యాసాగర్‌రావు కలం కూడా పదునెక్కింది. వార్తలో తెలంగాణ ప్రాజెక్టులపై ఆయన రాస్తున్న వ్యాసాలు విస్తృత ప్రజాదరణ పొందినాయి. వార్తతో పాటు వివిధ పత్రికలవారు తమకు కూడా వ్యాసాలూ రాయమని అడగడంతో ఆయన రచనా వ్యాసంగం పరిధి పెరిగింది. రాజకీయ పార్టీల నాయకులు సాగునీటి రంగంపై ఆయనని సంప్రదించడం మొదలయ్యింది. ప్రజా సంఘాలు వారి సభల్లో సాగునీటి రంగంపై ఉపన్యాసాలకు ఆహ్వానించడం ప్రారంభ మయ్యింది. 2004 ఎన్నికల నాటికి తెలంగాణ ఆకాంక్ష ప్రబలమైన రాజకీయ డిమాండ్‌గా మారింది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఈ రాజకీయ డిమాండ్‌ని పార్లమెంటులో వినిపించడానికి సన్నాహాలు చేస్తున్నది.టిఆర్‌ఎస్ తెలంగాణ ఆకాంక్షని వెల్లడించే బలమైన ఉద్యమ వేదికగా రూపుదాల్చింది. సహజంగానే విద్యాసాగర్‌రావు.. కేసీఆర్‌కు సన్నిహితులుగా మారినారు. ఆచార్య జయశంకర్ ఒకవైపు, విద్యాసాగర్ రావు మరొక వైపు నిలబడి కేసీఆర్‌కు ఉద్యమ ప్రస్థానంలో సైద్ధాంతిక, మేధోపరమైన సహకారాన్ని అందించినారు. విద్యాసాగర్ రావు సాగునీటి రంగ సమస్యలపై సాధికారంగా రాయడం ప్రారంభించిన తర్వాత ఇక ఆ అంశంపై తనకు మాట్లాడే అవసరం, రాసే అవసరం తీరిపోయిందని ఆచార్య జయశంకర్ అనేక సందర్భాల్లో
అనేవారు. అది నిజం. విద్యాసాగర్ రావు బలమైన తెలంగాణ గొంతుతో రాస్తున్న, మాట్లాడుతున్న కాలంలో జయశంకర్ సారు సాగునీటిఅంశాలపై తక్కువగానే మాట్లాడేవారు.
జలయజ్ఞం కుట్ర బద్దలు
2004ఎన్నికల అనంతరం ఉద్యమానికి గుణాత్మకమైన ఊపు వచ్చింది. తెలంగాణ డిమాండ్ పార్లమెంట్ కు చేరింది. యు.పి.ఎ. తన ఎజెండాలో తెలంగాణ ఏర్పాటును చేర్చింది. రాష్ట్రపతి చేత మొదటి ప్రసంగంలో తెలంగాణ ఏర్పాటును ప్రకటింపజేసింది. ఇక తెలంగాణ ఏర్పాటు దగ్గరికి వచ్చిందని అర్థం అయ్యింది. తెలంగాణ సమాజంలో గొప్ప కదలిక ప్రారంభమయ్యింది. అయితే తెలంగాణ వ్యతిరేకి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ముందుకు సాగకుండా చక్రం తిప్పసాగినాడు. తెలంగాణ ప్రజానీకాన్ని ఉద్యమ బాట నుంచితప్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. ఉద్యమానికి ప్రధాన ప్రాతిపదిక సాగునీరు. దానికి విరుగుడుగా జలయజ్ఞాన్ని తీసుకవచ్చినాడు రాజశేఖర్‌రెడ్డి. 2005 లో జలయజ్ఞం పెద్ద ఎత్తున ప్రారంభం అయ్యింది. విద్యాసాగర్‌రావు తొలి రచనల్లో సాగునీటి రంగంలో తెలంగాణకు అన్యాయాలు, వివక్షలు, ప్రాజెక్టుల
స్థితిగతులపై విస్తృతంగా రాసినారు. 2005 వరకు ఆయన రాసిన వందలాది వ్యాసాల నుంచి కొన్నింటిని ఎంపిక చేసి ఆ పుస్తకాన్ని విద్యావంతుల వేదిక, తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం తరపున సంయుక్త ప్రచురణగా వెలువరించినాము. 2006లో ఆ పుస్తకం వెలువడింది. కొన్ని నెలల్లోనే పుస్తకాలు అన్నీ అమ్ముడైపోయినాయి. ప్రజల నుండి డిమాండ్ ఉండడంతో 2008లో రెండో ముద్రణ కూడా వేసినాము.ఈ పుస్తకం తర్వాత రెండో భాగం వేయాల్సిన అవసరం ఉంటుందని ఆయన కూడా అనుకోలేదు. అయితే2005 జలయజ్ఞం ప్రారంభం అయినాకా రెండేండ్లు గడచినాయో లేదో రాజశేఖరరెడ్డి ప్రభుత్వం జలయజ్ఞాన్ని అమలుచేస్తున్న తీరుతెన్నుల్ని, తీసుకుంటున్న నిర్ణయాలను నిశితంగా పరిశీలించిన విద్యాసాగర్ రావు తన పని అయిపోలేదని జలయజ్ఞాన్ని విశ్లేషించక తప్పదనుకున్నాడు. రెండో దశ రచనలన్నీ జలయజ్ఞాన్ని నిశితంగా విశ్లేశించినవే కావడం మనం గమనించాలి. జలయజ్ఞం తాత్విక పునాది ఏమిటంటే కష్ణా నీళ్ళని పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు తరలించడం, తెలంగాణా ప్రజానీకాన్నిఉద్యమం నుంచి దూరం చెయ్యడం. ఈ అంశాన్ని ఎరుక పరచడంలో ఆయన చూపించిన నైపుణ్యం అనితరసాధ్యం. ప్రభుత్వంలో ఉన్న నాలాంటి ఇంజనీర్లు అందరికీ కనువిప్పు కలిగించే విధంగా ఆయన రచనలు సాగినాయి.కష్ణా నీళ్ళని శ్రీశైలం జలాశయం ద్వారా పోతిరెడ్డి పాడు హెడ్ రేగ్యులేటరీ ద్వారా సుమారు 250 టి ఎం సి ల నీటిని తరలించడానికి రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న మొదటి నిర్ణయం శ్రీశైలం జలాశయం కనీస నీటి మట్టాన్ని 834 అడుగుల నుంచి 854 అడుగులకు పెంచడం. 11 వేల క్యూసెక్కుల నీటిని తరలించే సామర్థ్యం కలిగిన పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ వద్ద అదనంగా 44 వేల క్యూసెక్కులను తరలించుకపోవడానికి తూములని నిర్మించడానికి చర్యలు చేపట్టడం. అంటేపాతవి కొత్తవి కలిపి పోతిరెడ్డి పాడు నుంచి మొత్తం 55 వేల క్యూసెక్కులని తరలించే ఏర్పాట్లు గుట్టుచప్పుడు కాకుండా జరిగిపొయినాయి. రాయలసీమలో 250టిఎం సి ల నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయాలని నిర్మించడం. శ్రీశైలం నుంచి తరలించుకపోయే 250 టి ఎం సి ల కృష్ణా నీటి లోటుని ఆంధ్ర ప్రాంతానికి సమకూర్చడానికి గోదావరిపై రెండు ప్రాజెక్టులని రాజశేఖరరెడ్డి ప్రభుత్వం చేపట్టింది. ఒకటి పోలవరం , రెండోది దుమ్ముగూడెం నాగార్జునసాగర్‌టెయిల్ పాండ్ లింక్ పథకం. ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా, కోర్టు కేసులు ఉన్నా, పక్కరాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయినా, లక్షలాదిగా నిర్వాసితులవుతున్న ఆదివాసీల నుంచి ఉద్యమాలు వస్తున్నా కూడా మొండిగా పోలవరం నిర్మాణానికి సంకల్పించినాడు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రల్ని సమర్థవంతంగా, నైపుణ్యంతో, పదునైన విశ్లేషణతో బహిర్గతం చేసినవాడు విద్యాసాగర్ రావు ఒక్కడే. 2012 లో విద్యాసాగర్ రావు రాసిన రెండో దశ వ్యాసాలని నీళ్ళు- నిజాలు-2గా తెలంగాణా ఇంజనీర్ల జెఎసి , తెలంగాణా విశ్రాంత ఇంజనీర్ల ఫోరం సంయుక్తంగా ప్రచురించినాయి. ఈ రెండో సంపుటాన్ని కెేసీఆర్ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఆవిష్కరించి విద్యాసాగర్ రావుని అభినందించినారు. నీళ్ళు నిజాలు రెండు సంపుటాలను తెలంగాణ సమాజం హదయపూర్వకంగా ఆదరించినాయి.
సాగునీటి సలహాదారుడు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే కెేసీఆర్ నాయకత్వాన తొలి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత విద్యాసాగర్ రావును ప్రభుత్వం సాగునీటి సలహాదారుగా నియమించుకున్నది. అది ఆయనకు దక్కిన సహజ న్యాయంగా నేను భావిస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తక్షణ నిర్ణయాల్లో కుట్ర పూరిత ప్రాజెక్టు అయిన
దుమ్ముగూడెం నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టుని రద్దు చెయ్యడం, ప్రాణహిత, చేవెళ్ళ, దేవాదుల, దుమ్ముగూడెం ప్రాజెక్టులని కూలంకషంగా మధించి ఉత్తర తెలంగాణ అవసరాలకు అనుగుణంగా రీ ఇంజనీరింగ్ ప్రక్రియను చేపట్టడం, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చి అటకకెక్కించిన పాలమూరు-రంగారెడ్డి, డిండీ ఎత్తిపోతల పథకాలని సమీక్షించి తెలంగాణ అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకొని ప్రాజెక్టులని చేపట్టడం, ఉమ్మడి ప్రభుత్వ హయాంలో విధ్వంసమైన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను పునరుద్ధరించుకోవడం కోసం మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ప్రారంభించడం, కృష్ణా, గోదావరి జలాల్లోన్యాయమైన వాటా దక్కించుకోవడానికి కేంద్ర ప్రభుత్వవివిధ వేదికలపై పోరాటాన్నికొనసాగించడం. ఈ అన్ని అంశాల్లో ముఖ్యమంత్రి కెేసీఆర్‌తో కలిసి రోజుల తరబడి జరిగిన మేదోమథనంలో సలహాదారుగా విద్యాసాగర్ రావు క్రియాశీలంగా భాగస్వాములైనారు. ముఖ్యంగా కృష్ణా నీటిలో వాటా కోసం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, సుప్రీం కోర్టులో కొనసాగుతున్న పోరాటంలో విద్యాసాగర్ రావు సూచనలు, సలహాల మేరకే అఫిడవిట్లు తయారయినాయి. విభజన చట్టం ద్వారా ఏర్పాటైన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశాల్లో విద్యాసాగర్ రావు సమర్థవంతంగా వాదనలు వినిపించేవారు.సలహాదారుగా మంత్రి హరీశ్‌రావు వారం వారం క్రమం తప్పకుండా నిర్వహించే మిషన్ కాకతీయ వీడియో కాన్ఫరెన్స్‌లకు, ప్రాజెక్టులపై నిర్వహించే సమీక్షా సమావేశాలకు, క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశాలకు తప్పనిసరిగా విద్యాసాగర్‌రావును ఆహ్వానించేవారు. ఢిల్లీలో అంతర్ రాష్ట్ర సంబంధిత అంశాలను పరిష్కరించే భాధ్యతని మంత్రి విద్యాసాగర్‌రావుకే బాధ్యతలు అప్పగించేవారు. ఢిల్ల్లీలో కేంద్ర జలసంఘం అధికారులతో, కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ అధికారులతో తనకున్న పరిచయాలతో సమస్యలను పరిష్కరించడంలో విద్యాసాగర్ రావు విశేషంగా కృషి చేసినారు..
సాహిత్య పిపాసి
విద్యాసాగర్ రావు నీళ్ళు-నిజాలు రచయితగానే తెలంగాణ ఉద్యమ శ్రేణులకు తెలుసు. అయితే ఆయనలో ఉత్తమమైన సాహిత్య పిపాసి కూడా ఉన్నాడని అతికొద్ది మంది
సన్నిహితులకు మాత్రమే తెలుసు. తొలి నాళ్లలో ఆయన కవిత్వం కూడా రాసేవారు. ప్లస్ మైనస్ అనే కవిత్వ సంపుటాన్ని కూడా ప్రచురించినారు.ఆ తర్వాత ఉద్యోగ రీత్యా ఢిల్లీలో
ఆయన కవిత్వాన్ని వదిలి నాటకాలను రాయడం, వాటిని ప్రదర్శించడం , నాటకాలకు ప్రయోక్తగా వ్యవహరిస్తూ, రేడియో కార్యక్రమాలకు స్క్రిప్టులు రాస్తూ తన సాహిత్య దాహాన్ని
తీర్చుకున్నారు. తెలంగాణ థియేటర్ రీసెర్చ్ సెంటర్ వారు ఆయన రాసిన ఒక డజను నాటకాలను ప్రచురించి 2017, మే 18, 19, 20 మూడు రోజుల పాటు నాటకాలను
ప్రదర్శించినారు.
కన్న ఊరిపై మమకారం :
విద్యాసాగర్ రావు రాష్ట్రానికి సేవలు అందించినా పుట్టిన ఊరు జాజిరెడ్డి గూడెంని మరువలేదు. తన ఊరుకి ఏమైనా చేయాలని తపన పడినారు. తమ పూర్వీకుల ఇంటిని కూల్చి ఆ జాగాని కళ్యాణ మండపం నిర్మాణం కోసం అప్పగించినారు. మంత్రి హరీశ్‌రావు చేత శంకుస్థాపన కూడా చేయించినారు. మంత్రి గారిని ఒప్పించి జాజిరెడ్డి గూడెంలో ఒక మార్కెట్ యార్డుని కూడా శాంక్షన్ చేయించినారు. అర్వపల్లిలో ఉన్న ప్రాచీన లక్ష్మీనరసింహ స్వామీ దేవాలయ అభివృద్ధి కోసం స్వయంగా మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఈటల రాజేందర్‌ని కలిసి ఫైలును ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపినారు. ముఖ్యమంత్రి ఆయన కోరికను మన్నించి ఒక కోటి రూపాయలు మంజూరు చేసినారు. జి ఓ వచ్చేనాటికి ఆయన స్పృహ లో లేరు. వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు నేనే జిఓ కాపీని ఆయన చేతిలో పెట్టి సార్ అర్వపల్లి జిఓ కాపీ తెచ్చాను, నాటకాల పుస్తకం అచ్చయ్యింది, కళ్యాణ మంట పం పనులు ప్రారంభం అయినాయని చెవిలో గట్టిగా చెప్పినాను. ఆయన విన్నారో లేదో ఆయనకే ఎరుక.
తెలంగాణ తీర్చుకున్న రుణం
తెలంగాణా ప్రజలకు ఆయనకు పలికిన వీడ్కోలు అవ్యాజనీయం. మీడియా సహకారం అపూర్వం. ప్రభుత్వం ఆయనకు అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించడం ఆయనకు దక్కిన గొప్ప గౌరవం. ఒక సాగునీటి ప్రాజెక్టుకు విద్యాసాగర్‌రావు పేరు పెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించడం తెలంగాణా సమాజానికి , తెలంగాణా ప్రభుత్వానికి ఆయన అందించిన నిస్వార్థ సేవలకు తెలంగాణా సమాజం తీర్చుకున్న రుణంగా భావించాలి.